బుధవారం, మార్చి 22, 2023

రంగమార్తాండ

నాటకరంగం వేరు.. జీవిత రంగం వేరు..
ఏ వేషం వేస్తున్నావో  తెలిసే చోటు అది..
ఏ నిమిషం ఏం చెయ్యాలో తెలియని ఆట ఇది... 

మన దగ్గర సినిమా నటీనటులకి ఉన్నంత క్రేజ్ నాటకాల్లో నటించే వాళ్ళ విషయంలో లేక పోవడం వల్ల నాకో మేలు జరిగింది. నాటక ప్రదర్శన అయ్యాక ఆయా నటీనటులతో నేరుగా మాట్లాడే అవకాశం చాలాసార్లు దొరికింది. కొందరితో స్నేహమూ కుదిరింది. ఈ క్రమంలో నాటకానికన్నా ముందు గ్రీన్ రూమ్ కి వెళ్లి కబుర్లు చెప్పడం తెలియకుండానే అలవాటయ్యింది. వేషం వేసుకున్నప్పుడూ, పూర్తి చేశాక కూడా వాళ్ళు మామూలు మనుషులే. కానీ, ఒక్కసారి స్టేజీ ఎక్కగానే పోషించే పాత్రలుగా మారిపోతారు. నాటకం ముగిసి, వేషం తుడుచుకోడానికి మళ్ళీ గ్రీన్ రూమ్ లోకి వస్తూనే మామూలు మనుషులైపోతారు. ఈ భేదం మొదట్లో చాలా ఆశ్చర్య పరిచేది. రానురానూ అలవాటైపోయింది. 

ఈ భేదాన్ని బహు చక్కగా పట్టుకున్నారు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం. ఈ సూక్ష్మాన్ని అంతే చక్కగా తెరకెక్కించాడు కృష్ణవంశీ. 'రంగమార్తాండ' సినిమా చూస్తున్నంత సేపూ, చూడడం పూర్తయ్యాక కూడా నాకు తెలిసిన థియేటర్ ఆర్టిస్టులందరూ గుర్తొస్తూనే ఉన్నారు. 'రంగస్థల రంగమార్తాండ' రాఘవరావు పాత్రలో ప్రకాష్ రాజ్ జీవిస్తే, 'నాకు అంతకన్నా ఒక మార్కన్నా ఎక్కువ ఇవ్వాల్సిందే' అన్నంతగా మరో నటుడు చక్రపాణి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు బ్రహ్మానందం. రాఘవరావు భార్య రాజుగారు గా రమ్యకృష్ణ మూడో స్థంభం అయితే, మిగిలిన నటీనటులు, సాంకేతిక బృందమంతా కలిసి నాలుగో స్థంభం. దర్శకుడితో పాటు సంభాషణల రచయిత (ఆకెళ్ళ శివప్రసాద్), సంగీత దర్శకుడు (ఇళయరాజా), గీత రచయితలు (సిరివెన్నెల తదితరులు) కెమెరా (రాజ్ కె నల్లి), ఎడిటింగ్ (పవన్)  విభాగాలకీ క్రెడిట్ ఇవ్వాలి. 

ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ని వాడుకుని తీసిన ఈ సినిమాలో అసలు కథ రాఘవరావు రిటైర్మెంట్ తో ప్రారంభమవుతుంది. అతడు స్టేజిమీద నటించిన సీన్ ఒక్కటన్నా చూపించలేదన్న కొరతని బ్రహ్మానందం హాస్పిటల్ సీన్ కొంతవరకూ తీర్చింది. నిజానికి ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం.. వీళ్ళు ముగ్గురూ కూడా మంచి పాత్ర దొరికితే ఒళ్ళు మర్చిపోయి నటించేస్తారు. దర్శకుడు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, వీళ్ళ నటన పాత్ర పరిధిని దాటేస్తుంది. అలా దాటకుండా కృష్ణవంశీ కాసుకున్నాడు. (వీళ్ళ ముగ్గురి ముందూ శివాత్మిక నటన లౌడ్ గా అనిపించిందంటే చాలదూ, వీళ్ళు ఎంత సటిల్డ్ గా చేశారో చెప్పడానికి). గత  కొన్నేళ్లుగా కృష్ణవంశీకి తన సినిమాల్లో సందేశాలు ఇమడ్చాలన్న తపన బాగా పెరిగింది. భాష గురించి, సంస్కృతి గురించి సందేశాలని ఈ సినిమాలోనూ చేర్చాడు. వాటి నిడివి పెరిగి ప్రేక్షకులకి విసుగు రాకుండా, క్రిస్ప్ గా కట్ చేయడం ద్వారా ఎడిటింగ్ టీం కృష్ణవంశీని కాసుకుంది. 

రంగస్థల నటుల వ్యక్తిగత జీవితం అనే పాయింట్ తీసేస్తే, ఈ కథ ఏ మధ్య తరగతి ఇంట్లో అయినా జరగడానికి వీలున్నదే. కానైతే, ఈ కథలా జరగదు. అందుకు కీలకం రంగస్థల నటుల వ్యక్తిగత జీవన శైలి. ఎక్కువమందిలో కనిపించేవి భోళాతనం, మనుషుల్ని తేలిగ్గా నమ్మేసే గుణం, తమ మీద తమకి విపరీతమైన ఆత్మవిశ్వాసం, తమ జడ్జిమెంట్ తప్పక నిజమవుతుందనే నమ్మకం... రాఘవరావు కి ఉన్న ఈ లక్షణాల వల్లే అతని జీవితం ఇల్లు దాటి రోడ్డున పడింది. మొదటినుంచీ హెచ్చరిస్తూ వచ్చిన భార్య మాత్రం అతడి వెనుక గట్టిగా నిలబడింది, అతన్ని నిలబెట్టేందుకు తన శక్తినంతటినీ పోగుచేసుకుంది. సినిమా చూసే ప్రేక్షకులు రాఘవరావుని ఎలా అర్ధం చేసుకుంటారో, సినిమా వాళ్ళకి అలా అర్ధమవుతుంది. ఇందుకోసం నాటకాలతో పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. రంగస్థల రంగమార్తాండుడితో సహానుభూతి చెందగలిగితే చాలు. 


మహానటుడు ఎస్వీ రంగారావు ఆశీస్సులతో రంగస్థల నటుడిగా జీవితం మొదలు పెట్టిన రాఘవరావు, తన కొడుక్కి (ఆదర్శ్ బాలకృష్ణ) ఆ నటుడి పేరే పెట్టుకున్నాడు. కానీ అతన్ని ఎస్వీఆర్లా పెంచలేకపోయాడు. ఫలితం, భార్య (అనసూయ భరద్వాజ్) చాటు భర్తగా మిగిలిపోయాడు రంగారావు. రాఘవరావు కూతురు శ్రీ (శివాత్మిక) మాత్రం తండ్రి కళా వారసత్వాన్ని కొనసాగిస్తూ ఫ్యూషన్ మ్యూజిక్ లో భవిష్యత్తుని వెతుక్కోవడం మొదలుపెట్టింది. సహ గాయకుడు రాహుల్ (రాహుల్ సిప్లిగంజ్) ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తనకి స్వర్ణకంకణం ప్రదానం చేసిన సన్మాన  సభలోనే నటుడిగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు రాఘవరావు, చూసుకోడానికి పిల్లలు ఉన్నారన్న నమ్మకంతో. ఆ రాత్రే తన ఆస్తిపాస్తుల్ని పిల్లలకి పంచేశాడు, భార్యకి మాటమాత్రమైనా చెప్పకుండా. ఆ తర్వాత, అసలు కథ మొదలైంది. 

ఇక, చక్రపాణి (బ్రహ్మానందం)ది ఓ శాపగ్రస్త జీవితం. (అందుకే సింబాలిక్ గా కర్ణ పాత్ర వేయించాడేమో కృష్ణవంశీ). రంగస్థలం మీద రాఘవరావుని మించిన నటుడే అయినా (ఈ మాట రాఘవరావే ఒప్పుకుంటాడు), తగినంత పేరు రాక వెనుక వరసలో నిలబడిపోయాడు. వ్యక్తిగత జీవితంలో ఉన్న లోటు సరేసరి. చక్రపాణిగా బ్రహ్మానందాన్ని చూశాక 'ఇంతటి నటుడిని ఇన్నాళ్లూ కామెడీకి మాత్రమే పరిమితం చేశారే' అనిపించింది. కామెడీ తక్కువ అని కాదు, ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేసి ఉండేవాడు కదా అని. నిజం చెప్పాలంటే తెరమీద చక్రపాణి మాత్రమే కనిపించాడు, నవ్వించినప్పుడు కూడా. చక్రపాణి భార్య సుబ్బుగా జయలలిత కనిపించింది. ఆమెకి నటించే అవకాశం దొరకలేదు. 

రమ్యకృష్ణ కి తన ట్రేడ్ మార్క్ అరుపులు లేని పాత్ర. లోపల అగ్నిపర్వతాలు బద్ధలవుతున్నా, చాలా మామూలుగా కనిపించేందుకు ప్రయత్నించే ఇల్లాలిగా ఆమె బదులు మరొకరిని ఊహించలేం. "కళ్ళతోనే నటించింది" అని ఇంటర్యూలలో కృష్ణవంశీ చెబితే ఏమో అనుకున్నా కానీ, నిజమే. రాఘవరావుని పూర్తిగా అర్ధం చేసుకున్న 'రాజుగారు' ఆమె. వీళ్ళ ముగ్గురూ తెరమీద కనిపిస్తుంటే, వీళ్ళతో పాటు కనిపిస్తూ మెప్పించడం ఎవరికైనా కష్టమే. అనసూయ, శివాత్మిక, రాహుల్, ఆదర్శ్ లు కేవలం సెట్ ప్రాపర్టీలుగా మిగిలిపోకుండా తాము చేయగలిగింది చక్కగా చేశారు. తెలుగు రంగస్థల చరిత్రని సందర్భోచితంగా ప్రస్తావిస్తూ రాసిన డైలాగులు ఈ సినిమాకి అదనపు బలం. అలాగే, రంగస్థల నటుల జీవితాలు ఎలా ఉంటాయన్నదీ ప్రస్తావించారు. 

ఓ సందర్భంలో రాఘవరావు "కోట్లు సంపాదించాను, తగలేశాను" అంటాడు. ఇది అర్ధసత్యం. తెలుగునాట రంగస్థలం అంత పే చెయ్యదు. మొత్తం సంపాదన లక్షల వరకూ వెళ్లే వాళ్లే తక్కువ. అయితే, తగలేయడం మాత్రం నూటికి తొంభై మంది నటుల విషయంలో నిజం. చప్పట్లు ఇచ్చే మత్తు, ఫలితంగా మారే జీవన శైలి, ఇన్ఫీరియారిటీ - సుపీరియారిటీ కాంప్లెక్సుల మిశ్రమంగా మారే వ్యక్తిత్వం, వీటినుంచి పుట్టే నిర్లక్ష్యం.. వీటన్నంటివల్లా కావొచ్చు థియేటర్ నుంచి సంపాదించింది నిలబెట్టుకున్న వాళ్ళు బహు తక్కువ. సినిమా రంగంలోనూ ఈ సమస్య ఉన్నా, అక్కడ సంపాదన ఎక్కువ, జాగ్రత్త పరుల సంఖ్యా ఎక్కువే. ఇళయరాజా స్వయంగా పాడిన నేపధ్య గీతంతో సహా పాటలన్నీ బాగున్నాయి. 'దమిడి సేమంతి' పాట చూస్తుంటే 'సాగర సంగమం' లో 'తకిట తధిమి' గుర్తొచ్చింది అప్రయత్నంగా. 

టైటిల్స్ రన్నయ్యేప్పుడు చిరంజీవి గొంతులో 'నేనొక నటుణ్ణి' కవిత వినిపిస్తూ తెలుగు సినిమా నటుల ఫోటోలు చూపించారు. నాటకం గురించిన సినిమాలో సినిమా నటుల్ని చూపించడం ఏమిటన్నది ఒక ప్రశ్నయితే, ఎన్టీఆర్, ఏఎన్నార్లతో మొదలుపెట్టడం మరోప్రశ్న. వాళ్లకన్నా ముందు వాళ్ళయిన నారాయణ రావు, నాగయ్య లాంటి నటుల్ని ప్రస్తావించక పోవడం కృష్ణవంశీ చేయదగ్గ పని కాదు. వాళ్ళ ఫోటోలు దొరకనివీ కాదు. నటుల్ని గురించి చక్కని సినిమా తీసిన దర్శకుడికి, ఎన్టీఆర్, ఏఎన్నార్లకి ముందు కూడా తెలుగు సినిమా చరిత్ర ఉందని గుర్తు చేయాల్సి రావడం బాధాకరం. సినిమా చూసిన ప్రేక్షకుడిగా రాఘవరావుని అర్ధం చేసుకోగలిగాను కానీ, చక్రపాణిని  అర్ధం చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉందనిపిస్తోంది. చాన్నాళ్ల తర్వాత మంచి సినిమా ఇచ్చిన కృష్ణవంశీకి అభినందనలు!! (కృష్ణవంశీ రీమేక్ చేస్తున్నాడని తెలిసి మరాఠీ 'నటసామ్రాట్' చూడలేదు ఇన్నాళ్లూ, ఇప్పుడు చూస్తే తెలుగుతో పోలిక వస్తుందేమో?) 

నీ నిలయమేది.. నర్తనశాలే కాదా.. 
నీ కొలువు ఏది.. విరాట పర్వం కాదా..
ముగిసిందా నీ అజ్ఞాతవాసం ??? 

10 కామెంట్‌లు:

  1. సమీక్ష బాగా వ్రాశారు. కృష్ణ వంశీ సినిమాలలో మెలోడ్రామా పాలు ఎక్కువగా ఉంటుంది. రంగమార్తాండ చిత్రం లో ఎలా ఉందో చూడాలి. పాటలు అంత బాగా లేవు. ఇళయరాజా సినిమాల నుంచి 20 ఏళ్ల క్రితం రిటైర్ అయితే బాగుండేది అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సినిమా చూడక ముందు పాటల విషయంలో నాకూ కించిత్ నిరాశ కలిగిన మాట నిజమండీ.. కానీ, సినిమాలో భాగంగా చూస్తున్నపుడు నచ్చేశాయి.. గడిచిన ఇరవై ఏళ్లలో ఇళయరాజా నుంచి కొన్ని మెమొరబుల్ మెలోడీస్ వచ్చాయి కదండీ (రాశిలో తక్కువే అయినా) , ఆయన రిటైర్ అయి ఉంటే మనం వాటిని మిస్సయి ఉండేవాళ్ళమేమో.. ..ధన్యవాదాలు.. 

      తొలగించండి
  2. బలగం సినిమా చూసిన తర్వాత రంగ మార్తాండ చూసాను. రంగ మార్తాండ అస్సలు నచ్చలేదు. బలగం సినిమా లో ప్రేక్షకులు లీనమయిపోయి బాధపడతారు, ఏడుస్తారు. సింగర్ సునీత, అనసూయ లు ఫీలయి పోయి ఏడ్పు వచ్చేసింది అని ప్రీరిలిజ్ లో చెప్పినట్లు గా ఏమి లేదు. కళాకారుడికి రిటైర్మెంట్ ఏమిటసలు? ఇక ఇళయరాజా పాటలు ఘోరం...వినలేకపోయాను. బలగం తో పోలికేమిటి అంటే రెండు ఒకేసారి రిలిజయ్యాయి కాబట్టి...so called హీరోయిన్స్ కృష్ణవంశీ కోసం ఏడుపు తెచ్చుకుని మాట్లాడకుండా జబర్దస్త్ వేణు నీ ప్రోత్సహించి ఉంటే బాగుండేది.

    రిప్లయితొలగించండి
  3. Theatric experience లాంటివి లేకపోయినా, కొన్ని జీవితాలు పూర్తిగా ఎమోషనల్ హైప్ లో నే ఎలా గడచిపోతాయో చాలా బాగా ఆవిష్కరించారు కృష్ణ వంశీ. నటుల జీవితాలు ఇందుకు సరైన ఉదాహరణ. మీరన్నట్టు బ్రహ్మానందం , ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ గార్లు వారి నటనా అనుభవ భారాన్ని ఎక్కడా మోపకుండా చాలా బాగా చేసారు. కానీ నాకు మాత్రం ప్రకాష్ రాజ్ మార్కు హావభావాలు కొంత carry చేసినట్టే అనిపించింది.

    అన్నిటికన్నా ఇబ్బంది పెట్టేది కామెడీ background . కామెడీ నటుడిగా దశాబ్దాల తరబడి ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించి, ఇప్పుడు, ఇలాంటి పాత్ర ఎంచుకోటమే కాకుండా అద్భుతంగా పండించారు బ్రహ్మానందం గారు. ఇదివరకు వారు కొన్ని ప్రయత్నించినా, బహుశా కెరీర్ ఒత్తిడి ఉందో ఏమోగాని అంతగా మెప్పించలేదు. కానీ ఈ సినిమాతో తనలోని నటుణ్ని పూర్తిగా ఆవిష్కరించుకున్నారు అనిపించింది. సరైన జాగ్రత్తలతో చేసిన మేకప్ కూడా సహాయపడింది.

    ఇక కృష్ణవంశీ నాకు అంతగా సదభిప్రాయం లేని దర్శకులు. జమానా కాలంలో సముద్రం అనే సినిమా చూసి కలిగిన impression అది. ఆ తర్వాత కూడా ఎందుకో ఏ సినిమా కూడా అంతగా నచ్చలేదు. అయితే కాలం గడిచే కొద్దీ అతనికి ఏర్పడిన ఆధ్యాత్మిక చింతన ప్రభావం ఈ సినిమా లో స్పష్టంగా కనిపించింది.

    సమాజానికి సందేశం లేకపోయినా, ఏ కళ అయినా కనీసం మనిషి నైతిక విలువలని పాడు చేయకుండా ఉండాలన్నది నా అభిమతం. ఆ పరంగా మీ రివ్యూ ఈ సినిమా చూడటానికి దోహద పడింది. ప్రధాన పాత్రలు మూడు పక్కన పెడితే, జీవిత గారి అమ్మాయి నటనలో చాలా maturity కనిపించింది. మీ సమీక్ష, నటులతో మీకున్న అసోసియేషన్ చేత మరింత కంటెంట్ గా అనిపించింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమేనండీ.. ప్రకాష్ రాజ్ మరికొంత సటిల్డ్ గా చేస్తే బాగుండేదని రెండు మూడు చోట్ల నాకూ అనిపించింది. కానీ, అలా నటించడానికి అతనూ, చూడ్డానికి మనమూ అలవాటు పడిపోయామేమో.. బ్రహ్మానందం నిజంగానే చాలా పెద్ద సర్ప్రైజ్ ఈ సినిమాలో.. ధన్యవాదాలు.. 

      తొలగించండి
    2. నిజానికి బ్రహ్మానందం పెద్ద సర్ప్రైజ్ కాదనుకుంటానండి. లోగడనే ఆయన (మనీ సినిమాలో అనుకుంటాను) సీరియస్ టైప్ నటన బ్రహ్మాండంగా చేసి చూపించి మంచి ప్రశంసలు అందుకున్నారు. ఐతే మన సినిమాల వాళ్ళు మాత్రం ఆయనకు చీప్ హాస్యం పాత్రలే డిజైన్ చేస్తూ వచ్చారు ఆయన టాలేంట్ విషయం పట్టించుకోకుండా కేవలం అయన హాస్యానికే‌ మార్కెట్ అన్న సిధ్ధాంతంతో. పాపం దానికి ఆయన ఏంచేయగల!

      తొలగించండి
    3. 'మనీ' లో సీరియస్ గా కనిపించినా కామెడీ వేషమేనండీ.. పూర్తి స్థాయి సీరియస్ వేషం వేసింది మాత్రం 'బాబాయ్ హోటల్' సినిమాలో. జంధ్యాల దర్శకత్వం, బ్రహ్మానందం ముఖ్యపాత్ర అనగానే చాలా కామెడీ ఊహించుకుని వెళ్లిన ప్రేక్షకులకి పూర్తి సెంటిమెంట్ చూపించారు ఇద్దరూ. సినిమా బాగా పోలేదు కానీ, బ్రహ్మానందం బానే చేశాడు (అక్కడక్కడా కొంచం లౌడ్ గా).. ఇన్నేళ్ల అనుభవం 'చక్రి' పాత్రకి కలిసొచ్చింది.. 

      తొలగించండి