తెలుగునాట ఆధునిక సాహిత్యానికి శక కర్తగా చెప్పదగ్గ గురజాడ
అప్పారావు పంతులు రాసిన 'కన్యాశుల్కం' నాటకం తొలికూర్పు విడుదలై
నూటపతికేళ్ళు. ఇవాళ్టికీ ఈ నాటకం ప్రేక్షకుల, పాఠకుల ఆదరణ పొందడమే కాదు,
కాల పరీక్షకి నిలబడి భవిష్యత్తు తరాల ఆదరణనీ చూరగొంటుందన్న నమ్మకం
రోజురోజుకీ బలపడుతోంది. "అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష" అని ఈ నాటకంలో
అగ్నిహోత్రావధానులు పాత్ర పలుకుతుందో సన్నివేశంలో. ఆధునిక తెలుగు సమాజానికి
సంబంధించినవి అన్నీ 'కన్యాశుల్కం' నాటకంలో కనిపిస్తాయి అనడంలో అతిశయోక్తి
ఏమాత్రమూ లేదు. కాలం మారినా, సరికొత్త ఆవిష్కరణలు ఎన్ని ప్రవేశించినా మానవ
నైజంలో పెద్దగా మార్పులేవీ రాలేదనడానికి సాక్షిగా నిలబడే నాకటం ఇది.
వేదవ్యాస
విరచిత సంస్కృత భారతాన్ని, తెలుగులోకి అనువదించడానికి శ్రీకారం చుట్టిన
నన్నయ భట్టారకుడిని తొలి తెలుగు రచయితగా గుర్తించింది చరిత్ర. క్రీస్తుశకం
పదకొండో శతాబ్దం నాటి ముచ్చట ఇది. అటుపైని, తిక్కన, ఎఱ్ఱన భారత ఆంధ్రీకరణని
పూర్తిచేశారు. అటుపైని శ్రీనాధుడు, బమ్మెర పోతన, శివకవులు.. ఈ వరుసలో
శ్రీకృష్ణదేవరాయలు అటుపైని తంజావూరుని కేంద్రంగా చేసుకుని పాలించిన
నాయకరాజుల కాలం. నన్నయ నుంచి నాయక రాజుల దగ్గరకి వచ్చేసరికి, సాహితీ శకం
కవుల పేరు నుంచి రాజుల పేరు మీదకి బదిలీ అయింది. అనేక కారణాలకి, నాయక రాజుల
కాలాన్ని సాహిత్యానికి 'క్షీణయుగం' అన్నారు. దేశం పరాయి పాలలోకి వెళ్లడంతో
సహజంగానే కళా సాహిత్యాలు మూలన పడ్డాయి కొంతకాలం.దాదాపు ఇదే సమయంలో భాషా ఉద్యమాలు మొదలై, వాడుక భాషలో కావ్యాలు రాయాలని నిశ్చయించారు వ్యవహార భాషా ఉద్యమకారులు. దైవ లీలలనో, విరహం నిండిన ప్రేమ కథలనో కాక, సామాన్యుల సమస్యలని ఇతివృత్తాలుగా తీసుకుని రచనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది 'కన్యాశుల్కం' నాటకానికి పూర్వరంగం. ఇంగ్లీషు చదువుకున్న వారిలో భావ వైశాల్యం పెరిగి, ఆచారాలుగా చెలామణి అవుతున్న వాటిలో చెడుని గుర్తించి, సంస్కరణ ఉద్యమాలు ఊపందుకున్న సమయం కూడా అదే. ఇంగ్లీషు చదువుకున్న గురజాడ, చుట్టూ జరుగుతున్న భాషా, సంస్కరణ ఉద్యమాలని ఆకళింపు చేసుకున్నారు. విజయనగరం మహారాజు కోరిక మేరకు, బాల్యవివాహ సమస్యని గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి 'నాటకం' సరైన మాధ్యమంగా భావించి రచన ఆరంభించారు.
మనం
ఉన్నది పితృస్వామ్య వ్యవస్థలో. అందుకే, ఓ నవల గురించి లేదా సినిమా గురించి
చర్చ వచ్చినప్పుడు మొదటగా వచ్చే ప్రశ్న 'హీరో ఎవరు?' అని. ఇంతకీ,
'కన్యాశుల్కం' నాటకంలో హీరో ఎవరు? కథానాయక పాత్ర నాటకం/నవల/సినిమాలో
ఆసాంతమూ ఉండాలి. మంచిచెడుల్లో మంచి వైపు నిలబడాలి. దుష్టులకి శిక్షించి,
శిష్టులని రక్షించాలి. ఎంతోకొంత స్వీయ సంస్కారమూ పొందాలి. 'కన్యాశుల్కం' ని
ఆమూలాగ్రం పరిశీలించినప్పుడు, ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకేఒక్క పాత్రగా
'మధురవాణి' నిలబడుతుంది. సౌజన్యారావుపంతులు తో సహా మిగిలిన పాత్రలన్నీ ఆమె
కన్నా ఓ మెట్టు కిందే నిలబడి కనిపిస్తాయి. హాస్యాన్నీ, వ్యంగ్యాన్ని అడ్డం
పెట్టుకుని లోకరీతి మీదా, పెద్దమనుషుల మీదా ఆమె వేసిన చురకలు సామాన్యమైనవి
కాదు.
నూటపాతికేళ్ల కాలంలో 'కన్యాశుల్కం'
నాటకాన్ని గురించి వేల సంఖ్యలో చర్చలు, వందల సంఖ్యలో విమర్శ వ్యాసాలూ
వచ్చాయి. నాటకం మీద, నాటకంలోని పాత్రల మీదా విశ్వవిద్యాలయ స్థాయిలో
పరిశోధనలూ జరిగాయి. అయినా, ఇంకా మాట్లాడుకోడానికి ఇంకా చాలా మిగిలి ఉండడమే ఈ
నాటకం ప్రత్యేకత. 'యద్భావం తద్భవతి' అన్నది ఈ నాటకం విషయంలో అక్షరాలా
నిజం. విజయనగరం మహారాజా తో ఆరంభించి ఎందరో, ఎందరెందరో 'కన్యాశుల్కం'
పల్లకీని మోశారు, మోస్తూనే ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ వారు ఈ నాటకాన్ని
'ఓన్' చేసుకున్నారు. వారి ముద్రశాలలు, మార్కెటింగ్ సౌకర్యాలు,
సాహిత్యవిభాగాల కృషి కారణంగా ఈ నాటకానికి, తద్వారా పార్టీకి కూడా మంచి
ప్రచారం జరిగింది. అదే సమయంలో, ఆ రాజకీయ భావజాలాన్ని వ్యతిరేకించే వారిలో
కొందరు ఈ నాటకం జోలికి పోకుండా 'అదంతా లెఫ్ట్ వ్యవహారం' అని దూరం పెట్టడమూ
నాకు తెలుసు.
ఇప్పటి తరంలో 'కన్యాశుల్కం'
సంబంధీకులని గురించి ప్రస్తావించుకోవాల్సి వచ్చినప్పుడు, మొదట
తల్చుకోవాల్సింది ఇటీవలే స్వర్గస్తులైన ఉపాధ్యాయుల అప్పల (యుఎ)
నరసింహమూర్తి గారిని. "బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం" అన్న శ్రీశ్రీ
వ్యాఖ్యని ఖండించడమే కాదు, ఆ వ్యాఖ్య నాటకం స్థాయిని తగ్గించేలా ఉన్నదని
చెప్పడానికి మొహమాట పడలేదు. గురజాడ సాహిత్యం మొత్తాన్ని 'గురుజాడలు'
పేరుతో ప్రచురించిన 'మనసు' ఫౌండేషన్ వారి కృషిని అభినందించాలి, తెలుగులోనే
కాదు, భారతీయ భాషల్లో ఎక్కడా కూడా ఒక కల్పిత పాత్రకి ఆత్మకథ రాయడం అన్నది
జరగలేదు. ఆ గౌరవం మన మధురవాణి కి దక్కింది. 'మధురవాణి ఊహాత్మక ఆత్మకథ' ని
వెలువరించిన పెన్నేపల్లి గోపాలకృష్ణ కృషికి తగినంత గుర్తింపు రాలేదేమో అన్న
భావన కలుగుతూ ఉంటుంది, ఆ పుస్తకాన్ని తిరగేసినప్పుడల్లా.
నది
ఎప్పుడూ ఒకేలా ప్రవహించనట్టే, భాష కూడా ఎప్పుడూ ఒకేలా సాగదు. కాలం
గడిచేకొద్దీ నదీ గమనంలో మార్పులొచ్చినట్టే, తరాలు గడిచే కొద్దీ వాడుక
భాషలోనూ ఎన్నో మార్పులు వచ్చేస్తాయి. అప్పటివరకూ వాడుకలో ఉన్న పదాలు మరుగున
పడడం, కొత్తపదాలు వచ్చి చేరడం సహజ పరిణామమే. మరి, నూట పాతికేళ్ల నాటి
నాటకంలో అర్ధం కాని పదాలు ఎదురు పడకుండా ఉంటాయా? పాఠకులకి ఎదురయ్యే ఈ
సమస్యని పరిష్కరించారు 'కన్యాశుల్కం పాఠకుడు' మందలపర్తి కిషోర్.
'కన్యాశుల్కం పలుకుబడి' పేరిట ఆయన వెలువరించిన నిఘంటువు పక్కన ఉంటే చాలు,
నాటకం రెండు కూర్పుల్లోనూ ఏ ఒక్క పదమూ అర్ధం కాకపోవడం అన్న సమస్యే రాదు.
ఇప్పటి తరమే కాదు, భవిష్యత్ తరాలు కూడా కిషోర్ కృషిని మెచ్చుకుని తీరాలి.
పఠనాసక్తి
ఉన్నవాళ్లు 'మంచి పాఠకులు' కావాలంటే చదవాల్సిన పుస్తకాల జాబితాలో మొదటి
వరసలో ఉంటుంది 'కన్యాశుల్కం.' రచనలు చేసేవాళ్ళు మంచి రచయితలుగా ఎదగాలంటే
మళ్ళీ మళ్ళీ చదవాల్సిన పుస్తకం 'కన్యాశుల్కం.' " ఈ సమాజం ఎటుపో తోంది?
మనుషులు ఎందుకిలా తయారవుతున్నారు?" లాంటి ప్రశ్నలు తలెత్తిన వెంటనే రిఫర్
చేయాల్సింది 'కన్యాశుల్కం' నాటకాన్నే. ఈ రచనకి రాజకీయాలని ఆపాదించడం అనవసరం అనిపిస్తుంది నాకు. గతంలో ఈ నాటకాన్ని గురించి బ్లాగులో
ప్రస్తావించినప్పటికీ, నూటపాతికేళ్ల సందర్భంగా ఏమన్నా రాయాలి అనిపించింది. ఆ
వెంటనే 'ఒక్కో పాత్రని గురించీ రాస్తే' అన్న ఆలోచన రావడం, బ్లాగు
మిత్రులందరి ప్రోత్సాహంతో అక్షరరూపం దాల్చడం జరిగిపోయింది. మిత్రులందరికీ
ప్రత్యేక కృతజ్ఞతలు.
మొత్తంమీద దీక్ష పూర్తి చేశారు. అభినందనలు. శ్లాఘించదగిన ప్రయత్నం 👏
రిప్లయితొలగించండిమీరు గత ఇరవై రోజులుగా వ్రాసినదంతా మరికాస్త విస్తరించి వ్రాస్తే ఒక థీసిస్ తయారవుతుంది. ఏదైనా యూనివర్శిటీ వారు దాన్ని పిహెచ్.డి. డిగ్రీకి అర్హమైనదిగా తీర్మానించే అవకాశాలుంటాయి. ప్రయత్నించి చూడండి. గుడ్ లక్ 👍.
పీహెచ్చడి అను పచ్చడి తెచ్చుకోవ "ఠానికి" ఇంత కషట పడాలా :) జె కె :)
తొలగించండిजिलेबी
మీ రచనలు బాగుంటాయి.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండి@విన్నకోట నరసింహారావు: ముందుగా మీ ప్రోత్సాహానికి ప్రత్యేక కృతజ్ఞతలండీ.. పీహెచ్ డీ ఆలోచన ఇప్పటివరకూ లేదండీ, ఇక మీదట వస్తే మీ సలహా పాటిస్తాను.. ధన్యవాదాలు.
@పూర్వాషాఢ మధు: ధన్యవాదాలండీ..
@జిలేబి: తెచ్చుకుంటున్న వాళ్ళందరూ కష్టపడుతున్నారు కదండీ మరి :) ఈ పోస్టులు ఇష్టంతో రాసినవండీ, వీటికైతే కష్టం ఏమాత్రం లేదు.. ధన్యవాదాలు..
mee postlannee baaguntaayandee.
రిప్లయితొలగించండికాస్త ఆలస్యమైనా తీరుబడిగా ఆస్వాదించాను. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఏదైనా యూనివర్సిటీ మీకు పీహెచ్డీ చదివించుకుంటే బంగారానికి తావి అబ్బినట్టే.
@నీలకంఠ: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: అకడమిక్ స్టైల్ అఫ్ రైటింగ్ వేరేగా ఉందనుకుంటానండీ.. మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది, యిజీనారం మార్కులు పడినట్టే :) ..ధన్యవాదాలు