పేరు చూడగానే రామాయణం గుర్తొస్తుంది, అప్రయత్నంగా. అయితే ఇది కావ్యమో, నవలో కాదు, కథల సంపుటి. అవి కూడా కన్నడ నుంచి తెలుగులోకి అనువదింపబడిన కథలు. కొని చదివేంత ప్రత్యేకత ఏమిటీ అంటే, ఈ సంకనానికి మూలమైన 'క్రౌంచ పక్షిగళు' కి 2018 సంవత్సరానికి గాను ఉత్తమ కథా సంకలనంగా కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి లభించింది. ఒక్కొక్కటీ ఆరు నుంచి పన్నెండు పేజీల నిడివి ఉన్న పది కథల సమాహారం. మూల కథల్ని రాసింది దక్షిణ కన్నడ ప్రముఖ రచయిత్రులలో ఒకరైన వైదేహి కాగా, తెనిగించింది ఇప్పటికే 'మాస్తి చిన్న కథలు' లాంటి ప్రముఖ కన్నడ పుస్తకాలని అలవోకగా అనువదించిన జి.ఎస్. మోహన్. అనువదింపజేసి, ప్రచురించింది కేంద్ర సాహిత్య అకాడెమీ.
పాత్రల పేర్లు, అక్కడక్కడా వినిపించే నుడికారాలు, కనిపించే భోజన పదార్ధాలు కన్నడ సీమకి చెందినవి కాబట్టి వీటిని కన్నడ కథలు అనుకోవాలి కానీ, నిజానికీ పది కథల్లోని వస్తువులూ సార్వజనీనాలు. ఏ ప్రాంతంలోనైనా జరగడానికి అవకాశం ఉన్నవి. ఒకట్రెండు మినహా మిగిలిన కథలు ఏ కాలంలో అయినా జరగగలిగేవి కూడా. మొదటి కథ 'దాడి' నే తీసుకుంటే బస్సులున్న ప్రతి చోటా జరుగుతుంది. బస్టాపులో ఆగేప్పటికే బస్సు రద్దీగా ఉంది. నిలబడే ఓపిక లేని ఆమె మరో బస్సు కోసం చూద్దామనుకుంది. కండక్టరు చొరవగా మాట కలిపి సీటిస్తాను బస్సెక్కమన్నాడు. తీరా ఆమె టిక్కెట్టు కొన్నాక ఆ మాటే మర్చిపోయాడు (మర్చిపోయినట్టు నటించాడు). ఆమె గుర్తు చేసింది. అతని మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులు ప్రేక్షకులుగా జరిగిన రసవత్తర నాటకమే ఈ కథ. 'ఇది కేవలం బస్సు ప్రయాణాన్ని గురించిన కథ మాత్రమేనా?' అన్న ప్రశ్న వస్తుంది, కథ ముగింపులో.
నలుగురు బంధువులు కూడే ప్రతిచోటా జరిగేందుకు అవకాశం ఉన్న కథ 'నటి'. ఎవ్వరినైనా చులాగ్గా అనుకరించగలగడం రత్నకి ఉన్న ప్రత్యేకత. బంధు సమూహాల్లో అక్కడ లేని వారిని అనుకరించి ఉన్న వారిని ఆనందింపజేస్తూ ఉంటుంది. ఒకవేళ ప్రదర్శన జరుగుతూ ఉండగా సదరు పాత్ర ఏ రిక్షానో దిగితే, రత్న పోషించే పాత్ర హఠాత్తుగా మారిపోతుంది. మేకప్పు, కాస్ట్యూమ్సు లాంటి హంగులేవీ అవసరం లేదు రత్నకి. కేవలం తన హావభావాలతో ఆయా పాత్రలకి మూలమైన వ్యక్తులని జ్ఞాపకం చేసేస్తుంది. ఆబాలగోపాలన్నీ ఏకకాలంలో అలరిస్తుంది. వేషాలన్నీ తీసేసిన తర్వాత, కేవలం రత్నగా మాత్రమే మిగిలిన తర్వాత ఆమె ఏమిటి అన్నది హృద్యమైన ముగింపు. రత్న మనల్ని వెంటాడుతుంది.
మూడో కథ 'సబిత' లో కథానాయికకి డబ్బున్న పొరుగువాళ్ళంటే విపరీతమైన ఆసక్తి. ముఖ్యంగా, ఆ ఇంట్లో 'ఆమె' అంటే. ఆమెని గమనించడం సబిత జీవితంలో ఓ ముఖ్యమైన భాగం. ఆమె గుణదోషాలన్నీ సబితకి కొట్టిన పిండి. ఆమె భర్త పట్ల విపరీతమైన సానుభూతి కూడా. 'ఆమె' కథకి ముగింపునిచ్చిన రచయిత్రి, సబిత కథకి ముగింపుని మాత్రం పాఠకులకు వదిలేశారు. 'మాటరాని క్షణం' కథ మృత్యువు ఇతివృత్తంగా సాగుతుంది. ఓ వృద్ధురాలు మరణించింది. ఆమె భర్తని పలకరించేందుకు ఓ పండు ముదుసలి వ్యక్తి కారు దిగాడు. ఆయన ఎంత వృద్ధుడంటే కనీసం మాట్లాడేందుకు నోరు తెరవలేనంత. "పాతకాలపు మంచం, యజమానురాలు చనిపోయిందని బాధ పడుతూ తినడం మానేసిన శునకం లాగ - మౌనంగా ఉంది" లాంటి వర్ణనలు ఈ కథని ప్రత్యేకంగా నిలుపుతాయి.
ఎన్నో ఏళ్లుగా ఆ ఇంటికి రోడ్డు లేదు. అందువల్ల ఇంటి ఆడపిల్లలకి పెళ్లి సంబంధాలు తప్పిపోయినా కూడా ఎవరూ స్పందించలేదు. రోడ్డు లేకపోవడం అంగీకారం అయిన వాళ్ళే సంబంధాలు కలుపుకున్నారు. ఉన్నట్టుండి ఎన్లో ఏళ్ళ తర్వాత యువతరం నడుం బిగించి రోడ్డు నిర్మించింది. ఆ ఇంటి వాళ్ళ జీవితాల్లో ఒక్కసారిగా వచ్చిన పడిన మార్పుని చిత్రించిన కథే 'ఇంటిదాకా ఉన్నదారి'. ఈ కథలో రోడ్డుని ఓ ప్రతీకగా ఉపయోగించుకున్నారనిపిస్తుంది. తానెంతో ధైర్యస్తురాలిని అనుకున్న ఓ అమ్మాయికి ఆ ధైర్యం విలోలంబైన సందర్భం చాలా యాదృచ్చికంగా ఎదురు కావడం 'ప్రశ్న' కథలో కనిపిస్తే, పజిల్ లా అనిపించే శుభాంటీని మర్చిపోనివ్వని కథ 'ప్రహేళిక'.
'దేవుడి గది' అనే ఏర్పాటు సొంతింట్లో అయితే సరే, కానీ అద్దెకిచ్చే వాటాలో అవసరమా? దైవభక్తి గల ఓ జంట, మరీ ఖర్చు పెట్టకుండానే చిన్న ఏర్పాటు చేసింది వాళ్ళ పై వాటాలో. అద్దెకొచ్చిన ఒక్కో కుటుంబమూ ఆ ఏర్పాటుని ఒక్కో విధంగా వాడుకుంది. ఆ వైనమంతా చదవొచ్చు 'ఎవరికి తోచినట్టు వారికి' కథలో. అందరికీ బాగా తెలిసినట్టు అనిపించే రాజత్త జీవితంలో ఎవరికీ తెలియని విషయాలుంటాయని చెప్పే కథ 'తెరవని పుటలు'. పుస్తకంలో చివరి కథ 'క్రౌంచ పక్షులు' రామాయణంతో పాటు దేశ విభజననీ గుర్తుచేస్తుంది. అంతకు మించి, ఎప్పటికీ గుర్తుండిపోయే కొందరు మనుషుల్ని, కొన్ని సంఘటనల్నీ పరిచయం చేస్తుంది. మొత్తం 108 పేజీల ఈ పుస్తకం వెల రూ. 120. హైదరాబాద్ నవోదయ ద్వారా (ఆన్లైన్ లో కూడా) లభిస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి