శనివారం, నవంబర్ 25, 2017

మెంటల్ మదిలో ...

సమకాలీన సమాజాన్ని గమనిస్తూ, జీవన శైలిలో వస్తున్న మార్పులని జాగ్రత్తగా రికార్డు చేసుకుని కథ రాసుకుంటే ప్రేక్షకులని థియేటర్లకు రప్పించడం, రెండు గంటల పాటు కూర్చోపెట్టడం సమస్య కాబోదని మరోసారి నిరూపించిన సినిమా 'మెంటల్ మదిలో ...' కొత్త దర్శకుడు వివేక్ ఆత్రేయ తనే రాసుకున్న కథని ఆద్యంతమూ ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఒక చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ అవ్వడంతో కథనం మీద బాగా శ్రద్ధ పెట్టి సినిమాని సాధ్యమైనంత వినోదాత్మకంగా మలిచే ప్రయత్నం చేశాడు.

కథలోకి వెళ్ళిపోతే, గోదావరి యాస మాట్లాడే హైదరాబాద్ కుర్రాడు అరవింద్ కృష్ణ (శ్రీవిష్ణు) మహా కన్ఫ్యూజన్ మనిషి. ఒకటికి మించిన అషన్లు ఎదురైన ప్రతిసారీ ఒకదాన్ని ఎంచుకోవడం అతనికి అసాధ్యం. ఇది రాత్రికి రాత్రికి వచ్చిన సమస్య కాదు. చిన్నప్పటినుంచీ ఉన్నదే. దానికితోడు, బాల్యంలో జరిగిన ఓ సంఘటన కారణంగా ఆడపిల్లల జోలికి వెళ్ళడు. వాళ్ళతో మాట్లాడాలన్నా భయమే. అతను మాట్లాడే స్త్రీ అమ్మ ఒక్కర్తే. పక్కింటి అమ్మాయి మొదలు, ఆఫీసు కొలీగ్స్ వరకూ అందరినీ తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. అమ్మకీ నాన్నకీ ఒక్కడే కొడుకు. పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగం. అయినా కూడా పెళ్లి సంబంధాలు తప్పిపోతూనే ఉంటాయి వరసగా.

ఇరవై తొమ్మిదేళ్ల ఎనిమిది నెలల వయసున్న అరవింద్ కృష్ణ కి పెళ్లి చేయడం వాళ్ళ నాన్న (శివాజీ రాజా) ముందున్న ప్రధానమైన సమస్య. పెళ్ళిచూపులకి వెళ్లి తలొంచుకుని కూర్చునే కుర్రాడిని ఏ అమ్మాయి ఇష్టపడుతుంది? చాలా విచిత్రంగా, స్వేచ్ఛ (నివేదా పేతురాజ్) అతన్ని పెళ్లి చేసుకోడానికి అంగీకరిస్తుంది. ఆమెకి అవే మొదటి పెళ్లిచూపులు. అతగాడు నోరువిప్పి మాట్లాడింది ఆమెతోనే. అక్కడికీ అంటాడు, "తొందరపడకండి.. మీకు మంచి సంబంధం దొరుకుతుందేమో" అని. "నాకేం కావాలో నాకు తెలుసు" అంటుంది స్వేచ్ఛ. పెళ్ళికి ముహూర్తం కుదిరేలోగా ఫోన్లో సంభాషణలు, చాటింగ్స్, ఔటింగ్స్ తో బిజీ అయిపోతుందా జంట.


ఇంతలో ఆఫీసు పని మీద ముంబై వెళ్లిన అరవింద్ కి రేణు (అమృత శ్రీనివాసన్) పరిచయం అయి దగ్గరవుతుంది. కథ మళ్ళీ మొదటికొస్తుంది. ఎవరిని ఎంచుకోవాలి అన్న సమస్య వస్తుంది కథానాయకుడికి. ఆ సమస్య నుంచి అతగాడు ఎలా బయట పడ్డాడు అన్నదే సినిమా ముగింపు. ముందే చెప్పినట్టుగా, కథ కన్నా కథనం బలంగా ఉండడం ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. మొదటి సగం అయితే  'అప్పుడే ఇంటర్వల్ వచ్చేసిందా' అనిపించేలా చకచకా సాగిపోయింది. చాలా మంది కొత్త దర్శకుల్లాగే వివేక్ కూడా రెండో సగంలో కాస్త తడబడ్డాడు.

ఫలితంగా, మొదటి సగంతో పోల్చినప్పుడు కించిత్ సాగతీత అనిపించింది. రెండో సగంలో వినోదం పాళ్ళు తగ్గడం కూడా ఇందుకు కారణమేమో బహుశా. రేణు పాత్రని బలంగా రాసుకుని ఉంటే కచ్చితంగా సినిమా మరో మెట్టు పైన ఉండేది. నటీనటుల్లో శ్రీవిష్ణు, నివేదలు మంచి మార్కులు కొట్టేస్తారు. అరవింద్ కృష్ణ పాత్రని అలవోకగా చేసేశాడు శ్రీవిష్ణు. రేణుగా చేసిన అమృత పాత్రలో స్పష్టత లేకపోవడం ఆమె నటనలోనూ ప్రతిఫలించింది. సపోర్టింగ్ కాస్ట్ లో శివాజీరాజా, అనితా చౌదరి కి చెప్పుకోదగ్గ పాత్రలు దొరికాయి. పాటలు గుర్తుండేలా లేకపోవడం, రెండో సగంలో ఎడిటింగ్ జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు.

ఈ సినిమా టైటిల్ నాకు నచ్చలేదు. ట్రైలర్ అవీ కూడా చూడలేదు. అయితే, సోషల్ మీడియా 'మేధావులు' కొందరికి ఈ సినిమా నచ్చకపోవడంతో నాకు నచ్చుతుందనిపించి చూసేశా. నా అంచనా తప్పలేదు. హీరోలని కాక కథలని నమ్మి సినిమాలు తీస్తున్న రాజ్ కందుకూరిని అభినందించాల్సిందే.

6 కామెంట్‌లు:

  1. మీరు చిన్న సినిమాలకి మాత్రమే సమీక్షలు వ్రాస్తారా?

    రిప్లయితొలగించండి
  2. హహహహ 100 likes for that last paragraph మురళి గారు.. నేను కూడా అలా కొన్ని సినిమాలు చూస్తుంటాను :-) ఈ సినిమా గురించి పాజిటివ్ గా విన్నా కానీ ఇంకా చూడలేదు. మీ రివ్యూ చదివాక మిస్సవకూడదని డిసైడయ్యానండీ..

    రిప్లయితొలగించండి
  3. "సోషల్ మీడియా 'మేధావులు' కొందరికి ఈ సినిమా నచ్చకపోవడంతో నాకు నచ్చుతుందనిపించి చూసేశా.". ... This is wonderful. ;)

    రిప్లయితొలగించండి
  4. @బోనగిరి: అదేమీ లేదండీ.. ఓవరాల్ గా సినిమాలు చూడడం తగ్గింది. చూస్తున్నవి అన్నీ చిన్నవే అవుతున్నాయి.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: మీకూ నచ్చడం సంతోషంగా ఉందండీ.. థాంక్యూ
    @పురాణపండ ఫణి: హహ్హా.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  5. Shivaji raja Anita aren't supporting crew rather support cast. Crew may indicate technicians.

    రిప్లయితొలగించండి