పద్నాలుగు మంది కన్నడ యువరచయితల కథలని తెలుగులోకి అనువదింపజేసి 'నవ లేఖన మాల' సిరీస్ లో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన సంకలనం 'నవ లేఖన కన్నడ కథలు'. సుప్రసిద్ధ కన్నడ కవి ఎస్. జి. సిద్ధరామయ్య సంపాదకత్వం వహించారు. తెలుగు పాఠకులకి సుపరిచితులైన రంగనాథ రామచంద్ర రావు అనువదించారీ కథలన్నింటినీ. సమకాలీన అంశాలతో పాటు, పాత సమస్యల్ని కొత్త దృష్టితో చూసి యువత రాసిన కథలివి. కొన్ని సంభాషణలు, పదప్రయోగాలు, కొన్నిచోట్ల హాస్యమూ కొంత ముతకగా అనిపించినప్పటికీ కథల్లో చర్చకు పెట్టిన వస్తువు మొదలు, కథని చెప్పిన విధానం వరకూ ప్రతి కథలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉండడం ఈ సంకలనం ప్రత్యేకత. చదివి మర్చిపోయే వాటి కన్నా, గుర్తుంచుకోమని వెంటపడే కథలే ఎక్కువ.
హనుమంత హలగేరి రాసిన 'పాడు వల్లకాడు బతుకు' సంకలనంలో తొలి కథ. శీర్షిక సూచిస్తున్నట్టుగా ఇది ఒక కాటి కాపరి కథ. సంప్రదాయ పద్దతిలో జరిగే శవదహనాలకి ఎలక్ట్రిక్ క్రిమిటోరియం ఒక ప్రత్యామ్నాయంగా అవతరించిన దశలో, కొత్త విద్య నేర్చుకోలేని, చేతనైన పనితో బతుకు వెళ్లదీయలేని కాపరి కథ ఇది. సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలని కథలో భాగం చేశారు రచయిత. నగరానికి వలస వచ్చి తీరైన బతుకు తెరువు వెతుక్కునే క్రమంలో పెళ్లి వయసు దాటేసిన వ్యక్తి కథ '24 క్యారెట్'. శ్రీధర బనవాసి రాసిన ఈ కథ, అతడివైపు నుంచి మాత్రమే కాకుండా అతన్ని పెళ్లాడాలనుకునే డైవోర్సీ స్త్రీ వైపు నుంచి కూడా సాగుతుంది.
నిడివిలో పెద్ద కథలు 'రెండు మరియు ఒకటి' 'వేగంలోని అవేగం'. ఇంద్రకుమార్ హెచ్ జి రాసిన 'రెండు మరియు ఒకటి' కథ తప్పిపోయిన తమ భార్యని వెతికే ఇద్దరు మగవాళ్ల కథగా మొదలై (ఇద్దరికీ ఒకే భార్య) ఊహించని మలుపులతో సాగుతుంది. దావణగెరె నూలు మిల్లుల మూసివేత, అనంతర పరిస్థితులని కళ్ళకి కడుతుంది. నాయిక పాత్ర ప్రత్యేకమైనది ఈ కథలో. టీవీ న్యూస్ ఛానళ్ల కథగా అనిపించే 'వేగంలోని అవేగం' లో నగరజీవితంలో ఓ భాగమైన వేగం నిజానికి ఎంతవరకూ అవసరం అనే ప్రశ్నని లేవనెత్తుతారు రచయిత మౌనేశ బడిగెర. కార్పొరేట్ కంపెనీల్లో కనిపించే ద్వంద్వ నీతిని హెచ్చార్ డిపార్ట్మెంట్ వైపు నుంచి చెప్పిన కథ 'కామసూత్ర'. విక్రమ హత్వార రాసిన ఈ కథ ఆపకుండా చదివిస్తుంది.
మమతా.ఆర్ కథ 'ఖాళీ చేతులతో వచ్చిన చంద్రుడు' పేరుకి తగ్గట్టే కవితాత్మకంగా సాగుతుంది. సంతోష గుడ్డియంగడి రాసిన 'దీన దళితుడి హోటల్' కథ దళిత రాజకీయాల నేపథ్యంలో నడుస్తుంది. వ్యసన పరుడైన కొడుకుని దారిలో పెట్టుకోడానికి గ్రామ జాతరని ఆసరా చేసుకున్న తండ్రి కథ టి. ఎస్. గొరవర రాసిన 'దేవుడి ఆట'. పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన మరో కథ 'నాన్న తప్పెట'. జడేకుంటె మంజునాథ్ రాసిన ఈ కథలో చదువుకునే కొడుక్కి తప్పెట మీద ఆసక్తి ఉండడాన్ని భరించలేని తండ్రిని మాత్రమే కాదు, సమకాలీన గ్రామరాజకీయాలనీ చూస్తాం. 'బార్బర్ బబ్లూ - ఆరెంజ్ అమ్మాయిలు' కథ చదువుతున్నంతసేపూ 'ఈ రచయిత తెలిసిన వాడే' అనిపించింది. 'రాయల్ ఎన్ ఫీల్డ్' నవల రాసిన మంజునాథ్ వి ఎం రాసిన కథ ఇది.
నది ఉగ్రరూపాన్నీ, వరద బీభత్సాన్నీ చిత్రించిన కథ 'కృష్ణ ప్రవహించింది'. తిరుపతి భంగి రాసిన ఈ కథలో బీభత్స రసంతో పాటు గ్రామ రాజకీయాలూ కనిపిస్తాయి. నిబంధనల్ని అతిక్రమించే పరిశ్రమ కథ 'గ్రీన్ టీ'. ఫార్మాస్యూటికల్ కంపెనీ నేపథ్యంగా సాగే ఈ కథని ఆనంద కుంచనూరు రాశారు. గ్రామాల శిధిలావస్థని ప్రతీకాత్మకంగా చెప్పిన కథ 'శిధిలం'. చూడ్డానికి చాలా చిన్నవిగా అనిపించే సమస్యలు అనుభవంలోకి వచ్చినప్పుడు ఎంత భరింపరానివిగా మారతాయో విశదంగా చెప్పారు అలకా కట్టెమనె. 'తుఫాన్' కథని సంకలనంలో చివరిదిగా ఉంచడం యాదృచ్చికం కాదనిపించింది, చదవడం పూర్తి చేశాక. సుశీలా డోణూర రాసిన ఈ కథ గుర్తుండిపోయే కథల్లో ఒకటి. 'కన్నడ ఫ్లేవర్' చెడని విధంగా అనువాదం సాగింది. మొత్తం 164 పేజీల ఈ సంకలనం వెల రూ. 170. పుస్తకాల షాపులతో పాటు, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి