సోమవారం, ఆగస్టు 23, 2021

నా మాటే తుపాకి తూటా

ప్రపంచ పోరాటాల చరిత్రలోనే ఓ ప్రత్యేక స్థానం ఉన్న తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టుకుని పాల్గొని, అటుపైన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన కమ్యూనిస్టు పార్టీ నేత మల్లు స్వరాజ్యం ఆత్మకథ 'నా మాటే తుపాకి తూటా'. హైదరాబాద్ బుక్  ట్రస్ట్ ప్రచురించిన ఈ పుస్తకం స్వరాజ్యం స్వీయ రచన కాదు. బుక్ ట్రస్ట్ తరపున రచయిత్రులు విమల, కాత్యాయని స్వరాజ్యాన్ని ఇంటర్యూ చేసి, ఆమె చెప్పిన వివరాలన్నింటినీ ఓ క్రమ పద్ధతిలో గ్రంధస్తం చేసి రూపు దిద్దిన పుస్తకం. ఇంటర్యూ చేసే నాటికి స్వరాజ్యం వయసు ఎనభై ఆరేళ్ళు. తన చిన్నప్పటి కబుర్ల మొదలు, రహస్య జీవితపు రోజుల విశేషాల వరకూ ఆవిడ జ్ఞాపకం చేసుకుని వివరంగా చెప్పిన తీరు అబ్బురమనిపిస్తుంది. ఉద్యమం-సంసారం అనే రెండింటినీ ఆవిడ సమన్వయం చేసుకున్న తీరునీ వివరంగా చిత్రించారీ పుస్తకంలో. 

నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో ఓ భూస్వామ్య కుటుంబంలో జన్మించారు స్వరాజ్యం. పుట్టిన సంవత్సరం 1930 లేదా 31. నాటి భూస్వాముల కుటుంబాల్లో ఆడపిల్లలకి ఆత్మరక్షణ పద్ధతుల మొదలు, ఎస్టేట్ నిర్వహణకు అవసరమైన శిక్షణ వరకూ చిన్ననాడే అందించే వారట.  దొరల మధ్య ఉండే స్పర్ధ  ఇందుకు కారణం అంటారామె. పుట్టింది భూస్వామ్య కుటుంబంలోనే అయినా ఇంట్లో వామపక్ష రాజకీయ వాతావరణం ఉండడం, ముఖ్యంగా తన అన్న భీమిరెడ్డి నరసింహా రెడ్డి ప్రభావంతో ఉద్యమంలో అడుగుపెట్టానంటారు స్వరాజ్యం. పదకొండేళ్ల వయసులో ఉద్యమంలో అడుగుపెట్టిన ఆమె, ఎన్నడూ వెనుతిరిగి చూడలేదు. వివాహానంతరం, పిల్లల పెంపకం నిమిత్తం ప్రజా జీవితానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఉక్కిరిబిక్కిరయ్యారు కూడా. 

మొత్తం పుస్తకంలో అత్యంత ఆసక్తికరంగా అనిపించే అధ్యాయాలు నిజాం కి వ్యతిరేకంగా జరిపిన పోరాటాలని వివరించేవి. స్వరాజ్యం స్వయంగా తుపాకీ పట్టి గెరిల్లా పోరాటంలో పాల్గొనడమే కాకుండా ఒక దళానికి నాయకత్వం వహించారు కూడా. గిరిజనుల నమ్మకాన్ని సంపాదించుకోడం మొదలు, పోలీసుల రాకని ఆనవాలు పట్టి ఎదురు దాడులు చేయడం, పోలీసులు చుట్టుముట్టినప్పుడు నేర్పుగా తప్పించుకోడం లాంటి సన్నివేశాలు ఊపిరి బిగపట్టి చదివిస్తాయి. అటు నిజాం, ఇటు స్థానిక దొరలూ కూడా అత్యంత బలవంతులు కావడంతో పోరాటం ఢీ అంటే ఢీ అన్నట్టుగా సాగింది. ఆయుధాలు సమకూర్చుకోడం మొదలు, రహస్యంగా డెన్ లు ఏర్పాటు చేసుకోడం, ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేస్తూ పోరాటాన్ని సాగించడం.. ఈ వివరాలన్నీ అత్యంత ఆసక్తికరంగా చెప్పారు స్వరాజ్యం. 



పోరాట విరమణ (1951) అనంతర కాలం స్వరాజ్యం లాంటి గెరిల్లా దళ సభ్యులకి నిజంగా గడ్డు కాలమే. దాదాపు పదేళ్ల పాటు అడవుల్లో తిరుగుతూ ఒక లక్ష్యం కోసం పని చేసిన వాళ్ళకి ఉన్నట్టుండి చేయడానికి ఏపనీ లేకుండా పోవడం అన్నది ఊహకి అందని సమస్య. అయితే స్వరాజ్యానికి కాల్పులు మాత్రమే కాదు, జన రంజకంగా ఉపన్యాసాలు చేయడమూ తెలుసు. పార్టీ సభల్లో ఉపన్యాసాలు ఇస్తూ తనని తాను యాక్టివ్ గా ఉంచుకున్నప్పటికీ, పూర్తి స్థాయిలో పనిచేయలేక పోతున్నానన్న బాధ ఆమెని వేధించింది. ఇదే విషయాన్ని పార్టీ నాయకుడు చండ్ర రాజేశ్వర రావు దృష్టికి అనేకమార్లు తీసుకెళ్లారు కూడా. ఉద్యమ సహచరుడు వీఎన్ (మల్లు వెంకట నరసింహా రెడ్డి) ని వివాహం చేసుకున్నాక కొన్నేళ్ల పాటు పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోవాల్సి వచ్చింది. ఆ రోజులు మరింత దుర్భరం అంటారు స్వరాజ్యం. 

కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలాక సీపీఎం వైపు నిలబడ్డ స్వరాజ్యం, పార్టీ కార్యకలాపాల ద్వారా ప్రజల్లోకి వచ్చారు. మహిళా సమస్యలతో పాటు, రైతు సమస్యలని భుజాన వేసుకున్నారు. ఓ పక్క ముగ్గురు పిల్లల పెంపకం బాధ్యతలు చూస్తూనే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు, ఈమె వేషధారణ చూసి అక్కడి కావలి వారు ఎమ్మెల్యే అంటే నమ్మకం కలగక, లోపలికి అనుమతించలేదట! అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల సీపీఎం పూర్తి వ్యతిరేక వైఖరి తీసుకోడంతో, ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పటికీ ఉద్యమాలు, పోరాటాలు కొనసాగాయి. ఈ విశేషాలతో పాటు సమాంతరంగా, తన పుట్టిల్లు, మెట్టింటి విశేషాలు, ఆస్తుల పంపిణీ తాలూకు గొడవలు, పిల్లల పెంపకం, వాళ్ళ చదువులు ఇత్యాది విషయాలనే సమాంతరంగా చెప్పుకుంటూ వచ్చారు. 

ఈ పుస్తకాన్ని స్వరాజ్యం స్వయంగా రాయలేదన్న లోపం చాలాచోట్ల కనిపిస్తుంది. వివరంగా రాయాల్సిన విషయాలని చెప్పీ చెప్పనట్టు చెప్పడం, కొన్ని విషయాలని పూర్తిగా దాటవేయడం గమనించినప్పుడు ఆమే స్వయంగా రాసి ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. దాటవేత - ప్రశ్న సరిగా లేకపోవడం వల్లనా, ఆమె  మరిచిపోవడం వల్లనా, లేక ఉద్దేశపూర్వకమా అన్న ప్రశ్న రెండుమూడు చోట వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటం పూర్వాపరాలని గురించి అవగాహనా లేని వారికి, 'మలిమాట' పేరుతో ఫెమినిస్టు చరిత్రకారిణి ఉమా చక్రవర్తి రాసిన పద్దెనిమిది పేజీల వ్యాసం అవసరమైన సమాచారాన్ని ఇస్తుంది. ఆత్మకథలో అవసరమైన చోట్ల వ్యక్తులు, సంఘటనలకు సంబంధించిన ఫుట్ నోట్స్ ఇచ్చి ఉంటే పాఠకులకి మరింత ఉపయుక్తంగా ఉండి ఉండేది. హెచ్ బీటీ ప్రచురించిన ఈ 138 పేజీల పుస్తకం వెల రూ. 120. చదువుతుంటే కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ 'నిర్జన వారధి' గుర్తురాక మానదు. 

2 కామెంట్‌లు: