బుధవారం, జూన్ 28, 2017

గిరిజా కళ్యాణం

యద్దనపూడి సులోచనారాణి నవలలు డిస్ప్లే లో కనిపిస్తూ ఉంటే కనీసం ఒకటైనా తీసుకోకుండా ఉండడం కష్టం. ఇంటికి తెచ్చాక చదవకుండా ఉండడం అంతకన్నా కష్టం. చదువుతున్నంతసేపూ అప్పుడే మొదటిసారి చదువుతున్న అనుభూతి కలగడంతో పాటు, నిజంగా తొలిసారి చదివిన టీనేజీ రోజుల్ని గుర్తు చేసుకోవడం మాత్రం బోల్డంత ఇష్టం. ఈ జాబితాలో తాజా నవల 'గిరిజా కళ్యాణం.' బోల్డన్ని సినిమాలుగానూ, 'రాధ-మధు' లాంటి పాపులర్ టీవీ సీరియల్ గానూ బాగా తెలిసిన కథే అయినా, ఆసాంతమూ ఆపకుండా చదివించింది మాత్రం యద్దనపూడి మేజిక్ అనడానికి అస్సలు సందేహం లేదు.

కథ కన్నా కథనాన్నీ, పాత్రల వ్యక్తిత్వాలనీ నమ్మి నవలలు రాసే నవలాదేశపు రాణి తన బాణీకి కొనసాగింపుగా రాసిన నవల 'గిరిజా కళ్యాణం'. టైటిల్ లోనే చెప్పేసినట్టుగా ఇది గిరిజ అనే అమ్మాయి పెళ్లి కథ. ఈ గిరిజ 'సెక్రటరీ' లో జయంతి, 'జీవనతరంగాలు' లో రోజా లాగ పేదింటి పిల్ల. వాళ్లలాగే చదువుకున్నది, ఆత్మాభిమానం మెండుగా ఉన్నదీను. వ్యతిరేక పరిస్థితులు ఎదురయినప్పుడు తల ఒగ్గ కూడదనీ, ఎదురు నిలిచి పోరాడాలనీ బలంగా నమ్మే గిరిజ, ఆ నమ్మకంతోనే తమ్ముడి ప్రాణాలని కాపాడుకుంది. తల్లీ, తండ్రీ చనిపోతే, తమ్ముడి మీదే ఆశలు పెట్టుకుని జీవిస్తున్న గిరిజకి ఆ తమ్ముడు హార్ట్ పేషేంట్ అని తెలిసినప్పుడు కలిగిన షాక్ తక్కువది కాదు. ఆపరేషన్ నిమిత్తం విరాళాలు అభ్యర్థిస్తూ పేపర్లో ప్రకటన ఇస్తుంది.

తల్లీ తండ్రీ లేని గొప్పింటి కుర్రాడు చందూ. పూర్తి పేరు చంద్రశేఖర్ అయినా, ఫ్రెండ్స్ అందరూ 'చెందూ' అనే పిలుస్తారు. ఇంట్లో తాతయ్య రాజగోపాలరావు, బయటికి వెళ్తే బోల్డంత మంది ఫ్రెండ్స్.. ఇదే చందూ ప్రపంచం. ఏటా తన తల్లి జయంతి రోజున ఒక మంచి పని చేయడం చందూకి చిన్నప్పుడే తాతయ్య చేసిన అలవాటు. ఇరవై ఎనిమిదో పుట్టినరోజు ఉదయాన్నే పేపరు తిరగేస్తున్న చందూకి గిరిజ ఇచ్చిన ప్రకటన కనిపిస్తుంది. ఆపరేషన్ కి అవసరమయ్యే మొత్తం డబ్బుని నమ్మకస్తుడైన పని వాడి చేత గిరిజకి పోస్ట్ చేయిస్తాడు చందూ. అంతే కాదు, ఫ్రమ్ అడ్రెస్ ఆమెకి తెలియకుండా జాగ్రత్త పడతాడు, థాంక్స్ అందుకోడం 'బోర్' అతనికి. అదొక్కటే కాదు, పెళ్లి చేసుకోడం, సంసార జీవితం ఇవన్నీ కూడా 'బోర్' అనే అంటాడు చందూ.


బోల్డంత ఆస్థి, ఎదిగొచ్చిన మనవడూ ఉన్నా రాజగోపాలరావు గారికి రోజులు భారంగా గడుస్తున్నాయి. చందూ పెళ్లి చేయడం ఎలా అన్నది ఆయన సమస్య. చందూ పెళ్ళికి ససేమిరా అంటున్నాడు. ఫ్రెండ్స్ వల్లే చందూ అలా తయారయ్యాడని ఆయన ఫిర్యాదు, అలాగని మనవడిని చిన్న మాట కూడా అనలేనంత ప్రేమ. సరిగ్గా ఇదే సమయంలో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రాజగోపాలరావు, గిరిజ ఎదురు పడతారు. మరికొన్ని పరిణామాల అనంతరం, ఆపరేషన్ పూర్తయిన తమ్ముడితో సహా రాజగోపాలరావు రాజ ప్రాసాదానికి చేరుతుంది గిరిజ. ఇంకొన్ని పరిణామాల తర్వాత చందూకి గిరిజకి పెళ్లవుతుంది. "తాతయ్య బాధ చూడలేక తాళికట్టాను తప్ప, కాపురం చేసే ఉద్దేశ్యం ఏమాత్రం లేదు" అని మొదటి రాత్రే గిరిజకి తేల్చి చెప్పేసి ఫ్రెండ్స్ తో బెంగుళూరు ట్రిప్ కి వెళ్ళిపోతాడు చందూ.

గిరిజ ఆత్మాభిమానానికి, పట్టుదలకి అసలైన పరీక్ష ఇప్పుడు ఎదురవుతుంది. చందూ అంత అవమానం చేశాక ఇంకా ఆ ఇంట్లో ఉండడానికి ఆమె అంతరాత్మ ఒప్పుకోదు. ఆమె తప్ప చందూని బాగు చెయ్యడం ఇంకెవరి వల్లా కాదని తేల్చి చెప్పేస్తారు అనారోగ్యవంతుడైన రాజగోపాలరావు. అంతే కాదు, గిరిజ చందూని చక్కదిద్దితే, గిరిజ తమ్ముడి భవిష్యత్తుని తాను తీర్చిదిద్దుతానని మాటిచ్చేస్తారు కూడా. ఇప్పుడు గిరిజ తమ్ముడి కోసం, ఆ పెద్దాయన కోసం ఆ ఇంట్లో ఉండాలా? లేక "నేను ఛీత్కరిస్తున్నా, కేవలం ఆస్థి కోసమే తాతయ్యని మంచి చేసుకుని ఇంట్లో ఉన్నావు" అని నిత్యం సాధిస్తున్న చందూకి ఎదురు తిరిగి పెళ్లి నుంచి బయటికి వెళ్లిపోవాలా? ఈ విషమ పరిస్థితుల్లో రాజగోపాలరావు మరణించడంతో గిరిజ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది.

ఇంతకీ, చందూకి పెళ్లి మీద అంతటి విముఖత ఎందుకు? రాజగోపాలరావు గారికి గిరిజ అంతగా నచ్చడానికి కారణాలేమిటి? గిరిజ-చందూల పోరులో గెలుపెవరిది? ఇవన్నీ తెలుసుకోవాలంటే 'గిరిజా కళ్యాణం' చదవాల్సిందే. కథని నాటకీయమైన మలుపులు తిప్పడంలో సులోచనారాణి ప్రతిభ పతాక స్థాయిలో కనిపిస్తుందీ నవలలో. అలాగే 'నాటకీయత' మోతాదు మీద ఆమెకున్న పట్టు మరోసారి ఆశ్చర్య పరుస్తుంది పాఠకులని. ఎమెస్కో తాజా ప్రచురణ మార్కెట్లో ఉంది. పేజీలు 280, వెల రూ. 90. (సులోచనారాణి సమగ్ర సాహిత్యం తీసుకురావాలన్న ఆలోచన ఏ ప్రచురణకర్తా చేయడం లేదెందుకన్న ఆలోచన వచ్చింది ఈ నవల చదువుతూండగా).

4 కామెంట్‌లు:

  1. ఆఖరి వాక్యానికి పొలమారిందండీ.. అబ్బే మరోవిధంగా కాదు. ఎదురుగా పేద్ద పుస్తకాన్ని వ్యాసపీఠంలో పెట్టుకున్నట్టనిపించి. :)

    రిప్లయితొలగించండి
  2. ఒక మంచి సినిమాటిక్ కథ.మంచి కాలక్షేపం. అంతకంటే విశేషం నాకేమీ ఈ కథలో కనబడ లేదు. ఐతే, ఇప్పుడొస్తున్న పరమభయంకరమైన జుగుప్సాకరమైన సీరియల్ కథలూ కథనాలకన్నా ఇది వేయి రెట్లు సరళమైన కథా సలక్షణమైన కథా అని మాత్రం ఒప్పుకోవాలి. నవలాకాలపుకథనం కదా.

    రిప్లయితొలగించండి
  3. హహహ సమగ్ర సాహిత్యం అంటే ఎన్ని వాల్యూములవుతాయో అని నవ్వుకుంటూ కిందకి స్క్రోల్ చేసి కామెంట్స్ లో కొత్తావకాయ గారి వ్యాసపీఠం ఊహ చూసి గట్టిగా బయటకే నవ్వేశానండీ :-)

    మీరు పరిచయం చేస్తే ఏ పుస్తకమైనా అర్జెంటుగా చదివేయాలనిపిస్తుంది :-)

    రిప్లయితొలగించండి
  4. @కొత్తావకాయ: హాహాహా.. పోనీ ఒక పుస్తకం కాకపోతే రెండు మూడు భాగాలుగా వేయొచ్చు కదండీ.. వర్క్స్ అన్నీ ఒకేచోట దొరుకుతాయని.. ధన్యవాదాలు..
    @శ్యామలీయం: నిజమేనండీ.. ఫక్తు కాలక్షేపపు నవల.. కాకపొతే సత్కాలక్షేపం, మీరన్నట్టుగా.. ..ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: ఒకేచోట దొరకడంతో ఒక సౌలభ్యం ఉందండీ.. కొనేసుకుని అప్పుడప్పుడూ చదువుకోవచ్చు ఒక్కో నవలా.. అందుకని ఆ ఆలోచన.. ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి