ఆదివారం, నవంబర్ 13, 2016

నా కరెన్సీ నోట్ల మార్పిడి ...

"ఆదివారం ఉదయాన్నే ఈ క్యూలో నిలబడ్డం ఏమిటో?" నన్ను నేను ప్రశ్నించుకుంటూ మా ఏరియా పోస్టాఫీసు క్యూలో చోటు సాధించాను. పోస్టాఫీసుతో సంబంధబాంధవ్యాలు బాగా తగ్గిపోవడంతో, అక్కడైతే పెద్దగా జనం ఉండరనుకున్నాను కానీ నా అంచనా తప్పింది. ఆదివారం పూటా ఉద్యోగం చేయాల్సి వచ్చిందనో, ఓవర్ టైం భత్యం అనౌన్స్ చేయకుండా డ్యూటీ చేయించేస్తున్నారనో లేక వారి సహజాతమో తెలీదు కానీ స్టాఫందరూ ఒకానొక ప్రముఖ తెలుగు హీరోని గుర్తు చేసేవిధంగా మొహాలు విసుగ్గా పెట్టుకుని కూర్చున్నారు. ఏం చేస్తాం.. అవసరం మనది కదా..

ప్లాస్టిక్ కార్డులు సర్వత్రా రాజ్యమేలుతున్న రోజుల్లో ఇంకా కరెన్సీతో అవసరం ఏమిటన్న ప్రశ్న రావొచ్చు ఎవరికైనా. నిజమే.. నోట్లు అవసరం లేకుండా చాలా పనులు జరిగిపోతున్నాయి. కానైతే కూరల షాపతను, ఇస్త్రీ అబ్బాయి, క్షురకుడు, వీధి చివర కిరాణా అబ్బాయి క్రెడిట్/డెబిట్ కార్డులు అంగీకరించేది లేదని తెగేసి చెప్పాక కరెన్సీ ప్రాధాన్యత ప్రాక్టికల్ గా అర్ధమయ్యింది. మామూలుగా అయితే నాల్రోజుల్లో అంతా సర్దుకుంటుంది లెమ్మని ఊరుకోవచ్చు కానీ, పరిస్థితి చక్కబడడానికి కనీసం కొన్ని వారాలు పడుతుందని సాక్షాత్తూ అరుణ్ జైట్లీ చెప్పాక కూడా ఉపేక్షించడం మంచిది కాదు కదా.

పోస్టాఫీసు వాళ్ళు అందుబాటులో ఉంచిన ఫామ్ తీసుకుని అక్కడ సూచించిన కాలాలన్నీ పూర్తి చేశాను. ఇద్దరి తర్వాత నా టర్న్. ఒకింత సంతోషంగా ఫామ్ కౌంటర్ లో ఉన్న ఉద్యోగినికి ఇచ్చాను.. ఏ డినామినేషన్ నోట్లు ఎన్ని అడగాలో మనసులో రిహార్సల్ వేసుకుంటూ. "మీరు సరెండర్ చేయబోయే నోట్ల సీరియల్ నెంబర్లన్నీ వరసగా రాసి, సంతకం పెట్టి, మీ ఫోన్ నెంబర్ వేసి తీసుకురండి" అని ఆవిడ మృదువుగా చెప్పి ఫామ్ నా చేతికి ఇచ్చేయడంతో వెనకవాళ్ళు సంతోషించారు. ఆ పని పూర్తి చేసి క్యూలో చేరాను. కాస్త ఓపిక పట్టాక మళ్ళీ నా టర్న్ వచ్చింది. "నా దగ్గర రెండువేల నోట్లు మాత్రమే ఉన్నాయండీ.. మీకు వందలు కావాలంటే పక్క క్యూలో నిలబడండి," దూరదర్శన్ శాంతిస్వరూప్ ని జ్ఞాపకం చేస్తూ ప్రతి అక్షరం స్పష్టంగా పలికిందామె.

పక్కన ఉన్న రెండు క్యూల్లో ఒక చోట జనం తక్కువగా ఉండడంతో చేరిపోయాను.. నోట్లతో వచ్చే వాళ్ళ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నా టర్న్ మళ్ళీ వచ్చింది. ఇక్కడా ఉద్యోగినే. కానైతే ఈవిడ ఫామ్ చూస్తూనే ముఖం చిట్లించి "ఎక్స్చేంజ్ ఇక్కడ కాదు, పక్క కౌంటర్" అని దురుసుగా చెప్పాక కానీ, ముందావిడ మంచితనం అర్ధం కాలేదు. అత్యంత ఆసక్తికరంగా మూడో కౌంటర్లో కూడా స్త్రీమూర్తే! కాకపొతే ఈవిడ డైలీ సీరియల్స్ బాగా చూస్తారనుకుంటా.. ప్రతి పనీ అతి తాపీగా చేస్తున్నారు. నా ముందు వాళ్ళిచ్చిన ఫామ్ కి నోట్లు పిన్ చేయాలి.. స్టాప్లెర్ లో పిన్స్ అయిపోయాయి. ఆవిడ అటెండర్ లో పిలవగా పిలవగా అతగాడు వచ్చాడు. కాసేపటి తర్వాత పిన్నులు తెచ్చాడు. మళ్ళీ వచ్చి వాటిని స్టాప్లర్ లో వేశాడు.. అప్పటివరకూ ఆవిడ కంప్యూటర్ స్క్రీన్ ని శ్రద్ధగా పరికించారు.

ఒక్కో నోటుని పరిశీలిస్తూ, వేసిన నెంబర్లని నోట్ల మీద అంకెలనీ టాలీ చేసుకుంటూ నింపాదిగా ఉలికిపడ్డారు. "ఈ నోట్లన్నీ రాసిన ఆర్డర్లో పెట్టి తీసుకురండి" అని చెప్పి తిప్పి పంపేశారు. నాకు తెలియకుండానే ఊపిరి బిగిసింది. గుండె వేగం హెచ్చింది.. వందనోట్లు వచ్చేస్తాయి అన్న ఆత్రుత నిలబడనివ్వడం లేదు. ఆవిడ నా అప్లికేషన్ ఆసాంతమూ చదివి, ఒకట్రెండు చోట్ల నేను ఎలా రాసి ఉంటే బావుండేదో వివరించి చెప్పి, అప్లికేషన్తో పాటు జత చేసిన ఆధార్ కాపీ మీద నా సంతకం తీసుకున్నారు. హమ్మయ్య.. చివరి ఘట్టం.. ఓ రెండు గంటలు నావి కాకపోతేనేమి.. పనయిపోతోంది.. అనుకుంటున్నానో లేదో ఆవిడ సూటిగా ప్రశ్నించారు "ఆధార్ ఒరిజినల్ ఇవ్వండి?"

అయిపోయింది.. ఆశలన్నీ ఆవిరైపోయాయి.. "తేలేదండీ" తప్పుచేసిన భావన నా గొంతులో పలకలేదెందుకో. ఆధార్ ఒరిజినల్ వెరిఫికేషన్ ఉంటుందని నేనెక్కడా చదవలేదు. అసలు వాళ్లకి అంత టైం ఉంటుందని కూడా అనుకోలేదు. "ఉహు.. ఆధార్ ఒరిజినల్ లేకుండా నోట్లు ఇవ్వడం కుదరదు" ఫామ్ ని సున్నితంగా నా మొహాన కొట్టారు. పొడవాటి క్యూలు ఎందుకు ఉంటున్నాయో బాగా అర్ధమయింది. నా వెనుక ఎవరో డ్వాక్రా మహిళ.. ఎక్కడ తేడా వచ్చిందో గమనించలేదు కానీ.. "తెలుసుకోకుండా ఎందుకు వచ్చేస్తారమ్మా" అని తాపీగా కోప్పడింది కౌంటర్ ఆవిడ. నేను వెనక్కి చూడలేదు. "తెలిత్తే మాకీ తిప్పలెందుకమ్మా" రోషంగా అంది డ్వాక్రా మహిళ. ఆగి, వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయాను, ఆ మహిళని కళ్ళతో అభినందించడం కోసం.. 

10 కామెంట్‌లు:



  1. నోట్ల ప్రహసనంబు నెమలి
    దాట్లకు సరిపోయెగాద దస్కము రాకన్ :)
    కోట్లకొలది రూపాయలు
    యెట్లిక మార్తురు జిలేబి యెవరికి తెలుసూ


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. మీరు ఆ క్యూలో పడ్డ టెన్షన్ మీ అక్షరాల్లో చూడగలిగాను :)

    రిప్లయితొలగించండి
  3. santosham meeru 2 gantale....nenu nilabadina time lo desam daati vellochu....aksharaala 1 day + 4 hours ( totel 12+ 4 = 16hours )for 4000 rs change ( 1000 to 100 rs )

    రిప్లయితొలగించండి
  4. ముందు బేంక్ లో మనీ డ్రా చేసేసుకోవాల్సింది మురళిగారు:( అక్కడైతే ఏదో ఒక వెరిఫికేషన్ మాత్రమే ఉంది కదా.

    రిప్లయితొలగించండి
  5. ఈ మధ్య మునిసిపల్ కారోరేషన్ కు, తాహశీల్దార్ ఆఫీసుకు, కోర్ట్ చుట్టు తిరుగుతున్నాను. అనుభవం ద్వారా గమనించిందేమిటంటే ప్రభుత్వోద్యోగులు చేసే మొదటి పని మీరిచ్చే అప్లికేషన్ ని ఎలా తిప్పి కొడదామా అని భూతద్దాలతో చూస్తారు. రెండోది ఆఫీసుల్లో మహిళా స్టాఫ్ పురుషులతో సంఖ్యా పరంగా దాదాపు సమానంగా ఉంట్టున్నారు. మహిళ ఉద్యోగులైతే నిర్ణయమే తీసుకోరు. పనిని మరింత ఆలస్యం చేస్తారనిపించింది.

    ఒక వి.ఆర్.ఓ. చిన్నపని కొరకు నన్ను 4నెలలు తిప్పుతూంటే, ఒకరోజు సహనం నశించి పోన్ లో అరిచేశాను. అతని స్థానంలో మహిళ ఉంటే మి అనలేక కోపాన్ని అణచుకొని మూసుకొని రావాలి. అతను పని చేయడేమో అని అనుకొన్నాను. కాని రెండు రోజుల తరువాత పని చేశాడు. పురుషులను తిట్టి వచ్చే అవకాశమన్నా ఉంట్టుంది. వాళ్లకి మనం ఇన్ని సార్లు తిప్పుకొన్నామని అనిపించి, పనులు అయ్యే ఛాన్స్ ఉంది. .

    మునిసిపల్ ఆఫీసులో వాటర్ బిల్ రద్దు చేయటానికి దరఖాస్తు పెట్టుకొంటే, అది పై అధికారులతో అప్రువ్ అయింది. (వాస్తవానికి 20ఏళ్ల క్రితమే వాటర్ కనెక్షన్ రద్దు చేశాం. ఎందుకో ఈ మధ్య మళ్ళి 15,000 బిల్ పంపటం మొదలు పెట్టారు). కంప్యుటర్ లో 15,000 స్థానం లో "సున్నా" తో అప్డేట్ చేయటానికి రెండు నెలలు పైగా తీసుకొంట్టున్నారు. ఇది ఏ సాఫ్ట్ వేర్ వాళ్లకి చెప్పినా ప్రపంచ వింతగా అనిపించవచ్చు. కాని ఆమే ఇదొ గొప్ప పనిలా మాపై ఆఫీసు నుంచి అప్డేట్ చేసినట్లు వివరాలు రాలేదు అని చెపుతుంది. ఆ పని చేయవలసిన అధికారి ఒక మహిళ. మీరు అప్డేట్ చేశారా ? అని అడిగినప్పుడల్లా ఇంకొక పది రోజుల తరువాత పోన్ చేయండి అని చాలా బిజి గా ఉన్నట్లు జవాబిస్తుంది. ఇప్పటికి రెండునెలలు దాటింది. ఎప్పటికౌతుందో తెలియదు. మహిళా ఉద్యోగి గనుక గట్టిగా మాట్లాడలేము. వాళ్ళు చెప్పింది వినటం తప్ప.

    ఇక మునిసిపల్ కార్పోరేషన్ లో ఉద్యోగులు అటు మేయ ని,ఇటు కమిష్నర్ ను చూసి భయపడేరోజులు ఎప్పుడో పోయాయి. లోకల్ పేపర్లలో ఎన్ని వార్తలు రాసినా లెక్క చేయరు. వేరే చోటికి బదలి చేస్తే జాయిన్ కూడా కాలేదు. అధికారులకు ఎమి చేయాలో తెలియక జీతం లో కొంత డబ్బును కట్ చేసి, ఆవార్తను ఉద్యోగుల పేర్లను పేపర్లొ ప్రకటించారు. దానిని ఉద్యోగులు పెద్దగా పట్టించుకోలేదు. వారి ప్రవర్తనలో వచ్చిన మార్పేమి లేదు. అలా ఉంది పరిస్థితి.

    కోర్ట్ అనుభవం రాస్తే జోలి యల్.యల్.బి. సినేమా నా అనుభవం ముందు దిగదుడుపు.

    రిప్లయితొలగించండి
  6. హ్మ్.. క్యూలో కష్టాలు కళ్ళకు కట్టారండీ... ఏ కౌంటర్ దేనికో ఒక పేపర్ మీద రాసి ఆ కౌంటర్ పైన అంటించడం, ఎంట్రన్స్ లో అవసరమైన డాక్యుమెంట్స్ గురించి లిస్ట్ పెట్టడం అనేవి కామన్ సెన్స్ ఉన్న ఏ బ్రాంచ్ మేనేజర్ అయినా చేయాల్సిన పనులండీ ఇలాంటి సమయంలో కూడా ఇటువంటి వాటిపట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడం దారుణం.

    అన్నట్లు పాలు కూరలు నిత్యావసరాల కోసం నేను bigbasket.com మీద ఆధార పడ్డానండీ. గుంటూరు విజయవాడ, హైదరాబాద్ లాంటి చోట్ల ఇదే బెస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేయచ్చు. సేం డే డెలివరీ అవకాశం ఉంది ఉదయం ఏడున్నర నుండీ రాత్రి పదిన్నర వరకు డెలివర్ చేస్తారు. ఆర్డర్ చేసిన టైమ్ ని పట్టి మనకి సౌకర్యంగా ఉండే డెలివరీ స్లాట్ ని ఎన్నుకోవచ్చు. కొత్త కస్టమర్స్ కి డిస్కౌంట్స్ కాష్ బాక్ ఆఫర్స్ కూడా ఉంటాయి.

    రిప్లయితొలగించండి
  7. అమ్మో! ఇవి కరెన్సీ కష్టాల్లా లేవండి. సినిమా కష్టాల్లా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  8. @జిలేబీ: ధన్యవాదాలండీ
    @లలిత టీఎస్: టెన్షన్ కాదండీ, రకరకాల ఫీలింగ్స్.. ధన్యవాదాలు
    @ప్రతాప్ రెడ్డి: అవునండీ, కొన్నిచోట్ల పరిస్థితి దారుణంగా ఉంది.. స్పందనకి ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  9. @జయ: పోస్టాఫీసులో రద్దీ తక్కువ ఉంటుందని అటు వెళ్ళానండీ.. ఇప్పుడెలాగూ బ్యాంకుకే వెళ్ళాలి.. ధన్యవాదాలు..
    @యుజి శ్రీరామ్: చాలా చురుగ్గా పనిచేసే ఉద్యోగినులనీ చూశానండీ నేను.. ఈసారే వీళ్లేందుకో అకేషన్ కి రైజ్ అవ్వలేదు.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  10. @వేణూ శ్రీకాంత్: ఆన్లైన్ సౌకర్యాలు చాలానే ఉన్నాయండీ. కానీ, మనుషులతో ఉండే అటాచ్మెంట్ వేరు కదా.. మనకి కష్టం అయితే వాళ్ళకీ కష్టమే కదా అన్న ఆలోచన అంతే.. ధన్యవాదాలు
    @బోనగిరి: ఇప్పుడు కొంచం తగ్గుముఖం పట్టాయండీ.. కొన్నాళ్ళకి నార్మల్ అయిపోవచ్చు.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి