శనివారం, సెప్టెంబర్ 16, 2017

మీనాక్షి

రామచంద్రపురం అగ్రహారీకుడు లుబ్దావధాన్లు ఏకైక సంతానం మీనాక్షి. లుబ్దావధాన్లు దగ్గర బాగానే డబ్బున్నా, పేరుకు తగ్గట్టే పరమ లోభి. 'కన్యాశుల్కం' ఆశించి, మీనాక్షికి చిన్నప్పుడే ఓ ముసలి వాణ్ణిచ్చి  పెళ్లి చేశాడు. పెళ్ళైన కొద్ది కాలానికే ఆ వరుడు కన్నుమూయడంతో, ఏ ముచ్చటా తీరకుండానే తల చెడి పుట్టిల్లు చేరింది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న మీనాక్షి, పుట్టింటికి తిరిగొచ్చాక తండ్రి ఆలనా పాలనా చూడడం ఆరంభించింది. అయితే, కేవలం తండ్రి చాటు బిడ్డ కాదు మీనాక్షి. ఆమెలో ఓ తిరుగుబాటు ఉంది. జీవితం మీద కొండత ఆశ ఉంది. తనకి జ్ఞానం తెలియని వయసులో జరిగిన పెళ్లి కారణంగా, తను కఠోరమైన జీవితం గడపాల్సిన అవసరం లేదని ఆమె నమ్మకం. అందుకే, తన అవసరాలు తీర్చుకునే దొడ్డిదారి వెతుక్కుంది. ఆ దారి మరేదో కాదు, తన తండ్రి స్నేహితుడు రామప్పంతులు.

తండ్రిమీద అభిమానం ఉన్నా, తన వైవాహిక జీవితం మొగ్గలోనే మాడిపోడానికి అతడే కారణమన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోదు మీనాక్షి. తనకన్నా వయసులో చాలా చిన్నదైన సుబ్బిని తండ్రి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు తనకేమనిపించిందో పైకి చెప్పలేదు మీనాక్షి. ఆ పెళ్లి చెడిపోయి, మాయగుంటతో పెళ్లి నిశ్చయం అయినప్పుడు మాత్రం చాలా మామూలుగా పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంది. ముహూర్తం విషయం తండ్రి తనతో సరిగ్గా చెప్పలేదని సిద్ధాంతి దగ్గర బాధ పడింది కూడా. పెళ్లవ్వగానే ఊరెళ్ళిపోతూ మారువేషంలో ఉన్న కరటక శాస్త్రి మాయగుంట మహేశాన్ని అప్పగించిందికూడా మీనాక్షికే. "మీ పిల్లని నా కడుపులో పెట్టుకోనా తాతయ్యా" అనడమే కాదు, తనకని ఇచ్చిన పులిమొహరుని కూడా మాయగుంట దగ్గరే ఉండనిస్తుంది "దాం దగ్గర ఉంటేనేం, నా దగ్గర ఉంటేనేం" అంటూ.

పెళ్ళిలో రామప్పంతులు చేసిన అల్లరి కారణంగా, తాను పెళ్లాడింది రెండో పెళ్లి పిల్లనేమో అన్న అనుమానం మొదలవుతుంది లుబ్దావధాన్లులో. ఆ పిల్ల మొదటి మొగుడొచ్చి తన పీక నులిమేస్తున్నట్టు పీడకలలు కూడా మొదలవుతాయి. దాంతో ప్రాణభయం పట్టుకుని అల్లరి ఆరంభిస్తాడు. అప్పుడు  అతగాడికి ధైర్యం చెప్పింది మీనాక్షే. "ఒహవేళ రెండో పెళ్లి పిల్ల అయితే మాత్రం గప్ చుప్ అని ఊరుకోవాలి గాని, అల్లరి చేసుకుంటారా? యంతమంది ఈ రోజుల్లో రెండో పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారు కారు? పిల్ల బుద్ధిమంతురాలు. మీ అదృష్టం వల్ల దొరికింది. మాట్లాడక ఊరుకోండి" అని లోకరీతి వివరిస్తుంది. అయినా వినిపించుకోని లుబ్ధావధాన్లు "ఇహ బతకను" అని రాగం అందుకునేసరికి, ఒక్కసారిగా నవ్వుతుంది మీనాక్షి. తనకన్నా చిన్నపిల్లని తన తండ్రి రెండో పెళ్లి చేసుకోడం పట్ల మీనాక్షి ప్రకటించిన తిరస్కారం ఆ నవ్వు.

కానీ, ఆ నవ్వు ఒక్క క్షణమే. అంతలోనే తండ్రి మీద జాలి ముంచుకొస్తుంది ఆమెకి. ధైర్యవచనాలెన్నో చెబుతుంది. కానీ, తండ్రి అవేవీ తలకెక్కించుకోకుండా "దాన్ని కూడా పాడుచేస్తున్నావూ?" అని కొత్త భార్య విషయంలో అనుమానపడ్డప్పుడు, మళ్ళీ తిరస్కారం కనిపిస్తుంది ఆమెలో. "ఇలాంటి మాటలంటేనే నాకు అసయ్యం" అని సూటిగా చెబుతుంది. మాయగుంట మీద మీనాక్షి చూపించిన ప్రేమ తాత్కాలికమే. ఎప్పుడైతే, తన పులిమొహరు తనకి యివ్వలేదో ఆ పిల్ల మీద అనుమానం మొదలవుతుంది. ఒళ్ళు పట్టని కోపం వచ్చి చీపురుకట్టతో కొట్టబోతుంది. "ఛస్తే ఈడ్చి పారేస్తాను" అనడానికి కూడా వెనుకాడదు. ఇహ, పారిపోయిన మాయగుంట ఆచోకీ కనిపెట్టడానికి రంగంలోకి దిగిన పూజారి గవరయ్యని - అంత ఒత్తిడిలోనూ - తర్కంతో ప్రశ్నించింది మీనాక్షే.

మాయగుంటని "దాని మొగుడు యగరేసుకుపోయాడు" అని చెప్పిన గవరయ్యతో, "ఎక్కడికి యగరేసుకు పోయాడు? వాడు ఈ సీసాలో ఉన్నాడన్నారే?" అని అడుగుతుంది మీనాక్షి. గవరయ్య కొంచం అలోచించి, ఇద్దర్నీ సీసాలో బంధించానని సమాధానమిస్తాడు. "యిద్దర్నీ ఓ సీసాలో పెడితే దెయ్యప్పిల్లల్ని పెడతారేమో" అన్న మీనాక్షి సందేహంలో హాస్యం ధ్వనించినా, కొంచం ఆలోచిస్తే ఆమె ఆలోచనలు ఏ దిశగా సాగుతున్నాయో స్పష్టమవుతుంది. రామప్పంతులుతో మీనాక్షి సంబంధం బహిరంగ రహస్యమే. అందరికీ తెలిసినా ఎవరికీ తెలియనట్టే ఉంటారు. ఆర్నెల్లకీ, ఏడాదికీ పీకలమీదకి వచ్చినా, అంతటి లుబ్ధావధాన్లూ డబ్బు ఖర్చు చేసి గండం గట్టెక్కిస్తూ ఉంటాడు. తన ప్రవర్తనకి మీనాక్షి సిగ్గు పడదు, పశ్చాత్తాపం ప్రదర్శించదు. ముసలివాడికి తనని ఇచ్చి కట్టబెట్టడమే దీనికంతటికీ కారణమని ఆమెకి బాగా తెలుసు.

తనని నేడో రేపో వితంతు వివాహం చేసుకుంటాడని ఎదురు చూస్తున్న రామప్పంతులు, ఉన్నట్టుండి మధురవాణిని తెచ్చి పెట్టుకోవడం మింగుడు పడదు మీనాక్షికి. దెయ్యాల మీద నమ్మకం లేకనో, లేక రామప్పంతులు మీద కోపం చేతనో, ఓ అర్ధరాత్రి వేళ తలుపుతట్టిన పంతులికి దిగదుడుపు కూడు చేతికిస్తుంది. "దెయ్యం తిని సచ్చిందా ఏవిటి?" అని ఎదురడుగుతుంది. మధురవాణితో మంచి స్నేహమే ఉన్నా, పంతులుని దక్కించుకుని, తన జీవితాన్ని ఓ గాడిలో పెట్టుకోవడం కోసం మధురవాణి మీద నిందారోపణలకి వెనుకాడదు. "ఆడది నీతి తప్పిన తర్వాత అంతేవిటి, ఇంతేవిటి? అందునా సాంది ఖాయిదాగా ఉండాలనుకోవడం మీదీ బుద్ధి తక్కువ" అని హితబోధ చేస్తుంది కూడా. రామప్పంతులు తనని పెళ్ళాడి తీరక తప్పదని, రాత్రికి రాత్రే ఇల్లు వదిలి అతగాడితో ప్రయాణమైపోతుంది.

మరోపక్క, తన కంటె  తెస్తే కానీ ఇంట్లోకి రానివ్వనని అల్లరిపెడుతుంది మధురవాణి. అదిగో, ఆ సందర్భంలో మీనాక్షికి పంతులు పెట్టిన ముద్దుపేరు 'ఆకు చిట్టెడ.' "పంతులు నన్ను కౌగలించుకుని ఎత్తుకుంటే మా నాన్న చూసి, తన్ని, యిద్దర్నీ ఇంట్లోంచి తగిలేశాడు. నువ్వు హెడ్డు కనిష్టీబుతో పోతున్నావు, నిన్నొదిలేసి నన్ను పెళ్ళాడతానని ఒట్టేసుకున్నాడు. నన్ను లేవదీసుకొచ్చి, నన్ను పెళ్లాడక తప్పుతుందా ఏవిటి?" అని మధురవాణిని అడుగుతుంది మీనాక్షి. "అవశ్యం పెళ్ళాడవలసిందే. పెళ్లాడకపోతే నువ్వు మాత్రం ఊరుకుంటావూ? దావా తెస్తావు. పంతులు గారికి  దావాలంటే సరదానే!" అంటూ పంతులు బలహీనత మీద కొడుతుంది మధురవాణి. ఇంతచేసీ, పంతుల్ని పెళ్ళాడలేక పోయింది మీనాక్షి. ఆ రాత్రే, "చిట్ట పులిని తండ్రొచ్చి వండకి తీసుకుపోయినాడని" దాసరివేషం కట్టిన మహేశం ద్వారా తెలుస్తుంది.

మాయగుంట ఖూనీ కేసు విషయమై సౌజన్యారావు పంతులుని కలిశాక, లుబ్దావధాన్లులో పశ్చాత్తాపం కలగడంతో పాటు, మీనాక్షిని వితంతువుల మఠంలో చేర్చాలని, చదువు, పెళ్లి ఆమె ఇష్టానికి వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. తన భవిష్యత్తుని గురించి మీనాక్షి తెలివైన నిర్ణయమే తీసుకుని ఉంటుంది.

6 కామెంట్‌లు:

  1. మొదట్లో ఎంతో భోగలాలసుడై "నాకు వాక్ స్థానమందు బృహస్పతి వున్నాడు..అందుచేతనే నాకు ఇంగిలీషు రాకపోయినా నా ప్రభ ఇలా వెలుగుతోంది" అంటూ పట్టుమంచం మీద మధురవాణి అందించిన తాంబూలం సేవిస్తూ గోటాలకు పోయిన రామప్పంతులు..చివరికి లుబ్ధావధాని చేతిలో చావుదెబ్బ తిని కుంటుకుంటూ పరుగెత్తుతూంటే..వెనకాలె" దీపవార్పి ప్రమాణం చేసారు..పెళ్ళాడతారా..లేదా?" అంటూ ఆకు చిట్టెడ లాగ మీనాక్షి తరువుతూంది.."నా కంటె తెస్తేనే ఇంటోకి రండి" అని మధురవాణి తలుపుమూసేస్తుంది.. గతిలేక ఏటిగట్టుకి బయలుదేరగా.."యిల్లు..యిల్లనియేవు..యిల్లు నాదనియేవు..నీ ఇల్లు రెక్కాడితే చిలుకా?" అంటూ సాధువు వేషంలో మహేశం వెంటబడతాడు..

    నాటిక చదువుతూ ఆ సీన్ మొత్తం ఊహించుకుంటూ ఉంటే..."వారేవా..క్యా సీన్ హై"అనుకోక తప్పదు..


    రిప్లయితొలగించండి
  2. " ................. నీ యిల్లు యెక్కడే చిలకా? " అనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  3. @విన్నకోట గారూ..auto correction లాగ మనం type చేసింది కాకుండా వేరేపదం పడేస్తున్నాయి..ఈ దిక్కుమాలిన ఫోనులు..నేనూ సరిచూసుకోకుండా "ప్రచురించు" అన్న పదం నొక్కేసాను..
    ధన్యవాదములు..మరియు sorry..

    రిప్లయితొలగించండి
  4. @Voleti, విన్నకోట నరసింహారావు: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  5. మొదట్లో యథాలాపంగా చదివి, ఆలోచించినకొద్దీ నచ్చేసిన పాత్ర మీనాక్షి. (గీతల మధ్య నడవని పాత్రలంటే ఉన్న ఆకర్షణవలన కాబోలు.)

    ఆఖరివాక్యం నచ్చేసింది.

    రిప్లయితొలగించండి
  6. @మీనాక్షి: నిజమేనండీ, గీతలకి శుద్ధ వ్యతిరేకి మీనాక్షి.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి