ఇండస్ మార్టిన్ రాసిన పన్నెండు కథలు, రెండు కవితల సంపుటి 'పాదిరిగారి అబ్బాయి, మరికొన్ని కథలు'. ఎనిమిది కథలు పాదిరిగారి అబ్బాయివి, నాలుగు కథలు వేర్వేరు అంశాలని ఇతివృత్తాలుగా తీసుకుని రాసినవీను. బ్రిటిష్ పాలనతో పాటుగా భారతదేశంలో ప్రవేశించిన మతం క్రైస్తవం. పాఠశాలలు, ఆస్పత్రుల నిర్మాణాలతో మొదలు పెట్టి, అనేక విధాలుగా ఇతర మతాల వారిని తమ మతంలోకి ఆకర్షిస్తూ, నేటికి ప్రతి ఊళ్ళో రెండు మూడు చర్చీలుగా వికసించింది. క్రైస్తవం పుచ్చుకున్న వారి జీవితాలని గురించి అడపాదడపా తెలుగు సాహిత్యంలో ప్రస్తావనలు వచ్చినా, చర్చీల్లో 'ఫాదర్' (పాదరీ)గా పనిచేసిన వాళ్ళని గురించి వివరాలు ఎక్కడా రికార్డు కాలేదనే చెప్పాలి. ఆ లోటుని పూడ్చే కథలివి. క్రైస్తవంలోకి మారిన కుటుంబంలో పుట్టి, బైబిల్ని అభ్యసించి, చర్చి ఫాదర్ గా జీవించిన రెవ. మోజెస్ గంగోలు ఈ కథల్లో పాదిరి గారు. కథకుడు ఇండస్ మార్టిన్, వారి అబ్బాయి.
భోజనం చేసే ముందు, విస్తట్లోకి అన్నాన్ని అందించిన పరమాత్మకి కృతజ్ఞత చెప్పడం దాదాపు అన్నిమతాల్లోనూ కనిపిస్తుంది, ఒక్కో మతంలోనూ ఒక్కో పధ్ధతిలో. క్రైస్తవులు ప్రార్ధన చేస్తారని తెలుసు కానీ, ఆ ప్రార్ధన ఎలా ఉంటుంది? మరీ ముఖ్యంగా పాదరీ గారింట్లో ప్రార్ధన ఎలా ఉంటుందో చెబుతుంది సంపుటిలో తొలి కథ 'ప్రార్ధన'. ఇండస్ కథన శైలి హాస్యం, వ్యంగ్యాల కలగలుపు అని తొలి కథ చదువుతుండగానే అర్ధమవుతుంది. పిల్లలకి చాదస్తంగా అనిపించే అమ్మ చేసే సుదీర్ఘ ప్రార్ధనతో మొదలుపెట్టి (అది కూడా వేడివేడి అన్నం, ఘుమాయించే కూర గిన్నెలు ముందు కుటుంబం మొత్తాన్ని కూర్చోబెట్టి), అంత గొప్ప పాదరి గారికి ఓ రిక్షా అబ్బి చేతిలో జరిగిన అవమానం గురించి చెప్పడంతో ముగుస్తుంది. 'ఓ మామూలు రిక్షా అతను పాదరీ గారిని అంతమాట అనే సాహసం చేస్తాడా?' అనే ప్రశ్న ఉదయిస్తుంది పాఠకుల్లో.
జీవహింస గురించి పెద్ద పెద్ద లెక్చర్లిచ్చే మిత్రుడే, ఒకానొక సందర్భంలో ఓ హత్య చేయడానికి కథకుడికి సుపారీ ఆశ చూపడం 'కనికరం' కథాంశం. "నాలో ఒక కిరాయి రౌడీని ఎట్టా చూశాడా?" అన్న కథకుడి ప్రశ్న ఆలోచనలో పడేస్తుంది. అదే సమయంలో, బ్రాడీపేట నాలుగు బై తొమ్మిదిలో గట్టిగా ఎనిమిది సెంట్ల స్థలంలో కట్టిన పుచ్చిపోయిన చెక్క తలుపు ఇంట్లో ఉండే గుడి పూజారి కొడుకు పిల్లలమఱ్ఱి ప్రసాదు - కారంచేడు నరమేధం జరిగిన 1985లో - ఏకంగా యాభైవేల రూపాయలు సుపారీగా ఇవ్వచూపడాన్ని జస్టిఫై చేసి ఉంటే బాగుండేది. కారంచేడు నరమేధానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన ఏసీ కాలేజీ విద్యార్థుల్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్న వైనాన్ని చెప్పే కథ 'నాజీరు'. "మండల్ కమీషనప్పుడు ఆసావుల పిల్లలు పలగగొట్టిన బొసులూ, రైళ్ళూ, గవుర్నమెంటు ఆపీసులూ గుర్తుకొస్తాయి. ఆళ్ళను ఎవుడూ ఏవీ ఎందుకనలేదో తెలీలేదు" అన్నారు కానీ ఇది సత్యదూరం. నాకు తెలిసిన ఇద్దరు (ఒకరు బ్రాహ్మణ, మరొకరు వైశ్య) యాంటీ-మండల్ కేసుల కారణంగానే కెరీర్ కోల్పోయారు. తెలియని వాళ్ళు ఇంకా ఎందరో.
నపుంసకుడైన నాంచారయ్య ప్రభువు ఆదరణకి పాత్రుడవుతాడా? అనే ప్రశ్నకి జవాబు 'పరలోకరాజ్జం' కథ చెబుతుంది. బైబిలుని అరకొరగా చదివి తీర్పులు చెప్పడం తప్పనీ, పూర్తిగా చదివి అర్ధం చేసుకోవాలనే సందేశం ఇచ్చే కథ ఇది. ఈ సందేశం అన్ని మత గ్రంధాలనికీ వర్తిస్తుంది నిజానికి. సరదాగా సాగుతూనే గుర్తుండిపోయే కథ 'మంత్రగత్తె'. 'పాదరిగారి అబ్బాయి' అనే హోదాని మోయడం వెనుక బరువుని చెబుతుంది. విజ్ఞాన వేదికల వారు సైతం వివరంగా మాట్లాడ్డానికి మొహమాట పడే స్వస్థత కూటములు, ప్రార్ధనలని గురించి ఉన్నదున్నట్టుగా చెప్పిన కథ 'జరుగుబాటు'. ఈ ప్రార్ధనల కారణంగా క్రైస్తవులు కొత్త క్రైస్తవం వైపు ఆకర్షితులు కావడం, పాత పాదరీల జరుగుబాటు ప్రశ్నార్ధకం కావడాన్ని చర్చిస్తుందీ కథ. క్రైస్తవ యువజనుల జీవితాన్ని నిశితంగా చిత్రించిన పెద్ద కథ 'తెర చినిగెను'. "అప్పటివరకూ సోదరుల్లా కలిసి ఉన్న మాల-మాదిగల మధ్య రిజర్వేషన్ ఉద్యమం చిచ్చు పెట్టింది" అని వి. చంద్రశేఖరరావు రాశారు కానీ, ఆ రెండు వర్గాల మధ్య విభేదాలు మధ్యలో వచ్చినవి కావనీ, తొలినుంచీ ఉన్నవేననీ చెప్పే కథ ఇది.
మాండలీకంలో రాస్తే బూతులు ఉండాల్సిందే అనే అలిఖిత నియమం ఒకటి ఇటీవలి సాహిత్యంలో కనిపిస్తోంది. ఈ సంకలనమూ ఇందుకు మినహాయింపు కాదు. పాదిరిగారి అబ్బాయిగా రాసిన ఎనిమిది కథల్లోనూ బూతు జోలికి వెళ్లని ఇండస్ మార్టిన్, తర్వాతి నాలుగు కథల్లోనూ ఆ దినుసుని విస్తారంగా వాడేశారు. మాలపల్లిలో పుట్టిన బట్టలకుక్క కథ 'గత్యంతరం' ప్రతీకాత్మకంగా రాసిన కథ. పులస చేపల మీద సెటైర్ వేసేందుకు చేసిన ప్రయత్నం 'పులసోపాఖ్యానం'. రాజు గారింట్లో పుట్టి పెరిగే కోడిపుంజు కథ 'మగత' ని కోడిపందేల మీద సెటైర్ అనుకుంటూ చదవడం మొదలుపెట్టాను కానీ, కోడి తొక్కిన చల్ల మిరపకాయల్ని - కథలోకి అదాటున ప్రవేశించిన - ఓ బ్రాహ్మలావిడ పెంటమీద పారబోయడం దగ్గరికి వచ్చాకా ఓ సారి వెనక్కి వెళ్లి మళ్ళీ మొదటి నుంచీ ప్రతీకల్ని గమనిస్తూ చదివాను. ఆత్మగౌరవాన్ని గురించి చెప్పే కథ 'కరేపాకు'. అప్పటి వరకూ జరిగిన ట్యూనింగ్ వల్లకాబోలు, రాఘవ శర్మ అనే పాత్ర కనిపించగానే విలన్ అనేసుకున్నాను కానీ, కాదు.
మొత్తం 162 పేజీల పుస్తకంలో 48వ పేజీ నుంచి కథలు మొదలవుతాయి. కథల పూర్వరంగం చెప్పడంతో పాటు, కథల్ని పరామర్శిస్తూ విపులమైన ముందుమాటలు రాశారు సత్యరంజన్ కోడూరు, ఏకే ప్రభాకర్. రచయిత కూడా ఆంధ్రలో క్రైస్తవం విస్తరణ మొదలు, ఫాదరీల కుటుంబాలు వాళ్ళ జీవన విధానం లాంటి అనేక విషయాలతో 'ఇంత పర్యంతం' పేరుతో 27 పేజీల ముందుమాట రాశారు. క్రైస్తవ సాహిత్యానికి, తెలుగు సాహిత్య చరిత్రలో చోటు దక్కలేదన్న రచయిత, తన కథలు జరిగిన కాలానికి, అదే ప్రాంతానికి, నేపధ్యానికి చెందిన కళాకారుడు చీమకుర్తి నాగేశ్వరరావుని గురించి ఈ కథల్లో ఎక్కడా కనీస ప్రస్తావన కూడా చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. తెలుగు సమాజంలో ఓ భాగంగానే ఉంటూ, తమదైన జీవన విధానాన్ని అవలంబించిన చర్చి ఫాదర్ల జీవితాలని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. (పర్స్ పెక్టివ్స్ ప్రచురణ, వెల రూ. 160, పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు).
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి