సోమవారం, డిసెంబర్ 05, 2022

పసిడిబొమ్మ

బ్లాగులతో రచనలు మొదలుపెట్టి కథారచయితలుగా మారిన వారి జాబితాలో చేరిన మరో పేరు చందు శైలజ. సరదా పోస్టులతో బ్లాగింగ్ ప్రారంభించిన ఈ గుంటూరు డాక్టర్ గారు ప్రేమకథల మీదుగా సాగి డాక్టర్ చెప్పిన కథలు చెబుతూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. లెక్క తీస్తే ఇప్పటివరకూ సుమారు యాభై కథలు రాసి ఉండొచ్చు. వాటిలోంచి పదకొండు కథలు ఎంచి 'పసిడిబొమ్మ' కథా సంకలనాన్ని వెలువరించారు. వ్యంగ్య వచనం మీద తనదైన ముద్ర వేసిన ఈ రచయిత్రి, సీరియస్ గా సాగే కథనంలో అక్కడక్కడా వ్యంగ్యాన్ని చేర్చి పఠితకి కథ తాలూకు సీరియస్ నెస్ నుంచి కొంత రిలీఫ్ ఇవ్వడాన్ని బాగా సాధన చేశారనిపించింది - ఈ కథల్ని పుస్తకరూపంలో చదవడం పూర్తి చేయగానే. 

నిజానికి బ్లాగు పాఠకులకి చందు శైలజని మాత్రమే కాదు, ఆమె కథల్నీ కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. పైగా, ఈ సంపుటిలో కథల తొలి ప్రచురణ ఆమె బ్లాగు తో సహా ఆన్లైన్ వేదికలమీదే. అయితే, పుస్తకరూపంలో వచ్చిన కథల్ని ఏకబిగిన చదివినప్పుడు (అవును, ఏకబిగినే) అనిపించిన నాలుగు విషయాలు పంచుకుందామనిపించింది. 'అమృతం' 'ఆమె నిర్ణయం' 'కళ్ళజోడు' స్త్రీవాద కథలైతే (బలమైన స్త్రీ, బలహీనమైన పురుష పాత్ర), 'దోషి', 'ఇద్దరు మనుషులు-ఒక జంట', 'వాన' కథల్లో బలమైన పురుష పాత్రలు మెరవడమే కాదు, రచయిత్రి మొగ్గు ఈ పురుష పాత్రలవైపు కనిపిస్తుంది. గత పదేళ్లలో రాయడం మొదలు పెట్టిన వాళ్లలో, ప్రత్యేకించి రచయిత్రులలో, ఈ బాలన్స్ అరుదు. 'అమృతం' కథలో శారదత్త, 'దోషి' కథలో నారాయణ, 'వాన' కథలో దేవ్ పాఠకుల్ని వెంటాడే పాత్రలు. 

ఒక పాత్ర గొప్పదనాన్ని ఎలివేట్ చేయడం కోసం మరో పాత్రని తక్కువ చేసి చూపడం, కథని కూడా ఈ మరో పాత్ర దృష్టి కోణం నుంచి చెప్పడం అన్నది ఈ పుస్తకం లోని కథల్లో కొంచం తరచుగా వాడిన టెక్నిక్. పుస్తకం పూర్తి చేసేసరికి ఈ టెక్నిక్ కొంచం ఎక్కువగా రిపీట్ అయిన భావన కలిగింది. ఇలాంటి సందర్భాల్లో కూడా రచయిత్రి వ్యంగ్యపు టోన్ కథల్ని నిలబెట్టేసింది. 'ఇద్దరు మనుషులు - ఒక జంట' ఇందుకు ఉదాహరణ. ఆసాంతమూ వ్యంగ్యంతో నడిపిన కథ 'పెళ్లి-పెటాకులు'. పెళ్లి ఎందుకు పెటాకులు అయిందో రచయిత్రి ఎక్కడా నేరుగా చెప్పకపోయినా, కథ సగానికి వచ్చేసరికే పాఠకులకి అర్ధమవుతుంది. అయితే, ఇది 'ఆమె' వైపు నుంచి చెప్పిన కథ అవడం వల్ల అతని తాలూకు లోపాలు మాత్రమే కనిపిస్తాయి. 

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కథల్లో మొదటిది 'దేవుడా, క్షమించు'. వరాలుని దేవుడు తప్పక క్షమిస్తాడు. ఎంతమాత్రం క్షమించనిది ఆమె చుట్టూ ఉన్న మనుషులు మాత్రమే. సమాజంలో సహానుభూతి (సానుభూతి కాదు, ఎంపతీ) పాళ్ళు పెరగాల్సిన అవసరాన్ని అన్యాపదేశంగా చెప్పే కథ ఇది. మామూలు ప్రేమకథగా మొదలై, ఊహించని మలుపు తిరిగి ఆర్ద్రంగా ముగుస్తుంది. నాయిక చుట్టూ తిరిగే రెండు కథలు 'పెనిమిటి', 'పసిడిబొమ్మ'. 'పెనిమిటి' కథలో నిశ్చలని పని చేతకాని పనమ్మాయిగా పరిచయం చేసి, ఆమె గురించి ఒక్కో వివరాలన్నీ చెబుతూ వెళ్లి, తాను చెప్పకుండా వదిలేసిన వివరాల్ని గురించి పాఠకులు కథ పూర్తయ్యేక కూడా ఆలోచించేలా చిత్రించారు. మామూలుగా చదివితే నోస్టాల్జియాలా అనిపించేసే 'పసిడిబొమ్మ' నిజానికి అంతకు మించిన కథ. 

మోనోలాగ్ లా అనిపించే 'సెల్వాన్ని పంపించేస్తా' కథ బాగా గుర్తుండి పోడానికి కారణం బలమైన పాత్ర చిత్రణ. సెల్వం తాలూకు శ్రీలంక తమిళ యాసని ప్రత్యేకంగా చిత్రించిన తీరు. కథకురాలిని కాస్త తక్కువ చేసినా, సెల్వానికి ఎలివేషన్ ఎక్కువైన భావన రాలేదు.  "శ్రద్ధగా వంట చేసి ప్రేమతో వడ్డించడం వంటిదే, కథ చెప్పడం కూడా. ఆహ్వానం నుండి, తాంబూల వాక్యం వరకూ, పాఠకుడి పట్ల ఆ శ్రద్ధ, గౌరవం చూపించగలగాలి" .. రచయిత్రి రాసుకున్న ముందుమాటలో ఈ వాక్యాలు, సాహిత్య సృష్టి చేసేవాళ్లంతా నిత్యం గుర్తుంచుకోవాల్సినవి. పాఠకుల పట్ల ఉన్న శ్రద్ధ, గౌరవం వల్లనే కావొచ్చు తన తొలి సంకలనంతోనే విందు భోజనాన్ని వడ్డించగలిగారు చందు శైలజ. ప్రతి కథ చివరా తొలి ప్రచురణ తేదీని ఇచ్చి ఉంటే తాంబూలంలో మరో వక్కపలుకు చేర్చినట్టయ్యేది. 

పాఠకులకి ఈ చేర్పు ఏ రకంగా ఉపకరిస్తుందో ఈ పుస్తకం నుంచే ఉదాహరణ చెప్పాలంటే, 'సెల్వాన్ని పంపించేస్తా' కథలో కథకురాలు సెల్వం పెళ్ళికి వెళ్లలేక పోడానికి కారణం కరోనా లాక్ డౌన్. ఈ విషయం కథలో ఎక్కడా ఉండదు. రచనా కాలాన్ని బట్టి అంచనాకి రాగలం. బ్లాగులో వచ్చిన వెంటనే చదివిన వాళ్ళు కాక, పుస్తకంలోనే తొలిసారి ఈ కథ చదివేవాళ్ళు కాస్త గందరగోళ పడే అవకాశం ఉంది. "ఇంకా లోనికి ప్రయాణించాలి, ఇంకా గాఢత ఉన్న రచనలు చెయ్యాలి" అన్న రచయిత్రి ఆకాంక్ష నెరవేరాలన్నదే పాఠకుడిగా నా ఆశంస. 'అనల్ప' ప్రచురించిన 130 పేజీల 'పసిడిబొమ్మ' పుస్తకం అందమైన గెటప్ తో, అచ్చుతప్పులు లేకుండా బొమ్మలాగే ఉంది. కథలన్నీ ప్రాణం ఉన్నవే. ('పసిడిబొమ్మ' వెల రూ. 150, అన్ని పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ దొరుకుతోంది). 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి