"తలంటోసుకుని..." చిన్నప్పుడు నా పుట్టినరోజుకి నేనేం చేయాలో నా పాటికి నేను ప్లాన్లేసుకుంటుంటే అమ్మో, బామ్మో ఈ 'తలంటు' ని గుర్తు చేసే వాళ్ళు. తలమీంచి కళ్ళు, ముక్కు, నోరు మీదుగా జారే కుంకుడుకాయ పులుసు ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చి ప్లాన్లన్నీ పైకెగిరి పోయేవి. కాసేపటి తర్వాత మళ్ళీ మామూలే. పండగలకీ తలంటు తప్పదు కానీ, పుట్టినరోజు తలంటు ప్రత్యేకం. పండగ నాడు ఇంటిల్లిపాదికీ అయితే, పుట్టిన్రోజున మనొక్కళ్ళకే తలంటన్న మాట. నీళ్లు మరికాస్త వేడిగా కాచి, పులుసు మరికొంచం చిక్కగా కలిపి, తల మాసినట్టైతే పులుసులో కాసిని మందారాకులు కలిపి, పాయసానికన్నా ముందు కుంకుడుకాయ పులుసు తాగించి, ఆపై ఉప్పుకల్లద్దిన చింతపండు తినిపించి.. అబ్బో, అదో మహా క్రతువు.
కాలక్రమంలో పులుసు ఇబ్బంది పెట్టని విధంగా తలంటుకునే చిట్కాలు నేర్చుకోడం మొదలు, రానురానూ సీకాయ సబ్బు, అటుపై షాంపూ లాంటి ప్రత్యామ్నాయాలకి మళ్లడం వరకూ తలంటులో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. అలాగే 'తలంటు' కి ఉన్న నానార్ధాలు మరింత బాగా తెలిసొచ్చాయి. అక్కడినుంచీ తలంట్లు పోయడం, పోయించుకోడం అనే శాఖా చంక్రమణంలో జీవితం సాగిపోతోంది. ఇంతకీ ఇప్పుడిలా తలంటు, పుట్టిన్రోజూ జమిలిగా జ్ఞాపకం రావడానికి కారణం ఏమిటీ అంటే, పెద్ద కారణమే ఉంది. 'నెమలికన్ను' పదకొండో పుట్టినరోజివాళ. అంటే, పుట్టినరోజు బ్లాగుకీ, తలంటు నాకూ అన్నమాట. ముందుగా 'హేపీ బర్త్ డే నెమలికన్ను!!'
ఈ శుభసమయంలో కాస్త సోలిలోక్వీ.. ఏడాది క్రితం ఏమనుకున్నానంటే, ఎప్పటినుంచో రాయాలని అలా అలా వాయిదా వేస్తున్న కబుర్లు, కథలు వచ్చే ఏడాది కాలంలో వరస పెట్టి రాసేయాలి అని ఘాట్టి నిర్ణయం తీసుకున్నా. ఏడాది తిరిగాక ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కరిగిపోయిన కాలం 'వెవ్వేవ్వే' అని వెక్కిరిస్తోంది. రాయాల్సినవన్నీ బుర్రలోనే ఉండిపోయాయి. వాటిని రాయడమో, మర్చిపోడమో చెయ్యకపోవడం వల్ల కాబోలు, కొత్త డేటా ఏదీ పెద్దగా బుర్రలోకి వెళ్లలేదీ ఏడాది. జీవితావసరాలనో, ఊపిరి సలపని పనులనో వంక వెతుక్కోడం నాకే నచ్చడం లేదు. ఎందుకంటే, అవి ఎప్పుడూ ఉండేవే. "అవి కాస్త సద్దు మణిగాక" అనుకోడానికీ, కెరటాలు తగ్గాక సముద్ర స్నానం చేద్దాం అని ఎదురు చూడ్డానికీ పెద్దగా తేడా ఉండదు.
ఉన్నట్టుండి నేనిలా ఆత్మగతంలో పడ్డానికి కారణం లేకపోలేదు. బ్లాగు పాఠకుల నుంచి అప్పుడప్పుడూ వస్తున్న మెయిలుత్తరాలు పదేపదే ఆలోచనల్లో పడేస్తున్నాయి. "ఈమధ్య రాయడం బాగా తగ్గిపోయింది.." "పాత పోస్టులు మళ్ళీ చదువుతున్నా. కొత్తవి ఎప్పుడు రాస్తారు?" లాంటి వాక్యాలు ఓపక్క ఉత్సాహాన్ని ఇస్తూనే, కించిత్తు సిగ్గునీ కలిగిస్తున్నాయి. "అప్పుడప్పుడూ ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాను కదా" అని సరిపెట్టుకుందామనుకున్నా, అంకెలు మోసం చేయవు కదా. బ్లాగులు మాత్రమే ఉన్న కాలంలో, బ్లాగ్మిత్రులు కొత్తపాళీ గారు కేలండర్ ప్రకారం టపాలు రాసేవారు. అది చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసేది. ఇంత టంచన్ గా ఎలా రాయగలుగుతారా అని. ఇప్పుడిప్పుడు అదే సరైన పధ్ధతి అనిపిస్తోంది కానీ, అంతలోనే అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదన్న స్పృహ కలుగుతోంది.
ఈ హింసని కాస్త పక్కన పెట్టి, సింహావలోకనంలోకి వెళ్తే, గతేడాది మొదలుపెట్టి బాగానే కొనసాగించిన సిరీస్ 'వేటూరి పాట.' నా అభిమాన గీత రచయిత వేటూరి సుందర రామ్మూర్తి పాటల్లో నాకు ఇష్టమైన కొన్నింటి గురించైనా వివరంగా రాయాలన్న తాపత్రయంతో మొదలు పెట్టిన సిరీస్ ఇది. సినీ కవులెవరూ బూతుకి అతీతులు కాకపోయినా, అదేంటో వేటూరి అనగానే బూతురాశాడు అనేస్తూ ఉంటారు కొందరు, అదేదో పేటెంట్ లాగా. నిజానికి తేలికపాటలు రాసినా చెల్లిపోయే సినిమాలకి కూడా లోతైన భావం ఉన్న పాటలు రాశారు వేటూరి. అయితే, ఈ బూతు బ్రాండింగ్ ఆకర్షించినట్టుగా ఆ కృషి ఆకర్షించడంలేదు విమర్శకులని. వాళ్ళకేమీ చెప్పనవసరం లేదు కానీ, నాలాగే వేటూరి పాటల్ని ఇష్ట పడే వాళ్ళకోసం రాయాలనిపించి మొదలుపెడితే, నెమ్మదిగా సిరీస్ గా మారింది.
నిజానికి నేను ముందుగా రాయాలన్న వాటిలో ఈ 'వేటూరి పాట' లేదు. కానీ, అనుకోకుండా మొదలై అలా అలా సాగుతోంది. పలికిస్తుంది వేటూరే. తప్పులేవి దొర్లినా అవి నావే. అభిమాన రచయిత్రి సోమరాజు సుశీల మరణం నన్ను బాగా బాధ పెట్టిన విషయాల్లో ఒకటి. రాయాల్సిన కథలింకా ఎన్నో ఉండగానే సెలవు తీసేసుకున్నారామె. చదివిన పుస్తకాల్లో పర్ల్ బక్ రాసిన 'ది గుడ్ ఎర్త్' ఇంకా వెంటాడుతోంది. వెంటాడుతూనే ఉంటుంది, బహుశా. చదవల్సినవి, రాయాల్సినవీ కూడా 'మా సంగతేంటి?' అంటూండగానే తగుదునమ్మా అంటూ పుట్టిన్రోజు వచ్చేసింది. ఏంచేయాలో తెలీకే ఈ తలంటి కార్యక్రమం అన్నమాట. మీరూ కాస్త పులుసు పొయ్యండి, పుట్టిన్రోజు ఊరికే వస్తుందా...
పుట్టినరోజు శుభాకాంక్షలు 💐🎂.
రిప్లయితొలగించండిఅవును, మీ బ్లాగ్-వ్రాతలు ఈ మధ్య కొంచెం తగ్గినట్లున్నాయి. We miss your writings.
బ్లాగుల్లో మిగిలున్న కొద్ది బ్లాగర్లలో మీరొకరు. నెమలికన్ను కనపడగానే కళ్ళుపడేసి చదివేస్తుంటాం. విమర్శించాలంటే అవగాహన ఉండాలి. వేటూరి గారు వ్రాసే పదాలు అర్ధమవ్వాలి కదా ? మా ఇంటి ప్రక్కన కుంకుడు కాయలు కొడుతున్న సౌండ్ వస్తుంటుంది. ఇంకా కుంకుడు కాయలు వాడుతున్నవారున్నట్లే మీ బ్లాగు చదివే పాఠకులు ఉన్నారని గుర్తుపెట్టుకోండి చాలు.
రిప్లయితొలగించండిబ్లాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు.
Happy birth day nemalikannu .gaaru ... raastune vundandi aapakandi
రిప్లయితొలగించండిబ్లాగ్ పుట్టినరోజుకి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిరాసేయ్యండి. మేం చదివి పెడతాం. నేను కూడా పాత ఖాతాలన్నీ దుమ్ము దులుపుతున్నా మళ్లీ.
దివాకర తనూజం .. గుర్తుందా?? ☺️
పుట్టినరోజు శుభాకాంక్షలు మురళీ గారూ. ప్రస్తుతం బ్లాగుల్లో అంతో ఇంతో వ్రాస్తుంది మీరేనేమో. నేనయితే మీదీ..కొత్తావకాయ గారిదీ తప్పితే ఎవరివీ చూడను కూడా చూడటం లేదు.మీరిలానే వ్రాస్తూ ఉండాలి.
రిప్లయితొలగించండిమూడు నెలలు ఐనట్టుంది మీ గూటికి వచ్చి. పుట్టినరోజు జేజేలు.
రిప్లయితొలగించండియేళ్ళ తరబడి అక్షరమ్ముక్క రాయని నాకు మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తోంది. మీ ఓపిక్కి జోహార్లు.
ఆ "మనోహర" గీతం నాకు చాలా ఇష్టం. గుణశేఖర్ మీద అభిమానంతో (అప్పటికి) గుణాలే తప్ప దోషాలు తెలీవు.😀.
నలుగెట్టుకుని తలంటు పోసుకుని కొత్త బట్టలు కట్టుకున్న మీ బ్లాగిల్లేరమ్మకి "శతమానం భవతి".
ఫణీంద్ర పురాణపణ్డ
మీ బ్లాగ్ ఇంకెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. మీరు మళ్ళీ బోల్డన్నిపోస్టులు రాయాలి .
రిప్లయితొలగించండిహలో..హలో..నెమలికన్ను గారూ...!! ఎలా ఉన్నారు? ఇప్పుడే కొత్తావకాయ గారి పొగడమాలలోంచీ పరిమళ వీచికలు నా దాకా వచ్చేసరికి, పడుతూ లేస్తూ బ్లాగులోకొచ్చాను - నా కేక్ ఉన్నట్టేనా? :)) - హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలండీ.
రిప్లయితొలగించండికుంకుళ్ళు పోసే స్నేహితులమా మేము? - నుదుటి మీద అరచేయి అడ్డుపెట్టేవాళ్ళమైతేనూ!! ఐనా ఈమాట మాత్రం చెప్పాలి - బుక్ ఎక్జిబిషన్‌కు వెళ్ళే ముందు ఒకసారి మీ బ్లాగంతా జల్లెడ పట్టి పేపర్ మీద రాసుకు మరీ వెళ్ళాను ఓ రెండేళ్ళు. ఈ ఏడాదికి మీ పుస్తక పరిచయాలైతే చాలా తగ్గాయండీ. కొత్తాపాతా పుస్తకాలను అలవోకగా పరిచయం చేసే పోస్ట్‌లను, ఈ ఏడాది మిస్ అయిపోయాం.
మీరీ ఏడాది మరిన్ని విశేషాలతో, రాతలతో బ్లాగులో పోస్ట్‌ల సంఖ్యా, ఆపిల్ పళ్ళ సంఖ్యా పెంచాలని కోరుకుంటూ - మానస :)
అభినందనలు మురళీ గారూ ..
రిప్లయితొలగించండిపుట్టిన రోజునాడు అడిగింది కాదనడం కూడా ఒక ఆచారమట కదా :)
మీరు ఈ సంవత్సరం రాయాల్సిన లిస్ట్ లో ఈ రెండూ చేర్చాలని మా రిక్వెస్ట్ :)
1) పురాణం సీత - ప్రేమ లేఖలు
2) C/O కంచరపాలేం
రామ రామ ! మీ దగ్గరే అచ్చు తప్పులన్నీ :) కాదనకపోవడం **
రిప్లయితొలగించండిహృదయపూర్వక జన్మదిన శుభాభినందనలు మురళి గారు. ఆ స్వర్ణయుగం మీరు కొనసాగిస్తున్నందుకు చాలా సంతొషంగా ఉందండి. మీరు ఇలాగే కలకాలం వర్ధిల్లాలి...
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండి1.1 దశాబ్ద కాలంపాటు రాయగలిగిన మీ సత్తా కున్ను మేటరు కున్నూ జోహార్లు!
2020 లో మళ్లీ వేగం పుంజుకుంటానని మాటిచ్చినందులకు శుభాకాంక్షలతో
2009 లో నెమలికన్ను పైటపా రాసిన మేటరు మీకోసం మళ్లీ :)
నెమలి కన్నులు చూడ చక్కన
' నెమలి కన్ను ' చదువ చంపకమాల
నెమలి కి అందం కన్నులు చందం నడకలు
' నెమలి కన్ను ' కి అందం విలక్షణం
చందం పుస్తక పరిచయం!
చీర్స్ సహిత
ది ఒన్ అండ్ ఓన్లీ
జిలేబి :)
Congratulations .I ofam one your blog followed waiting for your new post.All the best.
రిప్లయితొలగించండిమానస గారన్నట్లు చేతులడ్డుపెట్టగలమే తప్ప కుంకుళ్ళు పోయగలమా.. మనలో మన మాట అంతకుముందు ఏడాది కన్నా గడిచిన ఏడాది పోస్టుల సంఖ్య కాస్త పెరిగింది చూశారా :-) ఈ ఏడాది తప్పకుండా మరింత పెరుగుతుందిలెండి. మీకు నచ్చినట్లుగా మరింత వెసులుబాటు చిక్కి అనుకున్న పోస్టులు అన్నీ రాసేయాలని కోరుకుంటూ మీ నెమలికన్నుకు పుట్టినరోజు జేజేలూ మీకు అభినందనలు.
రిప్లయితొలగించండి@విన్నకోట నరసింహారావు: ఒక్కసారి వెనక్కి చూసుకుంటే నాకూ అదే అనిపించి, బాధనిపించిందండి.. మీ అభిమాననానికి ధన్యవాదాలు. @నీహారిక: కుంకుడు కాయల శబ్దం :) :)) .. ధన్యవాదాలండీ@హిమబిందు: తప్పక ప్రయత్నిస్తానండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@కొత్తపాళీ: 'దివాకర తనూజం' బావ-బావమరుదులు కథ అనే గుర్తు. అచ్చులో మిస్ అయ్యానండి.. ఆ పేరుతో కొత్త కథల సంకలనం తెస్తున్నారా? మీరూ బ్లాగు రాస్తారంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి.. ధన్యవాదాలు. @సిరిసిరిమువ్వ: మీరు కూడా మళ్ళీ రాసేందుకు ప్రయత్నిస్తే బాగుంటుందండి, కనీసం అప్పుడప్పుడైనా.. బ్లాగులు బ్లాగులే కదా.. ధన్యవాదాలు. @ఫణీన్ద్ర: 'బ్లాగిల్లేరమ్మ' భలే పేరు పెట్టారండీ.. మరికొంచం ఓపిక చేసుకోవాలని ఉందండీ నాకు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@లలిత: ధన్యవాదాలండీ @మానస చామర్తి: కుంకుళ్ళు - చాలా థాంక్స్ అండీ, ఇంకా ఏం చెప్పాలో తెలీడం లేదు. పుస్తకాలు - అవునండి, బాగా తగ్గింది. నా బాధ కూడా అదే. ..ధన్యవాదాలు. @పరుచూరి వంశీకృష్ణ: వేటూరి చెప్పినట్టు, "వద్దు లేదు నా భాషలో.." (ఆయన పూర్తిగా వేరే కాంటెక్స్టు లో చెప్పారు లెండి). పుట్టిన్రోజే కానక్కర్లేదు, ఎప్పుడైనా అడగొచ్చు. వీలు వెంబడి తప్పకుండా రాస్తానండి. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@జయ: మీరందరూ కూడా రాయాలండీ, అప్పుడే కదా స్వర్ణయుగం.. ధన్యవాదాలు. @జిలేబీ: ఆ రోజుల్ని మళ్ళీ గుర్తు చేశారు, ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@స్వాతి: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: మీరు భలే పాజిటివ్ ఎనర్జీ ఇస్తారండీ.. తప్పకుండా ప్రయత్నం చేస్తాను.. ధన్యవాదాలు..
You are an inspiration, always. నెమలికన్ను కి పుట్టినరోజు జేజేలు!
రిప్లయితొలగించండిసోషల్ మీడియాలో కూడా మీరు శుభాకాంక్షలు చెప్పినట్టు తెలిసిందండీ. ధన్యవాదాలు.
తొలగించండి