మంగళవారం, ఏప్రిల్ 11, 2017

'గోరాతో నా జీవితం'

ఇప్పటి విజయవాడలో అత్యంత ఖరీదయిన ప్రాంతాల్లో ఒకటైన బెంజ్ సర్కిల్లో 'డాక్టర్ సమరం హాస్పిటల్' గా ప్రసిద్ధమైన విశాలమైన భవనం కొన్ని దశాబ్దాలకి పూర్వం నాస్తికోద్యమానికి ముఖ్య కేంద్రంగా పనిచేసిందనీ, సామాన్య ప్రజలకోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందనీ చెబుతుంది సరస్వతీ గోరా ఆత్మకథ 'గోరాతో నా జీవితం.' కృష్ణా జిల్లా ముదునూరులో ఆరంభమై అటు పిమ్మట బెజవాడని కార్యస్థానంగా చేసుకున్న నాస్తిక కేంద్రం ఆరంభం కావడానికి పూర్వ రంగాన్నీ, నాటి నుంచి నిన్న మొన్నటివరకూ ఆ కేంద్రం కార్యకలాపాలనీ సవివరంగా కళ్ళముందు ఉంచుతుంది.

విజయనగరం పట్టణంలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన సరస్వతి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నారు. తల్లి, తాతల పెంపకంలో నోములు, వ్రతాలు ఆచరించడంతో పాటు పురాణకథలెన్నో విన్నారు. నాటి సంప్రదాయాన్ని అనుసరించి పదో ఏటనే ఆమెకి వివాహం జరిపించారు పెద్దలు. వరుడు కాకినాడ వాస్తవ్యుడు గోపరాజు రామంచంద్రరావు, అప్పటికి డిగ్రీ చదువుకుంటున్నవాడు. చదువయ్యాక తొలుత కోయంబత్తూరు లోనూ, తదుపరి కొలంబో లోనూ పని  రామచంద్రరావు నేపధ్యమూ పూర్తి బ్రాహ్మణ సంప్రదాయమే. అయితే, చుట్టూ ఉన్న వాతావరణం ఆయన్ని నాస్తికుడు 'గోరా' గా మార్చింది. తొలుత ఇష్టం లేకపోయినా, భార్య భర్తని అనుసరించాలన్న ధర్మానికి కట్టుబడి తానూ నాస్తికురాలిగా మారానంటారు సరస్వతి.

కొలంబో ఉండగా తొలిసారి గర్భం దాల్చిన సరస్వతి గ్రహణాన్ని చూడడంతో పాటు, గ్రహణ సమయంలో పళ్ళు తినడం ద్వారా 'గర్భిణులు గ్రహణం చూడకూడదు' అన్నది అర్ధం లేని ఆచారం అని స్వయంగా తెలుసుకున్నారు. అంతేకాదు ఆభరణాలు, బొట్టు, పూలు త్యజించారు కూడా. తొలిచూలు కుమార్తె మనోరమ ఆరోగ్యంగా పుట్టడంతో నాస్తికత్వం మీద బాగా నమ్మకం కుదిరిందని చెబుతూ, 'శాంతి నక్షత్రం' అని పెద్దలు చెప్పినా ధిక్కరించి శాంతులేవీ జరిపించలేదని గుర్తు చేసుకున్నారు. అటుపై మరో నలుగురు అమ్మాయిలు, నలుగురు మగపిల్లలు పుట్టినా ఎవరికీ బాలసారెలు, శాంతులు జరపలేదు. అంతే కాదు, పిల్లల పేర్లు కూడా నాటి సాంఘిక సందర్భాలకు తగినట్టుగానే పెట్టారు.


ఉప్పు సత్యాగ్రహ సమయంలో పుట్టిన అబ్బాయి లవణం, నియంతల మాట శాసనంగా చెలామణి అవుతున్న సమయంలో పుట్టిన కుర్రాడి పేరు నియంత, యుద్ధ సమయంలో జన్మించిన సమరం ఇలా.. అమ్మాయిల పేర్ల విషయమూ అంతే.. తొమ్మిదో సంతానం పేరు 'నౌ.' గోరా నాస్తికత్వం కారణంగా అత్తవారితో వచ్చిన మాట పట్టింపులు, పుట్టింట ఎదురైన అనుభవాలు.. అలాగే చేస్తున్న కాలేజీ లెక్చరర్ ఉద్యోగం మానేసి గోరా నాస్తికోద్యమంలో పూర్తి సమయం పనిచేయాలని నిర్ణయించుకున్న సందర్భం..నగరాలు, పట్టణాల జీవితం తర్వాత మారుమూల పల్లెటూరు ముదునూరులో అక్కడి ప్రజల సహాయంతో జీవించాల్సి వచ్చిన పరిస్థితులు ఇవన్నీ నాటి పరిస్థితులని సరస్వతి గోరా దృష్టికోణం నుంచి చూపిస్తాయి పాఠకులకి.

కేవలం పిల్లల పేర్లు మాత్రమే కాదు, వివాహాలూ ప్రత్యేకంగానే జరిపారు. నలుగురు అమ్మాయిలవీ, పెద్దబ్బాయి లవణానిదీ కులాంతర వివాహాలే. అయితే, మిగిలిన ముగ్గురు అబ్బాయిలు మేనకోడళ్ళని (అక్కల కూతుళ్లు) వివాహం చేసుకున్నారు. నాస్తికోద్యమానికి జనం నుంచి లభించిన మద్దతుని వివరంగా రాసిన సరస్వతి, వ్యతిరేకతని రేఖామాత్రంగా ప్రస్తావించారు. జాతీయ స్థాయికి విస్తరించిన ఉద్యమం, లవణం చొరవతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం, అనేక విదేశీ సంస్థలతో కలిసి పనిచేసిన సందర్భాలనూ గుర్తు చేసుకున్నారు సరస్వతి. ఓపక్క నాస్తికోద్యమం నిర్వహిస్తూనే, సత్యాగ్రహ ఉద్యమంలో భాగంగా జైలు జీవితం గడపడం, గాంధీ ఆశ్రమ సందర్శన, అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వైనాన్నీ ప్రస్తావించారు.

గోరా మరణం అనంతరం నాస్తిక కేంద్రం పగ్గాలు చేపట్టిన సరస్వతి అనేక అంతర్జాతీయ సమ్మేళనాలని నిర్వహించారు. కొడుకులు, కూతుళ్లు, కోడళ్ల సహాయంతో మొదలైన స్వచ్చంద సంస్థలు, వాటి కార్యకలాపాలు గోరా స్ఫూర్తిని కొనసాగించడానికి ఏవిధంగా సాయపడ్డాయో చెప్పారు. తన ఎనభయ్యో ఏట ఆమె అక్షరబద్ధం చేసిన 27 అధ్యాయాలకి తోడు, ఎనిమిది పదుల తర్వాత అంటూ తర్వాత ఆమె నిర్వహించిన కార్యక్రమాల వివరాలనూ, ఆమె మరణించినప్పుడు పత్రికల్లో వచ్చిన నివాళి వ్యాసాలనూ చివర్లో జత చేశారు. సంప్రదాయ నేపధ్యం నుంచి వచ్చిన ఓ స్త్రీ దృష్టి కోణం నుంచి నాస్తికోద్యమాన్ని, అదే కాలంలో జరిగిన ఇతర సంఘ సంస్కరణ కార్యక్రమాలని గురించి తెలుసుకోడానికి ఉపయోగపడుతుందీ పుస్తకం. (ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురణ, పేజీలు 224, వెల రూ. 150).

ఆదివారం, ఏప్రిల్ 09, 2017

చెలియా

సినిమా హాల్ నుంచి  బయటికి రాగానే నేను చేసిన మొదటి పని 'ఈ సినిమాకి ఎడిటర్ నిజంగా అక్కినేని శ్రీకర్ ప్రసాదేనా, నేనేమన్నా పొరబడ్డానా?' అని చెక్ చేసుకోవడం. ఎడిటింగ్ విభాగంలో జాతీయ స్థాయి అవార్డులు అందుకున్న ఒక ఎడిటర్ పని చేసిన సినిమాకి 'నిడివి' సమస్య కావడం అన్నది చాలా ఆశ్చర్య పరిచే విషయం. కానీ, మణిరత్నం తాజా సినిమా 'చెలియా' విషయంలో జరిగింది అదే. మొదటి సగంలో కొద్దిగానూ, రెండో సగంలో బాగానూ సినిమాను సాగతీస్తున్నారన్న భావన కలగడం. దీనితో పాటు మరికొన్ని ఇబ్బందిగా అనిపించిన విషయాలూ, బోల్డన్ని నచ్చేసిన సంగతులూ ఉన్న 'చెలియా' మణిరత్నం మార్కు ప్రేమకథ.

కథ కార్గిల్ యుద్ధానికి కొన్ని నెలల ముందుది. భారత వాయుసేనలో పనిచేసే వీసీ (కార్తీ) సాహసం, తెగింపు ఉన్న యువకుడు. తనమాటే నెగ్గాలన్న పంతం సరేసరి. అదంతా తాను చేస్తున్న వృత్తి కారణంగా వ్యక్తిత్వంలో వచ్చిన మార్పు అంటాడతను. అతను పనిచేస్తున్న శ్రీనగర్ లో ఆర్మీ హాస్పిటల్ లో డాక్టర్ గా చేరుతుంది లీలా అబ్రహాం (అదితీరావు హైదరీ). ఆమె మిలటరీ కల్నల్ కి మనవరాలు, క్రిమినల్ లాయర్ కి కూతురు. అన్న రవి వాయుసేనలో పనిచేస్తూ, విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోతాడు. ఆమె పన్నెండో తరగతి చదువుతుండగా జరిగిన ఈ సంఘటన లీలని ఆర్మీ హాస్పిటల్ లో ఉద్యోగంలో చేరేలా పురిగొల్పుతుంది.

వీసీ తన స్నేహితురాలితో షికారుకు వెళ్ళినప్పుడు జరిగిన ఓ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడడంతో దూరంగా ఉన్న ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్ కి కాకుండా దగ్గరలో ఉన్న ఆర్మీ హాస్పిటల్ లో చేరుస్తారు. లీల మొదటి పేషెంట్ అతడే. బలమైన వ్యక్తిత్వం, స్వతంత్ర భావాలూ ఉన్న అమ్మాయి లీల. తనపై మరొకరి పెత్తనాన్ని ఏమాత్రం సహించలేదు. అయితే వీసీ ఇందుకు పూర్తిగా విరుద్ధం. తనవాళ్లంతా తాను చెప్పిన మాట విని తీరాల్సిందే అన్నది అతని పంతం. భావజాలాల మధ్య ఘర్షణ  వీసీ-లీలల ప్రేమని పెళ్లి పీటలు ఎక్కనివ్వదు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వీసీ పాకిస్తాన్ సైనికులకు బందీగా దొరుకుతాడు. జైల్లో అతని పశ్చాత్తాపం మొదలవుతుంది. ఆమెనికలిసి క్షమాపణ కోరాలంటే, దుర్భేద్యమైన జైలు నుంచి బయట పడాలి. ఆపై ఆమెని వెతకాలి.


కార్గిల్ యుద్ధం అనే నేపధ్యాన్ని మినహాయించుకుంటే ఇదో మామూలు ప్రేమకథ. ప్రధాన పాత్రలు రెండూ కూడా మణిరత్నం మార్కు చట్రాల్లో ఉన్నవీ, నిన్నమొన్నటి 'ఓకే బంగారం' తో సహా అనేక సినిమాల్లో చూసేసినవీను. హీరో పట్టుదలకీ, హీరోయిన్ వ్యక్తిత్వానికీ మధ్య జరిగే సంఘర్షణ మొదలు, వాళ్ళిద్దరి మధ్యా జరిగే ప్రి-మారిటల్ సెక్స్ వరకూ అదే మూసలో ఉంటాయి సన్నివేశాలు కూడా. తెలుగు కన్నా తెరమీద పాత్రలు ఇంగ్లీష్, హిందీ, తమిళంలో ఎక్కువగా మాట్లాడతాయి. హాలీవుడ్ సినిమా 'ది షశాంక్ రిడంప్షన్' స్పూర్తితో తీసినట్టు అనిపించే హీరో జైలు బ్రేక్ దృశ్యాలు, అనంతర సన్నివేశాలు ఎంతబాగున్నప్పటికీ, అప్పటికే ప్రేక్షకుడికి మొదలైన సాగతీత భావనలో పడి కొట్టుకుపోతాయి.

బాగున్నవి ఏమీ లేవా అంటే, మొదట చెప్పుకోవాల్సింది రవి వర్మన్ ఫోటోగ్రఫీ, కథానాయిక అదితీరావు హైదరీ, ఏఆర్ రెహ్మాన్ అందించిన నేపధ్య సంగీతం. కాశ్మీర్ అందాలని కెమెరా ఒడిసిపట్టిన తీరు చాలాబాగుంది. చాలా ఫ్రేములు అందమైన గ్రీటింగ్ కార్డులని తలపించాయి. ఇక, రెండో సగం నడుస్తూ ఉండగా ప్రేక్షకులు బయటికి వెళ్లిపోకుండా ఆపిన ఏకైక శక్తి కథానాయిక. అందం-నటన ఒకదానితో ఒకటి పోటీ పడడం అంటే ఏమిటో తెలియాలంటే ఈ సినిమాలో అదితిని చూడాలి. రొమాంటిక్ సన్నివేశాల్లోనూ, ఎమోషనల్ సన్నివేశాల్లోనూ హీరోని డామినేట్ చేసిందనే చెప్పాలి. నావరకు నాకు 'సాగర సంగమం' లో జయప్రద గుర్తొచ్చింది. ఒకానొక సన్నివేశంలో ఓ క్లోజప్ షాట్లో ఆమె రోమాంచితం కావడాన్ని చిత్రించారు దర్శకుడు, కెమెరామన్!

రవివర్మన్ కి కార్తీకి పాత కక్షలు ఏమన్నా ఉన్నాయేమో తెలీదు కానీ, చాలా సన్నివేశాల్లో, మరీ ముఖ్యంగా క్లోజప్ షాట్లలో కార్తీ చాలా పేలవంగా కనిపించాడు. అతను అందంగా కనిపించిన ఫ్రేములు బహు తక్కువ. నటన విషయానికి వస్తే, అక్కడక్కడా 'అపరిచితుడు' లో విక్రమ్ ని అనుకరిస్తున్నాడేమో అన్న అనుమానం కలిగింది కూడా. రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నిడివిలో ఓ ఇరవై నిమిషాలు కత్తిరించి ఉంటే, ప్రేక్షకులు థియేటర్ నుంచి బరువుగా కాక హాయిగా బయటికి వచ్చేవాళ్ళు. ద్వితీయార్ధంలో ముఖ్యమైన సన్నివేశాలతో పాటు, క్లైమాక్స్ తాలూకు ఎమోషన్ నీ సినిమా నిడివి తినేసింది. ఇందుకు దర్శకుడితో పాటు ఎడిటర్ కూడా బాధ్యుడే కదా. అందుకే, ఎడిటర్ టైటిల్ కార్డుని పొరబడ్డానా అని సందేహం కలిగింది నాకు.

గురువారం, ఏప్రిల్ 06, 2017

చిలకమర్తి 'స్వీయ చరిత్రము'

తెలుగునాట తొలితరం సంఘ సంఘ సంస్కర్తల్లో ఒకరు చిలకమర్తి లక్ష్మీ నరసింహం (1867-1946). కందుకూరి వీరేశలింగం అనుయాయిగా సంస్కరణోద్యమంలో పాల్గొన్న చిలకమర్తి కవి, నవలా, నాటక రచయిత కూడా. గోదావరి జిల్లాలో (తర్వాత పశ్చిమ గోదావరి అయ్యింది) ఓ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, స్కూల్ ఫైనల్ వరకూ చదువుకుని, ఉపాధ్యాయ శిక్షణ పొంది, తొలుత ఉపాధ్యాయుడిగా అటుపై పాఠశాల నిర్వాహకుడిగా జీవిక సాగిస్తూనే సంఘ సంస్కరణ, సాహితీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి చిలకమర్తి. ఆయన పేరు చెప్పగానే, నాటక ప్రియులకి 'గయోపాఖ్యానం,' హాస్యప్రియులకి 'గణపతి,' నవలాభిమానులకి 'రామచంద్ర విజయం' గుర్తొచ్చి తీరతాయి. దేశభక్తులు పెదవులు అప్రయత్నంగానే 'భారతఖండంబు చక్కని పాడియావు' అని పలుకుతాయి.

తన గురుతుల్యుడు కందుకూరి బాటలోనే చిలకమర్తి తన ఆత్మకథని రాసుకున్నారు 'స్వీయ చరిత్రము' పేరుతో. బాల్యం, విద్యాభ్యాసం, విధి నిర్వహణ, జీవిక సాగించడంలో ఇబ్బందులు.. వీటన్నింటినీ ఎంత వివరంగా రాశారో, తన రచనల నేపధ్యాన్ని అంత క్లుప్తంగానూ తేల్చేశారు. తాతగారి నుంచీ వారసత్వంగా వచ్చిన పాక్షిక దృష్టి దోషం కారణంగా చదువు కొనసాగించడానికి చాలా కష్టపడ్డ చిలకమర్తి, రాజమహేంద్రవరాన్ని తన కార్యస్థానంగా చేసుకుని చేపట్టిన కార్యక్రమాలు ఒకపక్క, ఒకదానిపై ఒకటిగా మీదపడిన కుటుంబ బాధ్యతల్ని ఒడుపుగా నిర్వహించుకు వచ్చిన తీరు మరో పక్కా, నాటి దేశ సాంఘిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు, చదువుకున్న యువకుల్లో మొదలైన సంస్కరణ, స్వాతంత్రాభిలాష మరో పక్క ముప్పేటగా చేరి ఈ పుస్తకాన్ని ఆసాంతమూ విడవకుండా చదివిస్తాయి.

బాల్యం సాఫీగానే గడిచినా, యవ్వనంలోకి అడుగు పెడుతూ ఉండగానే ఆర్ధిక ఒడిదుడుకులు చవిచూడాల్సి వచ్చింది లక్ష్మీనరసింహం కుటుంబానికి. మేనమామ కుటుంబం చాలా వరకూ ఆదుకున్నా, చదువుతోపాటు సంపాదనా మార్గాలనీ అన్వేషించాల్సి వచ్చింది. ట్యూషన్లు చెప్పడంతో మొదలు పెట్టి, నాటకాలు, నవలలు రాయడం వరకూ అనేక మార్గాల్లో సంపాదించినప్పటికీ ఏనాడూ కేవలం డబ్బు సంపాదనకి మాత్రమే పరిమితమైపోలేదు చిలకమర్తి. సామాజిక స్పృహ కలిగి ఉండడమే కాదు, దేశభక్తి విషయంలో రాజీపడలేదు కూడా. పాఠ్యపుస్తకాలు రాసే రోజుల్లో, ఓ బ్రిటిష్ ప్రచురణ సంస్థ పెద్దమొత్తంలో డబ్బు ఆశ చూపినా "నేనెన్నడూ ఇంగ్లీష్ కంపెనీలకు గ్రంధములు వ్రాసి ఇవ్వను. స్వదేశీయు లెవరేనిజెసి యొక కంపెనీ పెట్టిన పక్షమున వారికి వ్రాసి యిచ్చెదను. లేదా నాకు నేనే వ్రాసుకొనెదను," అన్న స్థిరచిత్తం ఆయనది.


ఔత్సాహిక నటులు, నాటక నిర్మాత ఇమ్మానేని హనుమంతరావు నాయుడు కోరిక మేరకు 'కీచకవధ' నాటకంలో వచన నాటక రచన ఆరంభించిన చిలకమర్తి తర్వాత 'గయోపాఖ్యానం' లాంటి ఎన్నో పద్య నాటకాలు రాశారు. 'గయోపాఖ్యానం' కి ఎనలేని పేరొచ్చినా, ఆయనకి ఇష్టమైన స్వీయ రచన మాత్రం 'ప్రసన్నయాదవం.' పద్యాలు చదవడం చేతకాని నటులకోసం వచనంలో రాసిన నాటకాలన్నిటికీ జనాదరణ లభించడంతో పద్యాలు చేర్చి మలిముద్రణలు ప్రచురించారు. తెలుగు దేశంలో నాటక సమాజాల తొలినాళ్ళని గురించిన సమగ్రమైన వివరాలని తన స్వీయచరిత్రలో గ్రంధస్తం చేశారు చిలకమర్తి. నాటకసమాజాలు నడపడంలో ఉండే ఇబ్బందులతో పాటు, తెరవెనుక రాజకీయాలనూ సందర్భోచితంగా ప్రస్తావించారు. అదేవిధంగా నవలా  ప్రోత్సహించేందుకు పెద్ద మొత్తం నగదు బహుమతులతో పోటీలని నిర్వహించిన విశేషాలనూ చదవొచ్చు.

వీరేశలింగం ఆధ్వర్యంలో జరిగిన సంఘ సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గోవడంతో పాటు, దళితులకోసం ప్రత్యేక పాఠశాల నిర్వహించడం, ఆర్ధిక సమస్యలు ఉన్న పిల్లలకి చదువు కొనసాగేలా సాయం చేయడంతో పాటు, పత్రికా నిర్వహణ ద్వారా సమాజంలోని చెడుని ఎత్తిచూపించి సంస్కర్తగా తనవంతు పాత్ర పోషించారు. వితంతువులైన తన మేనకోడళ్ళకి చదువు చెప్పించిన చిలకమర్తి, మరో అడుగు ముందుకు వేసి పునర్వివాహం జరిపించలేక పోవడానికి అడ్డొచ్చిన పరిస్థితులని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. కందుకూరి తర్వాత తాను అంతగా గౌరవించిన పిఠాపురం రాజాని పదేపదే తల్చుకున్నారు. స్వీయ పోషణ నిమిత్తం, సంస్కరణ కార్యక్రమాలు కొనసాగించే నిమిత్తం రాజావారు చేసిన ఏర్పాటు తర్వాతి కాలంలో దివాణం రాజకీయాల కారణంగా క్షీణించిన వైనాన్ని వివరంగానే చెప్పారు.

కొన్ని విషయాలని గురించి విస్తారంగా రాసిన చిలకమర్తి మరికొన్ని విషయాలని ఏమాత్రం ప్రస్తావించక పోవడం ఆశ్చర్యపరిచింది. ఉదాహరణకి, నా చిన్నప్పుడు బరువుగా సాగే వేసవి మధ్యాహ్నాలని అతి తేలిగ్గా మార్చేసిన 'గణపతి' నవల ప్రస్తావన రేఖామాత్రంగా కూడా ఎక్కడా కనిపించలేదు. అంతే కాదు, ప్రస్తావించిన రచనల తాలూకు పూర్వరంగాన్నీ వివరించలేదు. 'వారు నాటకం రాయమని కోరారు.. రాసిచ్చాను.. వీరు నవల రాయమన్నారు రాసిచ్చాను' తప్ప అంతకు మించిన వివరం పెద్దగా కనిపించదు మొత్తం పుస్తకంలో. బ్రిటిష్ పాలనలో ఆంద్ర దేశపు తీరు తెన్నులను, సంస్కరణల ఫలితంగా సంప్రదాయాల్లో తొంగిచూస్తున్న మార్పులని రికార్డు చేసిన ఆత్మకథ ఇది. పరిశోధకులెవరైనా పూనుకుని, చిలకమర్తి రచనల తాలూకు నేపధ్యాలను ప్రచురిస్తే బాగుండును. (ప్రాచీ పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 410, వెల (2007 నాటి ముద్రణ) రూ. 125).

ఆదివారం, ఏప్రిల్ 02, 2017

ఓ హత్యకేసు

ఆ హత్య జరిగి తొమ్మిదేళ్లు దాటింది. మొన్నటి వరకూ నిందితుడిగా చెప్పబడిన వ్యక్తిని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఇవాళే అతను జైలు నుంచి విడుదల అయ్యాడు? మరి అసలు నిందితుడు ఎవరు? ఏమయ్యాడు?? తొలినుంచీ, కేవలం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో పోలీసుల చేత నిందితుడిగా చిత్రింపబడి, కింది కోర్టు చేత యావజ్జీవ జైలుశిక్ష విధింపబడి ఎనిమిదిన్నరేళ్ళ పాటు జైల్లో మగ్గిన సత్యంబాబు నిర్దోషిగా విడుదలవడంతో దాదాపు దశాబ్దం కిందటి కేసు మళ్ళీ వార్తల్లోకి రావడమే కాదు, చర్చనీయాంశం అయ్యింది.

గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన ఆయేషా మీరా అనే పందొమ్మిదేళ్ళ బీఫార్మసీ విద్యార్థిని, విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రయివేటు హాస్టల్లో డిసెంబర్ 27, 2007 న కిరాతకంగా హత్య చేయబడింది. నిందితుడు ఆమెపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడన్న పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా నిందితుడి వేట మొదలు పెట్టిన పోలీసులు, నెల తిరిగేసరికి సత్యంబాబు అనే యువకుడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఓ పక్క విచారణ జరుగుతూ ఉండగానే, సత్యం బాబు నిందితుడు కాడనీ, అసలు నిందితుడు అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓ సీనియర్ నాయకుడి దగ్గర బంధువనీ గగ్గోలు బయలుదేరింది.

పేపర్లలోనూ, టీవీల్లోనూ వచ్చిన ప్రత్యేక కథనాలేవీ పోలీసుల దృష్టిని మళ్లించలేదు. ఒక దశలో పోలీసుల పనితీరు మీద కూడా తీవ్రంగా విమర్శలు రావడంతో పాటు, అప్పటి పోలీసు కమిషనర్ కి నార్కో పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్లూ మొదలయ్యాయి. ఆయేషా తల్లిదండ్రులు సైతం సత్యం బాబు మీద ఎలాంటి అనుమానమూ లేదనీ, అసలు నిందితులు వేరే ఉన్నారనీ పదేపదే ప్రకటించారు. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అయేషా కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో పాటు, చాలా రాజకీయ సభల్లో అయేషా తల్లిచేత మాట్లాడించారు కూడా. అసలు నిందితులని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేది లేదని పదేపదే ప్రకటించారాయన.

ఓపక్క ఇవన్నీ జరుగుతూ ఉండగానే, మరోపక్క చట్టం తనపని తాను చేసుకుపోయింది. పోలీసులు ప్రవేశ పెట్టిన సాక్ష్యాలతో సంతృప్తి చెందిన విజయవాడ మహిళా కోర్టు సత్యంబాబుకి శిక్ష విధించింది. అయితే, సత్యంబాబు నిర్దోషి అని బలంగా నమ్మిన మానవ హక్కుల వేదిక అనే సంస్థ అతనికి న్యాయ సహాయం అందించి, మహిళా కోర్టు తీర్పుని హైకోర్టులో సవాలు చేసింది. ఎనిమిదిన్నరేళ్ళు గడిచాయి. సత్యంబాబు జైలు జీవితం గడుపుతున్నాడు కానీ, బయట ప్రపంచంలో చాలా మార్పులే వచ్చాయి. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో నామరూపాల్లేకుండా పోయింది. నాటి ప్రతిపక్ష నేత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు హైకోర్టులో కేసు గెలిచి సత్యంబాబు నిర్దోషిగా విడుదలయ్యాడు. కోర్టు ఖర్చుల నిమిత్తం అతనికి లక్ష రూపాయలు చెల్లించమని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

తన ఇరవయ్యో ఏట నిందితుడిగా ముద్ర పడి, శారీరకంగానూ, మానసికంగానూ ఎన్నో హింసలకు లోనయ్యి, ముప్ఫయ్యో ఏట నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు కి పదేళ్ల జీవితాన్ని వెనక్కి తెచ్చి ఇచ్చేది ఎవరు? నిర్దోషిగా గుర్తించినందుకు, న్యాయవ్యవస్థని అభినందించాలా? లేక, 'వందమంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ, ఒక్క నిర్దోషి  కూడా శిక్షింపబడకూడదు' అన్న మౌలిక న్యాయసూత్రం అమలుకానందుకు విచారించాలా? సత్యంబాబుకి నష్టపరిహారం చెల్లించాలని అయేషా మీరా తల్లి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.. పదేళ్ల జీవితానికి, చేయని నేరానికి అనుభవించిన శిక్షకి పరిహారం లెక్కించడం సులభమా?

ఇవన్నీ ఒకవైపైతే, రెండోవైపు ప్రశ్నల్లో మొదటిది సత్యంబాబు నిందితుడు కానప్పుడు అసలు నిందితుడు ఎవరు? అతన్ని ఉద్దేశపూర్వకంగా తప్పించిన వారికి శిక్ష ఉంటుందా? ఈ శిక్ష కేవలం పోలీసులకేనా, కింది కోర్టు వారికి కూడానా? ఈకేసులో తొలినుంచీ అనుమానితులుగా చెప్పబడుతున్న రాజకీయనాయకుల కుటుంబం ఇప్పుడు రాష్ట్రంలోని అధికార పార్టీతో అంటకాగుతోంది అంటున్నారు. నాటి ప్రతిపక్ష నేత తన హామీని నిలబెట్టుకుని, నిందితులకి శిక్ష పడేలా చేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు దొరికేసరికి ఇంకెంత కాలం పడుతుందో మరి...