బుధవారం, అక్టోబర్ 07, 2009

వరదలు-వార్తలు

ఆరు రోజుల పాటు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలని ముంచెత్తిన వరదలు తగ్గు ముఖం పట్టాయి. వరద కారణంగా పదుల సంఖ్యలో మనుషుల, వందల సంఖ్యలో మూగ జీవాల ప్రాణాలు పోయాయి. పంటలకి అపార నష్టం సంభవించింది. వ్యాపారాలూ దెబ్బ తిన్నాయి. అయితే, ఈ వరదలు రాష్ట్ర ప్రజలకి ఒక కనిపించని మేలు చేశాయి. వార్తా వ్యాపారపు వికృత క్రీడను సామాన్యుడు సైతం అర్ధం చేసుకోగలిగేలా చేశాయి. మేధావి వర్గం మొదలు, నిరక్షరాస్యుల వరకు టీవీ చూసే ప్రతి ఒక్కరికీ వార్తా చానళ్ళు ఎందుకోసం పనిచేస్తున్నాయో స్పష్టంగా అర్ధమయ్యేలా చేశాయి.

కృష్ణా నది నీటి మట్టం పెరుగుతోందని తెలిసిన క్షణం మొదలు ఇప్పటివరకూ మెజారిటీ వార్తా చానళ్ళు అక్షరాలా పండుగ చేసుకున్నాయి. గడిచిన వారం రోజులుగా ఈ చానళ్ళు చూసిన వాళ్ళెవరూ కాదనలేని నిజం ఇది. శ్రీశైలం డ్యాం మొదలు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజి కూలిపోతున్నాయన్న భయాన్ని ప్రజల్లో ఇంజెక్టు చేయడం లో తెలుగులో ఉన్న పది వార్తా చానళ్ళ లోనూ కనీసం ఎనిమిది చానళ్ళు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి.

ఏదైనా ప్రమాదం జరగబోతోందని తెలిసినప్పుడు బాధ్యత గల వ్యక్తులు గానీ, మీడియా గానీ చేయవలసింది ఏమిటి? ప్రజల్లో ధైర్యం నింపాలి.. అదే సమయంలో ప్రమాదం జరిగిన పక్షంలో నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించడానికి తన వంతు కృషి చేయాలి. దురదృష్టవశాత్తూ ఇక్కడ జరిగింది అందుకు పూర్తిగా భిన్నం. విపత్తు జరుగుతున్న స్థలం లో ఉన్న విలేకరి మొదలు, స్టూడియోలో కూర్చుని పరిస్థితిని సమీక్షిస్తున్న వార్తా నిర్వాహకుడి వరకు అందరి ముఖాల్లోనూ ఏదైనా జరిగిపోతే వార్త దొరుకుతుందనీ, అది తాము మాత్రమే ముందుగా చూపాలన్న తాపత్రయం కనిపించింది.

ఎప్పటిలాగే ఇప్పుడు కూడా మిగిలిన చానళ్ళ కన్నా టీవీ తొమ్మిది నాలుగడుగుల ముందే ఉంది. ఈ చానల్ చూడకూడదని మొదలే నిర్ణయించుకున్నా, చానళ్ళు మార్చే సమయంలో కనబడ్డ దృశ్యాలు, వినిపించిన వాక్యాలు ఈ చానల్ విశ్వసనీయతను మరికొన్ని మెట్లు కిందకి దించాయి. (ఆకాశానికీ, పాతాళానికీ అంతు ఉండదు). తెలుగు టీవీ విశ్లేషకులు నాగసూరి వేణుగోపాల్ (వార్త, ఆంధ్రభూమి పత్రికల్లో టీవీ కార్యక్రమాల ప్రసార సరళిపై వ్యాసాలు రాస్తూ ఉంటారు) చాలా రోజుల క్రితం టీవీ తొమ్మిది వార్తల గురించి రాస్తూ పోటీ చానల్ తో పోల్చినప్పుడు నెట్ వర్క్, లైబ్రరీ విషయాల్లో ఈ చానల్ వెనుకబడి ఉందని, సంచనాల ద్వారా ఆ లోపాలని కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందనీ రాశారు. ఆయన మాటలు నిజమని వరదల కవరేజీ మరోసారి నిరూపించింది.

ఇక, కాంగ్రెస్ ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుపుతున్న 'సాక్షి' చానల్ ది మరోదారి. ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపే ఏ అవకాశాన్నే ఈ చానల్ వదులుకోలేదు. విపత్తు, పర్యవసానాల మీద కన్నా ప్రభుత్వ వైఫల్యాల మీదే 'సాక్షి' దృష్టి పెట్టిందేమో అనిపించింది. 'ఆయనే బతికుంటే..' 'ఆ దేవుడే ఉంటే..' లాంటి కథనాలు ఈ చానల్ ప్రత్యేకత. పూర్తిగా కాకపోయినా కొంతవరకూ సంయమనం పాటించిన చానల్ ఐన్యూస్. ఇక 'మఖ లో పుట్టిన' మిగిలిన చానళ్ళన్నింటిదీ ఒకటే దారి. వీటిలో పనిచేసే వాళ్ళలో కొందరికైనా అసలు 'వరద' అంటే ఏమిటో అవగాహన ఉందా అన్న సందేహం కలుగక మానదు.

చానళ్ళన్నీ ఇలా ఎందుకు ప్రవర్తించాయి? ఇందుకు సమాధానం కూడా వేణుగోపాల్ గారి పాత వ్యాసాల్లోనే దొరుకుతుంది. చానళ్ళు నడవాలంటే డబ్బు కావాలి. అది ప్రకటనల రూపంలో రావాలి. ప్రకటనలు రావాలంటే చానల్ కి ఎక్కువమంది ప్రేక్షకులు కావాలి. మరి ప్రేక్షకులు కావాలంటే..? వాళ్ళని కట్టిపడేసే కార్యక్రమాలు ప్రసారం చేయాలి. వార్తలు వ్యాపార సరుకుగా మారాక, వ్యాపార విలువలకే తప్ప నైతిక విలువలకీ, సామాజిక బాధ్యతకీ స్థానం ఉండదు కాబట్టి చానళ్ళు సహజంగానే ప్రకృతి భీభత్సాన్ని ఉపయోగించుకుని ఆదాయాన్ని పెంచుకోడానికి ప్రయత్నించాయి. ఈ క్రమం లో సామాన్య ప్రేక్షకుడి ముందు సైతం తమ అసలు రంగుని బయట పెట్టుకున్నాయి. ఇక జాగ్రత్త పడాల్సింది ప్రేక్షకుడే.

వరదల ప్రసారం లో ఒక చానల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడు కోవాలి. అది ఈటీవీ రెండు. మిగిలిన చానళ్ళతో పోల్చినప్పుడు ఈ చానల్ వందల రెట్ల బాధ్యతతోనూ, సంయమనంతోనూ వ్యవహరించింది. పాత కాలపు నిర్మాణాలు కూలి పోనున్నాయని మిగిలిన చానళ్ళు హడావిడి చేసినప్పుడు ప్రజల్లో ధైర్యం నింపింది. ప్రమాదపు తీవ్రత తగ్గడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో విశ్లేషించింది. వరద తీవ్రత తగ్గేంత వరకూ సంయమనాన్ని కొనసాగించింది. నిజానికి ఈ చానల్ ప్రసారం చేసే రాజకీయ వార్తలపై నాకు అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో మాత్రం ఈటీవీ రెండు కృషిని, బాధ్యతనూ అభినందిస్తున్నాను.

21 కామెంట్‌లు:

 1. > > నిరక్షరాస్యుల వరకు టీవీ చూసే ప్రతి ఒక్కరికీ వార్తా చానళ్ళు ఎందుకోసం పనిచేస్తున్నాయో స్పష్టంగా అర్ధమయ్యేలా చేశాయి.
  ====
  నాకు డౌటే

  రిప్లయితొలగించు
 2. మీ విశ్లేషణ బాగుందండీ ....చాల రోజుల తరువాత వచ్చారు ...ఇన్ని రోజులు కళ్ళు ఆర్పకుండా వున్నా చానల్స్ అన్ని చూసినట్టున్నారు -:)

  రిప్లయితొలగించు
 3. I got a nervous break-down after hearing Ravi Prakash, continuously when Mr.YSR died miserably. I promised myself, I will never watch this person on TV.. who is dangerously witty to add a degree of 'collapse' or 'de-moralising' the viewer of whatever situation he would like to be briefed about. Ravi Prakash's re-iterations are dangerous to sensitive hearts.

  Secondly, I highly condemn the channels using various sad Songs and sad music playing continuously along with the news. Its kind of spicing up.

  I liked this post of yours. Well Done.

  రిప్లయితొలగించు
 4. హ్మ్మ్.. విషయసేకరణ చెయ్యటానికి బదులు విష ప్రయోగం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారన్నమాట మన టీవీ వాళ్ళు...

  రిప్లయితొలగించు
 5. మురళి గారు, మీ 'చానల్స్ విశ్లేషణ ' చాలా మంచి అబ్జర్వేషన్ తోటి ఇచ్హారు. అన్ని చానల్ల వారు ప్రజా సేవ పోటీతోటే నిర్వహించారు. ముఖ్యంగా నేను గమనించింది టీ.వీ. 9 యూనిఫారంస్. (టి.వి. 9 ఎంబ్లం తోటి, బ్లూ కలర్ ప్రత్యేక డ్రెస్సులు.) ఈ ఒక్క ఉదాహరణ చాలు, ప్రజల కష్టాలతో ఏ విధంగా వ్యాపారం చేయొచ్హో!

  రిప్లయితొలగించు
 6. "విపత్తు జరుగుతున్న స్థలం లో ఉన్న విలేకరి మొదలు, స్టూడియోలో కూర్చుని పరిస్థితిని సమీక్షిస్తున్న వార్తా నిర్వాహకుడి వరకు అందరి ముఖాల్లోనూ ఏదైనా జరిగిపోతే వార్త దొరుకుతుందనీ, అది తాము మాత్రమే ముందుగా చూపాలన్న తాపత్రయం కనిపించింది."

  నిజం!సొమ్ము చేసుకోవటానికి ఏ వార్త దొరుకుతుందా అనే ఎదురుచూపు మరి.

  "పనిచేసే వాళ్ళలో కొందరికైనా అసలు 'వరద' అంటే ఏమిటో అవగాహన ఉందా అన్న సందేహం కలుగక మానదు."

  వరద సంగతి ఏమో గానీ ఒక మహిళా న్యూస్ రీడర్ "అమావాస్య వల్ల ..."అంటూ వార్తలు చదివారు.పౌర్ణమికీ అమావాస్యకీ తేడా తెలీకుండా ఉన్నారని మాత్రం నాకు అర్ధమైంది.


  ఐతే 9,10 న్యుస్ ఛానళ్ళనీ కన్నర్పకుండా చూసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారన్నమాట..

  టపా బాగుందనటం పాతపాటైపోయింది..ఏదైనా కొత్త పదం వెతుక్కుని వస్తానుండండి...

  రిప్లయితొలగించు
 7. మురళి గారూ, మంచి పోస్టు.
  ఆ మధ్య పెద్దాయన పోయినపుడు వేసిన పాటలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. బ్రెయిన్ వాష్ అంటారుచూడండి అలా ,ఇంతకుముందున్నదంతా కొట్టుకుపోయి నాబుర్ర మొత్తం ఆ విషాదగీతాలతో నిండిపోయింది
  చుక్కల్లోకెక్కినాడు చక్కనోడూ...... అని ఇప్పటికీ అప్పుడప్పుడూ పాడేసుకుంటున్నాను.

  రిప్లయితొలగించు
 8. బాగుంది మురళి గారు.
  మా బెంగళూరు కేబుల్ వాడు తెలుగు న్యూస్ చానల్స్ ఇవ్వకపోడం మంచిదే అయింది. లైవ్ స్ట్రీమ్ లో కేవలం ఐన్యూస్ మాత్రమే పనిచేయడం వలన అది చూడగలిగాను. ఇక వీళ్ళ భాధ్యతారాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే...

  రిప్లయితొలగించు
 9. మురళి గారూ, చాల మంచి పోస్ట్ ఇది. నిజంగా నాకు టీవీ చూడాలంటే చిరాకు వేసింది. ప్రతి చానల్ ఇ ప్లేస్ కి మేము ముందు వచ్చాము ఎప్పటి వరకు ఒక అధికారికి కూడా ఎక్కడ కనబడలేదు. మేమే ఇక్కడ వున్నా అందరిని తరలిస్తున్నాం అని చెప్పుకోవడం. ఎ టీవీ చుస్తే అ టీవీ యూనిఫారంస్ వేసుకొని మేమే సేవచేస్తున్నాం అని చెప్పుకోవడం, మా రిలీఫ్ ఫండ్ కి ఇన్ని డబ్బులు ఇస్తే మీ గురించి పేపర్ లో రాస్తాం, టీవీ లో మీగురించి కవర్ చేస్తాం లాంటి పదాకలు పెట్టడం, మా సారు ఎడ్ల బండి ఎక్కి వెళ్లారు, తెప్పలో వెళ్లారు వరద ప్రాంతాలను చూడటానికి "అక్కడ ప్రజలు చిన్నబాబు CM అయితే మాకు ఇ బాధలు వుండేవి కాదు అని చెప్పారు ZZZZZZ " కెమెరామన్ XXXXX తో YYYYYY, SSSS News,

  రిప్లయితొలగించు
 10. em chestham cheppandi mana karma...ee chanalla bari nundi telugu vallani aa dhemude kapadali..
  nenu dheeni meedha o tapa rasanu veelaithe osari chadhivi mee abhiprayam cheppandi murali garu...

  రిప్లయితొలగించు
 11. నేను తృష్ణగారితో ఏకీభవిస్తున్నాను..
  కొత్త పదం కనుక్కొని వస్తే కాపీ కొట్టేస్తాలెండి..
  తృష్ణగారు మాప్ కర్దేనా ప్లీజ్!

  రిప్లయితొలగించు
 12. disgrace..media never concerned abt the needs of the ppl in such a horrifying situation & the moral values

  రిప్లయితొలగించు
 13. బావుందండి మీ విశ్లేషణ......

  కానీ ఈ చానళ్ళే లేక పోతే ఆ వరద బదితుల గతి అదొగతేనేమో..... ఒక్క సారి ఆలొచించండి

  రిప్లయితొలగించు
 14. మురళిగారు , మీ వరదల వార్తలు ఏ చానెల్ నిర్వాహకులైనా , కనీసం ఏదైనా చానెల్ లో పని చేసేవారన్నా చదివితే ఏమైనా మార్పు మొదలవుతుందేమో ....

  రిప్లయితొలగించు
 15. @ఒరెమూనా: నా చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటుంటే విన్నానంది.. కాబట్టి నాకు డౌట్ లేదు.. కనీసం కొంతమందికి తెలిసింది.. ధన్యవాదాలు.
  @చిన్ని: రోజంతా కాదులెండి.. టైం దొరికినప్పుడల్లా.. ధన్యవాదాలు.
  @Sujata: ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 16. @భావన: అదే జరుగుతోందండీ.. ధన్యవాదాలు.
  @జయ: వాళ్ళు మాత్రమే కాదులెండి.. మిగిలిన వాళ్ళూ తమవంతు చేస్తున్నారు.. ధన్యవాదాలు.
  @తృష్ణ: 'అమావాస్య వల్ల..' నేను కూడా చూశానండి.. ప్చ్.. ...ధన్యవాదాలు

  రిప్లయితొలగించు
 17. @లలిత: నేనూ ఆ పాటల బాధితుడినేనండీ.. వాటి గురించి ఒక టపా రాయొచ్చు.. ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: అదృష్టవంతులు.. ధన్యవాదాలు.
  @అమ్మాయి కళలు: మీ బ్లాగు బాగుందండీ.. కామెంట్ రాయడం కుదరడం లేదు.. కొద్దిగా సెట్టింగులు మార్చండి.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 18. @నాగ వర్మ మంతెన: చదివానండి.. బాగా రాశారు.. యెంత చెప్పుకున్నా తక్కువే.. ధన్యవాదాలు.
  @పద్మార్పిత: ధన్యవాదాలు.
  @హరే కృష్ణ: నిజమేనండి.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 19. @కార్తీక్: మీరు చెప్పింది నిజమేనండి.. కాని చానళ్ళ మధ్య పోటీ ఇంత అనారోగ్యకరంగా ఉండడం మంచిది కాదు కదా.. ధన్యవాదాలు.
  @పరిమళం: మనమందరం మన అభిప్రాయాలు చెప్పడం మొదలు పెడితే మార్పు రావచ్చేమోనండీ.. అంతకన్నా కూడా ఆయా చానళ్ళని చూడ్డం మానేస్తే త్వరగా మార్పు రావొచ్చు.. ధన్యవాదాలు. ..

  రిప్లయితొలగించు
 20. ఆకాశవాణి, అమెరికా విభాగం వార్తలు చదువుతోంది ఉమ వింటున్నది బ్లాగ్లోకం, అనేకమైన విషయాలు మన ముందు వున్నప్పటికినీ అన్నిటిని పక్కన పెట్టి మన మందరం సామూహికం గా ఆలోచించి, వెంటనే తగు నిర్ణయం తీసుకుని, దానిని వెంటనే అమలు పర్చవలసిన ( బ్లాగ్లోకం స్వగతం: సుత్తి వద్దు విషయం చెప్పు) ఒక ముఖ్య విషయాన్ని మీతో పంచుకుంటున్నాము. మన బ్లాగ్లోక వాసి, నెమలి కన్ను మురళి అని వాసికెక్కిన మన మురళి గారు గత 2 రోజులుగా ఎవ్వరిని పలకరించక అంతర్ముఖులై వున్నట్లు మా ఆకాశవాణి కి అందిన వార్త లను బట్టీ తెలుస్తోంది, ఆఖరు సారి గా ఆయన ఆయన బ్లాగ్ లో పరిమళానికి వరదల గురించి మాట చెప్పి, తదుపరి మౌనం వహించారు, ఆయన ఈ మౌనవ్రతానికి కారణమేమిటో అర్ధం కాక సామన్య బ్లాగ్లోకపు ప్రజానీకం తల్లడిల్లుతుంది.. కొందరు బ్లాగర్ లు విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు (భావన: బాబు మురళి ఎక్కడున్నారు? మీరు లేక ఈ బ్లాగ్లోకం చిన్నపోయినది మీరు ఒకసారి వచ్చి కనపడాలని అందరు బ్లాగ్లోకవాసుల తరుపునా కోరుకుంటున్నాను బాబు కోరుకుంటున్నా.... (దగ్గు బ్యాక్ గ్రౌండ్ లో) సెలవు) ఈ వార్తలు ఇంతటి తో సమాప్తం. శుభ రాత్రి అమెరికా వారికి, శుభోదయం ఇండియా వారికి.
  ముఖ్య గమనిక: ఎవరికైనా ఎక్కడైనా మన మురళి కనపడితే వెంటనే తెలియ చెయ్యవలసింది గా కోరిక, ఆయన ముఖ్యం గా పుస్తకాల షాప్ లలో వుండే అవకాశం వుంది. అలాగే ఆఫీస్ లో వుండే అవకాశం కూడా కొట్టి పారెయ్యవలసినది కాదు అని విజ్ఞప్తి. కనపడిన వారు kuudali.org కు కాని jalleda.com కు కాని, haaram.com కు కాని ఇంఫర్మేషన్ పంపగలరు.

  రిప్లయితొలగించు
 21. @భావన: కొంచం బిజీ గా ఉన్నానండి.. అయినా మళ్ళీ వచ్చేశాను.. 'పుస్తకాల షాపులో...' :):) ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు