మంగళవారం, నవంబర్ 03, 2015

అసహనం

చాలా రోజుల తర్వాత నలుగురు మిత్రులం పార్కులో కలిశాం. నడకయ్యాక బెంచీల మీద చోటు సంపాదించుకున్నాం. వాతావరణం చల్లబడడంతో మా దృష్టి మిరపకాయ బజ్జీల మీదకి మళ్ళింది. బండి కుర్రాడు బజ్జీలు తెచ్చిపెట్టి వెళ్ళాడు. బజ్జీలంత వేడిగా, ఘాటుగా సంభాషణ సాగింది. "షారుక్ ఖాన్ అలా అని ఉండాల్సింది కాదు," అన్నాడో మిత్రుడు. హిందీ సినిమాలు, హిందీ రాజకీయాలు తనకి కరతలామలకం. "ఎప్పుడు లేదు అసహనం? అధికార పక్షం మీద ప్రతిపక్షానికి ఎప్పుడూ అసహనమే కదా. ఇప్పడు ప్రతిపక్షం నోరున్నది కాబట్టి, ఇప్పటివరకూ అవార్డులు అందుకున్న వాళ్ళలో మెజారిటీ కాంగ్రెస్, కమ్యూనిస్టు వాదులే కాబట్టీ ఇంత గొడవ జరుగుతోంది" అని తన ఉవాచ.

మత అసహనం పెరగడం దేశానికి మంచిది కాదని తన యాభయ్యో పుట్టిన రోజు సందర్భంగా షారుక్ ఖాన్ జాతికి సందేశం ఇవ్వడం, దాన్ని కాంగ్రెస్సు, కమ్యూనిస్టులు స్వాగతించగా, బీజీపీ మరియు అనుబంధ సంస్థలు వ్యతిరేకించడం వేడి వేడి టాపిక్ మరి. "వెనక్కివ్వడానికి తన దగ్గర అవార్డులేవీ లేవని చెబుతున్నాడంటే, తనకి అవార్డు ఇమ్మని అడుగుతున్నట్టా, లేక రాజకీయాల్లోకి రాబోతున్న సంకేతమా?" ప్రశ్న పూర్తయ్యేసరికి పొగలుగక్కుతున్న బజ్జీలు కాస్త చల్లబడ్డాయి. నిమ్మరసం పిండిన ఉల్లిపాయముక్కల స్టఫింగ్ భలేగా ఉంది. "దేశంలోనే కాదు, రాష్ట్రంలోనూ అసహనం పెరిగిపోతోంది," ప్రకటించాడు రెండో మిత్రుడు. రాష్ట్రం తప్ప మరో విషయం పట్టదితగాడికి.

"అసలు చంద్రబాబు ఎంత కష్టపడుతున్నాడు. అమరావతి పూర్తిచేస్తే చరిత్రలో నిలిచిపోతాడు. అది భరించలేకే అపోజిషన్ వాళ్ళు హోదా అనీ, ఉల్లిపాయలనీ, కందిపప్పు అనీ గొడవలు చేస్తున్నారు. ఏం చేసినా చంద్రబాబుని ఆపలేరు" కొంచం ఆవేశంగా చెప్పాడు. ఏమాటకామాట, మిరపకాయ కొంచం కారంగానే ఉంది. "మోడీ ప్యాకేజీ ఏమీ అనౌన్స్ చేయడని నేను మొదటినుంచీ చెబుతూనే ఉన్నా కదా. ఏపీని మించిన విషయాలు చాలానే ఉన్నాయి.. మరీ ముఖ్యంగా బీహార్ ఎలక్షన్స్. ఏపీలో ఇప్పట్లో బీజీపీ స్ట్రాంగ్ అవ్వదని మోడీకి తెలుసు," హిందీ మిత్రుడు అందుకున్నాడు. మూడో మిత్రుడి ఆసక్తి సాహిత్యం. ఏమీ మాట్లాడకుండా శ్రద్దగా బజ్జీ తింటూ వాళ్ళ సంభాషణ వింటున్నాడు, నాలాగే.

"ఇంకెక్కడ బీజేపీ? అమరావతి పూర్తయితే ఇక రాష్ట్రంలో ఎప్పటికీ తెలుగుదేశమే పవర్లో ఉంటుంది. చంద్రబాబు, తర్వాత లోకేష్ బాబు సీఎంలు. ఇంకెవరూ ఆశలు పెట్టుకోడం అనవసరం" రాష్ట్ర మిత్రుడు కళ్ళు మూసుకుని చెప్పాడు. నిమ్మరసం పులుపు మామూలుగా లేదసలు. నేను ఊరికే ఉండక "గ్రీన్ ట్రిబ్యునల్ ఏదో అభ్యంతరం చెప్పిందని పేపర్లో చూశాను" అన్నాను. అతగాడికి అద్దుమాలిన కోపం వచ్చింది. "ఏ ట్రిబ్యునలూ ఏమీ చెయ్యలేవు. చంద్రబాబుకి ట్రిబ్యునల్ ఓ లెక్కా? చూస్తూ ఉండు, ఇట్టే మేనేజ్ చేసేస్తాడు. పైసా ఖర్చు లేకుండా బిల్డింగులు కట్టివ్వడానికి సింగపూర్ వాళ్ళు, జపాన్ వాళ్ళు రెడీగా ఉన్నారు," కొంచం గట్టిగానే చెప్పాడు.

"చేతిలో పైసా లేకుండా కేపిటల్ కట్టడం అంటే మాటలు కాదు," హిందీ మిత్రుడి ఉవాచ. "ఇంకెవరన్నా సీఎం పొజిషన్ లో ఉంటే సెంట్రల్ ఫండ్స్ కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉండే వాళ్ళు. కానీ, ఇక్కడున్నది చంద్రబాబు. అసలు పదమూడు జిల్లాల రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలన్న ఆలోచనే ఇంకెవరికన్నా వస్తుందా?" ప్రశ్న విని, ఓ బజ్జీ తీసి అతనికిచ్చాను. సాహిత్యం మిత్రుడు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నాను. హరిరామ జోగయ్య ఆత్మకథ విశేషాలేమన్నా తెలుస్తాయని ఆశ. చూడబోతే తను మాట్లాడే మూడ్ లో ఉన్నట్టు లేడు. "బజ్జీ తినడానికి తప్ప నోరిప్పడం లేదు నువ్వు?" హిందీ మిత్రుడు, సాహిత్యం మిత్రుణ్ణి కదిలించాడు.

"మొన్న నా ఫేవరెట్ రైటర్ కి ఫోన్ చేశాను.. చెడా మడా తిట్టి ఫోన్ పెట్టేశాడు," తను చెప్పింది విని ముగ్గురం ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచాం. "అతనికి నువ్వు ఎప్పటినుంచో ఫోన్లు చేస్తున్నావు కదా. ఎప్పుడూ సరదాగానే మాట్లాడతాడని చెప్పావు?" హిందీ మిత్రుడు అడిగేశాడు. "ఈ మధ్య అతను రాస్తున్న కథలు ఏమంత బాగుండడం లేదు. ఆమాట చెప్పానో లేదో, విరుచుకు పడ్డాడు నా మీద. నచ్చకపోతే చదవడం మానెయ్యండి కానీ ఇలా ఫోన్లు చెయ్యకండి. మీకు చదవడం చేతకాక వంకలు పెడుతున్నారు అని నిర్మొహమాటంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు," గొంతు కొంచం జీరబోయింది. ఎవ్వరం ఏమీ మాట్లాడలేదు. అతని చెయ్యి నొక్కి వదిలాను అప్రయత్నంగా. చినుకులు మొదలవ్వడంతో ఇళ్ళ దారి పట్టాం.

8 కామెంట్‌లు:

  1. వేడి వేడి మిరపకాయ బజ్జీలు , రాజకీయాలు, సాహిత్యం వగైరా సమ్మిళితం చేస్తూ మీ అసహనాన్ని అచ్చు మాలోని అసహనాన్ని బయటికి తీస్తూ.. భలేగా రాసారు మురళి గారూ..
    -ఉక్కుగోళ్ళ రచన.

    రిప్లయితొలగించండి
  2. బ్లాగులు నచ్చకపోతే చదవడం మానెయ్యాలా ? వ్రాసేవారే కరువయ్యారా ? ఎవరో ఒకరు ఎపుడో అపుడు .....
    ఏ మాటకామాటే బజ్జీలు మాత్రం సూపర్ !

    రిప్లయితొలగించండి
  3. ప్రజలు చాలా సహనంతోనే ఉన్నారండి, మంచి రోజులు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తూ.
    నాయకులు, మేధావులే అసహనంతో మీడియాలో మాటల యుద్ధం చేస్తున్నారు.
    అసలు ప్రభుత్వం అవార్డులు ఇవ్వటం ఆపేస్తే ఏ గొడవా ఉండదు.

    రిప్లయితొలగించండి
  4. అభిమానమో, దురభిమానమో వున్న చోటే అసహనం కూడా వున్నట్లుంది మురళి గారు మీ టపా చదివితే.

    రిప్లయితొలగించండి
  5. @భాస్కర్: బజ్జీల వల్లే అనుకుంటానండీ సంభాషణ బాగా గుర్తుండి పోయింది :) ..ధన్యవాదాలు..
    @నీహారిక: 'బజ్జీలు మాత్రం సూపర్' ..నిజమేనండీ.. కానీ, రోజూ తిందామంటే డాక్టర్ ఒప్పుకోరు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. @బోనగిరి: నాకొచ్చిన ఆలోచనా అదేనండీ.. ఈ గొడవలు చూసి గవర్నమెంట్ అవార్డులన్నీ రద్దు చేసేస్తుందా అని.. కానీ, ఇన్నాళ్ళుగా అవార్డుల కోసం ఎదురుచూస్తున్న రైట్ వింగ్ రచయితలు, మేధావులు ఏమైపోవాలి? ..ధన్యవాదాలు..
    @ఇద్దరు: నిజమేనండీ..నిజమే.. ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  7. అవార్డులు రిరిగిచ్చేటంతగా అసహనం పెరిగిన మేధావులకి యెవరన్నా ఇట్లా వేడి వేడి బజ్జీలు అందించి ఉంటే అలా ఆవేసపడిపొయ్యెవాళ్ళు కాదేమో?సమయానికి బజ్జీలు దొరక్క అసహనం ఫీలయి ఉంటారు:-)

    రిప్లయితొలగించండి
  8. @హరిబాబు సూరనేని : నిజమేనండోయ్.. పాయింటే :) ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి