బుధవారం, నవంబర్ 04, 2009

నాయికలు-కజు

ఆమె తన మూడవ ఏట జరిగిన మారణకాండకి ప్రత్యక్ష సాక్షి. ఆ గాయం తాలూకు గుర్తులు చెరగక ముందే పెంపుడు తల్లితో కలిసి పొరుగు దేశానికి ప్రయాణమయ్యింది. సంఘర్షణ ఆమె జీవితంలో ఒక భాగమయ్యింది. పెంపుడు తల్లి ఎలాంటి లోటూ చేయకపోయినా వయసుతో పాటు ఆమెలో పెరిగిన కోరిక ఒక్కటే.. ఎప్పటికైనా "తన వాళ్ళని" కలుసుకోవాలని.. చదువు పూర్తవ్వడంతోనే, అమెరికా నుంచి ఇండియా కి ప్రయాణమయ్యింది, బంధువులని చూసే వంకతో. మూలాలని వెతుక్కుంటూ ఆ అమ్మాయి చేసిన అన్వేషణే సోనాలి బోస్ రాసిన ఆంగ్ల నవల 'అము.' కథానాయిక కజు.. కజోరి రాయ్.

అమెరికా వర్ణ వివక్ష కారణంగా ఇబ్బందులు పడుతున్న మూడో ప్రపంచ దేశాల పౌరుల కోసం పనిచేసే ఉద్యమకారిణి కేయ రాయ్ పెంపుడు కూతురు కజు. ఢిల్లీ శివార్లలోని చందన్ హోలా అనే పల్లెటూళ్ళో అంటు వ్యాధి ప్రబలి చాలా మంది చనిపోయారనీ, అప్పుడే తాను మూడేళ్ళ కజు ని పెంపకానికి తీసుకున్నాననీ కూతురికి చెబుతుంది కేయ. తన ఊరిని చూడాలని, తనవారంటూ ఎవరైనా ఉంటే వాళ్ళని కలుసుకోవాలనే కోరిక వయసుతో పాటే పెరుగుతుంది కజు కి. తను తన గతాన్ని తలచుకోవడం తల్లికి ఇష్టం లేదని తెలుసు ఆమెకి. అందుకే చదువు పూర్తవ్వగానే, అమ్మమ్మనీ (కేయ తల్లి), మావయ్య కుటుంబాన్నీ చూసే వంకతో ఢిల్లీ బయలుదేరుతుంది.

స్వతంత్ర భావాలున్న కేయ పెంపకం, అమెరికా వాతావరణం నేపధ్యంలో పెరిగిన కజు ది విలక్షణమైన వ్యక్తిత్వం. తను అనుకున్నది ఎలాగైనా సాధించే పట్టుదల ఉన్న అమ్మాయి. అయితే అందుకోసం ఎవరినీ ఇబ్బంది పెట్టలేని మొహమాటం కూడా ఉంది. ఎలాంటి విషయాన్నైనా తల్లితో ధైర్యంగా చర్చించగలదు. తన పదమూడో ఏట కలిగిన 'తొలి ముద్దు' అనుభవాన్ని ఆమె మొదట చెప్పింది కేయకే.

చిన్నతనంలో తన స్నేహితుల కుటుంబాలని చూసి, తనకీ తల్లీ, తండ్రీ వాళ్లకి ఉదయం నుంచీ సాయంత్రం వరకూ మాత్రమే ఉండే ఉద్యోగాలు, చక్కటి సాయంత్రాలు, ఆహ్లాదకరమైన వారాంతాలు ఉంటే బాగుండేవని అనుకుంటుంది కజు. అయితే వయసు పెరిగే కొద్దీ తల్లి చేసే పనుల్లో గొప్పదనం అర్ధమవుతుంది ఆమెకి. ముఖ్యంగా తన స్నేహితులంతా తల్లిని అడ్మిరేషన్ తో చూస్తున్నప్పుడు ఆమె కూతురు అయినందుకు గర్వపడుతుంది కజు. ఆమెతో పాటే ఉద్యమాలలో పాల్గొంటూ ఉంటుంది, తనకి వీలైనప్పుడల్లా.. పేదలనూ, వాళ్ళ కష్టాలనూ చూసి చలించిపోయే మనస్తత్వం ఆమెది.

ఢిల్లీ లో ఉంటున్నా బెంగాలీ సంప్రదాయాలని క్రమం తప్పకుండా పాటించే మావయ్య కుటుంబంతో, ముఖ్యంగా తన ఈడుదే అయిన మావయ్య కూతురు తుకి తో తొందరలోనే అనుబంధం పెరుగుతుంది కజు కి. ఇండియా వచ్చిన నెల్లాళ్ళకి పల్లెటూరు చూడాలనే వంకతో చందన్ హోలాకి ప్రయాణం చేస్తుంది కజు. ఆమెని ఒంటరిగా బయటకు పంపడానికి ఇష్టపడని మేనమామ కుటుంబం ఆమె వెంటే వస్తుంది. ఎంతగా ప్రయత్నించినా ఆ గ్రామం తో తనకి ఎలాంటి అనుబంధం ఉన్నట్టు అనిపించదు కజు కి.

ఓ గురుద్వారా నుంచి వినిపించే గుర్బానీ యెంతో పరిచయమైనదిగా అనిపిస్తుంది కజుకి. 'ఎందుకు' అన్న విషయం లో స్పష్టత ఉండదు ఆమెకి. తుకి బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ స్నేహితుడైన కబీర్ తో పరిచయమవుతుంది ఆమెకి. సీనియర్ బ్యూరోక్రాట్ అరుణ్ సెహగల్ కొడుకైన కబీర్ తో మాటల యుద్ధంతో మొదలైన పరిచయం, అతనితో కలిసి ఒక మురికి వాడని చూడడానికి వెళ్ళేలా చేస్తుంది. ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలో దాబా నడిపే గోబింద్ భయ్యా ఇల్లు, ముఖ్యంగా దగ్గరలోనే ఉన్న రైల్వే ట్రాక్ తనకి బాగా తెలిసినవిగా అనిపిస్తాయి కజుకి.

తనని ఎవరో తరుముతున్నట్టుగానూ, తనని తాను రక్షించుకోవాలని అంతరాత్మ చెబుతున్నట్టుగానూ అనిపించి ఒకరకమైన ఉద్వేగానికి లోనవుతుంది కజు. కబీర్ సాయంతో తన జన్మ రహస్యం తెలుసుకునే పని మొదలు పెడుతుంది. పాత రికార్డులు చూడడం ద్వారా తన మూడో ఏట చందన్ హోలలో అంటు వ్యాధి ప్రబలి పెద్ద యెత్తున జనం చనిపోయిన సంఘటన ఏదీ జరగలేదని తెలిసి ఆశ్చర్య పోతుంది. ప్రతి విషయాన్నీ తనతో చర్చించే కేయ ఇంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పిందో అర్ధం కాదు ఆమెకి. అది మొదలు తన ప్రయత్నాలు మరింత తీవ్రతరం చేసి జన్మరహస్యాన్ని చేధిస్తుంది.

ఇండియన్ అమెరికన్ రచయిత్రి సోనాలి బోస్ రాసిన 'అము' నవల్లో కజుతోపాటు కేయ పాత్రకూడా చాలా బలమైనదే. తనకి ఏమీ కాని పసి పిల్ల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన స్త్రీ కేయ. గతం తెలుసుకోడానికి కజు పడే తపన, చేసే ప్రయత్నాలు అలెక్స్ హెలీ 'రూట్స్' నవలని గుర్తు చేస్తాయి. ఇలాంటి కథాంశం తో వచ్చే సాహిత్యంపై 'రూట్స్' ప్రభావం పడకుండా ఉండడం సాధ్యం కాదేమో. మార్కిస్టు రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం వల్ల కావచ్చు, సోనాలి బోస్ రచనలో చాలా చోట్ల 'ఎరుపు' నీ 'ఎర్రజెండా' నీ సింబాలిక్ గా వాడారు. రాజకీయాంశాల చర్చలో ఆమె మార్క్సిస్టు పార్టీ భావజాలాన్నే బలపరిచారు.

'అము' పేరు తో కజు పాత్రలో కొంకణ సేన్ శర్మ, కేయ పాత్రలో తన పిన్ని, మార్కిస్టు పార్టీ నేత బృందా కరత్ లతో సోనాలి తను తీసిన ఆంగ్ల చిత్రానికి 2004 సంవత్సరానికి గాను 'గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ నేషనల్ అవార్డు' అందుకున్నారు. స్క్రీన్ ప్లే ని కొద్ది మార్పులతో నవలగా విడుదల చేశారు. నాలుగేళ్ల క్రితం తొలిసారిగా చదివిన ఈ నవలని, మాజీ ప్రధాని ఇందిర హత్య జరిగి పాతికేళ్ళు గడిచిన సందర్భంగా దేశ రాజధానిలో జరిగిన ప్రదర్శనల నేపధ్యంలో మరో సారి తిరగేశాను. గతం లో లాగే కజు, కేయ పాత్రలు వెంటాడుతున్నాయి. ('amu,' పేజీలు 142, వెల రూ. 200, పెంగ్విన్ ప్రచురణ).

16 కామెంట్‌లు:

  1. మరో మంచి పుస్తకాన్ని మాముందుంచారు!

    నేను Amu సినిమా చూశాను.. 15 Park Avenue చూసిన తర్వాత కొంకణా సినిమాలన్నీ చూశేయాలని దీక్షగా వెతుకుతున్నప్పుడు ఇది కనబడింది! నాకు చాలా బాగా నచ్చిన సినిమాల్లో ఇదొకటి!

    రిప్లయితొలగించండి
  2. మరోమాట.. మొత్తం మూవీ యూట్యూబ్ లో ఉంది..

    http://www.youtube.com/watch?v=nKUyFTyTNwU

    రిప్లయితొలగించండి
  3. నేను కూడా ఈ పుస్తకం చదివాను. సినిమా చూడలేదు.

    రిప్లయితొలగించండి
  4. మురళీ గారూ !
    అము గురించి విన్నాను గానీ చూడటం కుదరలేదు. మంచి పరిచయం. అభినందనలు. అలాగే ఆ సినిమా లింక్ ను అందించిన నిషిగంధ గారికి కూడా అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. గాప్ తీసుకున్న తరువాత మంచి మంచి టపాలు వస్తాయన్నమాట..!!

    Mr.& Mrs Iyer లో ఆమె నటన చూసాకా నా అబిమాననటుల జాబితాలోకి చేరిపోయింది "కొంకణ".
    తరువాతెప్పుడో "page 3".... "Metro" చూసాను. మధ్యలో కొన్ని కారణాల వల్ల ప్రపంచకం లో జరిగిన విషయాలు తెలియవు లెండి. ఆ సమయంలో నేను ఈ సినిమాను, మరికొన్నిటిని మిస్సయ్యాను....ఈ సినిమా గురించీ, వచ్చిన అవార్డుల గురించీ విన్నాను కాని చూడటం పడలేదు...
    చాలా బాగా రాసారు.

    రిప్లయితొలగించండి
  6. నేను సినిమా చూసేను నవల వుందని తెలియదు.. మంచి పరిచయం మురళి ..

    రిప్లయితొలగించండి
  7. Very nice Intro.. Will first read the book and then watch the movie.. :)

    రిప్లయితొలగించండి
  8. @నిషిగంధ: వీలయితే నవల చదవండి.. లంకె ఇచ్చినందుకు బోల్డన్ని థాంకులు..
    @సునీత: ఇప్పుడు చూడచ్చండీ సినిమా.. లంకె ఉంది కదా... ధన్యవాదాలు.
    @SR Rao: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  9. @తృష్ణ: కొంకణ నటన నాక్కూడా నచ్చుతుందండీ.. నేనూ మొదట చూసింది 'అయ్యర్' లోనే..ధన్యవాదాలు.
    @భావన: వీలయితే నవల చదవండి.. ధన్యవాదాలు.
    @మేధ: అదే మంచిదండీ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. ఈ కాలపు హీరొయిన్లలో కొంకణా సేన్ బాగా చేస్తుంది, రాశి లో కాకపొయినా వాశిలో. పుస్తకం దొరికితే చదవాలి.

    రిప్లయితొలగించండి
  11. పరిచయం చాలా బాగుందండీ.. సంపాదించడానికి ప్రయత్నిస్తాను. ఈ సారి క్లైమాక్స్ గురించి క్లూలు ఏమీ వదిలినట్లు లేరు :-)

    రిప్లయితొలగించండి
  12. మరో నాయికను మాముందుకు తెచ్చారు .పరిచయం బావుందండీ నిషిగంధగారికి thanks!

    రిప్లయితొలగించండి
  13. కజు పాత్ర లోని భావ సంఘర్షణ చాలా బాగా వివరించారు. కన్న తల్లి తండ్రులను వెతుకుతు వెళ్ళిన కొన్ని నిజ సందర్భాలు కూడా ఉన్నాయి. మామూలుగానే మీ వివరణ చాలా బాగుంది మురళి గారు.

    రిప్లయితొలగించండి
  14. @Ruth: తప్పక చదవండి, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా.. నిజమేనండీ కొంకణ బాగా చేస్తోంది.. ముఖ్యంగా వైవిధ్యం కోసం ప్రయత్నిస్తోంది.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: బోల్డన్ని క్లూలు ఉన్నాయండి.. మీరు పుస్తకం చదివాక, కొంచం ఓపిక చేసుకుని మరోసారి టపా చదివితే దొరుకుతాయి :-) :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @పరిమళం: అనుకోకుండా చేసిన పరిచయం అండీ ఇది.. నిషిగంధ గారికి నా వైపునుంచ్i కూడా మరో థాంక్స్.. ధన్యవాదాలు.
    @జయ: సాహిత్యం జీవితం నుంచే పుడుతుంది కదండీ.. ఈ నవల్లో చాలా నిజ జీవిత సంఘటనలు ఉన్నాయి.. వీలైనప్పుడు చదవండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. మురళీ గారూ...చాలా చాలా థాంక్స్ మీకు...ఇంత మంచి పుస్తకాన్ని (కొనిపించి) చదివించినందుకు.

    రిప్లయితొలగించండి