ఆదివారం, డిసెంబర్ 10, 2017

మళ్ళీరావా ...

బ్లాకండ్ వైట్ సినిమాల రోజుల్లో మన హీరోలు బీఏ పాసయ్యాక ప్రేమలో పడే వాళ్ళు.. సినిమాలు కలర్ దారి పడుతున్నప్పుడు బీఏ చదువుకుంటూ, పార్ట్ టైం గా ప్రేమ వ్యవహారాలు చక్కబెట్టుకునే వాళ్ళు. ఓ ఇరవయ్యేళ్ళ క్రితం మొదలైన 'యూత్ సినిమాల' ట్రెండ్ పుణ్యమా అని, ఇంటర్మీడియట్లోనూ, కొండొకచో పదో తరగతిలోనూ నాయికా నాయకులు ఒకర్నొకరు ప్రేమించేయడం మొదట్టేశారు. ఇక ఇప్పుడు, మరో అడుగు ముందుకేసి తొమ్మిదో తరగతిలోనే ప్రేమించేసుకున్న అబ్బాయి అమ్మాయిల కథే 'మళ్ళీరావా ...'

కథనం మీద  ఎక్కువగా దృష్టి పెట్టి చెప్పదల్చుకున్న కథని ఆసాంతమూ ప్రేక్షకులు థియేటర్లో కూర్చుని చూసే విధంగా రాసుకుని సక్సెస్ కొడుతున్న నవ యువ దర్శకుల జాబితాలో గౌతమ్ తిన్ననూరి ని నిస్సందేహంగా చేర్చేయొచ్చు. స్క్రీన్ ప్లే, సంగీతం, ఫోటోగ్రఫీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఈ మధ్య వస్తున్న సినిమాల్లో మంచి ఎడిటింగ్ అనే చెప్పాలి. అనేక కాలాల్లో, అనేక స్థలాల్లో జరిగిన సన్నివేశ శకలాలని ఎలాంటి కన్ఫ్యూజన్ లేనివిధంగా గుది గుచ్చడం గొప్ప విషయమే. ప్రేక్షకులని నవ్వించాలంటే పంచ్ ల కోసం ప్రయాస పడక్కర్లేదని నిరూపించాడు సంభాషణలు తానే రాసుకున్న దర్శకుడు.

కథలోకి వెళ్ళిపోతే, రాజోలు లో పుట్టిపెరిగిన కార్తీక్ (సుమంత్, ఈ సినిమాతో సుమంత్ కుమార్ అయ్యాడు) తొమ్మిదో తరగతిలో కొత్తగా వచ్చి తన స్కూల్ లో చేరిన అంజలి (ఆకాంక్ష సింగ్) తో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోవడంతో ఆగిపోయిన ప్రేమకథ, ఉద్యోగాల్లో చేరిన ఆ ఇద్దరూ అనుకోకుండా కలుసుకోవడంతో కొనసాగి పెళ్లి వరకూ వస్తుంది. చివరి నిమిషంలో తనకా పెళ్లి ఇష్టం లేదని చెప్పిన అంజలి, ఉద్యోగానికి అమెరికా వెళ్ళిపోతుంది.


కొన్నేళ్ల తర్వాత, తన పెళ్లి శుభలేఖతో ఇండియా వచ్చిన అంజలికి అప్పటికీ తననే ప్రేమిస్తున్న కార్తీక్ తారస పడతాడు. ముప్ఫయి రెండేళ్ల మెచ్యూర్డ్ వయసులో అయినా వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారా అన్నది ముగింపు. తొమ్మిదో తరగతి కుర్రాడు ప్రేమలో పడడం అనే విషయాన్ని కన్వీన్సింగ్ గా చెప్పే ప్రయత్నం చేయడంతో పాటు, ఆ ప్రేమని అంగీకరించేందుకు ఆ అమ్మాయికి ఉన్న కారణాలని ఎస్టాబ్లిష్ చేయడం మీదా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, దీనితో పాటు ఎక్కడా బిగి సడలని కథనం కారణంగా ఎండ్ టైటిల్స్ వరకూ ఎక్కడా బోరింగ్ అనిపించదు.

ప్రధాన పాత్రల మీదే కాకుండా ప్రతి పాత్ర మీదా దృష్టి పెట్టడం వల్ల, సినిమా పూర్తయ్యే సరికి కథలో కనిపించే ఏ పాత్రా అనవసరం అన్న భావన కలగదు. మూడో వంతు కథని చిన్నప్పటి ఎపిసోడ్ కోసం కేటాయించిన దర్శకుడు చక్కని నటనని ప్రదర్శించే బాల తారల్ని ఎంచుకున్నాడు. (తొమ్మిదే తరగతి కదా అని సుమంత్ కి క్లీన్ షేవ్ చేసి, నిక్కరేసేయకుండా, ఆ పాత్రకి చిన్న కుర్రాణ్ణి తీసుకోవడం ప్రత్యేకంగా నచ్చేసింది). నాయికా నాయకులతో సమ ప్రాధాన్యం ఉన్న పాత్ర హీరో ఫ్రెండు 'డంబు.' పెద్దప్పటి డంబు కన్నా, చిన్నప్పటి కుర్రాడు భలేగా చేశాడు.

యూత్ సినిమాల్లో హీరోలు కాలేజీ లెక్చరర్ల మీద జోకులు వేసేవాళ్ళు. వాళ్లిప్పుడు పెద్ద వాళ్ళయిపోయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెచ్చేసుకున్నారు కాబట్టి, అవే జోకుల్ని మేనేజర్ల మీద పేల్చారు ఈ సినిమాలో. సాఫ్ట్వేర్ క్రౌడ్ కి బాగా నచ్చేసే విషయం ఇది. నటీనటుల విషయానికి వస్తే, సుమంత్ ఎప్పటిలాగే అభావంగా నటించేసి, హీరోయిన్ కి బాగా పేరొచ్చేందుకు దోహదం చేశాడు. సీనియర్ నటి అన్నపూర్ణకి మంచి పాత్ర దొరికింది. సపోర్టింగ్ కాస్ట్ లో మేనేజర్ గా చేసిన మిర్చి కిరణ్ గుర్తుండిపోతాడు. నా వరకూ, సినిమా కన్నా ముగింపు ఎక్కువగా నచ్చేసింది!!

7 వ్యాఖ్యలు:

Lakshmi చెప్పారు...

ఈ మధ్య కాలం లో తెలుగు సినిమాలకి వెళ్ళాలి అంటే పర్సుకి భారీగా చిల్లెట్టుకుని మరీ తలనొప్పి, మెదడు వాపు వ్యాధీ గట్రా తెచ్చుకోటం అవుతోంది. మీరు బాగుంది అని రాసారు అంటే ఖచ్చితంగా ధైర్యం చేయవచ్చు కాబట్టి ఈ వారాంతంలో మళ్ళీ రావా జిందాబాద్. "సుమంత్ అభావంగా నటించేసి"... వేసుకోండి నాలుగు వీరతాళ్ళు. కాకపోతే మిగతా నక్షత్రాల్లా ముభావంగా నటించలేదు కాబట్టి క్షమించేయవచ్చు.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఆ క్లైమాక్స్ నాక్కూడా బాగా నచ్చేసిందండీ.. గుడ్ మూవీ.. ఏంటో ఈ మధ్య చిన్న సినిమాలు వరసగా మంచివి వచ్చేస్తున్నాయ్ ఆశ్చర్యంగా... నాగ్ కి గీతాంజలి నప్పినట్లు సుమంత్ కి ఈ రోల్ కూడా నప్పేసింది :-)

వంశీ కృష్ణ !! చెప్పారు...

చూసొస్తానండీ :)

వాత్సల్య చెప్పారు...

అభావంగా నటించేసి,వాళ్ళిప్పుడు పెద్దవాళ్ళయిపోయి ...నవ్వకుండా ఉండలేకపోయాను.

బాగుంది సమీక్ష ఎప్పటిలాగే. మీరు వోటేసారు కాబట్టి యూ ట్యూబు లో వచ్చాకా చూడాలి,మాకు ఇక్కడ పెద్ద హీరోల సినిమాలు లేదా మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలే వస్తాయి మరి :(

ఈ మధ్యే నారా రోహిత్ సినిమా అసుర చూసాను, సినిమా బాగుంది, వీలయితే చూడండి యూ ట్యూబులో ఉంది.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

వాత్సల్య గారు సూచించిన "అసుర" మూవీ ఇందాకనే యూట్యూబ్‌లో చూశాను. బాగుంది. విభిన్న కథలతో సినిమాలు చేయడంలో నారా రోహిత్ తన ప్రత్యేకత మరోసారి చూపించాడు. మంచి మూవీ సూచించినందుకు వాత్సల్య గారికి థాంక్స్.

మురళిగారు ఈ మూవీ మీద సమీక్ష వ్రాసారా?

మురళి చెప్పారు...


@లక్ష్మి: అదృష్టవశాత్తూ ముభావం లేదు లెండి :) ..ధన్యవాదాలు
@వేణూ శ్రీకాంత్: అవునండీ.. మంచి చిన్న సినిమాలు రావడమే కాదు, మనం వాటిని చూసే వరకూ (మొదటి వారంలోనే అయినా) థియేటర్లలో ఉంటున్నాయి.. ఇది కూడా సంతోషమే :) ..ధన్యవాదాలు

మురళి చెప్పారు...

@వాత్సల్య: 'అసుర' థియేటర్లో చూడలేదండీ, యూట్యూబ్ లో చూడాలి.. రోహిత్ సినిమాలు సాధారణంగా బావుంటాయి (మరీ ముఖ్యంగా ఇతర వారసుల సినిమాలతో పోలిస్తే మరింత బావుంటాయి).. ధన్యవాదాలు
@విన్నకోట నరసింహారావు: నేనింకా 'అసుర' చూడలేదండీ.. ధన్యవాదాలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి