ఇప్పటి విజయవాడలో అత్యంత ఖరీదయిన ప్రాంతాల్లో
ఒకటైన బెంజ్ సర్కిల్లో 'డాక్టర్ సమరం హాస్పిటల్' గా ప్రసిద్ధమైన విశాలమైన
భవనం కొన్ని దశాబ్దాలకి పూర్వం నాస్తికోద్యమానికి ముఖ్య కేంద్రంగా
పనిచేసిందనీ, సామాన్య ప్రజలకోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందనీ చెబుతుంది
సరస్వతీ గోరా ఆత్మకథ 'గోరాతో నా జీవితం.' కృష్ణా జిల్లా ముదునూరులో ఆరంభమై
అటు పిమ్మట బెజవాడని కార్యస్థానంగా చేసుకున్న నాస్తిక కేంద్రం ఆరంభం
కావడానికి పూర్వ రంగాన్నీ, నాటి నుంచి నిన్న మొన్నటివరకూ ఆ కేంద్రం
కార్యకలాపాలనీ సవివరంగా కళ్ళముందు ఉంచుతుంది.
విజయనగరం
పట్టణంలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన సరస్వతి చిన్నతనంలోనే
తండ్రిని పోగొట్టుకున్నారు. తల్లి, తాతల పెంపకంలో నోములు, వ్రతాలు
ఆచరించడంతో పాటు పురాణకథలెన్నో విన్నారు. నాటి సంప్రదాయాన్ని అనుసరించి పదో
ఏటనే ఆమెకి వివాహం జరిపించారు పెద్దలు. వరుడు కాకినాడ వాస్తవ్యుడు గోపరాజు
రామంచంద్రరావు, అప్పటికి డిగ్రీ చదువుకుంటున్నవాడు. చదువయ్యాక తొలుత
కోయంబత్తూరు లోనూ, తదుపరి కొలంబో లోనూ పని రామచంద్రరావు నేపధ్యమూ పూర్తి
బ్రాహ్మణ సంప్రదాయమే. అయితే, చుట్టూ ఉన్న వాతావరణం ఆయన్ని నాస్తికుడు
'గోరా' గా మార్చింది. తొలుత ఇష్టం లేకపోయినా, భార్య భర్తని అనుసరించాలన్న
ధర్మానికి కట్టుబడి తానూ నాస్తికురాలిగా మారానంటారు సరస్వతి.
కొలంబో
ఉండగా తొలిసారి గర్భం దాల్చిన సరస్వతి గ్రహణాన్ని చూడడంతో పాటు, గ్రహణ
సమయంలో పళ్ళు తినడం ద్వారా 'గర్భిణులు గ్రహణం చూడకూడదు' అన్నది అర్ధం లేని
ఆచారం అని స్వయంగా తెలుసుకున్నారు. అంతేకాదు ఆభరణాలు, బొట్టు, పూలు
త్యజించారు కూడా. తొలిచూలు కుమార్తె మనోరమ ఆరోగ్యంగా పుట్టడంతో నాస్తికత్వం
మీద బాగా నమ్మకం కుదిరిందని చెబుతూ, 'శాంతి నక్షత్రం' అని పెద్దలు
చెప్పినా ధిక్కరించి శాంతులేవీ జరిపించలేదని గుర్తు చేసుకున్నారు. అటుపై
మరో నలుగురు అమ్మాయిలు, నలుగురు మగపిల్లలు పుట్టినా ఎవరికీ బాలసారెలు,
శాంతులు జరపలేదు. అంతే కాదు, పిల్లల పేర్లు కూడా నాటి సాంఘిక సందర్భాలకు
తగినట్టుగానే పెట్టారు.
ఉప్పు సత్యాగ్రహ సమయంలో పుట్టిన
అబ్బాయి లవణం, నియంతల మాట శాసనంగా చెలామణి అవుతున్న సమయంలో పుట్టిన
కుర్రాడి పేరు నియంత, యుద్ధ సమయంలో జన్మించిన సమరం ఇలా.. అమ్మాయిల పేర్ల
విషయమూ అంతే.. తొమ్మిదో సంతానం పేరు 'నౌ.' గోరా నాస్తికత్వం కారణంగా
అత్తవారితో వచ్చిన మాట పట్టింపులు, పుట్టింట ఎదురైన అనుభవాలు.. అలాగే
చేస్తున్న కాలేజీ లెక్చరర్ ఉద్యోగం మానేసి గోరా నాస్తికోద్యమంలో పూర్తి
సమయం పనిచేయాలని నిర్ణయించుకున్న సందర్భం..నగరాలు, పట్టణాల జీవితం తర్వాత
మారుమూల పల్లెటూరు ముదునూరులో అక్కడి ప్రజల సహాయంతో జీవించాల్సి వచ్చిన
పరిస్థితులు ఇవన్నీ నాటి పరిస్థితులని సరస్వతి గోరా దృష్టికోణం నుంచి
చూపిస్తాయి పాఠకులకి.
కేవలం పిల్లల పేర్లు మాత్రమే కాదు,
వివాహాలూ ప్రత్యేకంగానే జరిపారు. నలుగురు అమ్మాయిలవీ, పెద్దబ్బాయి లవణానిదీ
కులాంతర వివాహాలే. అయితే, మిగిలిన ముగ్గురు అబ్బాయిలు మేనకోడళ్ళని (అక్కల
కూతుళ్లు) వివాహం చేసుకున్నారు. నాస్తికోద్యమానికి జనం నుంచి లభించిన
మద్దతుని వివరంగా రాసిన సరస్వతి, వ్యతిరేకతని రేఖామాత్రంగా ప్రస్తావించారు.
జాతీయ స్థాయికి విస్తరించిన ఉద్యమం, లవణం చొరవతో అంతర్జాతీయ స్థాయిలో
గుర్తింపు తెచ్చుకోవడం, అనేక విదేశీ సంస్థలతో కలిసి పనిచేసిన సందర్భాలనూ
గుర్తు చేసుకున్నారు సరస్వతి. ఓపక్క నాస్తికోద్యమం నిర్వహిస్తూనే,
సత్యాగ్రహ ఉద్యమంలో భాగంగా జైలు జీవితం గడపడం, గాంధీ ఆశ్రమ సందర్శన, అనేక
ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వైనాన్నీ ప్రస్తావించారు.
గోరా
మరణం అనంతరం నాస్తిక కేంద్రం పగ్గాలు చేపట్టిన సరస్వతి అనేక అంతర్జాతీయ
సమ్మేళనాలని నిర్వహించారు. కొడుకులు, కూతుళ్లు, కోడళ్ల సహాయంతో మొదలైన
స్వచ్చంద సంస్థలు, వాటి కార్యకలాపాలు గోరా స్ఫూర్తిని కొనసాగించడానికి
ఏవిధంగా సాయపడ్డాయో చెప్పారు. తన ఎనభయ్యో ఏట ఆమె అక్షరబద్ధం చేసిన 27
అధ్యాయాలకి తోడు, ఎనిమిది పదుల తర్వాత అంటూ తర్వాత ఆమె నిర్వహించిన
కార్యక్రమాల వివరాలనూ, ఆమె మరణించినప్పుడు పత్రికల్లో వచ్చిన నివాళి
వ్యాసాలనూ చివర్లో జత చేశారు. సంప్రదాయ నేపధ్యం నుంచి వచ్చిన ఓ స్త్రీ
దృష్టి కోణం నుంచి నాస్తికోద్యమాన్ని, అదే కాలంలో జరిగిన ఇతర సంఘ సంస్కరణ
కార్యక్రమాలని గురించి తెలుసుకోడానికి ఉపయోగపడుతుందీ పుస్తకం. (ప్రజాశక్తి
బుక్ హౌస్ ప్రచురణ, పేజీలు 224, వెల రూ. 150).
బావుంది మురళి గారూ..
రిప్లయితొలగించండిమీరు ఈమధ్య విరివిగా పోస్ట్స్ పెడుతున్నందుకు సంతోషంగా ఉంది. అబినందనలు.
మీ కలంనుండి మరో పాకుడురాళ్ళ లాంటి కృష్ణవేణి ని అందిస్తారని ఎదురు చూస్తూ..
మీ అభిమాని,
-భాస్కర్ కూరపాటి.
@భాస్కర్: తప్పకుండానండీ.. ధన్యవాదాలు
రిప్లయితొలగించండి