శనివారం, అక్టోబర్ 13, 2018

స్థానం నట జీవన ప్రస్థానం

తెలుగు రంగస్థలంతో ఏ కాస్త పరిచయం ఉన్నవారికీ కూడా స్థానం నరసింహారావుని ప్రత్యేకించి పరిచయం చేయనవసరం లేదు. "మీరజాలగలడా నా యానతి, నటవిధాన మహిమన్ సత్యాపతి" పాటని జ్ఞాపకం చేస్తే చాలు, సత్యభామ ఠీవీ ఆ వెనుకే ఆ పాత్రకి రంగస్థలం మీద ప్రాణం పోసిన స్థానం నటనా గుర్తొచ్చేస్థాయి. ఆయన నాటకాలని నేరుగా చూసిన వాళ్లకి మాత్రమే కాదు, వాటిని గురించి పరోక్షంగా విన్నవారికి కూడా చిరపరిచితుడైపోయిన నటుడు స్థానం నరసింహారావు. ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన కాలంనాటి సామాజిక, రంగస్థల పరిస్థితులు, గొప్ప నటుడిగా పేరుతెచ్చుకోవడం వెనుక ఆయన చేసిన కృషి తదితర విషయాలని వివరించే పుస్తకం ఆచార్య మొదలి నాగభూషణ శర్మ రాసిన 'నటకావతంస స్థానం నరసింహారావు నట జీవన ప్రస్థానం.'

గుంటూరు జిల్లా బాపట్ల లోని ఒక పేద కుటుంబంలో 1902 సెప్టెంబరు 23న జన్మించిన స్థానం నరసింహారావు కుటుంబ పరిస్థితుల కారణంగా హైస్కూలు చదువుని కూడా పూర్తి చేయలేక పోయారు. బాల్యంలో సంగీతంలోనూ, చిత్రలేఖనంతోనూ కొద్దిపాటి పరిచయం కలిగింది. తన పద్ధెనిమిదో ఏట తండ్రి హఠాత్తుగా మరణించడం, వెనువెంటనే పెద్దకొడుకుగా కుటుంబ బాద్యత భుజాల మీద పడడంతో తల్లి అభీష్టానికి విరుద్ధంగా నటుడిగా మారారు స్థానం. నిజానికి ఆయన వేసిన మొట్టమొదట వేసింది స్త్రీ వేషమే. 'సత్య హరిశ్చంద్ర' నాటకంలో చంద్రమతి పాత్ర. చామనచాయ రంగులో, పీలగా, పొట్టిగా ఉండడంతో ఆయన్ని స్త్రీ పాత్రకి ఎంపిక చేశారట. రెండేళ్లు తిరిగేసరికల్లా నాటి నాటక సమాజాలన్నీ స్థానం రాక కోసం ఎదురు చూశాయంటే నటుడిగా ఆయన శ్రద్దాసక్తులు, తనని తాను మెరుగుపరుచుకున్న విధానాన్ని ఊహించవచ్చు.

ఆచార్య మొదలి నాగభూషణ శర్మ సాహిత్య విమర్శకుడు మాత్రమే కాక, రంగస్థల నటుడు, రచయిత, విమర్శకుడు కూడా కావడంతో ఈ పుస్తకంలో కేవలం స్థానం జీవిత విశేషాలని మాత్రమే కాక ఆంధ్రదేశంలో నాటి రంగస్థల పరిస్థితులనీ వివరంగా పొందుపరిచారు. వృత్తి నాటక సమాజాలు పోటాపోటీగా నాటకాలు ప్రదర్శించే రోజులు కావడం, స్త్రీ పాత్రలకి అన్నివిధాలా సరిపోయే నటులు దొరకడం అరుదైపోవడం ఒకవైపు, ఇతరత్రా వ్యాపకాల జోలికి పోకుండా క్రమశిక్షణతో నటనమీదే దృష్టి పెట్టి పాత్రకి న్యాయం చేయడం కోసం తపించే స్థానం దీక్షాదక్షతలు మరో వైపు - ఈ రెండింటి కలగలుపే స్థానాన్ని తక్కువ సమయంలోనే అగ్రశ్రేణి నటుడిగా నిలబెట్టింది అంటారు నాగభూషణ శర్మ.


నటనలో తన లోటుపాట్లని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడడం మాత్రమే కాదు, తాను పోషిస్తున్న పాత్ర స్వరూప స్వభావాలని అర్ధం చేసుకుని తదనుగుణంగా ఆహార్యం మొదలు వాచికం వరకూ పాత్రలో పరకాయ ప్రవేశానికి తపన పడడం స్థానం నరసింహారావుని ఆయన సమకాలీన నటులలో ప్రత్యేకంగా నిలబెట్టింది అంటారు రచయిత. సంగీతంతో పరిచయాన్ని ఉపయోగించుకుని పాత్రానుగుణమైన పాటల్ని రాసుకుని స్వరపరుచుకోవడం మొదలు (అలా పుట్టిన పాటల్లో ఒకటి 'మీరజాలగలడా') చిలేఖన విద్య సాయంతో వేషానికి మెరుగులు దిద్దుకోవడం, దుస్తులు, ఆభరణాల విషయంలో ఎక్కడా రాజీ పడకపోవడం ఇవన్నీ తన మూడున్నర దశాబ్దాల నటజీవితంలో ఆసాంతమూ పాటించారు నరసింహారావు.

దేశవిదేశాల్లో లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చి, అనేక సన్మానాలు, బిరుదులూ అందుకున్న నటుడికి సహజంగానే ఆ విజయం తలకెక్కాలి. కానీ, స్థానం విషయంలో అలా జరక్కపోవడానికి కారణం తొలినాళ్లలో జరిగిన ఒక సంఘటన అంటారు నాగభూషణ శర్మ. తొలిసారి బంగారు పతకం అందుకున్న తర్వాత, నాటకం పాంఫ్లెట్ లో తన పేరు పక్కన గోల్డ్ మెడలిస్ట్ అని రాయించుకోడమే కాక, ప్రదర్శనలో యశోద వేషం వేసి బంగారు పతకాన్ని కూడా ధరించారట. నాటకం ఆసాంతమూ గోల్డ్ మెడల్ ని ప్రేక్షకుల దృష్టిలో పడేలా చేసే ప్రయత్నంలో పాత్ర మీద, నాటకం మీద ఏకాగ్రత చూపలేకపోయారట. అప్పటివరకూ మెచ్చుకున్న వారే, ప్రదర్శన అనంతరం తీవ్రంగా విమర్శించడంతో మరెన్నడూ తన మెడల్స్ ని ప్రదర్శించలేదట.

ఇది కేవలం స్థానం నరసింహారావుని అభినందిస్తూ రాసిన పుస్తకం కాదు. స్త్రీపాత్రలలో రాణించినంతగా పురుష పాత్రల్లో పేరు తెచ్చుకోలేక పోవడం, రంగస్థలం మీద విజయం సాధించినా, సినిమాలలో రాణించక పోవడం లాంటి విషయాలనీ విశదం గానే రాశారు రచయిత. సత్యభామ, రోషనార, చిత్రాంగి, మధురవాణి పాత్రల విశేషాలని, స్థానం నటనపై వచ్చిన సమీక్షలనీ వివరిస్తూనే, నాటి నాటక సమాజాల పోటీ వాతావరణం, నటుల మధ్య స్పర్ధలు లాంటి విషయాలని కూడా సందర్భానుసారం ప్రస్తావించారు. కేవలం స్థానం నరసింహారావు నట జీవితాన్ని మాత్రమే కాక, తెలుగు రంగస్థలం పరిణామ క్రమాన్నీ వివరించే రచన ఇది. (కళాతపస్వి క్రియేషన్స్ ప్రచురణ, పేజీలు 146, వెల రూ. 200, స్థానం నరసింహారావు పాటల సీడీ ఉచితం, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులలోనూ లభ్యం).

2 కామెంట్‌లు:

  1. తెలిసిన కథే అనుకోండి ... స్థానం వారు ఒక ఊరిలో సాయంత్రం నాటకానికై (స్త్రీ వేషం) మేకప్ పూర్తి చేసుకుని, బస చేసిన వారింట్లో కూర్చునున్నప్పుడు ఆ ఇంటివారిని ఏదో పేరంటానికి పిలవడానికి వచ్చిన కొంతమంది మహిళలు స్థానం వారికి కూడా బొట్టు పెట్టి ఆహ్వానించారని మా పెద్దలు చెప్పగా విన్నాను. ఇటువంటి సంఘటనలు అనేక ఊళ్ళల్లో జరిగాయని కూడా అనేవాడు. స్థానం వారి స్త్రీవేషం అంత సహజంగా ఉండేదని చెప్పుకునే వారు. తెలుగు నాటకరంగ చరిత్రలో వారిదొక సుస్థిరమైన స్థానం.

    // "తన పద్ధెనిమిదో తండ్రి హఠాత్తుగా మరణించడం ... " // అని పడింది పైన రెండో పేరాలో. తన పద్ధెనిమిదో "ఏట" అని ఉండాలనుకుంటాను.

    రిప్లయితొలగించండి

  2. @విన్నకోట నరసింహారావు: 'ఏట' సరిచేశానండి.. ధన్యవాదాలు..
    స్త్రీ వేషంలో ఉన్నప్పుడు ఎక్కడా పురుష ప్రక్రుతి కనబరచకపోడం, వేషం తీసేయగానే స్త్రీత్వపు ఛాయలేవీ కనిపించని విధంగా ఉండడం ప్రత్యేకమైన విషయంగా అనిపిస్తుందండీ నాకు.. స్త్రీ వేషధారణకి ప్రసిద్ధి పొందిన నేటి కళా కృష్ణ లాంటి కళాకారుల మామూలు నడకలో కూడా స్త్రీత్వాన్ని గమనించినప్పుడు, స్థానం పాత్రని పాత్రగా మాత్రమే చూడడం అనేదాన్ని జీవితంలో భాగం చేసేసుకున్నారేమో అనిపించింది..

    రిప్లయితొలగించండి