బుధవారం, నవంబర్ 09, 2016

అమెరికన్ ఎన్నికలూ, ఇండియన్ కరెన్సీ..

నిన్న అర్ధరాత్రి నుంచీ ఈ రెండూ ట్రెండింగ్ టాపిక్స్ అయిపోయాయి.. అటు అమెరికా అధ్యక్ష స్థానానికి జరుగుతున్న ఎన్నికలు.. ఇటు భారతదేశంలో ఉన్నట్టుండి అమలులోకి వచ్చిన కరెన్సీ రద్దు. అప్పటివరకూ అమెరికా ఎన్నికలమీద మాత్రమే దృష్టి పెట్టిన భారతీయలు, ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లని రద్దు చేస్తూ నిన్నరాత్రి ప్రధాని ప్రకటన చేయగానే, ఎన్నికలని తాత్కాలికంగా మర్చిపోయి, ఇవాళ మధ్యాహ్నం తుది ఫలితం వెల్లడయ్యాక మళ్ళీ అమెరికా గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

డెమొక్రటిక్ పార్టీ తరపున హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ తరపున డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థులుగా ప్రకటన వఛ్చిన కొద్దిరోజులకే నాకు ట్రంప్ గెలుస్తాడనిపించింది. దగ్గర మిత్రులు కొందరి దగ్గర అన్నాను కూడా. అమెరికాని బాగా ఫాలో అయ్యేవాళ్ళు కొట్టిపారేశారు. అత్యధిక మెజారిటీతో హిల్లరీ గెలుస్తుందన్నది వాళ్ళ జోస్యం. తక్కువ మెజారిటీతో ట్రంప్ అధ్యక్షుడు అవుతాడన్నది నా నమ్మకం. ఈ నమ్మకం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది, ఒక మహిళని అధ్యక్షురాలిగా ఒప్పుకునేంతగా అమెరికన్లు ఎదిగారా? అన్నది.

రోజులు గడిచే కొద్దీ, ఇద్దరి హామీలు, ప్రచారాలు, ప్రసంగాలు, వాదోపవాదనలు ఇవన్నీ క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నప్పుడు కూడా నా అభిప్రాయం మారలేదు. 'అమెరికాకి ఏం చెయ్యాలి?' అన్న విషయంలో హిల్లరీ కన్నా ట్రంప్ కి ఎక్కువ స్పష్టత ఉందనిపించింది చాలాసార్లు. నేను చదివిన పత్రికలు, చూసిన టీవీ కార్యక్రమాలలో సింహభాగం హిల్లరీకే మద్దతు ఇచ్చాయి. ఓ నెలక్రితం మిత్రులొకరు "ప్రపంచం బాగుపడాలంటే హిల్లరీ గెలవాలి.. అమెరికా బాగుపడాలంటే ట్రంప్ గెలవాలి" అన్నారు. అమెరికన్ ఓటర్లు అమెరికా గురించి ఆలోచిస్తారు కానీ, ప్రపంచం గురించి కాదు కదా అనుకున్నాను నేను.

కొందరు మిత్రులు పట్టు విడవకుండా, "ట్రంప్ గెలిస్తే ఇండియా కి నష్టం తెలుసా?" అంటూ నాలో దేశభక్తిని రగిల్చే ప్రయత్నం చేశారు. నేను మరీ గట్టిగా మాట్లాడితే అలమండ భూవి తగువులా మారే ప్రమాదం కనిపించి, అభిప్రాయలు దాచుకోడం మొదలుపెట్టాను. ఇప్పుడింక ట్రంప్  గెలిచాడు కాబట్టి, క్షణ క్షణముల్ ట్రంప్ చిత్తముల్ కాబట్టి.. ఏరోజు ఏం జరుగుతుందో చూడాలి తప్ప పెద్దగా ఊహించేందుకు ఏమీ ఉండకపోవచ్చు. అయినా ట్రంప్ ఒఖ్ఖణ్ణీ అనుకోడం ఎందుకూ, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ రాత్రికి రాత్రే కరెన్సీ ప్రకటన చేయలేదూ? 'కొంచం ముందస్తుగా తెలిసినా బాగుండేది' అనుకుంటున్న వాళ్ళు చాలామంది నా చుట్టూనే ఉన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమారు నెలక్రితమే నోట్ల రద్దు గురించి ప్రధానికి లేఖ రాశారు. పై సర్కిళ్లకి ముందస్తుగా ఉప్పేమన్నా అంది ఉంటుందా అన్న సందేహం కలుగుతోంది ఇప్పుడు ఆలోచిస్తుంటే. ఐదు వందల రూపాయల నోటు కొత్తది వచ్చేస్తోంది కానీ, వెయ్యి స్థానం లో మాత్రం రెండువేల రూపాయల నోటు వస్తుందని చెబుతున్నారు. "ఈ మొత్తం వ్యవహారంలో సామాన్యుడికి ఒరిగేది ఏమన్నా ఉంటుందో ఉండదో కానీ, ఓ వారం పది రోజుల పాటు కరెన్సీ కష్టాలు మాత్రం ఖాయం" అంటున్నారు మిత్రులు.

నాకైతే మార్కెట్లో మనీ ఫ్లో పెరుగుతుందనిపిస్తోంది. కొన్నాళ్లపాటు రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యి, షేర్ మార్కెట్ పెరగొచ్చు. యాభై రోజుల గడువుంది కాబట్టి, డబ్బు నిల్వలు ఉన్నవాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటారు కాబట్టి, దేశీయంగా ఉన్న నల్లడబ్బు మొత్తం మార్కెట్లోకి వచ్చేస్తుందని అనుకోలేం.. కనీసం కొంతైనా రాకుండా ఉండడం అన్నది మాత్రం అసాధ్యం. డబ్బు కన్నా కూడా ముఖ్యమైన విషయం ప్రజలకి వ్యవస్థ మీద నమ్మకం కలగడం. ఒక్కో వ్యవస్థ మీదా జనానికి నమ్మకం పోతున్న తరుణంలో ప్రభుత్వం గట్టిగా తల్చుకుంటే, డబ్బున్న వాళ్ళని ఇలా కూడా ఇబ్బంది పెట్టగలదు అన్న సందేశం అయితే ప్రజల్లోకి వెళ్తుంది, కచ్చితంగా..

(మరి పేదవాడి ఇబ్బందులో అనొచ్చు, కొంత ఇబ్బంది ఉన్నా కష్టార్జితం రూపాయికి వంద పైసలూ తిరిగి వచ్చేస్తుంది, రాచమార్గంలో.. నల్లడబ్బు నిల్వలున్న వాళ్ళు ఇంత తక్కువ సమయంలో కరెన్సీని మార్చుకోవాలంటే ఎంతో కొంత ఖర్చు పెట్టక తప్పదు.. ఆ మొత్తం తెలుపే అవుతుంది కదా..)

2 కామెంట్‌లు:

  1. మీ అనాలసిస్ కరక్టే...అమెరికన్లు అమెరికా గురించి...వాళ్ళ కష్టాలు తీరుస్తాడని..ట్రంప్ మీద ఆశలు పెట్టుకున్నరన్నది వాస్తవం...అది ఫలితాల్లో నిరూపణ అయ్యింది..ఇక బ్లాక్ మనీ కుప్పలు తెప్పలుగా దాచుకున్న వాళ్ళ పరిస్థితి ఇలానే ఉంటుంది అని ఊహిస్తున్నాం....
    బరేలీలో బయటపడిన వైనం
    బరేలీ (యూపీ), నవంబరు 9: పెద్ద నోట్లపై నిషేధం అప్పుడే నల్లధనంపై ప్రభావం చూపుతోంది. గోతాల్లో నింపి తగలబెట్టిన రూ.1000, రూ.500 నోట్లను ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో గుర్తించారు. గోతాల్లో వేసి మసి చేసిన పెద్ద నోట్లను బరేలీ, సీబీ గంజ్‌లోని పర్సా ఖేడా రోడ్‌లో కనుగొన్నారు. ఓ కంపెనీకి చెందిన ఆ నోట్లను బస్తాల్లో వేసి తీసుకువచ్చిన కార్మికులు కాల్చేసినట్లు సమాచారం. ముందుగా ఆ నోట్లు ముక్కలు చేసి, ఆ తర్వాత తగలబెట్టారని పోలీసులు తెలిపారు. కాగా, కాలిపోకుండా మిగిలిపోయిన కరెన్సీని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆర్‌బీఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ నోట్లు ఎక్కణ్నుంచి, ఎవరు తెచ్చారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని బరేలీ పోలీసులు వెల్లడించారు.
    (ఆంధ్రజ్యోతి డైలీ నుండి)

    రిప్లయితొలగించండి