"నా పేరు విరూపాక్ష సార్. నా ఫోన్ నంబర్ రాసుకోండి.." ఎదురుగా నిలువెత్తు గుడి గోపురం, విరూపాక్ష స్వామిది. ఎడమ చేతివైపున రాతిపలకలతో నిర్మించిన బజారు, దానిని ఆనుకునే ఓ కొండ. కుడివైపున మైదానంలో పార్కు చేసిన టూరిస్టు బస్సులు, ఆటోలు. 'ఇదేనా చారిత్రాత్మకమైన హంపీ విరూపాక్ష స్వామి ఆలయం?' నా సందేహంలో నేనుండగానే, నెంబర్రాసుకోమంటూ ఆటో విరూపాక్షుడి గొడవ. ఫోన్లో నెంబర్ ఫీడ్ చేసుకున్నట్టుగా నటించి, అతగాడికి డబ్బులిచ్చి పంపించి నెమ్మదిగా గుడివైపుకి నడుస్తూ ఉండగా పలకరించింది హంపీ గాలి. అవును, అక్కడి గాలి కూడా ప్రత్యేకమే. వినగలిగితే ఎన్నెన్ని కథలూ, గాథలూ వినిపిస్తుందనీ? ఎస్సెల్లార్ కెమెరా సహిత బ్యాక్ ప్యాక్ బరువనిపించడం లేదు. రాత్రంతా ప్రయాణం చేసిన బడలిక లేనే లేదు. రాయల కాలంలోకి నడిచి వెళ్తున్న అనుభూతి కాబోలు.
పాదరక్షలు స్టాండులో పెట్టి, కెమెరా సహితంగా టిక్కెట్లు కొనుక్కుని, ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే కుడివైపున ఆయుర్వేద డిస్పెన్సరీ పలకరించింది. దీపాలు వెలిగించిన గుర్తుగా నూనె చారికలు కనిపిస్తున్నాయి రాతి నేలమీద. హంపీ పట్టణం మొత్తం మీద ఉన్న ఆలయాల్లో, ఇప్పటికీ నిత్యం ధూప దీప నైవేద్యాలు జరుగుతున్న పురాతన గుడి ఈ విరూపాక్ష స్వామి ఆలయం ఒక్కటే. అప్పుడప్పుడూ గుడి గంటలు వినిపించడమే కాదు, ప్రసాదాలు ఆరగించడం కోసం లెక్కకు మిక్కిలిగా వానరాలూ తిరుగాడుతున్నాయి ఆ ప్రాంగణంలో. ఎన్నో ప్రాచీన నిర్మాణాలు చూసినా, ఈ తరహా వాస్తుని చూడడం ఇదే ప్రధమం. 'విజయనగర ఆర్కిటెక్చర్' అని కదూ దీనికి పేరు. ఎత్తైన గోపురం చిట్టచివరి వరకూ సున్నితమైన పనితనంతో చెక్కిన శిల్పాలు. శిల్పదృష్టితోనే కాదు, గణితశాస్త్రం దృష్ట్యా చూసినా అబ్బుర పరిచే కొలతలతో ఠీవిగా నిలబడ్డ మండపాలు, నిర్మాణాలు.
ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలనీ, వాటి నిర్మాణన్నీ పరిశీలిస్తూ, కలియతిరిగి, ఓ మండపంలో విశ్రాంతిగా కూర్చోగానే, చెంగున ఎగిరొచ్చిన వానరం కెమెరా లెన్స్ కవర్ ఎత్తుకుపోయి, ఓ స్థంభం మీద కూర్చుని వినోదం చూసింది. 'నేన్నీకు మునిమనవడి వరస' అని ప్రవర చెప్పుకుంటే, కనికరించి, కవరు తిరిగిచ్చింది. ప్రవేశ ద్వారానికి అభిముఖంగా బయటికి వెళ్లేందుకు రాతి గుమ్మం, ఆనుకునే కోనేరు. కనుచూపు మేరలో కనిపిస్తున్న తుంగభద్రా నది. అప్రయత్నంగానే అడుగులు ఆ నదివైపుకు సాగాయి. నాగరికతలన్నీ నదీతీరాన్నే వెలిశాయని చెబుతుంది చరిత్ర. ఆ ప్రకారం చూసినప్పుడు, మహోన్నతమైన విజయనగర నాగరికత వికసించేందుకు దోహదం చేసిన నది ఈ తుంగభద్ర. సగం దూరం నడిచి రెండు పక్కలా చూస్తే, ఒకవైపు ఎత్తైన విరూపాక్ష ఆలయ ప్రాకారం, గోపురం, మరో వైపు తుంగభద్ర. అనుభూతిని అక్షరాల్లో తర్జుమా చేయటానికి ఈ యాత్రలో చేసిన మొట్టమొదటి విఫల ప్రయత్నం బహుశా ఇదే. హంపిలో గడిపినంత కాలమూ ఎన్నెన్ని విఫల యత్నాలు జరిగాయో లెక్కేలేదు. అడుగులు తుంగభద్ర వైపే పడ్డాయి.
ఎండ కాస్త తీక్షణంగా ఉన్న ఆ మధ్యాహ్నం వేళ, తన సహజ ధోరణిలోనే ప్రశాంతంగా కనిపిస్తోంది తుంగభద్ర, చారిత్రక నగరం హంపి ఉత్థానపతనాలకి మౌనసాక్షి. గట్టుమీద అక్కడక్కడా పైకిలేస్తున్న పొగలని చూడగానే ఒకటే సందేహం, కాశీలో లాగా ఇక్కడ కూడా శవదహనాలు జరుగుతాయా? ఉహు, జరుగుతున్నది అది కాదు. పట్టణంలో పేరుకున్న చెత్తని రాశులుగా పోసి తగలబెడుతున్నారని తెలిసింది. ఆ చెత్తని తయారు చేస్తున్నది నాలాంటి యాత్రికులే. అయినా, హంపికి, తుంగభద్రకీ ఈ పొగలు కొత్త కాదు. ఇంతకుమించిన దట్టమైన పొగల్ని మూడునెలలపాటు ఊపిరాడని విధంగా భరించాయవి. కానీ నాకే, ఆ సంగతులు తెలుసుకోడానికి మరో రెండు రోజులు పట్టింది. తుంగభద్రలో కాళ్ళు కడుక్కుంటూ ఉంటే మొదటగా గుర్తొచ్చినవి మొసళ్ళు! మహామహోపాధ్యాయ తిరుమల రామచంద్ర 'హంపీనుంచి హరప్పా దాక' చదివిన ప్రభావం. ఆ పండితుణ్ణీ, ఆ పుస్తకాన్నీ తల్చుకోడం ఆ ఉదయం నుంచీ అది ఎన్నోసారో గుర్తులేదు.
హోస్పేట స్టేషన్లో రైలు దిగగానే మొదట వెళ్ళాల్సింది కమలాపురం. కర్ణాటక టూరిజం కార్పొరేషన్ వారి హోటల్ మయూర భువనేశ్వరిలో బస. కమలాపురంలో అడుగుపెట్టింది మొదలు రామచంద్ర గుర్తొస్తూనే ఉన్నారు. స్నానానికి వేడినీళ్ళతో పాటు, మైసూర్ శాండల్ సబ్బుని, దావణగెరె తువ్వాలునీ అందించిన హోటల్ వారు సగం బడలిక పోగొట్టేశారు. బలంగా బ్రేక్ఫాస్ట్ చేసి, ఆటో పట్టుకుంటే అరగంట లోపే హంపీ చేర్చాడు డ్రైవరు, దారిలో కనిపించిన ప్రతి చెట్టు, పుట్ట గురించీ నమ్మశక్యం కాని కథలు చెబుతూ. మొసళ్ల ఆలోచనల్ని పక్కన పెట్టి, చుట్టూ చూస్తే, తుంగభద్ర గట్టున పొడవు పొడవూ దుకాణాలు. యాంటిక్ డిజైన్లని పోలిన డెకరేటివ్ పీసుల మొదలు, సేవెండి ఆభరణాల వరకూ అనేకం అమ్ముతున్నారు రాశులు పోసి. కొన్ని వందల ఏళ్ళక్రితం రత్నాలని, ముత్యాలనీ రాశులుగా పోసి విక్రయించింది ఇచ్చోటనేనా?
ఆలయాన్ని ఆనుకునే ఉన్న చిన్నపాటి కొండమీద పడింది దృష్టి. హేమకూట పర్వతమట పేరు. ఆ మధ్యాహ్నపు ఎండలో నిజంగానే బంగారంలా మెరిసిపోతోంది ఆ పర్వతం. సెమ్మెట్రికల్ గా నిర్మించిన చిన్న చిన్న గుళ్ళూ, మండపాలూ రారమ్మని పిలుస్తూ ఉంటే కొండెక్కడం ఏమంత కష్టమనిపించలేదు. ఆ కొండమీంచి మరింత స్పష్టంగా కనిపిస్తోంది విరూపాక్ష ఆలయ గోపురం. రెండోపక్క కనుచూపు మేరంతా హంపీ శిధిలాలు. ఆ గోపురం బ్యాక్డ్రాప్ గా వచ్చేలా వాళ్ళిద్దరికీ ఓ ఫోటో తీయమని రిక్వెస్ట్ చేసింది ఓ విదేశీ జంట. ఒకటికి నాలుగు ఫోటోలు తీసి ఐఫోన్ తిరిగిస్తే, మొహాలు చేటంత చేసుకున్నారు ఆ చైనా అమ్మాయి, డెన్మార్క్ అబ్బాయీ. అమెరికా నుంచి వచ్చారట హంపిని చూడడానికి. వాళ్ళ ప్రేమకథని మూడుముక్కల్లో చెప్పేసి "ఇటీజ్ టూ హాట్ హియర్" అన్నారు. 'మా రాయలుకీ ఓ ప్రేమకథ ఉంది తెలుసా మీకు?' అని అడగాలనిపించింది. కానీ, 'చిన్నాదేవిని గురించి నాకు తెలిసిందెంత?' అనే సందేహం అడ్డొచ్చింది.
హేమకూటం మీద ఉన్న గుళ్ళనీ, మండపాలనీ చూస్తున్నంతసేపు ఒకటే ప్రశ్న. ఇక్కడ ఉన్న రాళ్లనే తొలిచి వీటిని నిర్మించారా? లేక, వేరే చోట్ల నుంచి బండరాళ్లని ఈ కొండమీదకి చేర్చారా? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఏర్పాటు చేసిన బోర్డులో ఈ వివరం లేదు. ఆ మాటికొస్తే చాలా వివరాలే లేవు. హేమకూటం మీద కడలేకలు (శనగ గింజ) గణేశ, ససివేకలు (ఆవగింజ) గణేశ ఆలయాలు రెండూ చెప్పుకోదగ్గవి. రెండు విగ్రహాలూ భారీగానే ఉన్నాయి. కడలేకలు గణేశుడి ఉదరభాగం చెక్కేసి ఉండడం చూసి చివుక్కుమనిపించింది. ఆ పొట్టలో విలువైన మణులు ఉండొచ్చన్న అనుమానమో లేక అందమైన ఆ విగ్రహాన్ని పాడుచేయాలన్న ప్రయత్నమో తెలియదు కానీ, క్రూరత్వానికి గుర్తుగా చెక్కేసిన బొజ్జ మాత్రం మిగిలిపోయింది.
మరికాసేపట్లోనే - ఒడిలో లక్ష్మి లేని నరసింహుడినీ నీళ్లలో ఉన్న భారీ శివలింగాన్నీ దర్శించుకుని మరో నాలుగడుగులు ముందుకు వేసేసరికే - అంతకి వెయ్యింతల బాధ సుళ్ళు తిరిగింది, బలవంతంగా కూల్చివేయబడిన శ్రీకృష్ణ మందిరపు శిఖరాన్ని చూసినప్పుడు. విగ్రహమూ, పూజా పునస్కారమూ లేని ఆ గుడిలో గడిపే ఒక్కో నిమిషమూ మరింత బరువైపోయింది. శిధిలాలలోనే ఇంత సౌందర్యం తొంగిచూస్తూ ఉంటే, వైభవోపేతమైన కాలంలో ఈ ఆలయం ఎలా ఉండి ఉండేది? ఏమి వాస్తు ఇది? ఎందరి శ్రమ ఈ నిర్మాణం? టైం మెషిన్ లో వెనక్కి వెళ్లి ఆ విధ్వంసాన్ని ఆపేయగలిగితే అన్న ఆలోచన మొదటిసారిగా కలిగింది. అదొక్కటేనా? ఆ శిధిల సౌందర్యాన్ని చూస్తూ ఉంటే ఉబికి వచ్చే ఆలోచనలు ఎన్నో, ఎన్నెన్నో. ఎటొచ్చీ, వాటిల్లో కొట్టుకుపోకుండా పట్టి బయటికి లాగేందుకు విరూపాక్ష లాంటి వాళ్ళు సదా సిద్ధంగా ఉంటారు. ...అలా తొలిరోజు హంపీ యాత్ర పూర్తయింది.
(ఇంకా ఉంది)
( శిధిల కట్టడాలగురించి చదివినప్పుడు మనసు చివుక్కుమనిపించినా) చదువుతుంటే ఆహ్లాదంగా చాలా బావుందండీ.మిగతా భాగాలకు అట్టే టైం తీసుకోరని ఆశిస్తున్నా..
రిప్లయితొలగించండివినడానికి కించిత్తు నిష్టూరమనిపించినా ఇటువంటి యాత్రలు ఒంటరిగానే చేయాలి అనిపిస్తుంది నాకు. కుటుంబసమేతంగా వెళితే ఆ అనుభూతిలో ఐదు శాతం కూడా దక్కదు. :) . ప్రతి ఐదు నిమిషాలకు "ఆబ్సెంట్ మైండెడ్" అయిపోతుంటే ఎవరు మాత్రం భరించగలరు మరి? :)
టైం తీసుకోకూడదనే ప్రయత్నమండీ.. చూడాలి.. కుటుంబం విషయానికి వస్తే, కాలం గడిచేసరికి భరించడానికి అలవాటు పడిపోడమో, ఇంతేనని వదిలేయడమో జరుగుతుంది. :)) ధన్యవాదాలు.
తొలగించండిహంపీ వెళ్ళారన్న మాట ! భలే! వానరానికి ప్రవర చెప్పడం ఊహించుకోవడానికి సరదాగా వుంది. తదుపరి భాగాలు తొందరలోనే రాసేయండి మరి !
రిప్లయితొలగించండిరాసేస్తున్నానండీ.. ధన్యవాదాలు..
తొలగించండిఈ మధ్య రెండు మూడు బ్లాగుల్లో వరుసగా హంపి గురించిన పోస్టులు చదివా. అప్పటినుండి ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. మీ మొదటి రోజు యాత్రా విశేషాలు బావున్నాయండి... అన్నీ కలిపి ఒకే పోస్టులా పెడితే ఇంకా బావుండేదేమో..
రిప్లయితొలగించండిఅవిచదివే నేనూ ప్రయాణం కట్టానండీ.. కాస్త వివరంగా రాద్దామని ప్రయత్నం. ధన్యవాదాలు.
తొలగించండిహంపి!! ఎన్ని సార్లు తిరిగినా నాకు విసుగు అనిపించ లేదు.
రిప్లయితొలగించండిఅవునండీ.. నాకూ మళ్ళీ వెళ్లాలని ఉంది. ధన్యవాదాలు..
తొలగించండికళాకారులు, చింతనలో మునిగితేలేవారూ ఒంటరిగా వెళ్ళాల్సిన ప్రదేశం.. నిజమే! అనుభూతిని, ఆలోచనని పంచుకోనిదే ఉండలేని నాలాంటి మనిషి ఒక్కర్తే వెళ్తే మతిభ్రమించిపోయినా ఆశ్చర్యం లేదేమో.
రిప్లయితొలగించండిఇలాంటి విషయాల్లో జెండర్ పాత్ర కూడా ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుందండీ.. ధన్యవాదాలు.
తొలగించండిమిథునం, చెకుముకినిప్పు గుర్తొచ్చాయి. నిజమే, వద్దనుకున్నా జెండర్ అన్నిటా ముఖ్యపాత్ర వహిస్తుంది.
తొలగించండి