హేమలత లవణం అంతిమయాత్రలో పాల్గొన్న వందలాది మందిలో నేనూ ఒకణ్ణి. అంతకు
ముందెన్నడూ ఆమెని కలవలేదు. ఎన్నో ఏళ్లుగా వినడం తప్ప, కలిసి మాట్లాడడం
వీలవ్వలేదు ఎందుకో. సుప్రసిద్ధ కవి గుఱ్ఱం జాషువా కుమార్తె అనీ, సంఘసేవకుడు
గోపరాజు రామచంద్రరావు (గోరా) కోడలనీ, లవణానికి జీవన సహచరి అనీ తెలుసు.
స్టూవర్టుపురంలో దొంగతనాలు వృత్తిగా జీవించిన కుటుంబాలని మంచి మార్గంలో
పెట్టిన ఘనత హేమలతదే అనీ, ఆదిలాబాద్ జిల్లాలో జోగినులకి పునరావాసం ఆమె
చలవేననీ తెలుసు. ఇంతకుమించి ఆమెని గురించి పెద్దగా వివరాలు తెలియవు.
హేమలత
అంతిమయాత్రలో పాల్గొన్న వారి భావోద్వేగాలు చూసిన తర్వాత, మొదటిసారిగా
ఆమెని గురించి తెలుసుకోవాలి అనిపించింది. 'ఇది నా జీవితం' పేరుతో ఆమె
రాసుకున్న ఆత్మకథకి ఉపశీర్షిక 'మృత్యోర్మా అమృతంగమయ' కావడం కేవలం
యాదృచ్చికమేనా? పుస్తకం చదువుతున్నంత సేపూ, చదివిన తర్వాతా కూడా ఈ ప్రశ్న
నన్ను వెంటాడుతూనే ఉంది. గుర్రం జాషువా పేరున్న కవి, పైగా స్కూల్ మాస్టర్
ఉద్యోగంలో ఉన్నా హేమలత బాల్యం పేదరికంలోనే గడిచింది. గుంటూరు లోనూ,
మద్రాసులోనూ చదువు అనంతరం లవణంతో వివాహం. అటుపై సంఘసేవా కార్యక్రమాలతో
పరిచయం ఏర్పడడం, అవే జీవితం కావడం.. క్లుప్తంగా చెప్పాలంటే ఇదే ఆమె జీవితం.
కానీ, జీవితంలో ఎదురైన ఎత్తుపల్లాలు, ఆటుపోట్లు, వాటిని ఎదుర్కొని
నిలబడ్డ తీరు, అన్నిటినీ మించి పెద్ద సంఖ్యలో అభిమానించే మనుషుల్ని
సంపాదించుకోవడం, వాళ్ళచేత 'అమ్మా' అని పిలిపించుకోవడం.. వీటన్నింటినీ
చెబుతుందీ పుస్తకం. గోరా కోడలు కావడం తన జీవితంలో జరిగిన గొప్ప విషయం
అంటారు హేమలత. అప్పటివరకు ఇంటి బాధ్యతలు, చదువుకి మాత్రమే పరిమితమైన ఆమె
బయటి ప్రపంచాన్ని చూసింది లవణంతో కలిసి చేసిన యాత్రల్లోనే. అయితే, అతి
తక్కువ కాలంలోనే సంఘసేవికగా మారిపోగలగడం వెనుక ఆమెకి ఉన్న దయా గుణం,
స్పందించే హృదయం గట్టి కారణాలు అయి ఉండాలి.
నిజానికి
చిన్న పుస్తకాన్ని మూడు భాగాలుగా చూడాలి. మొదటి భాగం హేమలత బాల్యం.
చిన్నతనపు రోజుల్ని ఒకలాంటి పరవశంతో చెప్పారామె. కవితాత్మక ధోరణిలో సాగే
వాక్యాల వెనుక చుట్టూ ఉన్న ప్రకృతిని అబ్బురంగా చూస్తున్న ఓ చిన్న పాప
కనిపిస్తుంది పాఠకులకి. గృహస్థుగా జాషువాకవి పరిచయమయ్యేది కూడా ఇక్కడే.
తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, ఆటపాటలు, వాటితో పాటే చదువు..
వీటన్నింటి కబుర్లతో సాగుతూ వివాహం నిశ్చయం అవ్వడం వరకూ ఒక ధోరణిలో
సాగుతుంది కథనం. అక్కడి నుంచీ అంతకు ముందు కనిపించని గాంభీర్యాన్ని
గమనించవచ్చు.
ఏమాత్రం పరిచయం లేని వాతావరణంలో ఇమడడం,
నేరస్తుల్లో మార్పు తెచ్చే కార్యక్రమాల నిమిత్తం లవణంతో కలిసి ఉత్తరభారతదేశ
సంచారం, ఈ క్రమంలో పరిచయమయ్యే మనుషులు, జీవితాన్ని పునర్నిర్వచించుకునే
పరిస్థితులు, చెప్పీ చెప్పకుండా వదిలేసిన కొన్ని సంఘటనలు, మలుపులు.. ఇవన్నీ
రెండో భాగం అనుకుంటే, స్వతంత్రంగా సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం ఆరంభించి
స్టువర్ట్ పురం, ఆదిలాబాద్ లలో చేసిన కార్యక్రమాల వివరాలు చివరి భాగం.
అయితే ఈ చివరి భాగం కేవలం ఒక రోజువారీ దినచర్య తాలూకు డాక్యుమెంట్ లాగా
తయారవడం కించిత్ బాధ కలిగించిన విషయం. స్పష్టంగా చెప్పాలంటే ఇది ఒక
కార్యక్రమ వివరాల పట్టికలాగా ఉంది తప్ప 'ఆత్మ' కనిపించలేదు.
మొత్తం మీద చూసినప్పుడు హేమలతది
ప్రత్యేకమైన వ్యక్తిత్వం, జీవితం కూడా. స్టువర్ట్ పురం నుంచీ, ఆదిలాబాద్
నుంచీ ఆమె అంతిమయాత్రకు విజయవాడకి తరలి వచ్చిన వారిలో కొందరు ఊహ తెలిశాక
ఆరోజే మొదటిసారి కన్నీరు పెట్టామని చెప్పారు. వాళ్లంతా ఆమెని మాతృస్థానంలో
గౌరవించిన వాళ్ళే. ఆమెకూడా వాళ్లందరినీ తన జీవితంలో ముఖ్యమైన భాగంగానే
భావించారు.. కానీ, వాళ్ళతో అనుబంధాన్ని గురించి మరికొంచం వివరంగా రాసి ఉంటే
ఆత్మకథ కి నిండుదనం వచ్చి ఉండేది అనిపించింది పుస్తకం చదవడం పూర్తి చేశాక.
(ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురణ, పేజీలు 246, వెల రూ. 140, అన్ని ప్రముఖ
పుస్తకాల షాపులు)
చాలా బాగారాసారండి .. ఇంచుమించుగా మీ అభిప్రాయమే కలిగింది నాకు కూడా .. సమస్యలపై పోరాటాలు.. సాధించిన విజయాలు.. మారిన వ్యక్తుల గాధలు బాగానే ఉన్నా కధనం ఇంకొంచెం సమగ్రంగా ఉంటే బాగుండును అనిపించింది, ఉదాహరణకు స్టువర్టుపురం దొంగల సంస్కరణే తీసుకుంటే దానిపై ఒక పెద్ద పుస్తకమే రాయగల పోరాటం చేసి విజయం సాధించారు కానీ పుస్తకంలో కొన్ని పేజీలకే పరిమతమైపోయింది.. అలానే లవణం గారితో వారి వైవాహిక జీవితం గురించి మరింత చెప్పిఉంటే బాగుండును అనిపించింది, జీవితచరిత్రలలో బాగా ఆకర్షించేవి అప్పటి సాంఘిక సామాజిక అంశాలు ఈ జీవిత కధలో వాటికి చోటు తక్కువగా కల్పించారు అనిపిస్తుంది, ఆయా సమస్యలను చెప్పినా ఎందుకో అసమగ్రంగానే ఉన్నాయి.. అలానే ఒక చోట ప్రపంచంలో ఎక్కడాలేని అంటరానితనం మనదేశంలోనే ఉందనడం కూడా అంత సమంజసంగాలేదు, మన హరిజనులలానే విదేశాలలో నల్లజాతీయులు ఎన్నో బాధలు అనుభవించారు, ఈ సమస్య ఒక దేశానిదో ఒక వ్యవస్థదో కాదు .. మొత్తం మనుష్యజాతిదే .. ఇక ముద్రణ విషయానికొస్తే అక్షర దోషాలు పెద్దగా లేనప్పటికి ముందు పేజీలోని అక్షరాలు వెనుక పేజీలలో కనిపిస్తూ చదవడానికి ఇబ్బందిపెట్టాయి.. .. పుస్తకం చివర్లో "నా దేశం తప్పు అయితే దాన్ని దిద్దుతాను .. నా దేశం ఒప్పు అయితే దాన్ని అనుసరిస్తాను" అన్న మాట మనందరికి ఆదర్శంగా నిలిచిపోతుంది .. తప్పు జరిగితే అసహనం పేరుతో దేశంపై నిందలు వేయకుండా ఆ తప్పులను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తే ఎంత బాగుంటుంది ..
రిప్లయితొలగించండి@సురేష్ మోహన్: నిజమండీ.. ప్రారంభం ఎంత బాగుందో, రాను రాను అంతగా డాక్యుమెంట్ లాగా అయిపోయింది.. మొదట్లో ఉన్న పర్సనల్ టచ్ మధ్యనుంచీ కనిపించలేదు.. చివరి పేజీలైతే కేవలం ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసినట్టే ఉన్నాయి.. శ్రద్ధగా రాసి ఉంటే బావుండేది అని చాలాసార్లు అనిపించింది చదువుతున్నంత సేపూ.. ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండిపుస్తకం మాట ఎలా ఉన్నా మీ విశ్లేషణలు మాత్రం చాలాబాగుంటాయండి .. ఒక్క మాటలో చెప్పాలంటే మీ విశ్లేషణ చదవక ముందు ఒకలా చదువుతా .. మీ విశ్లేషణ చదివాకా దానిప్రకారం ఇంకోసారి చదువుతా .. మీ బ్లాగుతో పాటుగా ఫేస్ బుక్ పేజీ కూడా ఉంటే బాగుంటుందేమోనండి .. మీ బ్లాగు ఎప్పటినుండో చూస్తున్నా ఎప్పుడూ కామెంట్ పెట్టలేకపోయా
రిప్లయితొలగించండి@సురేష్ మోహన్: ఎఫ్బీ కి ఇప్పటివరకూ వెళ్ళలేదండీ.. అందుకే కొంచం టైం దొరుకుతుందేమో నాకు :) ..ఎనీవే, మీ సూచన గురించి ఆలోచిస్తాను.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి