సోమవారం, ఏప్రిల్ 04, 2016

'సంగీత చూడామణి' శ్రీరంగం గోపాలరత్నం

శాస్త్రీయ సంగీత అభిమానులకే కాదు, గడిచిన తరం ఆకాశవాణి శ్రోతలకి కూడా శ్రీరంగం గోపాలరత్నం పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలమురళి-గోపాలరత్నం యుగళంలో వచ్చిన ఎన్నెన్నో గీతాలు శ్రోతల మనస్సులో చిరస్థానాన్ని సంపాదించుకున్నాయి. భక్తిపాటల మొదలు రేడియో నాటకాల వరకూ అనేక విధాలైన రేడియో కార్యక్రమాలకి తన గాత్రాన్ని అందించిన గోపాలరత్నం కచేరీలతో పాటు, ప్రైవేటు ఆల్బంల ద్వారానూ లక్షలాది మంది శ్రోతలకి దగ్గరయ్యారు. అయితే, ఆమె గొంతే తప్ప ఆమెని గురించిన విశేషాలు పెద్దగా ఎవరికీ తెలియదు.

తెలుగునాట ప్రముఖ సంగీత విద్వాంసుల పేర్ల జాబితా వేస్తే, గోపాలరత్నం పేరు లేకుండా ఆ జాబితా అసంపూర్ణం. అలాంటి గోపాలరత్నం జీవితాన్ని పరిచయం చేస్తూ ఓ చిరుపుస్తకాన్ని రచించారు ప్రముఖ రచయిత్రి ఇంద్రగంటి జానకీబాల. 'సంగీత చూడామణి శ్రీరంగం గోపాలరత్నం (జీవితం-సంగీతం)' పేరిట విడుదలైన డెబ్బై ఆరు పేజీల పుస్తకంలో గోపాలరత్నం జీవిత విశేషాలతో పాటు, అరుదైన ఛాయా చిత్రాలనీ పొందు పరిచారు. గోపాలరత్నం అకాల మరణానికి స్పందిస్తూ ప్రముఖులు పంపిన సంతాప సందేశాలు, ఆమె పాడిన కొన్ని పాటల సాహిత్యాన్నీ జతచేశారు.

విజయనగరం జిల్లా పుష్పగిరిలో శ్రీరంగం వరదాచార్యులు, సుభద్రమ్మ దంపతులకి 1939 లో గోపాలరత్నం జన్మించారు. శాస్త్రీయ సంగీతపు నేపధ్యం ఉన్న కుటుంబం కావడంతో పాట సహజంగానే అబ్బింది ఆమెకి. చిన్నవయసులోనే హరికథలు చెప్పడం ఆరంభించిన గోపాలరత్నం, తల్లిదండ్రులనుంచి వైష్ణవ భక్తిగీతాలనీ, గురువు శ్రీపాద పినాకపాణి నుంచి శాస్త్రీయ సంగీతపు మెలకువలనీ నేర్చుకున్నారు. పద్దెనిమిదేళ్ళ వయసులో ఆకాశవాణి లో నిలయ గాయనిగా ఉద్యోగం రావడం గోపాలరత్నం సంగీత ప్రస్థానంలో మేలిమలుపు. అక్కడినుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.


"నిజాయితీగా చెప్తున్నా - వివాహం గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. సంగీత సాధనలో, అదే ధ్యాసలో ఉండడం వల్ల నాకు సమయమే చిక్కదు. అయితే, జీవితంలో ఏదో కోల్పోయానన్న బాధ అస్సలు లేదు. సంగీతం నా సర్వస్వం. సంగీతం తప్ప మరో అవసరమే కలగదు" అన్న గోపాలరత్నం మాటలు చాలామందికి కఠినంగా వినిపించాయంటారు జానకీబాల. "గోపాలరత్నం బహుముఖ సంగీత విదుషీమణిగా సానదేరడానికి సరైన సమయంలో తన కళ పట్ల తన ఉద్దేశాన్ని, అభిప్రాయాల్ని నిర్ణయించుకోవడం తన కర్తవ్యంగా భావించారు - అదే ఆమె జీవితంలో ఒక ప్రధాన ఘట్టంగా చెప్పుకోవాలి" అంటారు రచయిత్రి.

నిజానికి ఈ పుస్తకం గోపాలరత్నం జీవితాన్ని గురించిన ఒక రేఖామాత్రపు పరామర్శ. క్లుప్తంగా ఆమె జీవిత విశేషాలనీ, ఆకాశవాణి ప్రస్థానాన్నీ పరామర్శించారు రచయిత్రి. కొన్ని చోట్ల ఆ క్లుప్తత ఆకట్టుకున్నప్పటికీ, చాలా చోట్ల మరిన్ని వివరాలు రాసి ఉంటే బాగుండేది అనిపించింది పుస్తకం చదువుతుంటే. గోపాలరత్నం కుటుంబ, వ్యక్తిగత విషయాలని ఎంతో సంయమనంతో ప్రస్తావించారు జానకీబాల. ఆ గాయని అకాల మరణాన్ని గురించి చెప్పినప్పుడు కూడా, సంగీతాభిమానుల్లో తలెత్తిన సందేహాలని గురించి కాక, సంగీత ప్రపంచపు స్పందనల్ని మాత్రమే రికార్డు చేశారు. తనకి తెలిసన ప్రతి విషయాన్నీ రాయాల్సిన అవసరం లేదు అన్న భావనతో ఈ పుస్తకాన్ని రాశారనిపించింది.

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్ రాసిన ముందుమాట. మొత్తం తొమ్మిది పేజీల ముందుమాటలో గోపాలరత్నంతో తన అనుబంధాన్ని ఎంతో హృద్యంగా జ్ఞాపకం చేసుకున్నారు శారద. ముందుమాటలో ఆమె ప్రస్తావించిన కొన్ని సంగతులు, పుస్తకంలో పునరుక్తమయ్యాయి కూడా. పుస్తకాన్ని మరింత సమగ్రంగా తీసుకుని వచ్చి ఉంటే చాలా బాగుండేదన్న భావన బలంగా కలిగినప్పటికీ, ఇన్నాళ్ళకి గోపాలరత్నాన్ని గురించి ఓ పుస్తకం తెచ్చినందుకు అభినందించాల్సిందే అనిపించింది పుస్తకం పూర్తి చేశాక. గోపాలరత్నం పాడిన పద్నాలుగు పాటల సీడీని పుస్తకంతో పాటు ఉచితంగా అందిస్తున్నారు. (అనల్ప ప్రచురణలు మరియు సాహిత్య కేంద్రం ప్రచురణ, వెల రూ. 100, అని ప్రముఖ పుస్తకాల షాపులు).

7 కామెంట్‌లు:

  1. మీరు లైబ్రరీ లో ఉద్యోగం చేస్తుంటారా ? ఇన్ని పుస్తకాలు మీకు ఎలా తెలుసు ?

    రిప్లయితొలగించండి
  2. @నీహారిక: లేదండీ.. కొంచం తీరిక దొరికినప్పుడల్లా పుస్తకాల షాపులకి వెళ్తూ ఉంటాను.. అక్కడ కనిపిస్తూ ఉంటాయి కొత్తవీ, పాతవీ కూడా.. ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. గోపాలరత్నం గారి లలిత సంగీతం నాకు చాలా ఇస్ఠం మురళి గారు. ఆ గొంతు ఎంత బాగుంటుందో. కస్ఠపడి ఓ రెండు మూడు పాటలు కూడా నేర్చుకున్నాను:) ఈ బుక్ మాత్రం నేను తప్పకుండా కొనుక్కుంటాను. సిడి కూడా ఇస్తారు అంటున్నారు కదా!

    రిప్లయితొలగించండి
  4. @జయ: అవునండీ.. మంచి పాటలు ఉన్నాయి సీడీలో.. తప్పక తీసుకోండి.. ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  5. గోపాలరత్నం గారి గురించి చాలా విషయాలు తెసిసాయండి మురళి గారు ఈ బుక్ లో . చాలా థాంక్సండి. ఎంకి పాటలని ఆకాశవాణి ఎందుకు బాన్ చేసింది మురళి గారు.
    అకస్మాత్తుగ యాభమూడేళ్ళ వయసుసులోనే గోపాలరత్నం గారు మరణించటానికి కారణమేమిటండి.

    రిప్లయితొలగించండి
  6. అవునండీ, శ్రీరంగం గోపాలరత్నం గారు చిన్న వయస్సులోనే సర్గసీమకు తరలిపోయారు. వారికి పద్మశ్రీ అవార్డు వచ్చిన క్రొత్తలో జరిగిన ఒక సంఘటన మనవి చేస్తాను. ఆవిడ ఆనంద్‍బాగ్‍ లోని శంకరమఠంలో ఒక గాత్ర కచేరీ చేసారు. ఒక మిత్రులు ఈ విషయం చెప్పి నన్ను ఆక్కడికి తోడ్కొని పోయారు. కచేరీ చాలా బాగా జరిగింది. కాని గోపాలరత్నం గారు కొంచెం దిగులుగా కనిపించటం కలచివేసింది. కచేరీ మధ్యలో ఆవిడ కొద్దిగా మాట్లాడారు. అ సందర్భంలో ఆవిడ అన్న మాటలన్నీ గుర్తులేవు. కాని బాగా నాటుకొని గుర్తు ఉన్న మాట ఏమిటంటే, 'కుటుంబసంబంధమైన ఏవేవో గొడవలు, మనశ్శాంతి లేదు' అని. ఆ తరువాత ఆవిడ చిరునవ్వు నవ్వి కచేరీ కొనసాగించారు.
    ఆ గొడవలూ అవీ మనకు తెలియవు. కాని ఆ విద్వన్మణి మనశ్శాంతి లేకపోవటం వలన తొలగిపోయి ఉందవచ్చును.

    రిప్లయితొలగించండి

  7. @జయ: ఎంకి పాటల్లో బూతు పదాలున్నాయని కంప్లైంట్ వస్తే, అప్పటి నుంచీ వాటి ప్రసారం ఆపేశారని ఎక్కడో చదివిన జ్ఞాపకం అండీ.. పుస్తకం మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.. ధన్యవాదాలు..
    @శ్యామలీయం: "హైదరాబాద్ వెళ్ళాక నా సంతోషం దూరమయ్యింది" అని ఆమె తన దగ్గర వారితో చెప్పినట్టుగా ఉందండీ పుస్తకంలో.. వ్యక్తిగత-వృత్తి జీవితాలని బ్యాలన్స్ చేసుకోడం మరీ సులువేమీ కాదనిపిస్తూ ఉంటుంది ఇలాంటివి విన్నప్పుడు.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి