ఉగాది కన్నా ముందే ఎండలు మండిపోతున్నాయి. డీహైడ్రేషన్, వడదెబ్బ నుంచి ఎవరిని వారు రక్షించుకోవాల్సిన తరుణం వచ్చేసింది. కనబడ్డ ఓ జ్యూస్ షాపు లోకి అదాటున వెళ్లి, మెనూ చూడకముందే ఆర్డర్ ఇచ్చేసి, తాపీగా కూర్చుని మెనూ తిరగేస్తుండగా పక్క టేబుల్ నుంచి ఆర్డర్ వినిపించింది 'బటర్ ఫ్రూట్ జ్యూస్'. మెనూలో స్పెషల్ ఐటమ్స్ కేటగిరీలో కనిపించింది 'అవొకాడో' బొమ్మతో. ఆహా! ఏ దేశపు ఫలాన్నైనా ఆపళంగా తినేయడం ఒక్కటే కాదు, జ్యూస్ పిండుకుని తాగేయగలుగుతున్నాం కూడా కదా అని ఆశ్చర్యం కలిగింది. ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోవడం అంటే ఏమిటో మరోమారు అనుభవానికి వచ్చింది. నోరు తిరగని పేర్లున్న రకరకాల ఫలాలని, స్థలకాలాదులతో నిమిత్తం లేకుండా ఆరగించగలగడాన్ని ఒకప్పుడు ఎవరూ ఊహించలేదు.
ఇప్పుడిప్పుడు పెద్ద పెద్ద మాల్స్ లో మాత్రమే కాదు, వీధి చివర సూపర్ బజార్ల లోనూ ఇప్పుడు అవొకాడోలూ, ఫిగ్సూ, కివీ పళ్ళూ ఇంకా అనేకానేక విదేశవాళీ ఫలాలూ ప్రత్యేక ప్యాకింగుల్లో నోరూరిస్తున్నాయి.ధరవరల గురించి మాట్లాడ్డం ఓల్డ్ ఫ్యాషన్ కాబట్టి ఆ జోలికి వెళ్లొద్దు కానీ, ఇలా చప్పన్నారు దేశాలకీ పళ్ళని ఎగుమతి చేయడం వల్ల ఆయా రైతులు ఏమాత్రం ఆర్జిస్తున్నారు? మన రైతులు వాళ్ళ పంటల్ని ఇలాగే ఎగుమతి చేయగలుగుతున్నారా? ఆయా విదేశీ పంటల్ని మన దగ్గర పండించేందుకు చేసే ప్రయత్నాల వల్ల లాభనష్టాలేంటి? లాంటి ప్రశ్నలతో బుర్ర మరికొంచం వేడెక్కింది. షాపులో రద్దీ చూస్తే ఆర్డర్ నా నోటిదగ్గరకి రాడానికి బాగానే సమయం పడుతుందని అర్ధమై, ప్రశ్నల మీదే దృష్టి పెట్టాను.
Google Image |
'వెన్న ఫలం' గా తెనిగించ గలిగే అవొకాడో జన్మస్థలం మెక్సికో. అల్లప్పడు డోనాల్డ్ ట్రంపు సరిహద్దు గోడ కట్టేస్తానని బెదిరించిన అమెరికా పొరుగు దేశం. ఈ అవొకాడోలు తొలుత అమెరికాకీ, అక్కడినుంచి గ్లోబులో ఉన్న చాలా దేశాలకీ మొదట పరిచయమై, అటు పైని వదల్లేని అలవాటయ్యాక మెక్సికో రైతులకి అక్షరాలా పంట పండింది. మిగిలిన అన్నిదేశాల్లోలాగే అక్కడా మధ్య దళారులు బాగా డబ్బు చేసుకున్నా, వెన్న పళ్ళు పండించిన రైతులు కూడా చెప్పుకోదగ్గ లాభాలనే ఆర్జిస్తున్నారు. మెక్సికోలో ఉన్న నీళ్లన్నీ అవొకాడోలు పండించదానికే చాలడంలేదంటూ మీడియా కోడై కూయడం మొదలుపెట్టింది. మనకి 'ఈనాడు' 'సాక్షి' ఉన్నట్టే అన్ని స్థాయిల్లోనూ పరస్పర విరుద్ధ పత్రికలు ఉంటాయి కదా. ఆ రెండో వర్గమేమో చికెనూ, మటనూ కోసం కోళ్ళనీ, మేకల్నీ పెంచడానికయ్యే నీళ్ల ఖర్చు కన్నా, అవొకాడోలు పండించడానికి వ్యయమయ్యే నీళ్లు బహుతక్కువనే లెక్కలతో వచ్చింది.
అన్నట్టామధ్య మన మీడియా 'డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సీమలో సిరుల పంట' అంటూ హోరెత్తింది గుర్తుందా? సదరు డ్రాగన్ ఫ్రూట్ కూడా విదేశీ ఫలమే. స్పష్టంగా చెప్పాలంటే అమెరికన్ మూలాలున్న పండు. దిగుమతుల ఖర్చు తగ్గించుకోడానికీ, వీలయితే ఎగుమతులు చేసి డాలర్లు ఆర్జించడానికీ ప్రభుత్వం వారు రైతుల్ని డ్రాగన్ ఫ్రూట్ సాగుకి విపరీతంగా ప్రోత్సహిస్తున్నారని చెప్పింది మన మీడియా. 'అరకు లో యాపిల్ సాగు' అంటూ ఇంకో రకం వార్తలు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి చదివినప్పుడు నాకేమనిపిస్తుందంటే మన నేలలో విదేశీ పంటలు పండించడం వల్ల, మనవైన పంటలు పండించుకునే చోటుని నష్టపోతున్నాం కదా అని. దీనికి జవాబు బ్రెయిన్ డ్రైన్ అనబడే మేధోవలసలకు జవాబంత పెద్దదని కూడా తెలుసు కాబట్టి, ఎవరితోనూ చర్చ పెట్టలేదు.
జిహ్వకో రుచి ఉండడంలో ఆశ్చర్యం లేదు కానీ, అన్ని జిహ్వలకీ అమెరికా/విదేశీ పళ్లే ఎందుకు రుచి అవుతున్నాయి అన్నది ఆశ్చర్య పరిచే విషయం. మనవైన తాటి ముంజలు, రేగు, ఈత, నేరేడు పళ్ళ లాంటివి ఇంతే విస్తృతంగా మార్కెట్లో ఎందుకు కనిపించడం లేదన్నది బొత్తిగా అర్ధంకాని విషయం. ఈ విదేశీ పళ్ళన్నీ అందమైన పేకింగుల్లో, సూపర్ అద్దాల పెట్టెల వెనుక నుంచి షోగ్గా రారమ్మని పిలుస్తుంటే, మనవైన పళ్ళు మాత్రం ఇంకా సైకిలు వెనుక బుట్టలకీ, చెట్టు కింది గోనె పట్టాలకీ మాత్రమే పరిమితమై పోవడం బొత్తిగా అర్ధం కాని విషయం. పోనీ, విదేశాల్లో ఏవన్నా ఇవి మహారాణీ భోగం అనుభవిస్తున్నాయా అంటే అదీ లేదు. మావిడి మినహా మిగతా ఏ పళ్ళకీ ఆ భాగ్యం దక్కినట్టు లేదు. మనం మాత్రం మనవైన పళ్ళని బలిపెట్టి మరీ విదేశీ ఫలాలని నెత్తిన పెట్టుకుంటున్నాం అని గుర్తొచ్చి చివుక్కుమనిపించింది. మెనూని మరింత జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టాను, మళ్ళీసారి వచ్చినప్పుడు అప్పటికి కొత్తగా వచ్చిచేరిన జ్యూసులని పసిగట్టడంకోసం...
కొత్త ఒక వింత పాతది రోత.
రిప్లయితొలగించండిచాలా విషయాల్లో నిజమండీ.. ధన్యవాదాలు
తొలగించండిమామిడి కాయలు, జామకాయలు,ద్రాక్ష అందమైన ప్యాకింగ్ లో విదేశాలకు వెళుతున్నాయి.విదేశాల్లో ఉన్న ఇండియన్లు కొంటున్నారు కానీ మనం విదేశీ పండ్లను ఇష్టపడినట్లు విదేశీయులు మన పండ్లను ఇష్టపడటం లేదు. మనవాళ్ళు మార్కెటింగ్ చేయడంలో వెనకపడి పోయారు.
రిప్లయితొలగించండిమార్కెటింగ్ ఒకటేనా అన్నది ఒక సందేహం అయితే, దేశీయంగా కూడా జరగాల్సినంత వ్యాపారం జరుగుతోందా అన్నది మరో సందేహమండీ.. ధన్యవాదాలు..
తొలగించండిమేక్ డొనాల్డ్సూ, కె ఎఫ్ సి ల్లాగే ఇదీనూ .. పైగా ఇలా దిగుబడి చేసుకున్న వాటిని ప్రీమియంతో అంటగట్టడం చాలా వీజీ కదా.
రిప్లయితొలగించండికరోనా పుణ్యమాని ఇక్కడ కూడాను వీటి సప్లయి-చైను దెబ్బతిని ధరలు కొండెక్కాయి.కొన్ని రెస్టారెంట్లలో సర్వ్ చేయడం ఆపేసారు కూడా.ఇప్పుడు ఓకే అనుకుంటా .
"పండు పండు పండు" అనేసరికి మరో పాటేమో అనుకున్నా :)
దిగుమతి చేసుకుని ప్రీమియం తో అంటగట్టడం ఒకటైతే, స్థానికంగా పండించి గ్లోబల్ రేటుకి అమ్మడం ఇంకో కిటుకులా కనిపిస్తోందండి.. పాట కాదులెండి, భువనచంద్ర పాటల సిరీస్ ఏదీ లేదుగా :) ..ధన్యవాదాలు..
తొలగించండిపొరుగు దేశం పుల్ల పండు యమరుచిగా ఉంటుంది మరి !! :-) మనదికానిదాన్ని నెత్తినపెట్టుకోవటం అనేది మన DNA లోనే ఉంది కదండి... :P
రిప్లయితొలగించండి'పుల్లకూర' ని 'పుల్ల పండు' చేశారా, భలే!! నిజమండీ, ఇప్పుడు పళ్ళ వంతు.. ధన్యవాదాలు..
తొలగించండిచివరి పేరా - సరిగ్గా చెప్పారు.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ...
తొలగించండి