లౌక్యప్రజ్ఞలో తనని మించిన వాడు లేడని గట్టి నమ్మకం రామచంద్రపురం
అగ్రహారీకుడు రామప్పంతులుకి. కానీ, అదేం చిత్రమో, 'కన్యాశుల్కం' నాటకంలో
రామప్పంతులు చూపించిన లౌక్య ప్రజ్ఞ అంతా అతగాడికే ఎదురు తిరిగింది.
నడివయసుకి వచ్చినా ఇంకా "పడుచు వాణ్ణి" అని చెప్పుకోడం సరదా. పెద్దలిచ్చిన
ఆస్తి కరారావుడు చుట్టేసి, వాళ్ళకీ, వీళ్లకీ జుట్లు మూడేసి జీవితం
సాగిస్తున్నా హోదాకీ, ఫాయాకీ ఎక్కడా లోటు రాకూడదనుకునే స్వభావం.
శాక్తేయుణ్ణి అనీ, యోగ సాధన చేస్తాననీ చెప్పుకునే రామప్పంతులు, 'కామిగాక
మోక్షగామి కాడు' అంటారు కాబట్టే, మధురవాణి ని ఉంచానంటాడు. క్లిష్ట సమయాల్లో
తెచ్చిపెట్టుకున్న బింకం అభినయిస్తాడు కానీ, చచ్చేంత భయస్తుడు. నలుగురూ
గౌరవించ తగ్గ పనులేమీ చేయకపోయినా, అందరిచేతా బహువచనంలో పిలిపించుకోవాలని
మహా పట్టుదల.
తనది ధన జాతకమనీ, వాక్ స్థానమందు బృహస్పతి ఉన్నాడనీ చెప్పుకునే రామప్పంతులుకి, ఇంగ్లీష్ చదువుకోలేదని కించిత్ చింత ఉంది.
"నాకు యింగిలీషే వొస్తే దొరసాన్లు నా వెనకాతల పరిగెత్తరా?" అనుకోగలిగే
ఆత్మవిశ్వాసం అతగాడి సొంతం. తన దండలు సన్నవే అయినా ఉక్ఖు కడ్డీలనీ, తనకి
ఒంటి సత్తువతో పాటు బుద్ధి సత్తువకూడా విపరీతమనీ ప్రచారం చేసుకోవడం
రామప్పంతులుకి ఇష్టమైన పనుల్లో ఒకటి. అసలు 'కన్యాశుల్కం' నాటకంలో మూలకథ
అయిన లుబ్ధావధాన్లు-సుబ్బిల పెళ్లి కుదిర్చింది రామప్పంతులే. అందుకోసం పిసినారి ముసలివాడు లుబ్దావధాన్లు మీద రెండేళ్ల పాటు తన లౌక్య ప్రజ్ఞ అంతా ఉపయోగించాడు. పెళ్ళిచేసుకుంటే డబ్బు ఖర్చు కావడం లోకసహజం, అది కూడా కన్యాశుల్కపు రోజుల్లో వరుడి పక్షానికి ఖర్చులు లావే.
అయితే,
అసాధ్యాలని సాధ్యం చేసే లౌక్యుడు రామప్పంతులు, లుబ్ధావధాన్లుకి పెళ్ళయితే
వల్లమాలిన ధనం వొస్తుందని ఆశ పెడతాడు. ఊళ్ళో ఉన్న సిద్ధాంతి చేతా, ఊరికి
వచ్చిన పండా (ఉత్తరాది పండితుడు) చేతా అదే మాట చెప్పిస్తాడు. పండా అయితే మరో
అడుగు ముందుకేసి, వివాహ, ధన యోగాలు జరగడానికి వీల్లేని మహా యోగాలనీ, పెళ్లి
జరగని పక్షంలో మార్కవో, ధననష్టమో సంభవిస్తుందనీ బెదిరించి, గ్రహశాంతి
చేయమని సూచిస్తాడు. ఇక తప్పనిసరై పెళ్ళికి ఒప్పుకుంటాడు లుబ్ధావధాన్లు.
పెళ్లి పేరు చెప్పి, రెండు పక్షాల దగ్గరనుంచీ ఏదో రూపంలో సొమ్ము లాగాలన్నది
రామప్పంతులు ఆలోచన. "పెళ్ళైతే ధనం ఖర్చవుతుందిగానీ రావడవెలగ?" అని
ఆశ్చర్యపోయిన మధురవాణితో ఒకింత దర్పంగా తను జరిపించిన కథంతా చెప్పిన
రామప్పంతులు, "నీకు మేజువాణి నిర్ణయించుకున్నాను కానూ, నీకు పదిరూపాయలు
సొమ్ము దొరకడం ద్రవ్యాకర్షణ కాదా?" అని బులిపించ ప్రయత్నిస్తాడు.
"నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్యం" అని, మోసానికీ, లౌక్యానికీ మధ్య ఉన్న రేఖామాత్రపు భేదాన్ని
విప్పి చెప్పే రామప్పంతులు, "తాను చేస్తే లౌక్యం, మరోడు చేస్తే మోసం" అన్న
మాటని మాత్రం ఒప్పుకోడు. వ్యవహారం దగ్గర ఎంత నిక్కచ్చిగా ఉంటాడో,
మాయగుంటకి లుబ్ధావధాన్లుతో పెళ్లి నిశ్చయించమని గుంటూరు శాస్త్రులు వేషంలో
ఉన్న కరటక శాస్త్రి వచ్చి వేడుకునే సన్నివేశంలో చూడొచ్చు. పిల్లని అమ్మిన డబ్బుల్లో సగం తనకి ఇచ్చేట్టు అయితేనే, పెళ్లి కుదురుస్తానని
తెగేసి చెప్పడమే కాదు, "పాపపు సొమ్ము మా దగ్గరకు రాగానే పవిత్రమైపోతుంది"
అని తన వాటాని ఘనంగా సమర్ధించుకుంటాడు కూడా. కోర్టులకి సమాంతరంగా దొంగ
సాక్ష్యాల వ్యవస్థనే నడిపించిన వాడు రామప్పంతులు. పాత తాటాకులు అలేఖాలు,
ముప్ఫయ్యేళ్ళ నాటి కాకితాలు, రకరకాల సిరాలే కాదు, గెజిట్ ఆర్డర్ రేటుకి సాక్షులు కూడా సిద్ధంగా ఉంటారు అతగాడి దగ్గర.
అయితే,
అంతటి లౌక్యుడైన రామప్పంతులునీ, లౌక్యుల్ని పిలవడం కోసం పెద్దిపాలెం
పంపేసి, పెళ్లి ముహూర్తం ముందుకి జరిపేసి, పాంచరాత్ర వివాహాన్ని ఏకరాత్రం
చేసేసి, పంతులు తిరిగొచ్చే లోగా కన్యాశుల్కపు సొమ్ముతో ఊరు దాటేసిన కరటకుడి
లౌక్యం ముందు, రామప్పంతులు ఏపాటి అనిపించక మానదు. మధురవాణి దగ్గర గప్పాలు
కొట్టిన ప్రతిసారీ, ఆమెకి చులకనైపోతున్నా తన ప్రయత్నాలు మానుకోడు. అసలు,
మొట్టమొదట ఆమెకి రెండు వందలు అడ్వాన్సు ఇచ్చినప్పుడే గిరీశాన్ని తూలనాడి,
అతగాడి చేతిలోనూ, పూటకూళ్ళమ్మ చేతిలోనూ కూడా దెబ్బలు తింటాడు. అటుపైన,
"నేనే చిన్నతనంలో ఇంగ్లీషు చదివి ఉంటే జడ్జీల ఎదుట పెళపెళలాడించుదును. నాకు
వాక్ స్థానమందు బృహస్పతి ఉన్నాడు. అందుచాతనే యింగిలీషు రాకపోయినా నా ప్రభ
యిలా వెలుగుతూంది" అని ఆరంభించగానే, "మాటలు నేర్చిన శునకాన్ని వేటకి పంపితే
ఉసుకోమంటే ఉసుకోమందిట" అంటూ అంటిస్తుంది మధురవాణి.
లుబ్ధావధాన్లుకి
గిరీశం రాసిన ఉత్తరంలో, "యీ రామప్పంతులు చిక్కులకి జాకాల్, తెలివికి బిగ్
యాస్" అని టీకా టిప్పణి సహితంగా రాయడమూ, లుబ్ధావధానులేమో "గాడిదని ఎందుకు
తెమ్మన్నావయ్యా నా నెత్తిమీదకి?" అని అపార్ధం చేసుకోవడమూడు... నవ్వుకున్నవాళ్ళకి నవ్వుకున్నంత హాస్యం! తన కన్నా వయసులో చాలా పెద్దవాడే అయిన లుబ్ధావధాన్లు తనని కోపంలో ఏకవచన ప్రయోగం చేస్తే
సహించడు. లుబ్ధావధాన్లు కూతురు, వితంతువు అయిన మీనాక్షిని పెళ్లి
చేసుకుంటానని నమ్మించి ఆమెతో సంబంధం నెరపుతాడు రామప్పంతులు. ఓ రాత్రివేళ
లుబ్దావధాన్లుకి పట్టుబడి చావుదెబ్బలు తింటాడు. మధురవాణిని ఉంచుకున్నా, ఆమె
మీద విపరీతమైన అనుమానం. అలాగని ఆమెతో తెగతెంపులు చేసుకోడు.
పోలీసుల్ని ఉపయోగించుకోవడం ఎలాగో రామప్పంతుల్ని చూసి నేర్చుకోవచ్చు.
ప్రధమాంకంలో, గిరీశం చేతిలోనూ, పూటకూళ్ళమ్మ చీపురుతోనూ దెబ్బలు తిన్నప్పడు,
అంత బాధలోనూ కూడా "గవురనుమెంటు జీతవిచ్చుంచిన కనిష్టీబులుండగా మనకెందుకు
శరీరాయాసం?" అంటూ కనిష్టీబుకి కబురంపించమంటాడు మధురవాణితో. మాయగుంటతో పాటు మాయమైపోయిన మధురవాణి కంటె కోసం
పోలీసులనే ఆశ్రయిస్తాడు.కంటె ఇప్పించకపోతే హెడ్ కనిస్టీబు మీద పిటిషన్
వేస్తానంటూ "అక్కరమాలిన లౌక్యాలు" చేస్తాడు కూడా. సౌజన్యారావు పంతులు
తిరస్కారానికి గురైన రామప్పంతులు, బుచ్చమ్మ అబ్ డక్షన్ కేసులో జాతకం
బనాయింపు విషయం బయటపడిపోవడంతో ఫోర్జరీ కేసు భయంతో కోర్టు నుంచి
జారుకున్నాక మళ్ళా కనిపించడు. కోర్టు వ్యవహారాలు అనుభవం అయినవాళ్ళకి
రామప్పంతుల్ని కొత్తగా పరిచయం చేయనవసరం లేదు, ఇవాళ్టికీ.
ఉత్తి భేషజం ప్రదర్శించే వ్యక్తి రామప్పంతులు. అటువంటి వారు కొంతకాలం తమ పబ్బం గడుపుకున్నా తరవాత తరవాత వారికి ప్రతిచోటా చుక్కెదురే అవుతుంది.
రిప్లయితొలగించండి@విన్నకోట నరసింహారావు: నిజమండీ.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి