ఓ సినిమాలో వేసిన ఓ పాత్ర ప్రేక్షకులకి బాగా దగ్గరైతే, ఆ నటి/నటుడు కొన్నాళ్ల/కొన్నేళ్ల పాటు అదే తరహా పాత్రలు వేయాల్సి ఉంటుంది. కొత్తదనం కోసం ప్రయత్నిస్తే ప్రేక్షకులు తిరస్కరిస్తారేమో అనే భయం ఆయా నటీనటులతో పాటు, నిర్మాత, దర్శకుల్లోనూ పేరుకుపోయి ఉంటుంది. మన తెలుగు సినిమా పరిశ్రమ దీనికి పెట్టిన ముద్దుపేరు 'ఇమేజ్.' ఒక్కసారి ఓ ఇమేజ్ వచ్చిందీ అంటే, అందులోనుంచి బయట పడడం మాటల్లో అయ్యే పని కాదు. (అలాగని అదే ఇమేజ్ ని సుదీర్ఘకాలం పాటు చెక్కు చెదరకుండా నిలబెట్టుకోడమూ కుదిరే పని కాదు, అది వేరే కథ). ఇమేజ్ నుంచి బయట పడడానికి నటులకి టాలెంట్ తో పాటు తెగువ కూడా అవసరం. ధైర్యం చేసే దర్శక నిర్మాతలూ కలిసి రావాలి. ఇలా అన్నీ కలిసొచ్చినప్పుడు జయప్రకాష్ రెడ్డి లాంటి నటులు ఇమేజిని బద్దలుకొట్టగలిగిన కొందరిలో ఒకరవుతారు.
సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'ప్రేమించుకుందాం రా' సినిమాలో ప్రధాన ఆకర్షణ ఇద్దరు. కథానాయిక కావేరిగా కనిపించిన ఉత్తరాది నాయిక అంజలా జవేరి, విలన్ గా మెప్పించిన జయప్రకాశ్ రెడ్డి. అప్పటికే చిన్న చిన్న పాత్రల్లో తెరమీద కనిపించినా, ఆ సినిమాతోనే 'ఎవరీ జయప్రకాశ్ రెడ్డి?' అన్న ప్రశ్న వచ్చింది, సినిమా పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ కూడా. భయం గొలిపే భారీ విగ్రహం, అప్పటికి తెలుగు తెరకి అంతగా పరిచయం లేని రాయలసీమ యాసలో సంభాషణలు, చూపుల్లో క్రౌర్యం, చేతల్లో రాజసం.. ఓ మంచి విలన్ దొరికేశాడు తెలుగు సినిమాకి. అది మొదలు రాయలసీమ విలనీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు కొన్నేళ్ల పాటు. 'సమరసింహా రెడ్డి' సినిమాలో పోషించిన విలన్ పాత్రతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది 'రాయలసీమ వాసులంటే విలన్లేనా?' అని ఆ ప్రాంత ప్రజల మనోభావాలు గాయపడే వరకూ వెళ్ళింది, ఈ విలనీ పరంపర.
ఒక టైంలో జయప్రకాశ్ రెడ్డి అవుట్ డోర్ షూట్ లో ఉంటే, షూటింగ్ చూడ్డానికి చేరే జనం ఆయన్ని పలకరించడానికి భయపడే వాళ్ళట! అంతటి నిలువెత్తు విలనూ హాస్య పాత్రల్ని అవలీలగా పోషించి కడుపుబ్బా నవ్వించడం ఒక విచిత్రం. ముందుగానే చెప్పుకున్నట్టుగా, ఒక ఇమేజిని సంపాదించుకోడమే కాదు, దానిని తనకి తానే బ్రేక్ చేసుకున్నారు జయప్రకాశ్. తరువాత కొన్ని సెంటిమెంట్ పాత్రల్నీ పండించారు. అలాగని విలనీని విడిచిపెట్టలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే తనకి వచ్చిన ప్రతి పాత్రకీ న్యాయం చేశారు. ప్రేక్షకుల చేత ఔననిపించుకున్నారు. నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన జయప్రకాశ్ రెడ్డికి నాటకాల మీద మక్కువ తగ్గలేదు. సినిమాల నుంచి కొంత ఆటవిడుపు దొరికాక 'అలెగ్జాండర్' అనే నాటిక (ఏకాంకిక అనొచ్చేమో, ఎందుకంటే, స్టేజి మీద కనిపించేది ఆయనొక్కడే. మధ్యమధ్యలో కొన్ని గొంతులు (రికార్డెడ్ ఆడియో) వినిపిస్తూ ఉంటాయి) అనేక చోట్ల ప్రదర్శించారు. అయన సినిమా ఇమేజీ, ఆ నాటిక విజయానికి దోహదపడింది.
Google Image |
'అలెగ్జాండర్' ప్రదర్శన సందర్భంలోనే నాటకాల మీద మక్కువ తగ్గని కొందరం ఆయన్ని కలిసి కాసేపు గడిపాం. అసలే సినిమా వాడు, ఆ పైన గంభీర విగ్రహం కావడంతో మాలో కొందరు పలకరించడానికి కూడా జంకారు. కానీ, జయప్రకాశ్ చాలా మృదు స్వభావి, నిజమైన కళాకారుడూను. మేము సహజంగానే సినిమా విషయాలు, మరీ ముఖ్యంగా విలన్ నుంచి కేరక్టర్ ఆర్టిస్టుగా మారడాన్ని గురించి అడిగాం. జవాబు గా చెప్పినవి రెండు విషయాలు. మొదటిది, నటుడన్న వాడు అన్నిరకాల పాత్రలూ చేయాలి (ఇది అందరూ చెప్పేదే). రెండోది, కేవలం విలన్ పాత్రలు మాత్రమే చేస్తాను అని కూర్చుంటే అలాంటి సినిమాలు ఎన్ని వస్తాయి? వాటిలో మనదాకా వచ్చే పాత్రలు ఎన్ని? ప్రేక్షకులకి విసుగొస్తే తర్వాత పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నలు, వాటికి జవాబులూను. 'బురిడీ' అనే సినిమాలో ఆసాంతమూ ఓ టర్కీ టవల్లో కనిపిస్తారాయన. ఆ సినిమాని గుర్తు చేస్తే పగలబడి నవ్వారు. "ఏం జెప్పమంటారూ? సత్తిబాబు (దర్శకుడు ఈవీవీ) టేక్ అవుతుంటేనే పగలబడి నవ్వేసేవాడు" అని చాలా విశేషాలు గుర్తు చేసుకున్నారు.
టిక్కెట్టు నాటకాలని ప్రమోట్ చేయడం అన్న కాన్సెప్ట్ గురించి అడిగాం. మీరు సినిమా వాళ్ళు కదా, మీరు టికెట్ పెడితే జనానికి నాటకానికి టికెట్ కొనడం అలవాటు అవుతుందేమో కదా అని. తను ఎందుకు టిక్కెట్ పెట్టడం లేదు అనే విషయాన్ని గురించి చాలాసేపు చెప్పారు. ముఖ్యంగా చెప్పింది ఎక్కువమంది తన నాటకం చూసేలా చేయడం కోసం అని. తాను కోరుకున్నట్టుగానే ఆ నాటక ప్రదర్శన చాలా విజయవంతం అయ్యింది. కొన్నాళ్ళకి సినిమాల్లో మళ్ళీ బిజీ అయిపోయారు కూడా. ఒక్క మాండలీకాన్ని పలికే తీరే కాదు, చిన్న చిన్న విరుపులు ద్వారా డైలాగుల్ని మెరిపించడం జయప్రకాష్ రెడ్డి ప్రత్యేకత. విసుగు, చికాకు లాంటి రొటీన్ ఎక్స్ప్రెషన్ లలో కూడా బోలెడంత వైవిధ్యం చూపించడాన్ని గమనించొచ్చు. గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పడం మొదలు, అస్సలు డైలాగే లేని పెద్ద పాత్రలో మెప్పించడం వరకూ వెండితెర మీద జయప్రకాశ్ రెడ్డి చేసిన ప్రయోగాలు అనేకం.
దిగుమతి విలన్లకి దీటుగా మెప్పించినా, హాస్యాన్ని, సెంటిమెంట్ ని రసభంగం కాకుండా పండించినా ఆయనతో ప్రత్యేకమైన తరహా. ఆ నటుడు మరింక తెరమీద కనిపించబోడు అనుకుంటే కష్టంగా ఉంది. జయప్రకాశ్ రెడ్డి ఆత్మకి శాంతి కలగాలి.
"జయప్రకాశ్ రెడ్డి లాటి విలక్షణమైన నటుడిని, అతను పోషించి రక్తి కట్టించిన పాత్రలను సంస్మరించుకుని. ఆతని పవిత్రాత్మ కు సద్గతులు చేకూరాలని ఆశిద్దాం.."
రిప్లయితొలగించండి"మాటాడొద్దు.. బావోజి అంటే ఎవరు.. ఈ చంబల్ ఏరియా కే కింగు లాటి వాడు. అతని కొడుకుని మీ డిపార్ట్మెంట్ వాడు తిసుకుపోతా ఉంటే ఏమి పీకుతున్నారయ్య.. మాటాడవేఁ.." అంటు విక్రమార్కుడులో వైవిధ్యభరితమైన విలని కమ్ క్యారెక్టర్ కమ్ కామికల్ పాత్రని గుర్తు చేసుకుంటు.
~శ్రీత ధరణి
నిజమండీ.. ధన్యవాదాలు
తొలగించండి