(మొదటి భాగం తర్వాత)
బయట చినుకులు పెరుగుతున్నాయి. వాటిని చీల్చుకుంటూ భక్తులు లోపలికి వస్తున్నారు. చూస్తుండగానే హాలు నెమ్మదిగా నిండుతోంది. ఇంతలో ఓ కుర్రాడు నా దగ్గరికి వచ్చాడు.రెండంచుల పంచె, ఉత్తరీయం, నుదుటన విభూది పట్టెలు, మధ్యలో కుంకుమ బొట్టు, చేతిలో ఉన్న పళ్లెంలో పళ్ళు, పూజా ద్రవ్యాలు, చంకన బ్యాక్ ప్యాక్.. అతను నన్ను పలకరిస్తే తప్ప 'రూమ్మేట్' గా గుర్తు పట్టలేక పోయాను. "నేను పాదపూజ టికెట్ తీసుకున్నాను. ఆ క్యూలో స్వామీజీని చూస్తాను.. మీరు ఈ వైపు క్యూలో ఉంటే స్వామిని దర్శనం చేసుకోవచ్చు. స్వామీజీ పూర్వాశ్రమంలో మీ తెలుగువారే. ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు" అనేసి హడావుడిగా పాదపూజ వైపు వెళ్ళిపోయాడు. 'నీ ప్రశ్నలు నీవే.. ఎవరూ బదులివ్వరుగా...' అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడడానికి చాలా ముందు నుంచీ కూడా నా నమ్మకం అదే, కాబట్టి అడగడానికి ఏమీ లేదు. కానైతే స్వామీజీని దగ్గరగా చూడాలనిపించింది. ఆయనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని కొన్నేళ్ల క్రితం ఓ సందర్భంలో కలిశానని గుర్తొచ్చింది.
ఎడమవైపు పాదపూజల హడావిడి మొదలైంది. ఇంతకీ పూజ నిజ పాదాలకి కాదు, గురు పాదుకలకి. రూమ్మేట్ చేస్తున్న పూజని చూస్తూ ఉండగానే ఒక్కసారిగా కలకలం, స్వామీజీ వచ్చేశారు. వేగంగా వచ్చి, ఎవరివైపూ చూడకుండా తన స్థానంలో కూర్చున్నారు. హాల్లో అందరూ లేచి నిలబడ్డారు. కొందరు ఉన్నచోటే సాష్టాంగ పడ్డారు. అందరిలోకీ వయసులో పెద్ద అయిన పరిచారకుడు స్వామీజీ దగ్గరకి వెళ్లి తీర్ధం స్వీకరించాక, దర్శనం మొదలైంది. నన్ను రెండో వైపు క్యూలో నిలబడమని రూమ్మేట్ సైగ చేశాడు. అప్పటికే ఐదారు కుటుంబాలు అక్కడ నిలబడి ఉన్నాయి. నేనూ నిలబడ్డా. తొలి దర్శనం పాదపూజల వాళ్లకి. రూమ్మేట్ వంతు వచ్చింది. అతను స్వామీజీకి ఏదో చెప్పడం, ఆయన శ్రద్ధగా వింటూ మధ్యలో ప్రశ్నలు అడగడం, ఇతను జవాబులు చెప్పడం కనిపిస్తోంది. రెండు మూడు నిమిషాలపాటు సంభాషణ సాగింది. రూమ్మేట్, పరిచారకుడు ఇచ్చిన తీర్ధం తీసుకుని, హాల్లోనే ఓ మూల ధ్యానంలో కూర్చున్నాడు.
క్యూ చాలా నెమ్మదిగా కదులుతోంది. ఎందుకా అని చూస్తే వీఐపీల తాకిడి. వాళ్ళు షార్ట్ కట్ లో దర్శనానికి వెళ్లిపోతున్నారు. ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక వాళ్ళు.. అప్పటికప్పుడు రావడం, స్వామీజీతో మాట్లాడి వెళ్లిపోవడం. హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తెలుగు భాషల్లో జరుగుతున్నాయి సంభాషణలు. అక్కడక్కడా తమిళ మాటలూ వినిపిస్తున్నాయి. అన్ని భాషల్నీ స్వామీజీ అనర్గళంగా మాట్లాడుతున్నారు. పక్కనున్న పళ్లాల నుంచి పండో, పువ్వో వాళ్ళ వైపు విసురుతున్నారు. పరిచారకులు ప్రసాదం అందిస్తున్నారు. క్యూలో నా ముందు ఓ కుటుంబం. ఆయన, భార్య, కొడుకు, కోడలు, ఏడాది వయసున్న మనవరాలు - ఉత్తరాది నుంచి వచ్చారు. ఆ పిల్ల అందరి చంకలూ మారుతోంది. భక్తులందరూ పళ్ళ పళ్ళాలు, బుట్టలతో వస్తున్నారు. 'పత్రం, పుష్పం, ఫలం, తోయం..' అన్నాడు గీతాకారుడు. వాటిలో ఏ ఒక్కటీ తేలేదు నేను. 'యోమే భక్త్యా ప్రయచ్ఛతి' అని కూడా అన్నాడు. నా భక్తి నాకెప్పుడూ ప్రశ్నార్ధకమే.
బయట వర్షం తగ్గింది. రూమ్మేట్ నా దగ్గరికి వచ్చి క్యూ కి ఆవల నిలబడ్డాడు. "నేను రూమ్ కి వెళ్తున్నాను. మీకు దర్శనం అయ్యాక, గుడి ఎంట్రన్స్ దగ్గర అన్న ప్రసాదం ఉంటుంది.. తినేసి రూమ్ కి వచ్చేయండి. ఒకవేళ నేను తలుపు తీయకపోతే కాల్ చెయ్యండి" అని చెప్పి వెనుతిరిగాడు. నాకూ వెనక్కి వెళ్లిపోదామా అనిపించింది. ఎందుకో మరి, ముందుకే వెళ్లాను. మరో విడత పాదపూజ పూర్తవ్వడంతో ఆ భక్తులు అటువైపు క్యూలో చేరారు. ఒక కుటుంబం, తర్వాత నా ముందున్న ఉత్తరాది వాళ్ళు, ఆ తర్వాత నా వంతు. కొంచం సేపటికి ఉన్నట్టుండి స్వామీజీ దృష్టి నామీద పడింది. నేనూ ఆయన వైపే చూశాను రెప్ప వేయకుండా. అర నిమిషం పైనే గడిచి ఉంటుంది. కేవలం ఆయన కళ్ళని మాత్రమే చూస్తున్నాన్నేను. పరిచారకుడి పిలుపుతో ఆయన దృష్టి మరలింది.
చన్నీళ్లతో తలారా స్నానం చేసినట్టు, అడగని ప్రశ్నలు అన్నింటికీ జవాబులు దొరికినట్టూ అనిపించింది. ఉత్తరాది పెద్దాయన స్వామీజీకి ఏదో చెప్పుకుంటున్నాడు. నేను నెమ్మదిగా బయట పడ్డాను. రూమ్ కి తిరిగి వెళ్లడం, "కాసేపు నిద్రపోతాను" అని రూమ్మేట్ కి చెప్పి నా మంచం మీద వాలడం లీలగా మాత్రమే గుర్తున్నాయి. మూడు గంటల పాటు ఒంటి మీద స్పృహ లేదు. ఉన్నట్టుండి మెలకువ వచ్చేసరికి రూమ్మేట్ నన్ను నిద్ర లేపుదామా అని తటపటాయిస్తున్నాడు. నాకు బరువేదో దిగిపోయినట్టు వొళ్ళంతా తేలికగా అనిపించింది. "మీరు భోజనం చేశారో లేదో అని.." అన్నాడు. ఆకలిగా అనిపించలేదని చెప్పాను. పాదపూజ చేశాడు కాబట్టి తను ఉపవాసం ఉంటాడట. "స్వామీజీతో మాట్లాడారా?" అని అడిగాడు. దర్శనం అయిందని చెప్పాను.
కిటికీలోనుంచి చూస్తే బయట జల్లు పడుతోంది. తన కబుర్లు వింటున్నా. ఓ దేశంలో మాస్టర్స్ లో సీటు, మరో దేశంలో ఇప్పుడు చేస్తున్న కన్నాపెద్ద ఉద్యోగం వచ్చాయట. ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోగలడు. ఏది ఎంచుకోవాలా అని సందేహం. "నాకు ఏ సందేహం వచ్చినా స్వామీజీ దగ్గరకి వస్తాను. ఆయన్ని అడిగినా, అడగక పోయినా మంచి పరిష్కారం అయితే దొరుకుతుంది.." నేనా విషయంలో జోక్యం చేసుకోకుండా, "తరచూ వస్తూ ఉంటారా?" అని అడిగాను. "చాలా తరచుగా వస్తాం.. ఇదే మొదటి సారి నేను ఒక్కడినీ రావడం .. మీరు ఉండడం వల్ల రూమ్ దొరికింది.. లేకపోతే ఏమయ్యేదో.." అన్నాడు. "మీరు లేకపోతే నా పరిస్థితి కూడా అదే కదా" అన్నాను. "నాన్నగారిప్పుడు ఢిల్లీలో ఉన్నారు.. సెంట్రల్ సెక్రటేరియట్లో పోస్టింగ్" ఒక్కడూ రాడానికి కారణం చెప్పాడు. "బ్యూరోక్రాట్?" అడిగాను. "ఐఏఎస్, సెంట్రల్ సర్వీస్" ఏదో కో-ఆపరేటివ్ సొసైటీలో గుమస్తా అన్నంత కాజువల్ గా చెప్పాడు.
నాకు తగిలింది మామూలు షాక్ కాదు. వాళ్ళ నాన్నారి ఆఫీసు జీపులో ప్రతిరోజూ దర్జాగా కాలేజీకొచ్చిన నా కాలేజ్మేట్ 'తాసీల్దారు గారి అబ్బాయి' గుర్తొచ్చాడు. ఇతనేమో నేను లేకపోతే రూమ్ దొరికేది కాదు అంటున్నాడు. రికమండేషన్ ఆ తండ్రికి ఇష్టం ఉండదా? ఈ కొడుక్కి నచ్చదా? వీఐపీలకి దొరికే ట్రీట్మెంట్ ఏవిటో కొన్ని గంటల ముందే ప్రత్యక్షంగా చూసి ఉన్నాను. "మిమ్మల్ని సివిల్స్ వైపు వెళ్ళమనలేదా?" కుతూహలంగా అడిగాను. "నేను చాలా అదృష్టవంతుడిని. చదువు, ఉద్యోగం, ఇప్పుడు వచ్చిన ఛాన్సులు.. ఏ విషయంలోనూ కలగజేసుకోలేదు.. కాకపోతే, పెళ్లి చేసుకోమని మాత్రం ప్రెషర్ చేస్తున్నారు" కొంచం సిగ్గు పడుతూ చెప్పాడు. "వాళ్ళూ అదృష్టవంతులే, ఇలాంటి కొడుకు ఉన్నందుకు" అప్రయత్నంగా పైకే అనేసి, "మంచి పిల్ల జతపడాలి" అని మనసులో దీవించా, అప్పదాసులా. "మా నాన్నగారి రూట్స్ తెలుగు అని ఈ మధ్యనే తెలిసింది. నాకు తెలుగు నేర్చుకోవాలని ఉంది.. సులువే అంటున్నారు అందరూ.." అన్నాడు. "కన్నడకి దగ్గరగానే ఉంటుంది, సులువే" అన్నాను. చాలా సేపు కబుర్లు నడిచాయి.
"నా విషయంలో మీరైతే ఏ నిర్ణయం తీసుకుంటారు?" ఉన్నట్టుండి అడిగాడు. ఊహించని ప్రశ్న కాదు. "ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది.. మీ ప్లేసులో, మీ వయసులో ఉంటే నేనైతే చదువుకి వెళ్తాను" అతని మొహం వెలిగిపోయింది. "నాకూ చదువే ఇష్టం.. కానీ జాబ్ ఆఫర్ బాగా టెంప్ట్ చేస్తోంది. మా ఫ్రెండ్స్ చాలామంది ఎదురు చూసిన ఛాన్స్, అది నాకు వచ్చింది.. అందుకే..." ..."మీరు మంచి నిర్ణయమే తీసుకుంటారు.. ఆల్ ది బెస్ట్" అన్నాను. నేను బయల్దేరాల్సిన వేళవుతోంది. అతని ప్రయాణం రాత్రి హారతి తర్వాతట. "మారుతి టిఫిన్ సెంటర్ సాయంత్రం కూడా ఉంటుంది. ఏదన్నా తినేసి వెళ్ళండి. అదే రోడ్ లో తిన్నగా వెళ్లి ఎడమకి తిరిగితే బస్టాండ్.. వర్షం తగ్గింది కాబట్టి నడిచి వెళ్లిపోవచ్చు.. ఈ ఊళ్ళో మిరియాలు తప్ప షాపింగ్ చేయాల్సింది ఏమీ ఉండదు. కాంపౌండ్ బయట చూడాల్సినవి రెండు మూడు ఆలయాలున్నాయి, కానీ మీకు టైం లేదు, పైగా వర్షం" ఒక్కొక్కటిగా చెప్పాడు. "ఇది నాకు అన్ ప్లాన్డ్ ట్రిప్.. కేవలం మీవల్ల చాలా బాగా జరిగింది అనిపిస్తోంది.. గ్రేట్ మీటింగ్ యు.." అన్నాను బయల్దేరుతూ.. చేయి సాచాడు, తొలి హ్యాండ్ షేక్. "మనం ఈసారి ప్లాన్ చేసుకుని ఏదన్నా ట్రిప్ కి వెళదామా, నేను అబ్రాడ్ వెళ్ళేలోగా?" అడిగాడు. "తప్పకుండా..." ఇది దాదాపు నా ఊతపదం.
గుడి దగ్గర వాతావరణం ఉదయం ఉన్నట్టే ఉంది. టిఫిన్ సెంటర్ దగ్గర కూడా అంతే. ఈసారి మాత్రం స్నేహితుల ఇంటికి వెళ్లినంత చొరవగా లోపలి వెళ్లి కూర్చున్నా. వండి వడ్డించే వాళ్ళు వాళ్ళే, మెనూ కూడా అదే. ఆశ్చర్యం ఏమిటంటే అందరూ గుర్తు పట్టి పలకరించారు. బిల్లు రాస్తుండగా "ఇంకొక్క కాఫీ తాగుతాను, ఇంకొంచం స్ట్రాంగ్ గా.." అడిగేశాను నిర్మొహమాటంగా. ఆ వేళ్టి మూడో కాఫీ ఘుమఘుమలాడుతూ నా ముందుకు వచ్చింది. బిల్లు చెల్లించి నడక మొదలు పెట్టాను. ఏ క్షణంలో అయినా మళ్ళీ వర్షం పడేలా ఉంది వాతావరణం. పాతకాలపు ఇళ్ళు, వాటి మధ్యలో సరికొత్త మేడలు. జనం తాకిడికి బాగా అలవాటు పడిన మనుషులు. గుడిని మినహాయిస్తే ఓ చిన్న పల్లెటూరు. బస్సు నా కోసం ఎదురు చూస్తోంది. సీట్లో కూర్చుని ఫోన్ తీసి మెసేజ్ టైపు చేశాను "థాంక్స్ ఫర్ మేకింగ్ మై ట్రిప్ మెమరబుల్". కిటికీ లోంచి బయటికి చూస్తుంటే పచ్చని శృంగేరి వెనక్కి వెళ్ళిపోతోంది. గాలితో పాటుగా చినుకులు పలకరిస్తున్నాయి. అద్దం మూసి ఫోన్ చూస్తే, జవాబు ఎదురు చూస్తోంది "హేపీ జర్నీ.. శృంగేరి మళ్ళీ వద్దామా? ఇంకెక్కడికైనా వెళదామా?" ... "ప్లాన్ చేద్దాం.." రిప్లై ఇచ్చి వెనక్కి వాలాను.
(అయిపోయింది)