సోమవారం, ఫిబ్రవరి 14, 2011

మరోచరిత్ర

తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో 'క్లాసిక్స్' గా స్థానం సంపాదించుకున్న అతికొద్ది విషాదాంత ప్రేమకథా చిత్రాలలో ఒకటి 'మరోచరిత్ర.' ముప్ఫైమూడేళ్ళ క్రితం నలుపు తెలుపుల్లో కే.బాలచందర్ సృష్టించిన ఈ అపూర్వ ప్రేమకావ్యం ప్రేక్షకుల మీద ఎంతటి ప్రభావాన్ని చూపించిందంటే, తమ ప్రేమ విఫలమవుతుందేమో అని భయపడ్డ కొందరు పిరికి ప్రేమికులు ఆత్మహత్యకి పాల్పడేంతగా. బాలచందర్ పుణ్యమా అని బాలు, స్వప్న అనే పేర్లు ప్రేమికులకి పర్యాయపదాలైపోయాయి తెలుగునాట.

కమలహాసన్, సరిత, మాధవిల అపూర్వ నటనా పటిమకి, బాలచందర్ దర్శకత్వ ప్రతిభ, ఎమ్మెస్ విశ్వనాథన్ అందించిన స్వరాలు తోడవ్వడంతో తెలుగు, తమిళనాట సినిమా చరిత్రలో మరోచరిత్ర సృష్టించిందీ సినిమా. విశాఖ అందాలని ఇంతగా ఒడిసిపట్టిన సినిమా మరొకటి లేదనడంలో అతిశయోక్తి లేదు. బలమైన కథ, దానిని ఓర్పుగా తెరకెక్కించగల సాంకేతిక వర్గం, నేర్పుగా నటించగల నటీనటులు ఉంటే చిన్న బడ్జెట్ తోనే భారీ విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అనడానికి ఉదాహరణ ఈ సినిమా.


బాలు (కమలహాసన్) ఓ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. విశాఖలో వాళ్ళ పొరుగింట్లో ఉండే బ్రాహ్మణేతర కుటుంబానికి చెందిన అమ్మాయి స్వప్న (సరిత). చేస్తున్న ఉద్యోగం నచ్చక దాన్నివదిలేసి వచ్చిన బాలూ, కాలేజీలో చదువుతున్న స్వప్నతో ప్రేమలో పడతాడు. ఇద్దరి తల్లిదండ్రులకీ తెల్లారింది మొదలు రాత్రి వరకూ ప్రతి విషయంలోనూ తగువే. అమ్మాయికీ అబ్బాయికీ ఒకరి భాష మరొకరికి రాదు. అయినా ఇవేవీ వాళ్ళ ప్రేమకి ఆటంకాలు కాలేకపోయాయి.

చురుకైనదీ, తెలివైనదీ పైగా ఆధునికంగా ఉండేదీ అయిన స్వప్నని అభిమానించే వాళ్లకి కొదవ లేదు. ఆమె తరచూ వెళ్ళే పుస్తకాల షాపు ఓనరు ఆమెని ఆరాధించే వాళ్ళలో ఒకడు. అతని కారణంగా బాలు, స్వప్నల ప్రేమ విషయం వాళ్ళ పెద్దవాళ్ళకి తెలిసిపోతుంది. అప్పటికీ వాళ్ళిద్దరూ కలిసి వైజాగ్ మొత్తాన్ని చుట్టేసి పాటలు పాడేసుకోవడమే కాక కనిపించిన ప్రతి చెట్టుమీదా, పుట్టమీదా, రాయీ రప్పలమీదా వాళ్ళ పేర్లు రాసేసుకుంటారు.


ఇరుగుపొరుగులుగానే ఏమంత సఖ్యంగా ఉండని పెద్దవాళ్ళు పిల్లల ప్రేమకి ససేమిరా అంటారు. అయితే పిల్లల పట్టుదల కారణంగా ఓ మెట్టు దిగి వచ్చి, వీళ్ళ ప్రేమకి పరిక్ష పెడతారు. ఏడాది పాటు దూరంగా ఉండి ప్రేమని నిరూపించుకోమంటారు. వాదోపవాదాల అనంతరం ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వెళ్ళడానికి అంగీకరిస్తాడు బాలూ. వీళ్ళ ప్రేమ మీద ఏమాత్రం నమ్మకం లేని స్వప్న తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.

కలిసి ఉన్నప్పటికన్నా విడిపోయాక ఒకరిమీద ఒకరికి ప్రేమ బలపడుతుంది బాలూ స్వప్నలకి. ఆవేశపరుడైన బాలూకి పరిచయమైన బాలవితంతువు సంధ్య (మాధవి) తనకి వచ్చిన నృత్యాన్ని నేర్పడం ద్వారా అతని ఆవేశాన్ని సక్రమమైన మార్గంలో పెడుతుంది. అంతేకాదు అతనికి స్వచ్చమైన తెలుగు నేర్పుతుంది కూడా. మరోపక్క తన పెళ్లి ప్రయత్నాలని తీవ్రంగా వ్యతిరేకించే స్వప్న, బాలూమీద తనకున్న ప్రేమని వ్యక్తం చేయడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోదు. గోడల నిండా అతని పేరు రాయడం, తల్లి కాల్చేసిన బాలూ ఫోటో బూడిదని కాఫీలో కలుపుకుని తాగేయడం...ఇవన్నీ సామాన్య విషయాలు స్వప్నకి.


అయితే ఓ చిన్న అపార్ధం కారణంగా మానసికంగా స్వప్నకి దూరమైన బాలూ, సంధ్యకి దగ్గరవుతాడు. స్వప్న ప్రేమలో సిన్సియారిటీని అర్ధం చేసుకున్న సంధ్య బాలూ స్వప్నలని దగ్గర చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తుంది. ఇక కథ సుఖాంతమే అనుకుంటున్న తరుణంలో సినిమాని ఓ కర్కశమైన మలుపు తిప్పుతాడు దర్శకుడు. ఫలితం, వాళ్ళ ప్రేమ మొగ్గ తొడిగిన బీచ్ లోనే బాలూ స్వప్నల విషాదాంతం.

నిజానికిది నాయికల కథ. బాలూ పాత్ర కన్నా స్వప్న, సంధ్య పాత్రలు బలమైనవి. అందం, ఆవేశం మినహాయిస్తే బాలూలో మరో చెప్పుకోదగ్గ లక్షణం కనిపించదు. బాలూమీద పిచ్చి ప్రేమ స్వప్నకి. ఎంతగా అంటే 'నిన్ను ప్రేమిస్తున్నాను ఒక పిచ్చిది' అని అతని వీపు మీద రాసేంత. ఇప్పుడిప్పుడు బాలీవుడ్ ఖాన్ లని చూసి మన కుర్ర హీరోలు చేస్తున్న కండల ప్రదర్శనని మూడు దశాబ్దాల క్రితమే కమల్ చేసి చూపించాడు ఈ సినిమాలో. విధి తనకి పరిక్షలు పెట్టినా ఎదురొడ్డి నిలిచే స్థైర్యం సంధ్య సొంతం. కష్టాలకి కుంగిపోదు ఆమె.


ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీత సారధ్యంలో పాటలన్నీ ఈనాటికీ మారుమోగుతున్నాయి. బాలూతో కలిసి సుశీల, జానకి, రమోల, ఎల్లారీశ్వరి, వాణీ జయరాం ఒక్కొక్క పాట పాడారు ఈ సినిమాకి. ఇది విశ్వనాథన్ స్టైల్ అనుకోవాలి. అందరూ చెప్పే పాట 'ఏ తీగ పూవునో' అయినా, నాకు మాత్రం 'పదహారేళ్ళకి..' 'విధి చేయు వింతలన్నీ..' బాగా ఇష్టం. 'కలిసి ఉంటే..' పాట సాహిత్యం, చిత్రీకరణ కూడా తమాషాగానే ఉంటాయి. మోడర్న్ దుస్తుల్లో సరిత కుర్రకారుని ఒక ఊపు ఊపింది అప్పట్లో.

హిందీలో 'ఏక్ దూజే కేలియే' పేరిట రీమేక్ చేసిన ఈ సినిమా అక్కడ కూడా ఘన విజయం సాధించింది. హిందీ చిత్రానికి కూడా బాలచందరే దర్శకుడు. వరుణ్ సందేశ్, అనితలతో నూతన దర్శకుడు రవి యాదవ్ నిర్దేశకత్వంలో ఈ సినిమాని గతేడాది తెలుగులోనే రీమేక్ చేశారు నిర్మాత దిల్ రాజు. రీమేక్ ఎలా ఉండకూడదు అనడానికి ఉదాహరణగా నిలబడిందీ సినిమా. అయితే బాలచందర్ 'మరోచరిత్ర' మాత్రం నిస్సందేహంగా తెలుగు సిని చరిత్రలో నిలిచిపోయే సినిమా.