ఆన్లైన్ ప్రపంచంలోకి నేను అడుగుపెట్టి దాదాపు పదమూడేళ్ళు. తొలినాళ్లనుంచీ నాకు తెలిసిన పేర్లలో ఒకటి కత్తి మహేశ్. ఆన్లైన్ ని ఆధారంగా చేసుకుని అటుపైన ఎత్తులకి ఎదిగిన అతికొద్ది మందిలో తనూ ఒకరు. మహేశ్ ఇక లేరన్న వార్త తెలియగానే అతని తాలూకు జ్ఞాపకాలన్నీ మనసు లోపలి పొరలనుంచి ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. నాకు తెలిసిన మొదటి ఆన్లైన్ వేదిక 'నవతరంగం' అనే వెబ్ పత్రిక. అక్కడ సినిమా సమీక్షకుడు, విమర్శకుడు పాత్రల్లో మహేశ్ కనిపించారు. అక్కడి నుంచి నా రెండో అడుగు బ్లాగ్ ప్రపంచం. అక్కడ బ్లాగరుగానూ, వ్యాఖ్యాత గానూ మహేశ్ ప్రత్యక్షం. అటు 'నవతరంగం' లోనైనా, ఇటు 'పర్ణశాల' బ్లాగులోనైనా తను రాసిన పోస్టుల కన్నా చేసిన కామెంట్లే చాలా ఎక్కువ. అవి కూడా ఎక్కువగా వివాదాలకి దారితీసే వ్యాఖ్యలే.
మహేశ్ ధోరణి చూస్తున్నప్పుడల్లా ఓ రచయిత్రి తరచుగా గుర్తొచ్చే వారు. తొలినాళ్లలో సాధారణ రచనలే చేసిన ఆమె, వివాదాల ద్వారా ఎక్కువ పేరు సంపాదించుకోవచ్చునని తెలుసుకున్న తర్వాత తన ప్రతి రచనలోనూ ఓ వివాదం ఉండేలా చూసుకోవడం అలవాటు చేసుకున్నారు. పేరొచ్చిన ప్రతి వ్యక్తినీ, రచననీ తనదైన ధోరణిలో విమర్శించడం ద్వారా తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చేసుకోగలిగారు. అటుపైన 'మనోభావాల' వైపు దృష్టి సారించారు. పథకం ఫలించింది. ఆ రచనల కారణంగా మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళ తాలూకు ప్రతిస్పందనలతో ఆమెకి మరింత పేరొచ్చేసింది. ఇంచుమించుగా మహేశ్ కూడా ఇదే స్ట్రాటజీని అమలుచేశారు. ఆయన లక్ష్యం పాపులర్ కావడమే అయి ఉంటే, చాలా తక్కువ కాలంలోనే దానిని సాధించేశారు.
బ్లాగుల్లోనూ, అంతకన్నా ఎక్కువగా బజ్జులోనూ పేరు తెచ్చుకున్నారు మహేశ్. ఎక్కడ వివాదం ఉన్నా అక్కడ తను ఉండడం, తానున్న ప్రతి చోటా వివాదం ఉండడం ఆన్లైన్ వేదికని పంచుకున్న అందరికీ త్వరలోనే అలవాటైపోయింది. వాదనా పటిమ ద్వారా కన్నా, ఎక్కడ ఏ కార్డు వాడాలో బాగా తెలియడం మహేశ్ కి బాగా కలిసొచ్చిన విషయం. అవతలి వాళ్ళని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసేలా చేయడం, వాటి ఆధారంగా వివాదాన్ని మరింత పెంచడం, కొండొకచో వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టడం నిత్యకృత్యంగా ఉండేది. ఎందుకొచ్చిన గొడవ అని కొందరూ, అతని స్ట్రాటజీని అర్ధం చేసుకుని, మనమెందుకు సహకరించాలి?అనే ధోరణిలో మరికొందరు వాదనలకు దిగడం మానేశారు. సరిగ్గా అప్పుడే బ్లాగులు, బజ్జుని మించిన వేదిక దొరికింది మహేశ్ కి. ఫేస్బుక్ మాధ్యమం ద్వారా కొత్త వాదనలు, కొంగొత్త ప్రతివాదులు.
పాపులారిటీని సంపాదించుకోడమే కాదు, దాన్ని ఛానలైజ్ చేసుకోవడంలోనూ తానే ముందుండి ఒరవడి పెట్టారు మహేశ్. 'క్రౌడ్ ఫండింగ్' ద్వారా సినిమా నిర్మాణం మొదలు పెట్టారు. తానే దర్శకుడు. సినిమా ఆడకపోయినా ఆ రంగంలో ఫుట్ హోల్డ్ దొరికింది. కార్యసాధకులకి అది చాలు. అంతలోనే టీవీ ఛానళ్లలో విమర్శకుడిగా మరో కొత్త అవతారం. సినిమా రంగంలో నిలదొక్కుకోడానికీ తనకి అచ్చొచ్చిన వివాదాలనే నమ్ముకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన సినిమా నటుడు పవన్ కళ్యాణ్ మీద కత్తి కట్టారు. ఫలితంగా, పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కత్తి మహేశ్ చిరపరిచితం అయిపోయారు. నటుడిగా అవకాశాలు రావడం మొదలైంది. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ కూడా పేరు జనంలో నానుతూ ఉండడం అన్నది ముఖ్యం - మంచిగానా, చెడ్డగానా అన్నది తర్వాత.
నిజానికి మహేశ్ తర్వాతి అడుగు రాజకీయాలవైపే అనిపించింది. కులం, మతం లాంటి కార్డులని వ్యూహాత్మకంగా వాడడం, నిత్యం వివాదాల్లో ఉండేలా జాగ్రత్త పడడం చూసినప్పుడు త్వరలోనే ఇతన్ని ఏదో ఒక రాజకీయ పార్టీలో చూడబోతున్నాం అనుకున్నాను. రోడ్డు ప్రమాదం జరగకపోయి ఉంటే ఆ దిశగా అడుగులు పడి ఉండేవేమో. అతని వైద్య ఖర్చుల నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పదిహేడు లక్షల రూపాయల్ని ఆఘమేఘాల మీద కేటాయించడం చూసినప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి కాగానే ఇక రాజకీయాలే అనుకున్నాను. ("కత్తి మహేశ్ కోసం ప్రభుత్వం పదహారు ప్రాణాల్ని పణంగా పెట్టింది" అన్నారు మిత్రులొకరు - సహాయనిధి నుంచి సామాన్యులకి విడుదలయ్యే మొత్తం సగటున ఒక్కొక్కరికి లక్ష రూపాయలు).
చాలా ఏళ్ళ క్రితం సంగతి - బ్లాగు మిత్రులొకరు కథ రాయడానికి ప్రయత్నిస్తూ డ్రాఫ్ట్ మెయిల్ చేశారు. కథ బాగుంది కానీ, కులాల ప్రస్తావన ఉంది. "కులాల గురించి తీసేస్తే కథలో ఫ్లేవర్ ఉండదు. ఉంచితే కత్తి మహేశ్ గారు కత్తి తీసుకుని వస్తారేమో అని అనుమానంగా ఉంది" అన్నది వారి సందేహం. ఆన్లైన్ వేదిక మీద కత్తి మహేశ్ చూపించిన ప్రభావానికి ఇదో చిన్న ఉదాహరణ. తనకేం కావాలో, కావాల్సిన దానిని ఎలా సాధించుకోవాలో చాలా స్పష్టంగా తెలిసిన మనిషి మహేశ్. తన బలాలు, బలహీనతల మీద కూడా మొదటినుంచీ స్పష్టమైన అవగాహన ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ పదమూడేళ్లలో అతను సాధించింది తక్కువేమీ కాదు. తన అడుగులు మాత్రమే కాదు, మరణం కూడా 'సెన్సేషనల్' వార్తే ఇవాళ. జీవించి ఉంటే మరింత సాధించే వారేమో కూడా. ఎందుకంటే తనకి మార్గం కన్నా, లక్ష్యం ముఖ్యం.
(ఆత్మల మీద మహేశ్ కి నమ్మకం లేదు, తన కుటుంబానికీ, మిత్రులకీ సానుభూతి).