సంస్కృత పండితుడూ, విజయనగరం నాటక కంపెనీలో
విదూషకుడూ అయిన కరటక శాస్త్రికి ప్రియశిష్యుడు మహేశం. సంస్కృత విద్యార్థి.
కరటకుడి మేనల్లుడు వెంకటేశం ఈడువాడు. అవతలున్నది గురువుగారైనా, మరెవరైనా
ఎలాంటి శషభిషలూ లేకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడ్డం మహేశం నైజం.
అందుకే. "ఈ రోజుల్లో సంస్కృతం చదువు ఎవరికి కావాలి?" అని గురువు గారడిగితే,
"దరిద్రులకి కావాలి" అని ఠపీమని జవాబిస్తాడు. అవును, ఇంగ్లీషు చదువుకోడం
హోదాకి చిహ్నంగా మారిన కాలంలో, తన ఈడు వాడైన వెంకడు తనకి ఇంగ్లీషు వచ్చునని
గర్రా వెలిగిస్తూ ఉన్నప్పుడు మహేశానికి ఆ మాత్రం కడుపు మండడం సహజమే. అంతే
కాదు, ఇంగ్లీష్ చదువంటే ఆషామాషీ కాదని కూడా తెలుసునా కుర్రాడికి. అందుకే,
"నీకు ఇంగ్లీషు చదువుకోవాల్నుందా?" అన్న కరటక శాస్త్రి ప్రశ్నకి,
"చెప్పించే దాతేడీ?" అని ఎదురు ప్రశ్న వేస్తాడు.
ఇంగ్లీషు
చదువులు దేశంలో ప్రవేశించిన తొలినాళ్లలో, ఆ చదువులపై మోజు పెంచుకుని,
చదువుకునే స్తోమతు లేని తొలితరం యువతకి ప్రతినిధి మహేశం. వెంకటేశం ద్వారా
పరిచయమైన గిరీశం ఓ అద్భుతమైన మనిషిగా తోస్తాడు అతనికి. ఇంగ్లీషు మీద మోజుతో
పాటు, తాను నేర్చుకుంటున్న సంస్కృతం ఎందుకూ కొరగానిదన్న భావనా బలపడుతూ
ఉంటుంది. "పనికొచ్చే ముక్క ఒక్కటీ ఈ పుస్తకంలో లేదు. నాలుగంకెలు బేరీజు
వేయడం, వొడ్డీ వాశి కట్టడం కాళిదాసుకేం తెలుసు? తెల్లవాడిదా మహిమ! ఏ
పట్నం యెక్కడుందో, ఏ కొండలెక్కడున్నాయో అడగవయ్యా గిరీశం గార్నీ; నిలుచున్న
పాట్న చెబుతాడు" అని ముచ్చటపడతాడు మహేశం. అంతే కాదు "నాటకంలో నా చేత వేషం
కట్టించి పెద్ద చేంతాళ్ల లాంటి హిందుస్తానీ ముక్కలూ, సంస్కృతం ముక్కలూ
అర్ధం తెలియకుండా భట్టీయం వేయించడానికి మీకు ఓపికుందిగాని, నాకు
నాల్రోజులకో శ్లోకం చెప్పడానికి శ్రద్ధ లేదుకదా?" అని గురువుగారిని
నిలదీయగలడు.
పారిపోయిన
మహేశం మధురవాణి బసకి చేరి, పేకాట సంరంభంలో ఉన్న మధురవాణినీ, ఆమె
స్నేహితుల్నీ రామప్పంతులు గొంతుని అనుకరించి భయపెడతాడు. "వాళ్ళింట ఏవేవి
చిత్రాలు చేశావో చెప్పు?" అని అడిగినప్పుడు, "ముద్దెట్టుకోనంటే చెబుతాను"
అని చెప్పి, "ముద్దెట్టుకుంటే యెంగిలౌతుంది" అంటూ తనకున్న బుద్ధి తన
పెద్దలకి లేదని నిరూపించుకుంటాడు. ఆమె కంటె ఆమెకి ఇచ్చేసి, వేషం విప్పేసి,
దాసరి వేషంలో ఊరు దాటేస్తాడు, రామప్పంతులు భయపడే చావు పాటలు పాడుకుంటూ.
మళ్ళీ మహేశం కనిపించేది, ఖూనీ కేసు హడావిడికి భయపడిన కరటక శాస్త్రి,
శిష్యుడితో సహా విశాఖపట్నంలో ఉన్న మధురవాణి బసకి వచ్చినప్పుడే.
ఆడిన
నాటకానికి గాను గురుశిష్యులిద్దరికీ మఠ ప్రవేశం తప్పదని మధురవాణి
హడలగొడితే, "మా గురువుగారి మాటకేం. అయన పెద్దవారు. ఏం వచ్చినా సర్దుకోగలరు.
నేను పాపం పుణ్యం ఎరగని పసి పిల్లవాణ్ణి. నా ప్రాణానికి నీ ప్రాణం
అడ్డువేశావంటే కీర్తి ఉండి పోతుంది" అనడమే కాదు, అప్పటికప్పుడు
గురువుగారితో తెగతెంపులు చేసుకుని ఆమె శిష్యరికం చేయడానికి సిద్ధపడిపోతాడు. "నీళ్లు తోడుతాను, వంట చేస్తాను. బట్టలు వుతుకుతాను గాని
బ్రాహ్మణ్ణి కదా, కాళ్ళు పట్టమనవు గద?" అన్న అమాయకపు ప్రశ్నతో ఆమెని
నవ్విస్తాడు. మధురవాణి కంటెని లుబ్ధావధాన్లుకి పోస్టులో పంపితే, ఖూనీ
జరగలేదని పోల్చుకుంటారని కరటకుడి ఆలోచన. కంటె తిరిగి వచ్చేవరకూ మహేశాన్ని,
మధురవాణి తాకట్టులో ఉంచుతాడు. వెళ్తూ వెళ్తూ జాగ్రత్తలు చెప్పబోయిన
గురువుగారితో "ఎవరిదగ్గర ఉన్నప్పుడు వారు చెప్పిందల్లా చేయడవే నా నిర్ణయం"
అని తెగేసి చెబుతాడు మహేశం.ఇంగ్లీషు చదువులు చదివాక మహేశం ఇంకెన్ని
చిత్రాలు చేశాడో తెలుసుకునే వీలు లేదుకదా అనిపిస్తూ ఉంటుంది, 'కన్యాశుల్కం'
చదివినప్పుడల్లా.
"లేళ్ళు పరుగెత్తుతే యవడికి కావాలి? పరుగెత్తక పోతే యవడికి కావాలి?" ... ప్రేక్షకులు ఘొల్లున నవ్వు...
రిప్లయితొలగించండి"మా గురువు గారికి దొండకాయ కూరంటే ఇష్టం లేదు..కాని గురువు గారి పెళ్ళాం పెరట్లో దొండపాదు ఉందని రోజూ ఆ కూరే వండుతుంది..బతికున్న వాడి ఇష్టాలే ఇలా తగలడితే..ఇక చచ్చినవాడి ఇష్టాలతో ఏంటని?" ఈ డైలాగ్ మధ్యలో గురువు వెనకాతలే వచ్చి వింటూ..ముఖం మాడ్చుకుంటాడు... ప్రేక్షకులు చప్పట్లు, ఈలలు, నవ్వులు..
నేను నిజంగా చాలా ఎంజాయ్ చేసాను..
ఆడపిల్ల వేషంలో లుబ్ధావధాన్లు వేపు ఓరగా చూడ్డం, పెళ్ళికూతురు గా పసుబ్బట్టలతో తలొంచుకుని కూచోడం.. friends కూడా పోల్చుకోలేనంతగా మేకప్ అవడం..మధురస్మృతులు...
ధన్యవాదములు మళ్ళీ గుర్తుచేసినందుకు...
@Voleti: ప్రేక్షకుల్లో కూర్చుని స్టేజీ మీద నాటకం చూస్తున్నట్టుగా ఉందండీ, మీ జ్ఞాపకాలు చదువుతూ ఉంటే.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి