శుక్రవారం, అక్టోబర్ 16, 2009

తిప్పుడు పొట్లం

అప్పుడు నాకు తొమ్మిది/పదేళ్ళు. ఎప్పటిలాగే ఆ సంవత్సరం కూడా దీపావళి హడావిడి మొదలయ్యింది. అప్పటి పరిస్థితి ఏమిటంటే మతాబులు, కాకర పువ్వొత్తులు కాల్చడం మరీ చిన్నతనం, టపాకాయలు కాల్చడం మరీ పెద్దతనం. ఏం చెయ్యాలి మరి? అసలే దీపావళి అంటే నెల్లాళ్ళ ముందు నుంచే మతాబా గొట్టాలు చేసే పని మొదలైపోతుంది ఇంట్లో. మరో పక్క టపాకాయల హడావిడి. మతాబా మందూ, సూరే కారం, మన్నూ మశానం.. మొత్తం కలిపి చిత్ర విచిత్రమైన వాసనలు.

నేనంత ఉత్సాహంగా ఉండకపోడం తాతయ్య దృష్టిలో పడింది. ఒళ్లో కూర్చో పెట్టుకుని ఆ కబురూ, ఈ కబురూ చెప్పి నా బాధేమిటో కూపీ లాగారు. "ఓస్.. ఇంతేనా.. నీకీ సంవత్సరం తిప్పుడు పొట్లం చేయిస్తాను కదా.." నాకేమో మిఠాయి పొట్లం తెలుసు కానీ తిప్పుడు పొట్లం ఏమిటో తెలీదు. కనీసం ఆ పేరు కూడా వినలేదు. మా ఊళ్ళో నా ఈడు పిల్లలెవరూ అప్పటి వరకూ ఎవరూ తిప్పుడు పొట్లం కాల్చలేదని తెలిసి బోల్డంత గర్వ పడ్డాను. ఇక అది మొదలు ఎప్పుడెప్పుడు దీపావళి వస్తుందా అని ఎదురు చూడడమే..

తాతయ్య చిన్నప్పుడు ఇంట్లో పిల్లలంతా తిప్పుడు పొట్లం తిప్పుకునే వాళ్లుట.. కావాల్సిన సరంజామా అంతా వాళ్ళే సమకూర్చుకునే వాళ్లుట.. "ఏమేం కావాలో చెబుతాను.. తెచ్చుకుని ఒక చోట పెట్టుకో" అని తాతయ్య చెప్పడం ఆలస్యం, మరుక్షణం నేను వేట మొదలు పెట్టాను. తాతయ్య అభయ హస్తం ఉంది కాబట్టి నాన్న భయం లేదు. ముందుగా డొక్క పొట్టు తెచ్చి ఎండబెట్టాలి. కొబ్బరి పీచుతో డొక్క తాళ్ళు పేనే లక్ష్మమ్మ గారి ఇంటి చుట్టూ నాలుగైదు ప్రదక్షిణాలు చేసి తడి తడిగా ఉన్న డొక్క పొట్టు సంపాదించా.

నెక్స్ట్ ఐటెం చితుకులు. అర్ధమయ్యేలా చెప్పాలంటే తాటికాయల గుత్తి లో కాయలు రాలిపోయాక మిగిలి ఉండే ఖాళీ గుత్తులన్న మాట. తాటి తోపు చుట్టూ తిరిగి ఎన్ని సంపాదించానంటే.. అవి చూసి అమ్మ బోల్డంత సంతోష పడింది.. తిప్పుడు పోట్లానికి పోను మిగిలిన వాటితో ఒక నెల్లాళ్ళ పాటు వేడి నీళ్ళు కాచుకోవచ్చని. తగుమాత్రం చితుకులని ఎండ బెట్టి, కాల్చి బొగ్గులు చేసి, ఆ బొగ్గులని మరీ మెత్తగా కాకుండా పొడి కొట్టి పక్కన పెట్టేసరికి నా శరీర చాయ కృష్ణ వర్ణానికి మారింది. అద్దం లో చూసుకుంటే నేను దొరికిన పిల్లాడినేమో అని నాకే అనుమానం వచ్చింది.

తిప్పుడు పొట్లం చేయడానికి కావాల్సిన మరో ముఖ్యమైన వస్తువు ఉప్పు. అదెలాగో ఇంట్లో పెద్ద జాడీ నిండా సమృద్ధిగా ఉంటుంది. "ఇదిగో.. రేప్పొద్దున్న మీరు ఏడాదికి కొన్న ఉప్పు అప్పుడే అయిపోయిందా అంటారు.. తాతా మనవళ్ళు వేరే ఉప్పు కొనుక్కోండి.. ఇంట్లోది ఇవ్వను" అని బామ్మ పేచీ పెట్టింది. అలాంటివి పట్టించుకుంటే తాతయ్య గొప్పదనం ఏముంది? పాత నేత చీర కనీసం సగం ముక్కైనా కావాలి.. బామ్మని అడుగుదాం అనుకున్నాను కానీ.. "నా దగ్గర ఉందిరా.." అని అమ్మ ఇచ్చేసింది. ఒక తాటాకు కావాలిట.. తాతయ్య నరసింహులు చేత తెప్పించారు.

తెల్లారితే దీపావళి.. అయినా ఇల్లలకగానే పండుగ కాదు కదా.. తిప్పుడు పొట్లం అలకడానికి పేడ, మట్టి కావాలనేసరికి, కొమ్ముల గేదె దగ్గరికి కొంచం భయం భయంగా వెళ్లి పేడ తెచ్చేశా. తిప్పుడు పొట్లం ఎలా ఉంటుందో, ఎలా కాల్చాలో నా ఊహకి అస్సలు అందడం లేదు.. తాతయ్యని అడిగినా "చేసి ఇస్తాను కదా.." అంటున్నారు తప్ప ఇంకేమీ చెప్పడం లేదు. ఇంక నేను చేసేదేముంది? తాతయ్య తిప్పుడు పొట్లం ఎలా చేస్తారో చూడడం తప్ప.

ముందుగా చీర ముక్కని అడ్డంగా మడతలు వేసి నిలువుగా పరిచారా.. దానిమీద ఎండబెట్టిన డొక్క పొట్టు, చితుకుల పొడి, ఉప్పు అన్నీ కలిపి సమంగా పరిచారు, తాతయ్య నాన్న కలిసి. ఇప్పుడు చీర ముక్కని రిబ్బన్ చుట్టినట్టుగా చుట్టుకుంటూ వెళ్ళారు, డొక్క పొట్టూ అవీ ఒలికి పోకుండా.. మొత్తం చుట్టేశాక పురికొస తాడుతో గట్టిగా కట్టేశారు. అప్పుడు తాతయ్య అమ్మని కేకేసి ఆ మూట చుట్టూ రెండు సార్లు అలకమన్నారు.. "నాకు తెలుసండీ మావయ్య గారూ.. మా చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం" అని వినయంగా చెప్పింది అమ్మ. మొత్తానికి ఒక పేడముద్ద లా తయారైన ఆ వస్తువు ని చూడగానే సగం ఆసక్తి పోయింది నాకు.

"అప్పుడే అయిపోలేదురా.. ఇంకా బోల్డంత పని ఉంది.. దీన్ని బాగా ఎండ బెట్టు.." చెప్పారు తాతయ్య. వీధిలో మంచం వేసి మతాబాలు, చిచ్చు బుడ్లు, జువ్వలు వాటన్నింటితో పాటూ పొట్లాన్ని కూడా ఎండ బెట్టాను. "బాగుంది తిప్పుడు పొట్లం.. మిగిలిన వాటికి దిష్టి తగలకుండా.." తాతయ్య వినకుండా బామ్మ వెక్కిరించింది. దీపావళి రోజు మధ్యాహ్నానికి ఫెళఫెళ్ళాడుతూ ఎండిపోయింది ఆ తిప్పుడు పొట్లం. సాయంత్రం అవుతుండగా నరసింహులు వచ్చాడు. ఎండిన తాటాకులో కమ్మ మాత్రం ఉంచి, ఆకుని విడగొట్టేశాడు. ఆ కమ్మని ఒక ఉట్టిలా తయారు చేసి అందులో పొట్లాన్ని పెట్టి కదలకుండా కట్టేశాడు.

అది మొదలు నేను దివిటీలు కొట్టేస్తాననడం.. బామ్మేమో కాసేపు ఆగమనడం.. దివిటీలు కొట్టాక కూడా తిప్పుడు పొట్లం కాల్చడానికి తాతయ్య ఒప్పుకోలేదు.. "చీకటి పడ్డాక అయితే బాగుంటుంది" అనడంతో ఇష్టం లేకపోయినా మతాబాలూ అవీ కాల్చాను కాసేపు. చీకటి పడ్డాక తిప్పుడు పొట్లం లో పైన నిప్పు వేసి, ఓ రెండు తిప్పులు తిప్పి చూపించి పొట్లాన్ని నా చేతికి ఇచ్చారు తాతయ్య. తాటి కమ్మ పట్టుకుని వడిసెల తిప్పినట్టు గిరగిరా తిప్పితే పొట్లం లోపల నిప్పు రాజుకుని ఉప్పు కళ్ళు ఠాప్ ఠాప్ మని పేలడం.. బొగ్గు పొడి, కొబ్బరి పొట్టూ కలిసి మెరుపుల్లా బయటకి రావడం. ఎంత స్పీడుగా తిప్పితే అన్ని మెరుపులు.

మొదట్లో చాలా ఉత్సాహం గా ఉంది కానీ, రాను రానూ చెయ్యి నొప్పెట్టడం మొదలెట్టింది.. మెరుపులు బయటికి రావడం మినహా ఏ ప్రత్యేకతా లేదు తిప్పుడు పొట్లంలో.. ఎంత సేపు తిప్పినా ఎప్పటికీ అవ్వడం లేదన్న విసుగు.. అక్కడికీ 'కాసేపు మీరు కూడా తిప్పండి.. ఎంత బాగుందో' అని ఇంట్లో వాళ్ళని ఊరించా.. అబ్బే.. వింటేనా.. ఇలా కాదని "మిగిలింది రేపు మిగులు దీపావళి కి తిప్పుతా తాతయ్యా.." అన్నాను.. అలా కుదరదుట.. ఒకసారి వెలిగిస్తే పూర్తవ్వాల్సిందేట..

చేతులు మార్చుకుంటూ, స్పీడు బాగా తగ్గించి తిప్పుతుంటే చూసి కాసేపటికి తాతయ్య జాలి పడ్డారు.. "ఇంక చాల్లేరా.. పక్కన పడేయ్.." అనడంతో ప్రాణం లేచొచ్చింది. "ఇంతోటి సంబరానికి నా ఉప్పు జాడీ ఖాళీ చేసేశావా నాయనా" అన్న బామ్మ మాటలు విన్నట్టు నటించా..

బ్లాగ్మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

37 కామెంట్‌లు:

  1. బాగుంది మురళిగారు,
    నాకు ఈ తిప్పుడు పొట్లం గురించి తెలీదు సుమా! మీరు పోస్ట్ చదువుతూ వుహించుకొన్న.దీపావళి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. ha ha bhale raasaru

    meeku kooda దీపావళి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  3. సిసింద్రీలు తయారుచేసుకోలేదాండీ ....దాంట్లో కూడా మన్నూ మశానం లాంటివేవో వేస్తారనుకుంటా :)
    కృష్ణ వర్ణం ....హ హ్హ హ్హ ....మరి నెమలికన్ను ధరించిన వాడి వర్ణమదే ... ఉప్పు పొట్లం సస్పెన్స్ చివరిదాకా విప్పలేదు భలే నాకైతే దానిగురించి ఇప్పటివరకూ తెలీదు.ఐనా తాతగారు అంత కష్టపడి తయారుచేసిస్తే మీరేంటండీ చివరివరకూ తిప్పకుండా .... :) మీకూ , మీ కుటుంబసభ్యులకూ దీపావళి శుభాకాంక్షలు .

    రిప్లయితొలగించండి
  4. వో ఇదా తిప్పుడు పొట్లామంటె.. పక..పక..పక (నవ్వేనన్న మాట) మా అక్క వాళ్ళు ఖమ్మం అవతల నైజాం ప్రాంతం లో వుండేవారు తెగ గొప్ప చెప్పుకునేది చిన్నప్పుడు పొట్లాం (లు) చేసుకుని తెగ తిప్పేము సూపర్ తెలుసా అని. అమ్మయ్య తృప్తి గా వుంది. థ్యాంక్స్ మురళి. మీకు కూడ దీపావళి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  5. :) భలే ఉంది మీ తిప్పుడు పొట్లం...మొదటి సారి వింటున్నాను...

    రిప్లయితొలగించండి
  6. Very nice ... I have attempted to do the same in my childhood; it never worked for us (we didn't use enough cattle dung on cloth, it got burned quickly... Thanks for sharing the joy..

    రిప్లయితొలగించండి
  7. అద్భుతం, అమోఘం...మధురం...ఇంకేమైనా పదాలు మిగిలున్నాయా అని..అసలు అనుమానం....
    very nice post....కానీ మధ్యాహ్నం నా టపా వ్యాఖ్యలొ మీరూ దివిటీలు కొట్టేవారని రాయలేదేం? ఇక్కడ మీ పోస్ట్లో రాసుకున్నారు....?? :(

    మా తాతమ్మ కూడా మీ తాతగారిలానే తయారు చేసేది...మందు కూరటమ్...ఎండబెట్టడమ్...అదొక పెద్ద కుటీఅ పరిశ్రమ తంతు..!!

    మా ఊళ్ళో కూడా దొడ్లో పొయ్యి మీదే అందరికీ నీళ్ళు కాచే వారు.కొబ్బరి మట్టలు, పొయ్యి క్రింద ఎండు కొమ్మలూ అవీ కాలుతూంటే భలే సరదాగా చూసేవాళ్ళం...!!

    రిప్లయితొలగించండి
  8. భలే గుర్తుచెసారండి.. - నాకూ చిన్నప్పుడు మా తాతగారు నేర్పించారు.. చేతులు నెప్పిపుట్టేవరకు తిప్పుతూనే వుండెవాడిని...
    మేము తడి పీచు తొ పాటు తడి రంపంపొట్టు వేసేవాళ్లం..
    చితుకులు - తాటికాయల గుత్తి లో కాయలు రాలిపోయాక మిగిలి ఉండే ఖాళీ గుత్తులు కాదనుకుంటా.. తాటిచెట్లలొ ఆడ మగ వుంటాయట.. మగ చెట్టుకి ఈ చితుకులు వస్తయకుంటా,, నాకు సరిగ్గా గుర్తులేదు..

    మీకు , మీ కుంటుంబానికి దీపావళి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  9. తిప్పుడు పొట్లం....ఎంతకాలమయిందండీ ....ఆ మాట విని. జ్ఞాపకాల పొరల్లోంచి తవ్వి తీసారు కదండీ ! శుద్ధ దేశవాళీ తయారీ ! రసాయనాల మయమైపోయిన నేటి బాణాసంచా ముందు నిలబడ లేక మాయమై పోయింది గానీ కాలుష్యం మచ్చుకైనా ఉండేదా ! ఏమైనా అందుకోండి. శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  10. ఓహ్ మీరు దాన్ని తిప్పుడు పొట్లం అంటారా ? మేము పూల పొట్లం అనేవాళ్ళం మీకు అంత నచ్చినట్లు లేదు కాని నాకు మహా ఇష్టం గా ఉండేది చిన్నప్పుడు, కాకపొతే మాకొక పెద్ద గ్యాంగ్ ఉండేది పోటీలు పడి తిప్పేవాళ్ళం, కాని ఇంత కష్టపడిన గుర్తు లేదు.
    మీకు దీపావళి శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  11. బాగా వ్రాస్తున్నారు.
    ఓ పుస్తకం వేసెయ్య వచ్చు.

    రిప్లయితొలగించండి
  12. బాగుందండీ, మీ తిప్పుడు పొట్లం. మరి ఇప్పుడు కూడా చేస్తున్నారా లేదా, మీ పిల్లలకి నేర్పించాలిగా! మీరొక్కళ్ళే, సరదాగా కాల్చుకుంటే సరిపోయిందా.మీరు తప్పకుండా ఈ దీపావళికి తిప్పుడుపొట్లం తిప్పాల్సిందే! దీపావళి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  13. మీకు,మీ కుటుంభసభ్యులందరికీ దీపావళి శభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  14. >>"ఇంతోటి సంబరానికి నా ఉప్పు జాడీ ఖాళీ చేసేశావా నాయనా" అన్న బామ్మ మాటలు విన్నట్టు నటించా..

    హ్హహ్హ.. అంతే అంతే.. ;)

    మీకు దీపావళి శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  15. హ హ బాగుంది మురళి గారు. తిప్పుడు పొట్లం గురించి నేను మొదటి సారి వింటున్నాను. తొమ్మిదేళ్ళ మురళి చేతులు మార్చుకుంటూ మెల్లగా తిప్పడం ఊహించుకుంటే చొ చొ.. పాపం అని అనిపిస్తూనే తయారీకి చేసిన హడావిడి గుర్తొచ్చి నవ్వుకూడా వచ్చింది :-)

    మా పక్కింటి కాలేజి కుర్రాళ్ళ తో కలిసి మాతాబులు తయారు చేసినప్పుడు నాదీ ఇంచుమించు ఇదే ఫీలింగ్. అవి కొంచెం ఫ్లాప్ అయ్యాయి లెండి :-) అప్పుడప్పుడు కాస్త మెరుపులు తప్ప ఏమీ లేదు పైగా ఒక పట్టాన అయి చావదు చేతిని ఇలా పట్టుకుని ఎంత సేపు నుంచోవాల్రా బాబు అని విసుగొచ్చేది.

    మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  16. happy dewalli.
    aithe aa rojullo mere tayaru chesukenevaranmatta? makeme allante anubhavaluu levu, kani meru chebuthunte chala andhanga undhi.

    రిప్లయితొలగించండి
  17. మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .

    రిప్లయితొలగించండి
  18. భలే! ఎప్పుడూ వినలేదీ పొట్లం సంగతి. తాతగారి, బామ్మగారి సంగతులింకా నచ్చాయి. యాక్ పేడ పట్టుకున్నారా? ;) ఈ మధ్య మా యువ పేదరికం అని వ్రాయబోయి (మరి పాపం ఇక్కడి పిల్లలకి అంతగా తెలుగు రాదు, వాళ్ళు నేర్చుకునేది అదో తీరు] పేడరికం అని వ్రాసినపుడు ఓ సారి, హరేకృష్ణ గారి తాజా టపాలో ఓ సారి ఈ పదం చదివాను.

    >> శరీర చాయ కృష్ణ వర్ణానికి మారింది
    మాకు బాగా తెలిసిందేలెండీ వర్ణం. :)

    టపాల్లో మీ "తిప్పుడు పొట్లమే" పెద్ద తాటాకు టపాకాయ.

    రిప్లయితొలగించండి
  19. హ హ్హ హ్హ...భలేగుంది. మొత్తానికి తొమ్మిదేళ్ళ మురళి ని కళ్ళ ముందు నిలబెట్టేశారు. కృష్ణ వర్ణం, నెమలి కన్ను "Perfect matching"

    రిప్లయితొలగించండి
  20. తిప్పుడు పొట్లం గురించి ఎప్పుడు వినలేదు ,కాసేపు నేను మీఉరు వచ్చి ,మిమ్మల్ని మీ తిప్పుడుపొట్లాన్ని చుసివచ్చేను.చాల అద్బుతంగా రాసేరు .

    రిప్లయితొలగించండి
  21. @స్వాతి మాధవ్: కొన్ని ప్రాంతాలకే పరిమితం అనుకుంటానండీ.. ధన్యవాదాలు.
    @హరే కృష్ణ: ధన్యవాదాలు.
    @పరిమళం: సిసింద్రీలది వేరే కథ అండీ.. అన్నీ ఒక్కసారే చెప్పాలంటే కష్టం కదా :):) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. @స్వప్న: అన్నింటి గురించి సాధ్యమైనంత వివరంగా రాశాను కదండీ.. ధన్యవాదాలు.
    @చిన్ని: థెన్క్సొ థెన్క్స్.. :):) ధన్యవాదాలు.
    @భావన; హమ్మయ్య.. మీకు తెలిసిపోయింది కదా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. @శేఖర్ పెద్దగోపు: అయితే చాలామందికే నేను కొత్త విషయం చెప్పానన్న మాట.. ధన్యవాదాలండీ..
    @అరుణ్: అందుకే కొద్దిగా మట్టి కూడా కలుపుతారనుకుంటానండీ.. ధన్యవాదాలు.
    @తృష్ణ: మీరు భలేగా అడుగుతారండీ.. ఏం చెప్పాలో అర్ధం కాదు నాకు :):) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. @మంచు పల్లకీ: చితుకుల గురించి నాకూ పూర్తిగా తెలీదండీ..జ్ఞాపకం ఉన్నంతవరకూ రాశా.. ఎవరినైనా అడగాలి.. ధన్యవాదాలు.
    @పద్మార్పిత: ధన్యవాదాలు.
    @SR Rao: నిజమేనండీ.. ఎకో ఫ్రెండ్లీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. @శ్రావ్య వట్టికూటి: ఒక్కళ్ళం తిప్పాలంటే బాధేనండీ.. మీరు గ్యాంగ్ కాబట్టి ఎంజాయ్ చేసి ఉంటారు.. ధన్యవాదాలు.
    @ఒరెమునా: పెద్ద ప్రశంశ.. ధన్యవాదాలు.
    @జయ: ఇప్పుడు ముడి సరుకులన్నీ ఎక్కడ సంపాదించగలం చెప్పండి? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. @నాని: ధన్యవాదాలు.
    @మేధ: మరి అంతకన్నా ఇంకేమీ చేయలేము కదండీ.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: మతాబుల గురించి రాసి ఉండాల్సిందండీ.. ఎప్పుడైనా రాయండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. @మహీపాల్: అప్పుడప్పుడూ ఇలాంటి ప్రయోగాలండీ.. బయటా కొనేవాళ్ళం.. ధన్యవాదాలు.
    @మాలాకుమార్: ధన్యవాదాలు.
    @ఉష: "యాక్??" నాకు వ్యవసాయంలోనూ, పశు పోషణ లోనూ కూడా బోల్డంత అనుభవం ఉంది.. పల్లెటూళ్ళో పుట్టి పెరిగిన వాళ్ళెవరూ పేడని తక్కువగా చూడరండీ.. అదేదో చిన్నతనం అనీ అనిపించదు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. @లక్ష్మి: స్నానం చేయగానే రంగు మారిపోయిందండీ.. పైగా అప్పుడు నెమలికన్ను లేదు :( ..ధన్యవాదాలు.
    @అనఘ: ధన్యవాదాలండీ.. అన్నట్టు మీ బ్లాగు పేరు నాకు భలేగా నచ్చింది..

    రిప్లయితొలగించండి
  29. అయ్యోరామా, నా స్మైలీ చూడలేదా? ;) పల్లెపట్టు జీవితం గడపలేదు కానీ అవగాహన వుందండి. మీ భావాలు దెబ్బ తీయటం కాదు నా ఉద్దేశ్యం.

    రిప్లయితొలగించండి
  30. మురళి గారూ, ఇన్ని టపాసులు ఎలా మిస్ అయ్యానబ్బా?
    చివరిదాకా అదేంటో అని తెగ వుత్సాహంగా చదివా? అసలు ఉప్పు/పేడ/పొట్టు ఇదేమి కాంబినేషన్ అనుకుంటూ... చివర్లో కానీ తెలియలేదు.
    ఇవిగో అసలు టపాసులు
    >>అద్దం లో చూసుకుంటే నేను దొరికిన పిల్లాడినేమో అని నాకే అనుమానం వచ్చింది
    అప్పట్లోనే మురళీ మోహనుడవన్న మాట :)
    >>అలాంటివి పట్టించుకుంటే తాతయ్య గొప్పదనం ఏముంది? :)
    >>"బాగుంది తిప్పుడు పొట్లం.. మిగిలిన వాటికి దిష్టి తగలకుండా.." తాతయ్య వినకుండా బామ్మ వెక్కిరించింది

    దీనికి :) :-)

    >> అక్కడికీ 'కాసేపు మీరు కూడా తిప్పండి.. ఎంత బాగుందో' అని ఇంట్లో వాళ్ళని ఊరించా.. అబ్బే.. వింటేనా

    లక్ష్మీ బాంబ్

    రిప్లయితొలగించండి
  31. మురళీ గారు.. చాలా బాగుందండి.తిప్పుడు పొట్లం. నేను మొత్తం పల్లెటూరు లోనే పెరిగాను కానీ ఇది ఎప్పుడు వినలేదు. మరి మీరు ఎవరికైనా నేర్పించారా అ తరువాత???

    రిప్లయితొలగించండి
  32. @ఉష: ఇప్పుడు చూశానండీ.. కొంచం ఆవేశ పడ్డట్టున్నాను కదూ :):)
    @భాస్కర రామిరెడ్డి: పోనీలెండి.. మిస్సవ్వలేదు కదా.. ధన్యవాదాలు.
    @లక్ష్మణ్: నేర్చుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? ఇది చదివారు కదా.. పోనీ నెక్స్ట్ ఇయర్ ప్రయత్నించండి :) :) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  33. బాగుంది మీ టపా.జ్ఞాపకాల్లోకి తీసుకు వెళ్ళారు. ఈ తిప్పుడు పొట్లాన్నే మా వైపు 'పూల పొట్లం ' అంటారండీ. కొబ్బరి పొట్టు తో తక్కువ గానీ, తాటి చెట్టు కాయలు( ముంజెలు కాదు - పొడవుగా ఉంటాయి. ముంజెలు కాయని తాటిచెట్లకు ఉంటాయి) పొడుం చేసి, ఎండ బెట్టి ఆ పొడితో చేసేవారు. ఇప్పటికీ మా ఊర్లో అవి చేస్తారు. సిసింద్రీ లు, హవ్వాయి-సువ్వాయి(తారాజువ్వ)లు కూడా చేసే వాళ్ళు. ఇవి తయారు చేయటం లో చిన్నప్పుడు నేను కూడా పాల్గొన్నా. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  34. @వెంకటరమణ: మాకు కొబ్బరి పొట్టు బాగా దొరుకుతుంది కాబట్టి అది వాడే వాళ్ళేమోనండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి