గురువారం, నవంబర్ 05, 2009

విలేజ్ లో వినాయకుడు

తొలి సినిమా తో తనని తాను నిరూపించుకుని ప్రేక్షకుల రివార్డు తో పాటు ప్రభుత్వ అవార్డునూ అందుకున్న దర్శకుడు తనే నిర్మాతగా మారి తీస్తున్న రెండో సినిమా. అది కూడా మొదటి సినిమాకి సీక్వెల్. కోనసీమ నేపధ్యంలో గోదారి ఒడ్డున తొంభై శాతం షూటింగ్ జరుపుకుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. హీరో పెర్ఫార్మన్స్ ఆల్రెడీ నచ్చింది... ఈ కారణాలు చాలనిపించాయి నాకు, 'విలేజ్ లో వినాయకుడు' సినిమా రిలీజ్ షో చూడ్డానికి.

ప్రేక్షకులకి ఒక కథ చెప్పడం కన్నా తెలిసిన కథని కొత్తగా చెప్పడానికి ప్రయత్నించడంలో ఓ సాహసం ఉంది. ఆ సాహసాన్ని చేశాడు యువ దర్శకుడు సాయికిరణ్ అడివి. ఒక పల్చని, బాగా నలిగిన కథాంశాన్ని రెండున్నర గంటల పాటు ప్రేక్షకులని కూర్చోబెట్టి చూపించాలంటే ఏం చెయ్యాలో అవన్నీ చేశాడు దర్శకుడు. వీనుల విందైన సంగీతం, కంటికి ఇంపైన లొకేషన్లు, సిట్యుయేషనల్ కామెడీ.. ఇవన్నీ ఉన్నాయి సినిమాలో.

మెడిసిన్ చదివిన కావ్య (నూతన నటి శరణ్య మోహన్) మన కార్తిక్ ('వినాయకుడు' ఫేం కృష్ణుడు) ని ప్రేమిస్తుంది. తను వైద్యం చేసిన పేషెంట్ కి ఏమైనా జరిగితే తట్టుకోలేని సున్నితమైన మనస్తత్వం కావ్యది. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన కావ్య అంటే యెంతో గారాబం ఆమె తండ్రి లక్ష్మీపతి రాజు (రావు రమేష్) కి. ఈ కోనసీమ భూస్వామి, ఆర్మీ లో పని చేసి రిటైరై ఉమ్మడి కుటుంబాన్ని ఎలాంటి పొరపొచ్చాలూ లేకుండా నడుపుతూ ఉంటాడు.

లక్ష్మీపతి స్నేహితుడు పజిల్స్ భాస్కరం (యండమూరి వీరేంద్రనాథ్). ఇతని పనులు రెండు.. కనిపించిన వాళ్ళందరినీ పజిల్స్ తో వేధించడం, కావ్యకి తగిన వరుణ్ణి వెతికే పనిలో ఫెయిలవుతూ లక్ష్మీపతి చేత చివాట్లు తింటూ ఉండడం. ఎలాంటి వాళ్ళూ ఓ పట్టాన నచ్చరు లక్ష్మీపతి కి. ఇలాంటి పరిస్థితిలో కావ్య ఎంతగానో ప్రేమించిన అబ్బాయిగా ఆ ఇంట్లో అడుగుపెడతాడు కార్తిక్. అతను లక్ష్మీపతి మనసు గెలుచుకోగాలిగాడా? అన్నది కథ.

నిజానికి తెలుగు ప్రేక్షకులకి ఇదేమీ కొత్తకథ కాదు. అందుకే కథనం మీద ఆధార పడ్డాడు దర్శకుడు.. ప్రేక్షకుడు ఆలోచనలో పడకుండా ఉండడం కోసం హాస్య సన్నివేశాలని గుది గుచ్చాడు. క్లీన్ కామెడీ ని మాత్రమే ఎంచుకోవడం అభినందించాల్సిన విషయం. జంద్యాల పాపులర్ డైలాగు 'నాన్నా చిట్టీ..' కి నేపధ్యం లో వచ్చే సంగీతాన్ని కథానుసారం వాడుకుని మొదటి సగం లో హాయిగా నవ్వించాడు. అలాగే 'ముద్దుగారే యశోద..' కీర్తనని హీరో మీద చిత్రీకరించి 'పడమటి సంధ్యారాగం' గుర్తు చేశాడు.

తండ్రికూతుళ్ళ సెంటిమెంట్ సన్నివేశాలు గతంలో వచ్చిన కృష్ణవంశీ 'చందమామ' 'శశిరేఖా పరిణయం' లో చూసేసినవే.. తండ్రికి ఎదురు చెప్పలేని కూతురు, కూతురి ఎంపిక ని అంగీకరించలేని, అలా అని ఆమెని కష్ట పెట్టలేని తండ్రి. చాలా ఫ్రేముల్లో తెరమీద కిటకిటలాడుతూ జనం కనిపించడం వల్ల కూడా కృష్ణవంశీ గుర్తొచ్చాడు అప్పుడప్పుడు. అయితే, ప్రతి పాత్రకీ ఒక ఐడెంటిటీ ఇచ్చే విషయం లో మాత్రం కొంచం జాగ్రత్త పడ్డాడు దర్శకుడు.

నేటివిటీ విషయంలో గురువు శేఖర్ కమ్ముల చేసిన పొరపాటునే శిష్యుడు సాయికిరణ్ కూడా చేశాడు. కేవలం తెర నిండా గోదారినీ, పచ్చని కొబ్బరి తోటలనీ చూపించడం ద్వారా నేటివిటీ వచ్చేస్తుందనుకోడం పొరపాటు. పాత్రల ఆహార్యం, భాషా సంస్కృతులు.. ఇవన్నీ ఆ ప్రాంతాన్ని ప్రతిబింబించాలి. ఈ దిశగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ('శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ' లాంటి వంశీ పాత సినిమాల్లో గోదావరి నేటివిటీ ని చూడొచ్చు) అలాగే సినిమా ప్రారంభం, ముగింపు విషయాల్లో ఇంకొచం శ్రద్ధ చూపి, సన్నివేశాలని రొటీన్ కి భిన్నంగా రాసుకుని ఉండాల్సింది అనిపించింది.

మణికాంత్ కద్రి సంగీతం లో వనమాలి (సింగిల్ కార్డ్) రాసిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా 'చినుకై వరదై..' 'నీలి మేఘమా..' పాటలు వెంటాడతాయి. ఎడిటింగ్ ఇంకొంచం జాగ్రత్తగా చెయ్యొచ్చు, ముఖ్యంగా రెండో సగంలో.. కృష్ణుడిని పెద్దగా ఫోకస్ చేయలేదనిపించింది.. బహుశా అతని పాత్ర 'వినాయకుడు' కి కొనసాగింపు కావడం వల్ల కావొచ్చు. కొంచం డల్ గా కనిపించాడు చాలా చోట్ల. శరణ్య బాగా చేసింది. రావు రమేష్, యండమూరి పర్వాలేదు.

"సినిమా విజయానికి యాభై శాతం క్రియేటివిటీ, మరో యాభై శాతం పబ్లిసిటీ సాయపడతాయి" అని ఆమధ్య ఏదో ఇంటర్వ్యూ లో చెప్పాడు సాయికిరణ్. క్రియేటివిటీ పాళ్ళు మరో పది, పదిహేను శాతం కలిపితే మరింత చక్కని సినిమా అయి ఉండేది 'విలేజ్ లో వినాయకుడు.'

22 కామెంట్‌లు:

  1. బాగుంది ఈ సినిమా రివ్యూ. ఇలాంటి సినిమా ఒకటి రిలీజ్ అయ్యిందని కూడా తెలియదు నాకు. వస్తుందేమో లెండి ఇంకో రెండు మూడు వారాలలో మాకు కూడా, మా వూరు B క్లాస్ సెంటర్ అమెరికా లో. "చాలా ఫ్రేముల్లో తెరమీద కిటకిటలాడుతూ జనం కనిపించడం వల్ల కూడా కృష్ణవంశీ గుర్తొచ్చాడు అప్పుడప్పుడు. " బావుంది అబ్జర్వేషన్. యండమూరి కి మొదటి సినిమా ఏమో కదా నటుడి గా?

    రిప్లయితొలగించండి
  2. మొత్తానికి చూడదగ్గ సినిమానే అంటారన్నమాట...నాకెందుకో ఆ హీరో అస్సలు ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేడేమో అని అనిపిస్తుంటుంది(ఇదివరకటిది చూసా).
    మీ రివ్యూ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  3. హ్మ్మ్.... పాత టపాకి కామెంటేలోగానే ఇంకో టపా వచ్చేసింది. మీ పేస్ కి మమ్మల్ని మేం సరి చేసుకుంటూ ఉండాలి! విల్లేజ్ లో వినాయకుడు బాగుందన్నమాట. " గురువు గారు శేఖర్ కమ్ముల చేసిన తప్పునే..." ఈ డైలాగ్ మా అప్పారావు కి చూపించాలి వెంఠనే :)

    రిప్లయితొలగించండి
  4. ఈ సినిమాలో పాటలు బాగున్నాయని ఆ మధ్యెప్పుడో నవతరంగంలో చదివిన గుర్తు. ఇంకా విననే లేదు...మీరప్పుడే సినిమా అంటున్నారు...అసలు చూడాల్సినవి చాలా ఉన్నాయి...ఎప్పటికో వాటికి మోక్షం మరి.... :)

    రిప్లయితొలగించండి
  5. రవిగారు (ravigaru.blogspot.com) కూడా ఈ సినిమాలో ఉన్నారు. గమనించారా...

    రిప్లయితొలగించండి
  6. మీరు మరీనండీ. సచిన్‌తో పోలుస్తూ మాట్లాడితే ఎవరు మిగులుతారు? గోదావరీ- వంశీకూడా అంతే మరి. సరే లీమ్కులు కోసం వెతుకుతా. దొరికితే ctrl+D :)

    రిప్లయితొలగించండి
  7. బాగుంది. చూడచ్చన్నమాట.
    ఇదేదో వినాయకుడు సిరీస్ తీస్తాడేమో ఇతగాడు!

    రిప్లయితొలగించండి
  8. బాగుంది సినిమా రివ్యూ....
    సినిమా కూడా పర్వాలేదు అని విన్నాను.

    రిప్లయితొలగించండి
  9. ఓ...సినిమా రిలీజ్ అయిపొయిందా?

    నాకూ చూడాలని ఉంది ఈ సినిమా.

    రిప్లయితొలగించండి
  10. ఆ డైలాగు "నాన్నా చిట్టీ" కాదు "బాబూ..చిట్టీ..."
    మా అమ్మని మేం ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటాము...."ఏంటి?...బాబు చీట్టీనా?" అని....
    "అష్ట చమ్మా" లో కూడా వాడుకున్నారు కదా..

    రిప్లయితొలగించండి
  11. ధైర్యంగా చూసేయచ్చంటారనమాట సినిమా..

    రిప్లయితొలగించండి
  12. మీ పోస్టులే కాదు మీ ఫాలో అప్ లు కూడా చదివేలా చేస్తారు. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  13. నా వీకెండ్ సినిమా ఫిక్స్ ఐపోయిందోచ్ ! మీ రివ్యూ చదివాకా :)
    అన్నట్టు బ్లాగర్ రవిగారు కొన్ని సన్నివేశాలలో నటించారట ఇది మరో విశేషం !
    @ భావన ! యండమూరిగారు ఈమధ్య "డైరీ " లో కూడా కనిపించారు.

    రిప్లయితొలగించండి
  14. ఏవిటో, అసలు ఈ సినిమా మీద ధ్యాసే పోలేదు. బాణం సినిమా రివ్యూ మీరు రాసేవరకు నాకసలు అదిబాగుంటుందనే అనిపించలేదు. సో,ఈ సినిమా కూడా చూడొచ్చు.

    రిప్లయితొలగించండి
  15. @భావన: యండమూరి గతంలో 'డైరీ' అనే ఒక సినిమా లో కనిపించారు.. పరిమళం గారిది కూడా అదే మాట.. ధన్యవాదాలండీ..
    @శేఖర్ పెద్దగోపు: ఇంకా బాగా తీయోచ్చండీ.. కానీ ఆరోగ్యకరమైన హాస్యం తీసినందుకు అభినందించాలి.. పాటలు బాగున్నాయి.. ధన్యవాదాలు.
    @Ruth: అప్పారావు గారు ఏమన్నారో మాక్కూడా చెప్పండి మరి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @తృష్ణ: మీరైతే సినిమా పేరు చెప్పకుండా రాసేవాళ్ళు కదా అనుకున్నానండి, రాసేటప్పుడు.. ధన్యవాదాలు.
    @సత్యనారాయణ శర్మ: అవునా.. గమనించ లేదండీ.. ధన్యవాదాలు.
    @సుబ్రహ్మణ్య చైతన్య: పోలిక కాదండీ..ఉదాహరణ.. సరే కానివ్వండి :) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @కొత్తపాళీ: ద్వితీయ విఘ్నం కలగా కుండా ఉండడం కోసం వినాయకుడి మీద భారం వేశాదేమో అని నా అనుమానం :):) ..ధన్యవాదాలు.
    @పద్మార్పిత: ధన్యవాదాలు.
    @శ్రీ: కాలాస్త్రి సమీక్ష కోసం నేనూ ఎదురు చూస్తున్నానండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. @వేణూ శ్రీకాంత్: పర్లేదండీ.. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా చూడండి.. ధన్యవాదాలు.
    @rama108: అడిగిన వాటికి సమాధానాలు చెప్పాలి కదండీ.. ధన్యవాదాలు.
    @పరిమళం: అయితే మీ టపా కోసం ఎదురు చూస్తూ.. ధన్యవాదాలు.
    @జయ: బాణం తో పోలిక లేదు కానీ, సినిమా బానే ఉందండీ.. ధన్యవాదాలు. అన్నట్టు మీకు బాణం నచ్చిందా? ఓ టపా రాయొచ్చు కదండీ??

    రిప్లయితొలగించండి
  19. ఇవ్వాళా సినిమా చూసాను, బాగా నచ్చింది.

    ఇంకా శరణ్య రోల్ సూపర్ గా ఉంది.

    రిప్లయితొలగించండి
  20. @మౌళి: అమ్మాయి బాగుందండీ.. కానీ అతని పక్కన మరీ చిన్నగా ఉంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. అంత సినిమానూ చూసి మీకు అర్ధమైంది ఇదా..??
    వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరిమటుకూ "best pair" అయినా చూసేవాళ్ళకు "odd pair" అనిపించాలనేదే కదా దర్శకుడి ప్రయత్నం....అందుకే అంత చిన్నగా కనిపించే అమ్మాయిని ఏరుకుని మరీ పెట్టుకున్నది...

    రిప్లయితొలగించండి
  22. hai friends
    nenu na friends kalisi 5 minits short film prayatnam chesam.
    ee link lo choosi me comments teliyajeyandi.

    http://okkaavakasam.blogspot.com/2009/12/original-video-more-videos-at-tinypic.html

    రిప్లయితొలగించండి