బుధవారం, జూన్ 15, 2016

అఆ

నలభై ఐదేళ్ళ క్రితం సినీ నటి విజయనిర్మల సినిమాకి దర్శకత్వం చేయాలని సబ్జక్ట్ ల కోసం వెతుకుతున్నప్పుడు తన అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి రాసిన 'మీనా' నవల ఆమె దృష్టికి వచ్చింది.  నవలాదేశపు రాణి నుంచి ఆ నవల హక్కులు కొనడం మాత్రమే కాక, టైటిల్ కార్డు ఇచ్చి గౌరవించారు, ఏనాడూ విలువలని గురించి సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇవ్వని విజయ నిర్మల. నాలుగున్నర దశాబ్దాల తర్వాత అదే నవల మళ్ళీ సినిమాగా వచ్చింది 'అఆ' పేరుతో. త్రివిక్రమ్ కి రచయితగానూ, దర్శకుడిగా స్టార్ స్టేటస్ వచ్చేయడం వల్లేమో, హక్కులు కొనడం, టైటిల్ కార్డ్స్ లో 'కథ' అని గౌరవం ఇవ్వడం లాంటి శషభిషలేవీ పెట్టుకోకుండా కథని వాడేసుకున్నారు.

ఈ జనరేషన్లో 'మీనా' నవల చదివిన వాళ్ళూ, సినిమా చూసిన వాళ్ళూ చాలా తక్కువ మంది ఉండడం, త్రివిక్రమ్ కి ఉన్న క్రేజ్, సమంత గ్లామరు, పంచ్ డైలాగులు.. ఇవన్నీ కలిసి సినిమా బాగా నడించేందుకు దోహదం చేస్తున్నాయి. ఓ నవలని సినిమాగా తీసేప్పుడు, నవలలో ఉన్న భావోద్వేగాలన్నీ తెరమీదకి అనువదించడం కుదిరేపని కాదు. నవలకి పెద్దగా లెక్కలుండవు కానీ సినిమాకి తప్పకుండా ఉంటాయి. బహుశా అందువల్లే, అటు విజయనిర్మల, ఇటు త్రివిక్రమ్ కూడా 'మీనా' నవలకి పూర్తి న్యాయం చెయ్యలేక పోయారు. పోల్చి చూస్తే, త్రివిక్రమ్ కన్నా విజయనిర్మలే నవలకి ఎక్కువ న్యాయం చేశారు. ఆమె సినిమా చూసేప్పుడు నలభై ఐదేళ్ళ నాటి సినిమా, దర్శకురాలిగా ఆమె తొలి సినిమా అన్న విషయాలు గుర్తు పెట్టుకోవాలి.

'అఆ' కథలోకి వస్తే, పారిశ్రామికవేత్త మహాలక్ష్మి (నదియా), అడ్వొకేట్ రామలింగం (సీనియర్ నరేష్) ల ఏకైక కూతురు అనసూయ (సమంత). ఇంట్లో మనుషులు ఊపిరి పీల్చడాన్ని కూడా నియంత్రించే టైపు మనిషి మహాలక్ష్మి. సహజంగానే తండ్రికి దగ్గరవుతుంది అనసూయ. తల్లి మీద ఉన్న వ్యతిరేకత కారణంగానే ఆమె చూసిన పెళ్లి సంబంధాన్ని ఇష్ట పడదు. అనుకోకుండా తల్లి చెన్నై వెళ్ళడంతో, ఆ పదిరోజులూ తల్లి పేరు వినిపించని చోటికి వెళ్ళాలనుకుంటుంది. రామలింగం ఆమెని కలువపూడిలో ఉన్న మహాలక్ష్మి అన్న ఇంటికి పంపుతాడు. ఆ అన్నకొడుకు ఆనంద్ విహారి (నితిన్) తో అనసూయ ప్రేమలో పడడంతో కథ మలుపు తిరిగి, మహాలక్ష్మి-అనసూయల మధ్య దూరం తగ్గడంతో సినిమా ముగుస్తుంది.


'అనసూయ రామలింగం వెర్సస్ ఆనంద్ విహారి' అన్న పూర్తి పేరుకి 'అఆ' అని షార్ట్ కట్ ఇచ్చిన దర్శకుడు, ఆనంద్ విహారిని పెద్దగా పట్టించుకోకుండా అనసూయ మీద దృష్టి కేంద్రీకరించాడు. తల్లి నీడనే ఉంటూ, బలవంతంగా తల్లి మాటలకి తల ఊపుతూ, లోలోపల నలిగిపోయే అనసూయగా సమంతకి మంచి పాత్ర దొరికింది. అయితే, గ్లామర్, కాస్ట్యూమ్స్ విషయంలో ఆ అమ్మాయి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా నాగవల్లి గా వేసిన అనుపమా పరమేశ్వరన్ తో కాంబినేషన్ సీన్లలో సమంత తేలిపోయింది. నితిన్ కూడా వడిలిపోయి కనిపించాడెందుకో. భార్య చాటు భర్తగా నరేష్ ఒప్పించాడు. కాకపొతే, ఈ పాత్రని మరీ రొటీన్ గా డిజైన్ చేశారనిపించింది. స్వార్ధ పరురాలైన చెల్లెలు, స్ట్రిక్ట్ మనిషి మహాలక్ష్మిగా నదియాని చూసినప్పుడు నగ్మా గుర్తొచ్చింది చాలాసార్లు.

పల్లం వెంకన్న అనే పల్లెటూరి మోతుబరి పాత్రలో కనిపించిన రావు రమేష్ ఎప్పుడూ లేనిది తన తండ్రిని అనుకరించే ప్రయత్నం చేశాడీ సినిమాలో. తనకంటూ ఓ సొంత మార్కుతో ముందుకు వెళ్తున్న రమేష్, రావు గోపాలరావుని అనుకరించడానికి కారణం అర్ధం కాలేదు. ఇంకొంచం సటిల్ గా చేస్తే బాగుండుననిపించింది. సమంత పనమ్మాయిగా వేసినమ్మాయి, నదియా పీయే గా చేసిన శ్రీనివాస రెడ్డి నవ్విస్తారు. పాటలు, నేపధ్య సంగీతం రెండూ కూడా మైనస్ ఈ సినిమాకి. ఒక్క పాటా గుర్తు పెట్టుకునేలా లేదు. కీలకమైన సన్నివేశాల్లో వినిపించే సంగీతం, గతకాలపు హిట్ పాటలని జ్ఞాపకం చేయడం విషాదం. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. మహాలక్ష్మి బంగ్లా, ఆనంద్ విహారి ఇల్లు, కలవపూడి ఊరు విజువల్స్ కంటికి చాలా హాయిగా ఉన్నాయి. తళుక్కున మెరిసే పాత్రల్లో సీనియర్ నటి అన్నపూర్ణ, 'జబర్దస్త్' చమ్మక్ చంద్ర, 'షకలక' శంకర్ గుర్తుండిపోతారు.

చక్కగా తీయడానికి అవకాశం ఉన్న కథని త్రివిక్రమ్ లాంటి దర్శకుడు అతుకుల బొంతలా తీయడం మింగుడు పడలేదు. నవలలో, మొదటి సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్ర అయిన సారధిని, శేఖర్ (అవసరాల శ్రీనివాస్) అనే అతిధి పాత్రగా కుదించి నాలుగు సీన్లకి పరిమితం చేశారు. ఆ పాత్ర ఎప్పుడు ఎందుకు ఎలా ప్రవర్తిస్తుందో అర్ధం కాదు. మంచి కుటుంబ కథా చిత్రంగా మలచడానికి అవకాశం ఉన్న కథని ఎంచుకుని, కేవలం ఓ కాలక్షేప చిత్రం తీయడం, అదికూడా బాగా పేరున్న దర్శకుడు గొప్ప తారాగణంతో, భారీ బడ్జెట్ తో తీయడం చివుక్కుమనిపించింది. విలువల్ని గురించి మాట్లాడే త్రివిక్రమ్ ని తన అభిమాన రచయిత్రి కథని కాపీ చేస్తున్నాననే గిల్ట్ వెంటాడి సినిమాని సరిగ్గా తీయనివ్వలేదా?

2 కామెంట్‌లు:

  1. విషయం తెలిశాక క్రెడిట్స్ ఇవ్వనందుకు త్రివిక్రమ్ మీద కాస్త అసహనం కలిగినా మీనా సినిమా చూశాక (నవల ఇంకా చదవలేదు 550 పేజీలు భయపెడుతున్నాయ్:-) మాత్రం తను కావాలనే ఇవ్వలేదనిపించిందండీ.. మూల కథని కొన్ని సన్నివేశాలనీ వాడుకున్నాడనే కానీ కారెక్టరైజేషన్స్ పరంగా ఇది పూర్ అడాప్టేషన్ అని తనకి కూడా అనిపించి ఉంటుంది అందుకే వేసి ఉండడేమో అనుకున్నా.

    కాకపోతే సినిమా మాత్రం బోర్ కొట్టకుండా ఈకాలం మిగిలిన సినిమాలతో పోలిస్తే ఆహ్లాదంగా సాగిపోయింది. నాకు పాటలు నచ్చాయండోయ్ మళ్ళీ మళ్ళీ వినేలా లేకపోయినా సినిమా ఫ్లోలో కలిసిపోయాయి :-)

    రిప్లయితొలగించండి
  2. @వేణూ శ్రీకాంత్: 'మానస' రాసిన 'నవ్వినా కన్నీళ్లే' నవల కథకీ, 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమాకీ చాలా భేదాలు ఉన్నాయండీ. కానీ, క్రాంతి కుమార్ 'నవ్వినా కన్నీళ్లే' హక్కులు కొనడంతో పాటు, టైటిల్ క్రెడిట్ ఇస్తూ "ఈ నవల లేకపోతే సినిమా లేదు" అన్నారు. ఆఫ్కోర్స్, అందరూ అలా ఆలోచించాలని లేదనుకోండి.. ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి