శనివారం, మే 30, 2020

ఏడాది పాలన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో కనీసం నాలుగైదు సందర్భాల్లో జగన్ నిర్ణయాలని గురించి రాద్దామనుకునే, ఏడాది పూర్తయ్యే వరకూ ఏమీ మాట్లాడకూడదని నేను పెట్టుకున్న నియమం గుర్తొచ్చి ఆగిపోయాను. ఏడాది ఆగడం ఎందుకంటే, జగన్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కాదు. ముఖ్యమంత్రిగా కాదు కదా, మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం లేదు. ఇప్పుడు మాట్లాడడం ఎందుకంటే, ఆయన వెనుక ఏడాది కాలపు పాలనానుభవం ఉంది. మరే ఇతర నాయకుడికైనా ఐదేళ్ల కాలంలో ఎదురయ్యే అనుభవాలన్నీ జగన్ కి తొలి సంవత్సరంలోనే అనుభవానికి వచ్చేశాయి. 

శెభాష్ అనిపించే నిర్ణయాలతో పాటు, అయ్యో అనిపించే నిర్ణయాలనీ తీసుకుని అమలు పరిచారు గత  పన్నెండు నెలల్లోనూ.  అనేక ఇబ్బందులనీ ఎదుర్కొన్నారు. చెయ్యదల్చుకున్న పనులన్నీ వరుసగా చేసేయాలనే తొందర  కొన్ని వివాదాస్పద  నిర్ణయాలకి తావివ్వగా, మరికొన్ని నిర్ణయాలు కేవలం రాజకీయ కారణాల వల్లే వివాదాస్పదం అయ్యాయి.  వ్యక్తిగతంగా నన్ను కలవర పెట్టిన నిర్ణయాలు రెండు. మొదటిది పరిశ్రమల్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనేది. వినడానికి ఇది చాలా బాగుంది. కానీ ఆచరణలో కష్టనష్టాలు అనేకం. చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే, వెనక్కి వచ్చేసే అందరికీ రాష్ట్రం ఉపాధి చూపించగలదా? 

రెండో నిర్ణయం, ఏదో ఒక పేరుతో చేస్తున్న ఉచిత పంపిణీలు. నిజానికి ఈ ఉచితాలు మొదలై చాలా ఏళ్ళే గడిచినా, ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక సందర్భంలో అమలు చేసిందే అయినా, ప్రస్తుత ప్రభుత్వం వీటిని పరాకాష్టకి తీసుకెళ్లినట్టు అనిపిస్తోంది. విద్య, వైద్యం ఈ రెండు సేవలనీ అర్హులకి ఉచితంగా అందించడం అవసరం. వ్యవసాయం చేసుకునే రైతులు సమయానికి రుణాలని, పంటలకు గిట్టుబాటు ధరల్నీ ఆశిస్తున్నారు తప్ప అంతకు మించి కోరుకోవడం లేదు. ప్రతివర్గానికీ ఏదో ఒక పేరిట నిరంతరంగా డబ్బు పంపిణీ అన్నది సుదీర్ఘ కాలంలో ఒక్క ఆర్ధిక వ్యవస్థకి మాత్రమే కాక అన్ని వ్యవస్థలకీ చేటు చేస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇదో పులి స్వారీలా తయారయ్యే ప్రమాదం ఉంది. ఉచితాల మీద కన్నా ఉపాధికల్పన మీద దృష్టి పెట్టడం శ్రేయస్కరం. 

Google Image

వినగానే నచ్చిన నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం. ఈ నిర్ణయం వల్ల పేదల జీవితాల్లో  రాత్రికి రాత్రే వెలుగొచ్ఛేస్తుందన్న భ్రమలేవీ లేవు కానీ, దీర్ఘ కాలంలో ప్రయోజనాన్ని ఇచ్చే నిర్ణయం అవుతుంది అనిపించింది. అయితే ఈ నిర్ణయం అమలులో చాలా సాధకబాదకాలున్నాయి. తెలుగుని ఒక తప్పనిసరి సబ్జెక్టుగా ప్రవేశపెట్టే మాటుంటే,  దానిని కేవలం ప్రభుత్వ విద్యాసంస్థలకి మాత్రమే పరిమితం చేయకుండా ప్రయివేటు సంస్థల్లోనూ కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. బాగా పనిచేస్తున్న మరో వ్యవస్థ గ్రామ వాలంటీర్లు. మా ఊరు, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి నాకున్న సమాచారం ప్రకారం ఈ వ్యవస్థ బాగా పనిచేస్తోంది. ముఖ్యంగా కరోనా కాలంలో వాలంటీర్లు చాలా బాధ్యతగా పనిచేశారు. నిరుద్యోగ సమస్యని కొంతవరకూ పరిష్కరించడం ఈ వ్యవస్థలో మరో పార్శ్వం. 

"మొండివాడు రాజుకన్నా బలవంతుడు అంటారు, ఇప్పుడు మొండివాడే రాజయ్యాడు," ఏడాది క్రితం ఒక మిత్రుడన్న మాట ఇది. జగన్ మొండితనాన్ని తెలియజెప్పే దృష్టాంతాలు గత కొన్నేళ్లుగా అనేకం జరిగాయి. కాంగ్రెస్ ని వ్యతిరేకించడం మొదలు, తెలుగు దేశం పార్టీని ఢీ కొనడం వరకూ అనేక సందర్భాల్లో, "మరొకరైతే ఈపని చేయలేకపోయేవారు" అనిపించింది. ఒక ఓటమితో ప్రయాణాన్ని ఆపేసిన/మార్గాన్ని మార్చుకున్న నాయకులతో పోల్చినప్పుడు జగన్ ని ముందుకు నడిపించింది ఆ మొండితనమే అని చెప్పక తప్పదు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి వారసత్వంగా జగన్ కి  అంది ఉంటే కథ  వేరేగా ఉండేది. ప్రస్తుతానుభవాలని బట్టి చూస్తే, అప్పట్లో ఆ పదవిని నిలబెట్టుకోవడం ఆయనకి బహుశా కష్టమై ఉండేది. 

ప్రజలు  అఖండమైన మెజార్టీ ఇచ్చి ఉండొచ్చు కానీ, బలమైన ప్రతిపక్షం అనేక రూపాల్లో చుట్టుముట్టి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రతి నిర్ణయాన్నీ ఆచితూచి తీసుకోవడం అవసరం. ప్రతి ప్రకటన వెనుకా ఒక సమగ్ర సమీక్ష ఉండాల్సిందే. సమస్యలు ఏయే రూపాల్లో ఉండొచ్చు అన్న విషయంలో ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఆ వైపుగానూ ఆలోచనలు సాగాలి. మూడు రాజధానులు, మండలి రద్దు వంటి నిర్ణయాల అమలులో కనిపించిన తొందరపాటు విమర్శలకి తావిచ్చింది. (వీటిలో మండలి రద్దు నాకు బాగా నచ్చిన నిర్ణయం). అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటిలోనూ అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. అలాగే, సంక్షేమం అంటే కేవలం ఉచిత పంపిణీలు మాత్రమే అనే ధోరణి నుంచి  బయటికి వచ్చి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏడాది కాలపు అనుభవాల నుంచి జగన్ ఏం నేర్చుకున్నారన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. 

మంగళవారం, మే 12, 2020

నలుపెరుపు

కథనం మీద శ్రద్ధ చూపించే రచయిత ఏ ఇతివృత్తాన్ని తీసుకుని కథ రాసినా చివరి వరకూ ఆపకుండా చదువుతారు పాఠకులు. పర్యావరణవేత్త, కవి, నవలా రచయితా కూడా అయిన కథకుడు తల్లావఝుల పతంజలి శాస్త్రికి పాఠకులని అక్షరాల వెంబడి పరిగెత్తించడం ఎలాగో బాగా తెలుసు. అలాగే, ఎక్కడ వాళ్ళని ఆపి  ఆలోచించుకోనివ్వాలో కూడా తెలుసు. ఆయన ఏం రాసినా అందులో చదివించే గుణం పుష్కలంగా ఉంటుందన్నది నిర్వివాదం. పన్నెండు కథలతో ఆయన వెలువరించిన కథా సంపుటి 'నలుపెరుపు.'  పాఠకుల వయసు, పఠనానుభవంతో సంబంధం లేకుండా వాళ్ళని వేలుపట్టి అదాటున కథలోకి తీసుకెళ్ళిపోయి, కథా స్థలంలో పాత్రల మధ్యన కూర్చోపెట్టి జరుగుతున్న కథకి వాళ్ళని సాక్షీభూతుల్ని చేయడం ఎలాగో ఆయనకి బాగా తెలుసు. 

సంకలనంలో మొదటి కథ 'జై' స్వాతంత్రోద్యమ కాలంనాటిది. సీతానగరం పక్కనున్న ఓ పల్లెటూళ్ళో మలేరియా వల్ల జనం ప్రాణాలు పోతుంటే, వాళ్ళని చూసి, పరిసరాల పరిశుభ్రత గురించి వివరించి చెప్పడానికి మహాత్మాగాంధీ ఆ ఊరిలో పర్యటించడమే కథ. ఆ ఊరి బడిలో మేష్టారు నరసింహమూర్తికి తప్ప మిగిలిన ఎవరికీ గాంధీ ఎవరో తెలీదు. ఆయన ఎందుకు గొప్పవాడో అంతకన్నా తెలీదు. "అంటే ఆయనగారికి బోయినాలూ గట్టా ... ఆరు బేమర్లా అండీ? కోణ్ణీ గట్టా కొయ్యమంటే తప్పదనుకోండి. అంటే తెలవక అడుగుతున్నానండి, ఆయ."  గాంధీజీ వస్తున్న వార్త తెలిసి చాలా హడావిడి చేసిన నరసింహ మూర్తి మేష్టారు ఊరిని ఉన్నంతలో  శుభ్రం చేయించడం మొదలు, పిల్లలకి 'గాంధీజీకి జై' నినాదాన్ని, స్త్రీలకి 'రఘుపతి రాఘవ రాజారామ్' పాటని నేర్పించడం వరకూ అనేక పనులు మీద వేసుకుని ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. గాంధీ పర్యటన ప్రహసనంగా ముగిసిన వైనాన్ని చిత్రిస్తుందీ కథ. 

తనకిష్టమైన పర్యావరణం ఇతివృత్తంగా రాసిన కథలు మూడు. వీటిలో 'కాసులోడు' ప్రత్యేక ఆర్ధిక మండళ్ల కోసం చేసే భూసేకరణ గురించి చెబితే, 'జోగిపంతులు తిరిగి రాలేదు' కథలో ఉత్పత్తి పెంచే వ్యవసాయ విధానాల పట్ల నిరసన కనిపిస్తుంది. 'కాసులోడు' సగం చదివేసారికే ముగింపు గురించి ఓ అంచనా వచ్చినా, కథని ఆ ముగింపుకి ఎలా తీసుకెళ్తారన్న కుతూహలం ఆపకుండా చదివిస్తుంది. 'జోగిపంతులు..' కథలో ఎన్ని విషయాలు చర్చించారంటే..లెక్క పెట్టే ప్రయత్నం చేసినప్పుడల్లా ఇంకో కొత్త కోణం కనిపిస్తూ ఉంటుంది. కాస్త మేజిక్ రియలిజం ఛాయలు కనిపిస్తాయి ఈ కథలో. ఇక 'ఈ చెట్టు తప్ప' కథ ఒక యాభై-అరవై ఏళ్లలో ఓ చిన్న పట్టణం పెద్ద నగరంగా మారిన క్రమాన్ని మాత్రమే కాక, అక్కడ కనుమరుగైపోయింది పచ్చదనాన్ని గురించి ఉపన్యాస ధోరణిలో కాక కథనంలో నేర్పుగా చెప్పడం వల్ల, ఆగి ఆలోచింపజేస్తుంది పాఠకుల్ని. 


సాఫ్ట్వేర్ జీవితాలు ఇతివృత్తంగా రాసిన కథలు రెండు. 'ఆర్వీ చారి కరెంటు బిల్లు,' 'అయాం సారీ మూర్తి గారూ.' ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో, చాలా పెద్ద పొజిషన్లో ఉన్న ఆర్వీ చారికి కరెంటు బిల్లు ఎంత వస్తోందో చూసుకునే తీరిక ఉండదు. గత నాలుగు నెలలుగా అతనికి ఎక్కువ బిల్లు వస్తోంది. అతను కట్టిన అదనపు బిల్లు మొత్తం అపార్ట్మెంట్ వాచ్మన్ అలీ (కౌంటర్ కి వెళ్లి ఈ బిల్లులు కట్టేది ఇతనే)  మూడు నెలల జీతానికి సమానం. అలీ చెప్పిన ఈ సంగతి సూదిలా గుచ్చుకుంటుంది చారిని. అతనేమీ పుట్టు ధనవంతుడు కాదు. తండ్రి సుబ్బాచారి పల్లెటూళ్ళో బంగారప్పని చేసేవాడు. పెరట్లో పండించిన ఆకుకూరల్తోనే పొదుపుగా వంట కానిచ్చేసేది తల్లి. ఆర్వీ చారి వైభవాన్ని వాళ్లిద్దరూ కూడా చూడకుండానే లోకం విడిచి వెళ్లిపోయారు. అలీ గుచ్చిన సూది, ఆర్వీ చారి ఆలోచనల్లో ఎలాంటి మార్పు తెచ్చిందో చెబుతుందీ కథ. 'అయామ్ సారీ... ' ఐస్క్రీం పార్లర్లో జరిగిన ఓ సాఫ్ట్వేర్ జంట పెళ్లిచూపుల కథ. 

రాజకీయాలని ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథలు 'సింవ్వాసెలం గోరి గేదె' 'కపి జాతకం 1' కపి జాతకం 2.' వీటిలో 'సింవ్వాసెలం గోరి గేదె' ' కథలో సమస్య నేను దగ్గరనుంచి చూసినా కావడం వల్ల కొంచం ఎక్కువగా కనెక్ట్ అయ్యాను. ఇలాంటి 'గేదె' బాధితులు మా ఊళ్లోనూ ఉన్నారు. కానీ, ఈ కథకి రచయిత ఇచ్చిన ముగింపుని మాత్రం అస్సలు ఊహించలేం. బౌద్ధ జాతక కథలని, వర్తమాన రాజకీయాలతో ముడిపెట్టి కథలు చెప్పడం పతంజలి శాస్త్రి మొదలు పెట్టిన ప్రయోగం. బహుశా, ఈ సిరీస్లో వచ్చిన తొలి రెండు కథలూ 'కపి జాతకం' అయి ఉండొచ్చు. నిజానికి ఈ తరహా కథలు రాసి 'రాజకీయ పంచతంత్ర కథలు' తరహాలో ఓసంపుటిగా ప్రచురిస్తే బాగుండుననిపించింది చదువుతున్నంతసేపూ. పేరుకి తగ్గట్టే కోతుల బెడద, వాటికి 'రాజకీయ' పరిష్కారాలూ, ఆ క్రమంలో తెరవెనుక జరిగే రాజకీయాలూ.. వీటన్నింటినీ వ్యంగ్యంగా చెప్పారీ కథల్లో. 

వేటికవే ప్రత్యేకం అనిపించే మూడు కథలు 'నలుపెరుపు' 'నెమలికన్ను' 'గారడీ.' పుస్తకానికి మకుటంగా ఉంచిన 'నలుపెరుపు' ని ఓ పనిమనిషి-యజమానురాలి మధ్య జరిగే కథ అనడం కన్నా, పనిమనిషి సోలిలోక్వీ అనడం సబబు. ఇద్దరి జీవితాల మధ్య ఉన్న కాంట్రాస్ట్ ని చిన్న చిన్న సన్నివేశాల్లోనూ, మాటల్లోనూ చిత్రించారు రచయిత. అల్లరి అనేది బాల్యంలో ఒక భాగం కావడం ఎంత ముఖ్యమో 'నెమలికన్ను' చెబితే, జీవితంతో రాజీ పడిన ఖాదర్ సాహెబు తీసుకున్న ఓ నిర్ణయాన్ని చెప్పే కథ 'గారడీ.' ముందుగానే చెప్పినట్టు ఆపకుండా చదివించే గుణం పుష్కలంగా ఉన్న కథలివి. 'వడ్ల చిలకలు' లాంటి కథా సంపుటాలు, 'దేవర కోటేశు,' 'గేదెమీద పిట్ట' లాంటి నవలికలూ ప్రచురించిన పతంజలి శాస్త్రి మరిన్ని రచనలు చేయాల్సిన అవసరం ఉంది. ('నలుపెరుపు,' చినుకు ప్రచురణలు (అచ్చుతప్పులు అక్కడక్కడా కొంచం ఎక్కువ ఇబ్బంది పెట్టాయి), పేజీలు 104, వెల రూ. 120). 

శనివారం, మే 09, 2020

అనగనగా ఒక రాకుమారుడు

"తెలుగు సినిమా పరిశ్రమకి ఎన్టీఆర్, ఏఎన్నార్లిద్దరూ రెండు కళ్ళు" ఏళ్ళ తరబడి అనేకమంది నోటివెంట వింటూ వచ్చిన ఈ డైలాగుని విన్న ప్రతిసారీ "మరి కాంతారావు?" అన్న ప్రశ్న వచ్చేది. నటనలో వాళ్ళిద్దరికీ సమస్థాయిలోనే ఉన్నా స్వయంకృతాపరాధాలతో సహా అనేక కారణాలకి కాంతారావు తెలుగు సినీ నటరాజుకి మూడోకన్ను కాలేకపోయారని తెలుస్తుంది ఆయన ఆత్మకథ 'అనగనగా ఒక రాకుమారుడు' చదివినప్పుడు. తను మరణించడానికి రెండేళ్లు ముందు 2007 లో కాంతారావు ప్రచురించిన ఈ స్వీయగాధ చదువుతూ ఉంటే ఈ రాకుమారుడు పుట్టుకతోనే శాపగ్రస్తుడు అనిపించక మానదు. 

నిజాం రాజ్యంలో కోదాడకు సమీపంలో ఉన్న గుడిబండలో 1923, నవంబరు 16న జన్మించిన కాంతారావు చిన్ననాటినుంచీ కష్టాలు అనుభవిస్తూ పెరిగారు. పుట్టింది జమిందారీ కుటుంబంలోనే అయినా, అయన పుట్టుకకి కొన్ని నెలల ముందే తండ్రి మరణించడం, ఆ వెంటనే దాయాదులందరూ ఆస్తి కోసం కోర్టుకి వెళ్లడంతో పదిహేడో ఏడు వచ్చే వరకూ న్యాయ పోరాటాలతోనే సరిపోయింది. కోర్టు కేసు గెలిచినా, మేనత్త మాయమాటలు నమ్మి వచ్చిన ఆస్తిని ఉన్నదున్నట్టుగా ఆమెకి ధారపోశారు కాంతారావు. అటుపైని, పాతికేళ్ల వయసొచ్చే లోగానే వివాహం, భార్యాబిడ్డలని పోగొట్టుకోవడం, ద్వితీయ వివాహం,  రజాకార్ల దాడి కారణంగా ఉన్న ఊరిలో నిలువ నీడ లేకుండా పోవడం వంటివన్నీ వరసగా జరిగిపోయాయి. 

నటన మీద చిన్నప్పటినుంచీ మక్కువ ఉన్నా, పదిహేడో ఏట సురభి నాటక సమాజంలో చేరి నాటకాలు ఆడడంతో తనలో ఒక నటుడున్నాడన్న నమ్మకం కుదిరింది కాంతారావుకి. జగ్గయ్యపేటలో తానుంటున్న ఇంటికి ఎదురుగా నాటి బాలనటుడు మాస్టర్ విశ్వం (బాలనాగమ్మ) కుటుంబం ఉంటూ ఉండడంతో, తాను కూడా మద్రాసు వెళ్లి సినిమాల్లో చేరాలన్న ఆలోచన వచ్చి, ఉన్నఫళంగా మద్రాసు ప్రయాణం అయ్యారు కాంతారావు. వెళ్లిన కొన్నాళ్లకే అగ్ర నిర్మాత హెచ్. ఎం. రెడ్డి దృష్టిలో పడడంతో చిన్న వేషాలతో మొదలై, త్వరలోనే హీరో వేషాలకి ఎదిగారు. వంద సినిమాల్లో హీరోగా నటించిన తర్వాత, తన తోటివాళ్ళు ఇంకా హీరోలుగా కొనసాగుతూ ఉండగానే తనుమాత్రం కేరక్టర్ ఆర్టిస్టుగా మారిపోయి దాదాపు 350 సినిమాలు, టీవీ సీరియళ్ళలో నటించారు. 


ఆత్మకథతో తన బాల్యం తర్వాత, చిత్రరంగ ప్రవేశాన్ని వివరంగా రాసి, అటుపైని ఏ ఏడాది ఏ సినిమాల్లో నటించిందీ, ఆయా షూటింగుల్లో జరిగిన తమాషా సంఘటనలు లాంటివి మాత్రం వివరంగా చెప్పి, తెరవెనుక జరిగిన రాజకీయాలని రేఖామాత్రంగా ప్రస్తావించి ఊరుకున్నారు. అయితే, తనకి జానపద వీరుడిగా పేరొచ్చేందుకు దోహదం చేసిన దర్శకుడు విఠలాచార్య తనని పెట్టిన ఇబ్బందులు, సృష్టించిన కష్టాలు అన్నింటిని మాత్రం వివరంగా చెప్పుకొచ్చారు. కృష్ణ హీరోగా రంగ ప్రవేశం చేసిన తర్వాత, తనని హీరోగా తప్పించడం కోసం 'కొందరు పెద్దలు' కృషి చేశారని చెబుతూనే, కృష్ణతో తనకి మంచి స్నేహం ఉందని చెప్పారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరిలోనూ కలిసి నటించినా, కాంతారావు మొగ్గు ఎక్కువగా ఎన్టీఆర్ వైపే ఉందనిపిస్తుంది, ఈ ఆత్మకథ చదువుతూ ఉంటే. 

చిన్నప్పటినుంచీ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నా, హీరోగా మారాక ఆర్ధిక క్రమశిక్షణ మీద కాంతారావు దృష్టి పెట్టలేదని స్పష్టంగా అర్ధమవుతుంది. వచ్చిన సినిమాలు వరుసగా చేసుకుంటూ పోవడమే తప్ప, తన మార్కెట్ ఎంతన్నది గమనించుకుని పారితోషికం పెంచుకోవడం, చేసిన సినిమాలకి గాను ముక్కుపిండి డబ్బు వసూలు చేసుకోవడం చేతకాలేదు. అందరితోనూ మంచిగా ఉండాలని అనుకున్నారు తప్ప, తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకోలేదు. అసలా ఆలోచనే చేయలేదు. సినిమా నిర్మాణంలోకి దిగి చేతులు కాల్చుకోవడంతో కూతురికి పెళ్లి చేయలేని పరిస్థితి. అయితే, ఉన్నట్టుండి వేషాలు వచ్చి, అడ్వాన్సులు చేతిలో పడడంతో అంగరంగ వైభవంగా ఆ పెళ్లి జరిపించారు. (ఈ పెళ్లిలో జరిగిన వృధా వ్యయాన్ని కళ్లారా చూశాకే బాపూ-రమణలు తమ పిల్లల పెళ్లిళ్లు బంధువులకే పరిమితం చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు - 'కోతికొమ్మచ్చి'). 

వృద్ధాప్యంలోకి అడుగు పెడుతూనే పుట్టపర్తి సత్యసాయి బాబాకి భక్తుడిగా మారిపోయిన కాంతారావు, అనేక ముఖ్యమైన విషయాల్లో బాబా సలహాని తీసుకునే ముందుకు నడిచారు. అయితే, సినిమా నిర్మాణం జోలికి వెళ్ళొద్దని బాబా ఇచ్చిన సలహాని పెడచెవిన పెట్టి మరో రెండు సినిమాలు నిర్మించారు. ఫలితంగా, మద్రాసులో ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ఇల్లు, భార్య ఒంటిమీద బంగారం అమ్ముకుని కుటుంబంతో సహా హైదరాబాదులో అద్దె ఇంటికి మారాల్సి వచ్చింది. నలుగురబ్బాయిల్లో ఇద్దరు బాలనటులుగా నటించారు తప్ప తర్వాత సినిమాల్లోకి రాలేదు. హైదరాబాదు, మద్రాసులో ఉద్యాగాలలో స్థిరపడ్డారు. చలన చిత్ర పరిశ్రమ ఎంత వింత పరిశ్రమో మరోమారు కళ్ళకి కట్టే పుస్తకం ఈ 'అనగనగా ఒక రాకుమారుడు.' (క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 230, వెల రూ. 200). 

సోమవారం, మే 04, 2020

సినిమా పోస్టర్

సినిమా కథని చెప్పీ చెప్పకుండా చెప్పి, ఊరికే రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళని కూడా థియేటర్లకు లాక్కుపోయే శక్తి సినిమా పోస్టర్ కి ఉంది. అనాకారి గోడమీద అందంగా అలంకరించబడి, సినిమాకి సంబంధిచిన సమస్త సమాచారాన్నీ జన సామాన్యానికి అందించడమే కాదు, అభిమాన నాయికా నాయకులని పంచరంగుల్లో చూపించి ఇంకెటూ చూపు తిప్పుకోనివ్వనిది కూడా ఈ పోస్టరే. సినిమా ప్రచారంలో పోస్టర్ ది తిరుగు లేని స్థానం అనడం నిర్వివాదం. కానీ, ఈ సినిమా పోస్టర్ల పుట్టు పూర్వోత్తరాలేమిటి? అన్నది వెంటనే జవాబు చెప్పగలిగే సంగతి కాదు. తన స్వీయ గాధని, సినిమా పోస్టర్ పరిణామ క్రమాన్నీ వివరిస్తూ సుప్రసిద్ధ పబ్లిసిటీ ఆర్టిస్ట్ 'ఈశ్వర్' రాసిన పుస్తకమే 'సినిమా పోస్టర్. ' 

సినిమా పోస్టర్లనీ, దినపత్రికల్లో వచ్చే సినిమా ప్రకటనలనీ పస్తాయించి చూసే వారికి ఈశ్వర్ పేరు, ఆయన డిజైన్లు సుపరిచితమే. ఒక్కమాటలో చెప్పాలంటే, 1967 లో విడుదలైన 'సాక్షి' మొదలు 2000 లో వచ్చిన 'దేవుళ్ళు' వరకూ - తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో - సుమారు 2,500 సినిమాలకి వాల్ పోస్టర్లతో పాటు సమస్త ప్రచార సామాగ్రినీ సమకూర్చిన ప్రచార కళాకారుడు ఈశ్వర్. స్వంతంగా పబ్లిసిటీ సంస్థని ప్రారంభించడానికి ముందు అప్రెంటిస్ గా పనిచేసిన రోజులతో లెక్కిస్తే సినిమా పరిశ్రమలో ఆయనది నాలుగు దశాబ్దాల అనుభవం, ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న అనుబంధం. సినిమా అభిమానులనే కాక చిత్రకారులనీ అలరించే విధంగా తీర్చిదిద్దారు 'సినిమా పోస్టర్' పుస్తకాన్ని. 

"సినిమా పరిశ్రమలో నేనెంత డబ్బు సంపాదించాను అన్నది కాదు, ఎంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నాను అనేది నాకు ముఖ్యం" అనే ఈశ్వర్, తాను చేసిన పనికి అందుకోవాల్సిన పారితోషికంలో కేవలం మూడోవంతు మాత్రమే పొందగలిగారట. సినిమా పరిశ్రమలో డబ్బు విషయంలో పట్టుదలకి పోతే చేసేందుకు పని దొరకని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటారాయన. కేవలం సినిమా పోస్టర్లు, పబ్లిసిటీ డిజైన్లు మాత్రమే కాదు, తిరుమల వెంకన్న నేత్ర దర్శనాన్ని గర్భగుడి గడపమీద కూర్చుని చిత్రించడం మొదలు, ఎంటీ రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ పతాకాన్ని రూపొందించడం వరకూ (అదే డిజైన్ ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు) ప్రపంచానికి తెలియని ఎంతో కృషిని చేశారు ఈశ్వర్. 


పాలకొల్లుకి చెందిన కొసనా ఈశ్వర రావుకి మద్రాసు వెళ్లాలన్న ఆశ కానీ, లక్ష్యం కానీ లేవు. మంచి చదువు చదువుకుని, ఉద్యోగం సంపాదించుకుని ఒకప్పుడు బాగా బతికి తర్వాత చితికిపోయిన తన పెద్ద కుటుంబానికి ఆసరాగా నిలవాలన్నది మాత్రమే చిన్ననాటి లక్ష్యం. తండ్రి శిల్పి, సోదరులు చిత్రకారులు కావడంతో కళ మీద ఆసక్తి కలిగే వాతావరణమే చిన్నప్పటి నుంచీ చుట్టూ ఉండేది. పాలకొల్లు అంటే నాటక సమాజాలకు, ప్రదర్శనలకు పెట్టింది పేరు. హై స్కూల్ చదువుకి వస్తూనే నాటకాల్లో నటించడమే కాదు, రాయడమూ, రంగాలంకరణ చేయడమూ ప్రారంభించారు ఈశ్వర్. ఆయనలో పబ్లిసిటీ కళాకారుడు నిద్రలేచింది నాటక ప్రదర్శనలకు భారీ స్థాయిలో చేసిన పబ్లిసిటీ తోనే. అర్ధాంతరంగా చదువాగిపోవడం, ఏదో ఒక పని చేసి తీరక తప్పని పరిస్థితులు రావడంతో పని వెతుక్కుంటూ మద్రాసు బాట పట్టారు. 

సినిమా పబ్లిసిటీ గురించి ఈశ్వర్ చెప్పిన కబుర్లు ఎన్నో, ఎన్నెన్నో. చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో ఎడం చెయ్యి మోచేయి వరకూ తీసేసినా, పట్టుదలగా చిత్రకళలోనే కొనసాగి, 'నర్తనశాల' లాంటి చిత్రాలెన్నింటికో కళాదర్శకత్వం చేసిన టీవీఎస్ శర్మ సినిమా పబ్లిసిటీని కొత్తపుంతలు తొక్కించారు. శర్మ శిష్యుడైన కేతా దగ్గర విద్య నేర్చుకున్నారు ఈశ్వర్. అలా చూస్తే, ఆయన మూడోతరం కమర్షియల్ ఆర్టిస్ట్. ఈ వివరాలు మాత్రమే చెప్పి ఊరుకోలేదు. శర్మకి మునుపు చలనచిత్ర ప్రచార కళ ఎలా ఉన్నదో, ఇప్పటి కంప్యూటర్ యుగంలో ఎలాంటి మార్పులకి లోనైందో సవివరంగా చెప్పారు. తెలుగు చిత్రకారులు, దక్షిణభారత చలన చిత్ర పరిశ్రమలో పనిచేసిన పబ్లిసిటీ ఆర్టిస్టులందరి పరిచయాలనీ వీలైనన్ని వివరాలతో పొందుపరిచారు ఈ పుస్తకంలో. 

మొత్తం 418 పేజీలున్న ఈ పుస్తకంలో ఈశ్వర్ స్వీయగాధకి కేటాయించింది మూడో వంతు పేజీలు కాగా, మరో మూడోవంతు పేజీలు చిత్రకారులు, పబ్లిసిటీ ఆర్టిస్టుల వివరాలకి కేటాయించారు. మిగిలిన పేజీల్లో తాను డిజైన్ చేసిన పోస్టర్లు, పోర్ట్రైట్లలో  తనకి ఇష్టమైన వాటిని ముద్రించారు. పుస్తకం ముద్రణ జరిగింది విజయా ప్రెస్ లో కనుక, పుస్తకం నాణ్యతకి ఎలాంటి ఢోకా లేదు. పబ్లిసిటీ విషయంలో అనేకమంది హీరోలు, నిర్మాతల అభిప్రాయాలు, వ్యూహాల మొదలు, ఆ రంగంలో మంచి చెడ్డల వరకూ ఎన్నో విషయాలని సందర్భానుసారం ప్రస్తావించారు. బ్లాకండ్ వైట్ సినిమాల రోజుల్లోనే పబ్లిసిటీ ఆఫీస్ ని కార్పొరేట్ స్థాయిలో నిర్వహించిన ఆర్టిస్టుల కబుర్లు ఆశ్చర్యం కలిగిస్తాయి. ప్రపంచంలో అత్యధికంగా వాల్ పోస్టర్లు ఉపయోగించేది భారతదేశంలోనేనట! ఈ విషయమై ఓ విదేశీ పరిశోధక విద్యార్థి తనని కలిసినప్పుడే, ఈ పుస్తకం రాయాలన్న ఆలోచన వచ్చిందంటారు ఈశ్వర్. 2011 లో తొలిముద్రణ జరిగిన ఈ పుస్తకం ఇప్పటికీ మార్కెట్లో దొరుకుతోంది. వెల రూ. 450.