వర్షాలు మొదలైన కొన్నాళ్ళకి కొబ్బరితోట సరిహద్దులో
ఉన్న డొంకల నిండా వత్తుగా అల్లుకుపోయేవి కాకర తీగలు. చాలా త్వరగా కాపుకి
వచ్చేసేవి కూడా. చేదు తీగె కాబట్టి పశువులు తినేస్తాయనే బెడద కూడా ఉండేది
కాదేమో, పాదుల నిండా కోసుకున్నన్ని కాయలు. పొద్దున్నే అలా పెత్తనానికి
వెళ్లి కంటికి నదురుగా కనిపించిన కాకరకాయలు తెంపుకు వచ్చి, పాకలో నీళ్ళు
కాచుకుంటూ, చలికాగుతూ, తెచ్చిన కాయలు వైనంగా కాల్చేసి (బండ పచ్చడి కోసం మెట్ట వంకాయి కాల్చినట్టన్న మాట, మరీ బొగ్గయిపోకూడదు) అమ్మకిచ్చేస్తే,
మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసరికి అన్నంతో పాటు కాకరకాయ కూర సిద్ధంగా
ఉండేది. వేడి చేయకుండా పక్కనే ఉల్లిపాయ పులుసు కూడా.
డొంకల్లో
కాసే కాకరకాయలు చిన్నగా ఉండేది. కండ మరీ ఎక్కువగా ఉండేది కాదు. కాల్చిన
కాయల మధ్యలో నిలువుగా నాటు పెట్టి, గింజలు తీసేసి, ఉల్లి కారం కూరి, నూనెలో
వేయించి కూర చేసేది అమ్మ. ఒక వేళ కాయలు కొంచం పెద్దవి అయితే, కాల్చిన
కాయని అడ్డంగా సగానికి కోసి రెండేసి ముక్కలుగా చేసి కూరొండేసేది. 'గ్లాసుల
కూర' అని పేరు పెట్టాన్నేను. ఒక్కో ముక్కా చిన్న గ్లాసు ఆకారంలో ఉండేది
మరి. అమ్మ అప్పుడప్పుడూ కాకరకాయతో బెల్లం కూర కూడా చేసేది కానీ, నా వోటు
మాత్రం ఎప్పుడూ ఈ కారం కూరకే. చిన్నుల్లిపాయల్లాగే చిన్న కాకరకాయలు కూడా
అంతరించిపోయినట్టున్నాయి. ఎక్కడ చూసినా పెద్ద కాయలే కనిపిస్తున్నాయి.
కాకరకాయలతో
కారం కూరని రెండు రకాలుగా చేసుకోవచ్చు, మనం ఎంత చేదు తినగలం అనేదాన్ని
బట్టి. ఒక చిన్న మార్పు మినహా మిగిలిన పద్ధతంతా మామూలే. ముందుగా చేదుగా
ఇష్టపడే వాళ్ళైతే ఇలా వండుకోవచ్చు. కాకరకాయలు కడిగి, అడ్డంగా ముక్కలు కోసి,
గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయ ముక్కల్ని బట్టి అందుకు
తగ్గట్టుగా ఉల్లిపాయలు తీసుకుని ముక్కలు కోసి పక్కన పెట్టాలి. అలాగే
తగుమాత్రం చింతపండుని గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టాలి. బాండీలో కొంచం నూనె
వేసి అది వేడెక్కాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు,
ఎండుమిరప కాయలు వేసి వేగనివ్వాలి. ఈ వేగిన మిశ్రమాన్ని, పచ్చి ఉల్లిపాయ
ముక్కలని కలిపి మరీ మెత్తగా కాకుండా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఒక్క
తిప్పు అవ్వగానే పసుపు, ఉప్పు, చింతపండు రసం వేసి మరో తిప్పు రానిస్తే
సరిపోతుంది.
ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కొంచం ధారాళంగానే
నూనె పొయ్యాలి. నూనె వేడెక్కాక, కాకర కాయ ముక్కల్లో ఉల్లి కారం కూరి,
నూనెలోకి జారవిడిచి, సన్నని సెగమీద వేగనివ్వాలి. నూనె ఎక్కువ వాడడం ఇష్టం
లేకపోతే, ముక్కలు వేసేశాక పైన మూత పెట్టి, ఆ మూత మీద నీళ్ళు జల్లుతూ
ఉండొచ్చు. ఓ ఇరవై నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. కొంచం చల్లారాక
కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుంది. చేదుగా, కారంగా ఉండే కూర వర్షం
కురిసేప్పుడు తినే వేడన్నం లోకి మాంచి కాంబినేషన్. కాకపోతే 'వేడిచేయడం' మీద
నమ్మకం ఉన్నా లేకపోయినా, ఈ కూరైతే వేడి చేస్తుంది. అందుకు తగ్గట్టుగా
మజ్జిగ ఎక్కువ తీసుకోడమో, మరేదన్నా యేర్పాటో చేసుకోవాలి.
మరీ
అంత చేదు తినలేం అనుకున్న వాళ్ళు, కాకరకాయ ముక్కలు కోసి, గింజలు తీసిన
తర్వాత, ఓ గిన్నెలో కొంచం నీళ్ళు మరగబెట్టి, పొంగుతున్న నీళ్ళలో
తీసిపెట్టుకున్న చింతపండు రసం, చిన్న బెల్లం ముక్కా వేసి, అటుపైన కాకరకాయ
ముక్కలు వేసి ముక్కలు మరీ మెత్తబడక ముందే స్టవ్ మీద నుంచి దించేసి, నీళ్ళు
వార్చేసి చల్లారబెట్టుకోవాలి. మిగిలిన ప్రొసీజర్ అంతా మామూలే. ఎటొచ్చీ
ఉల్లి కారంలో చింతపండు రసం కలపక్కర్లేదు. ఇలా ఉడికిన ముక్కలని ఎక్కువ
నూనెలో వేయించే పనిలేదు. మూత మీద నీళ్ళు జల్లే పద్ధతిలో కూర వండేయడమే.
కొత్తిమీర గార్నిష్ మామూలే. ముందు పద్ధతిలో కూరకన్నా ఈ కూర చేదు తక్కువగా
ఉంటుంది.
ఎటూ ఇక్కడిదాకా
వచ్చాం కాబట్టి, బెల్లం కూర గురించి కూడా ఓ మాట అనేసుకుంటే బావుంటుంది.
కాకరకాయలు చక్రాల్లా తరుక్కుని గింజలు తీసేయాలి. వీటి మీద కాస్త ఉప్పు
జల్లి, కాసేపాగి పిండితే చేదు దిగిపోతుంది. లేదూ, ముందు చెప్పుకున్న
పద్ధతిలో చింతపండు రసంతో చేదు విరగ్గొట్టచ్చు. బాండీలో కొంచం నూనె వేసి
శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి ముక్కలు వేయించి,
తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టాలి. అవసరమయితే మూత మీద కొంచం
నీళ్ళు జల్లుకుని, మధ్య మధ్యలో కదుపుతూ ఉంటే కాసేపటికి ముక్కలు మగ్గుతాయి.
అప్పుడు ఉప్పు, పసుపు జల్లాలి.
ఓ చిన్న గిన్నెలో రెండు చెంచాల వరి
పిండి, ముక్కలకి తగినంత బెల్లపు రజను వేసి, కొంచం నీళ్ళు పోసి మరీ పల్చగా
కాకుంగా, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాండీలో పోసి, ముక్కలతో
పాటు బాగా కలుపుతూ ఉంటే కూర దగ్గర పడుతుంది. బెల్లం పాకం మరీ గట్టి
పడకముందే స్టవ్ కట్టేయాలి. చేదు లేని కాకరకాయ తినాలంటే వేపుడు ఒక్కటే
మార్గం. కాకరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని, ఉప్పుజల్లి, ముక్కలు
పిండేసి, ఎన్ని ముక్కలు ఉన్నాయో అంత బరువూ సన్నగా తరిగిన ఉల్లిపాయ రజను
చేర్చి డీప్ ఫ్రై చేసేసుకోడమే. కారం వేసే ముందు, అర స్పూను చక్కర, రెండు
స్పూన్ల ఎండు కొబ్బరి పొడి చేర్చుకోవచ్చు. కారంతో పాటు ఉప్పు వేసేప్పుడు
ముక్కల్ని ఉప్పులో పిండిన విషయం మర్చిపోకూడదు మరి. ఉన్నమాట చెప్పాలంటే,
వర్షం కురిసేప్పుడు ఎక్కువ రుచిగా ఉండే కూర కాకరకాయ.
Sir, mee tapa chaduvutunte, kura kanna ruchiga(andanga) mi varnane untondi. 😃
రిప్లయితొలగించండినాకే సహనం తక్కువైపోయి ఈ మధ్య చేయడం లేదు గానీ మా ఇంట్లో కాకరకాయ అంటే పోటీపడి తినేస్తాం !
రిప్లయితొలగించండికాకరకాయ వంటి కూరయు....కృష్ణవేణి వంటి భార్యయు....అన్నారు కదండీ మురళిగారు ?!
కాకరకాయ కాల్చి కూర.. నలమహరాజు చెయ్యగా దూరదర్శన్ లో చూశానండీ. :) 'బాండీలోకి జారవిడవడం..' స్లో మోషన్ లో కళ్ళక్కట్టేసేలా రాస్తారుగా!
రిప్లయితొలగించండినీహారిక గారూ, హహ్హహా భలే ప్రాస కదూ!
పులుపు పెద్దగా ఇష్టపడనివాళ్ళు చేదు తగ్గడానికి కొంచెంపల్చని పుల్లటి మజ్జిగలో ఉడికిస్తే చింతపండు రసంలో ఉడికించిన దానికన్నా రుచిగా ఉంటుంది కూర. చేదూ తగ్గుతుంది. పులుపూ ఎక్కువగా ముక్కలకి పట్టదు.
రిప్లయితొలగించండిHmm....So tasty
రిప్లయితొలగించండి@Unknown: 'ఇడ్లీ కన్నా చట్నీ రుచి' అంటే ఇదేనేమోనండీ :) ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@నీహారిక: అవునండీ, తరచూ వండుకునే కూరే.. ఇకపోతే, 'వంకాయవంటి కూరయు, పంకజముఖి "సీత" వంటి భార్యా మణియున్...' అన్నారండీ పెద్దలు. అభిమానంతో మీరిలా కూడా అంటానంటే నేను కాదంటానా చెప్పండి :) ..ధన్యవాదాలు..
@కొత్తావకాయ: దూరదర్శన్.. 'మర్యాద రామన్న' అంటారా? ..ధన్యవాదాలు..
@శిశిర: భలే చిట్కా అండీ.. ఇదే వినడం నేను.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@హిమబిందు: ధన్యవాదాలండీ..
Murlai garuuu.... its my favrt andi :) Entha baaga raasaru!!
రిప్లయితొలగించండిSee this post!
http://vennelasantakam.blogspot.com/2011/02/blog-post.html
కాకరకాయ సరిగా వండితే నాకూ ఇష్టమేనండీ.. చాలా వెరైటీస్ చెప్పారు ప్రయత్నించాలి. షుగర్ పేషంట్స్ పులుపు కూడా ఎక్కువ తినకూడదంటారండీ వాళ్ళు పథ్యంకోసం ఈ కాకరకాయ తింటూంటే కనుక చింతపండు కన్నా మజ్జిగ బెటర్.. మజ్జిగ రుచి కూడా తెలియకూడదంటే కాస్త ఉప్పు కలిపిన మజ్జిగలో ముక్కలు ఓ గంట నానబెట్టి పిండేసినా కూడా చేదు విరిగిపోతుందంటారు.
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్:ఈసారి నేనూ మజ్జిగ ప్రయత్నించి చూస్తా ఉండండయితే.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండిమీ వర్ణన అద్భుతం, కళ్ళకు కట్టినట్లు తినిపించారు.
రిప్లయితొలగించండి