అతను మొదట 'వేణు వండర్స్' గా పరిచయం. ధారాళమైన బూతులకి మరికొన్ని అవలక్షణాలు గుదిగుచ్చి 'జబర్దస్త్' అని పేరిచ్చిన ఒకానొక టీవీ షోలో ఒకానొక టీం లీడర్ అప్పుడతను. ఆ మొత్తం షో ని భరించాల్సిన అవసరం లేకుండా, ఉన్నంతలో శుభ్రంగానూ, ఏదో ఒక ప్రత్యేకతతోనూ స్కిట్లు చేసే టీం లీడర్లని ఎంచుకుని, టీవీ కి బదులుగా యూట్యూబులో చూసే అవకాశం వచ్చినప్పుడు నేను షార్ట్ లిస్ట్ చేసుకున్న కొద్దిమంది టీం లీడర్లలో అతనూ ఒకడు. అప్పటికే వేణు సినిమాల్లో చిన్న వేషాలు వేసి ఉన్నాడని నెమ్మదిగా తెలిసింది. కాలక్రమంలో అతను ఇతర చానళ్లకు మళ్ళినా, యూట్యూబ్ లో దొరికిన కంటెంట్ ని చూస్తూనే ఉన్నాను. హాస్యంతో పాటుగా జానపద కళల మీద వేణుకి ఉన్న మక్కువ, అతని స్కిట్లు ప్రత్యేకంగా అనిపించడానికి, గుర్తుండడానికీ కారణమని అర్ధమవ్వడానికి చాలారోజులు పట్టింది.
ఆలోగా అతను బుర్రకథ మొదలు, ఒగ్గు కథ వరకూ ఎన్నింటినో తన స్కిట్లలో వాడుకున్నాడు, ఆయా కళల్ని ఏమాత్రం కించ పరచకుండా, వాటిని మరింతగా గౌరవిస్తూ... "వేణు సినిమా తీస్తున్నాడు" అని విన్నప్పుడు కచ్చితంగా కామెడీ సినిమానే అయి ఉంటుంది అనుకున్నాను. ఆ సినిమా, 'బలగం', విడుదలై మంచి పేరు తెచ్చుకుందని తెలిసి సంతోషం కలిగింది. మొదట తక్కువ థియేటర్లలో విడుదల చేసినట్టున్నారు, దగ్గర థియేటర్లలో కనిపించలేదు. కేవలం సినిమాకి పెరిగిన ఆదరణ వల్ల థియేటర్లు పెంచారు. ముందుగా చేసుకున్న ఒప్పందం వల్ల అమెజాన్ ప్రైమ్ లోనూ విడుదల చేసేశారు. ఓపక్క ఉచితంగా ఓటీటీలో దొరుకుతున్నా, జనం టిక్కెట్లు కొనుక్కుని హాళ్ళకి వెళ్తూ ఉండడం బహుశా ఈ సినిమాకి మాత్రమే దొరికిన గౌరవం.
ప్రియదర్శి మినహా పేరున్న నటీనటులెవరూ లేరు. జబర్దస్త్ లో వేణుతో పాటు కనిపించిన కొందరు కమెడియన్లతో మాత్రం జనానికి ముఖ పరిచయం. కథా స్థలం తెలంగాణ పల్లె. కథేమో ఆ పల్లెలో జరిగే ఒక చావు. చాలా మామూలుగా మొదలై, చిన్నగా నవ్విస్తూ సాగే కథనం మనకి తెలియకుండానే సీరియస్ గా మారుతుంది. సినిమా చూస్తున్న మనం ప్రేక్షకులం అనే విషయం మర్చిపోయి, ఆ ఊళ్ళో మనుషులం అయిపోతాం. ఇంటి పెద్దని పోగొట్టుకున్న ఆ కుటుంబానికి ఊహించని సమస్య రావడంతో, దాన్నుంచి వాళ్ళు ఎలా బయట పడతారా అని కుతూహల పడతాం. మెడమీద వేలాడే 'పదిలక్షల అప్పు' అనే కత్తి బారి నుంచి కథానాయకుడు (?) ఎలా తప్పించుకుంటాడో అని ఆందోళన పడతాం. చివరికొచ్చేసరికి తెరమీద కనిపించే మిగిలిన పాత్రలతో పాటు మనం కూడా 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకుంటాం.
ఆ పల్లెటూళ్ళో సాయిలు (ప్రియదర్శి) ఓ రైతు కొడుకు. పాతికేళ్ళు ఉంటాయి. చదువుకున్నాడు కనుక వ్యవసాయం మీద ఆసక్తి లేదు. వ్యాపారం చేయాలని కోరిక. తండ్రిది బొత్తిగా సహాయనిరాకరణ. అప్పులు చేసి మొదలు పెట్టిన వ్యాపారాలేవీ ఆ పల్లెటూళ్ళో క్లిక్కవ్వలేదు. అప్పు మాత్రం, వడ్డీలతో కలిపి పది లక్షలయ్యింది. పదిహేను లక్షల కట్నంతో పెళ్లి కుదరడం సాయిలుకి పెద్ద ఊరట. రెండు రోజుల్లో వరపూజ (ఎంగేజ్మెంట్) అనగా సాయిలు తాత కొమరయ్య హఠాత్తుగా కన్నుమూస్తాడు. ఇక, చావు చుట్టూ జరిగే రాజకీయాలు మొదలు. ముసలాయన పోయినందుకు సాయిలుతో సహా మనస్ఫూర్తిగా బాధపడేవాళ్లు ఎవరూ లేరు, సాయిలు మేనత్త లక్ష్మి పరుగున వచ్చే వరకూ. ఇరవై ఏళ్ళ తర్వాత పుట్టింట్లో అడుగు పెట్టింది ఆమె. అది కూడా, తండ్రి కడసారి చూపు కోసం.
పెళ్ళైన తర్వాత వచ్చిన తొలి దసరా పండుగకి పుట్టింట్లో లక్ష్మి భర్త నారాయణకి, లక్ష్మి సోదరుల (సాయిలు తండ్రి, చిన్నాన్న) చేతిలో జరిగిన అవమానం ఫలితంగా ఇరవయ్యేళ్లు ఆమె పుట్టింటి గడప తొక్కలేదు. పుట్టెడు దుఃఖంతో వచ్చిన ఆమెని మనస్ఫూర్తిగా అక్కున చేర్చుకున్నది సాయిలు తల్లి మాత్రమే. నాటి అవమానాన్ని నారాయణ ఇంకా మర్చిపోలేదు. బావమరుదులూ మర్చిపోలేదు. వాళ్ళు అతన్ని కనీసం పలకరించలేదు. లక్ష్మి కూతురు సంధ్య (కావ్య కళ్యాణ్ రామ్) కి ఇదంతా కొత్త. తాతగారింటికి తొలిసారి వచ్చిందామె. అది కూడా ఇలాంటి సందర్భంలో. ఇంజినీరింగ్ చదువుకుంటోన్న ఆ అమ్మాయి జరుగుతున్న వాటిని మౌనంగా గమనిస్తూ ఉంటుంది, తప్పొప్పుల తీర్పుల జోలికి పోకుండా.
చిన్న దినంలో కొమరయ్యకి పెట్టిన భోజనాన్ని కాకి ముట్టకపోవడంతో కథ పాకాన పడుతుంది. కాకి వస్తుంది, కొమ్మ మీద కూర్చుంటుంది తప్ప విస్తరిని కన్నెత్తి చూడదు. కొమరయ్య తీరని కోరిక ఏమిటన్నది ఎవరికీ తెలీదు. అది పల్లెటూరు కావడంతో జరుగుతున్న వాటిని ఊరు బాగానే పట్టించుకుంటూ ఉంటుంది. పదకొండో రోజున జరిగే పెద్ద దినం నాడు కూడా కాకి ముట్టకపోతే అది ఊరికి అరిష్టం. అదే కనుక జరిగితే పంచాయితీ వేసే శిక్షని ఆ కుటుంబం భరించాలి. సినిమా మొదట్లో ఏ ప్రాముఖ్యతా లేని కొమరయ్య, పోయాక కథలో ముఖ్యపాత్ర అయిపోతాడు. పోయినప్పుడు కూడా పెద్దగా మాట్లాడుకోని వాళ్ళు ప్రతి క్షణం అతన్ని తల్చుకుంటూ ఉంటారు. సాయిలు అప్పు గొడవ, బావ-బావమరుదులు ఇగో క్లాషెస్, ఇవి చాలవన్నట్టు అన్నదమ్ముల (సాయిలు తండ్రి, చిన్నాన్న) మధ్య ఆస్తి తగాదాలు.
చాలా సీరియస్ గా వినిపించే ఈ కథని వ్యంగ్యాత్మకంగా తీశాడు వేణు. తెరమీద సీరియస్ సన్నివేశాలు నడుస్తున్నా చూస్తున్న ప్రేక్షకులకి చాలాచోట్ల నవ్వొస్తుంది, అక్కడక్కడా ఏడుపొస్తుంది. సాయిలు హీరో కాబట్టి, కుటుంబ సభ్యులందరికీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేసి, అందరినీ కలిపేసి, అవసరమైతే కాకికి కూడా పంచ్ డైలాగులతో బ్రెయిన్ వాష్ చేసేసి ముద్ద తినిపించేస్తాడేమో అని భయపడ్డాను. కానైతే, అవేవీ జరగలేదు. ఏం చేస్తే తాత ఆత్మ శాంతిస్తుందో తన వాళ్ళకి సింబాలిక్ గా చెప్పాడు. అందులో కూడా తన డబ్బు సమస్య నుంచి బయట పడే దారిని వెతుక్కున్నాడు. ఈ కథకి కీలకం లక్ష్మి పాత్ర. ఎంతో అనుభవం ఉన్న నటి వేయాల్సిన బరువైన పాత్ర. రూపాలక్ష్మి అనే ఆవిడ చాలా అలవోకగా పోషించింది. ఆ మాటకొస్తే అన్ని పాత్రలూ అంతే. పేరున్న నటులు కాకపోవడం వల్ల, పాత్రలు మాత్రమే కనిపించాయి.
తేలికపాటి సన్నివేశాలతో కూడిన బరువైన సినిమా 'బలగం'. వేణు తన అభిరుచికి తగ్గట్టుగా ఒగ్గుకథ మొదలు అనేక తెలంగాణ కళా రూపాలని కథలో భాగం చేశాడు. క్లైమాక్స్ లో వచ్చే పాట థియేటర్లలో ఒక సామూహిక దుఃఖ ప్రకటనగా మారుతోంది. అలా తేలిక పడడంకోసమే జనం ప్రత్యేకంగా సినిమా హాళ్ళకి వెళ్ళి చూస్తున్నారేమో అనిపించింది. చావింటిలో టీల పంపిణీ మొదలు ప్రతి చిన్న విషయాన్నీ జాగ్రత్తగా కథలో భాగం చేసుకున్నాడు దర్శకుడు. రెండు గంటల సినిమాలో ఎక్కడో అక్కడ ఏదో ఒక పాత్రలో తమని తాము చూసుకోని ప్రేక్షకులు ఉండరేమో. సంగీతం, కెమెరా, ఎడిటింగ్.. ఇలా సాంకేతిక విభాగాలన్నీ వంక పెట్టడానికి వీల్లేని విధంగా పనిచేశాయి. తెలిసిన కథలా అనిపిస్తూనే, తర్వాత ఏమిటన్న కుతూహలాన్ని ఆసాంతమూ కొనసాగించింది. నేల విడిచి సామన్నది ఎక్కడా కనిపించలేదు. బహుశా, 'బలగం' విజయ రహస్యం అదేనేమో.
మొదటి సినిమా అయినప్పటికీ కూడా ఎంతో అనుభవమున్న డైరెక్టర్ లాగా ఎంత చక్కగా తీసాడో... ఆశ్చర్యంగా అన్పించింది ఇతనిలో ఇంత డెప్త్ ఉందా అని..తెలంగాణ నేటివిటీ ని చక్కగా చూపించాడు.. సినిమా చూస్తున్నంత సేపు నా కొడుకులిద్దరూ మాట్లాడుకోవాలని, కలిసి ఉండాలని తాపత్రయ పడ్డ మా నానమ్మ, తాతయ్య గుర్తుకు వచ్చారు. పాపం పోయాక కూడా వాళ్ళ కోరిక తీరలేదు.
రిప్లయితొలగించండిప్రేక్షకులు థియేటర్ కి రావాలంటే ఒక ఐటెం సాంగ్, నాలుగు పాటలు , నాలుగు ఫైట్లు పెడితే చాలు అనుకునే హీరోలు, డైరెక్టర్లు ఉన్న ఈ కాలంలో పూర్తిగా కథను, కథనాన్ని నమ్ముకొని సినిమా తీసిన వేణు కి, అతనికి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి మనస్ఫూర్తిగా అభినందనలు.
👏👏👏👏👏
రిప్లయితొలగించండి