సోమవారం, అక్టోబర్ 19, 2015

మంజుల నుంచి నీహారిక వరకూ ...

పాతికేళ్ళ క్రితం ఓ ప్రముఖ తెలుగు సినీ కథా నాయకుడి కుమార్తె వెండితెర నాయికగా పరిచయం కాబోతోందన్న వార్త పత్రికల్లో వచ్చింది. ఆ మర్నాటి నుంచీ ఆ హీరో అభిమానులు ఆ అమ్మాయిని సినిమాల్లోకి రావద్దంటూ బహిరంగ ప్రకటనలు చేయడంతో పాటు, అభిమాన హీరోని కలిసి ఒత్తిడి తెచ్చారు కూడా. ఈ అభిమానులే ఆ కథానాయకుడి కొడుకులిద్దరినీ హీరోలుగా ఆదరించారు. వాళ్ళలో చిన్నవాడు ఇప్పుడు తెలుగు టాప్ హీరోల్లో ఒకడైన మహేష్ బాబు. ఆ అమ్మాయి పేరు మంజుల.

నటి కావాలన్న మంజుల కోరిక కేవలం తన తండ్రి అభిమానుల కారణంగా తీరకుండా పోయింది. ఒకటి రెండు పరభాషా చిత్రాల్లో ప్రత్యేక అతిధి పాత్రల్లో నటించిన మంజుల, 2002 లో తను నటించి, నిర్మించిన తెలుగు సినిమా 'షో' తాలూకు వివరాలని సినిమా విడుదల ముందు వరకూ అత్యంత రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. ఆ సినిమా రొటీన్ కి భిన్నమైనది కావడం, ఆమెపాత్ర హీరోతో ఆడిపాడే రొటీన్ కథానాయిక పాత్ర కాకపోవడం వల్ల ఆమె తండ్రి 'నటశేఖర' కృష్ణ అభిమానులు 'షో' ని ఆదరించారు. వెండితెర మీద కథానాయికగా వెలుగొందాలనుకున్న మంజుల, తన తండ్రి అభిమానుల కారణంగా ఆ ప్రయత్నం మానుకుని నిర్మాతగా స్థిరపడింది.


పాతికేళ్ళు గడిచాయి. ఈ మధ్యలో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి ఆయన మనవరాలు సుప్రియ ఒకే ఒక్క సినిమాలో కథానాయికగా నటించింది తప్పిస్తే, ప్రఖ్యాత సినీ కుటుంబాల్లో స్త్రీలెవరూ వెండితెర మీదకి రాలేదు. ఇన్నేళ్ళ తర్వాత, ఒకప్పుడు మంజులకి ఎదురైన సమస్యే ఇప్పుడు నీహారిక ఎదుర్కొంటోంది. 'మెగాస్టార్' చిరంజీవి సోదరుడు 'లాఫింగ్ స్టార్' నాగబాబు కుమార్తె నీహారిక. ఇప్పటికే టీవీ షోలకి వ్యాఖ్యాతగా జనానికి పరిచయం అయ్యింది. మరో అడుగు ముందుకు వేసి సినిమాల్లో కథా నాయికగా నటించాలని నిర్ణయించుకుంది నీహారిక. తండ్రి ప్రోత్సహించాడు. దర్శక నిర్మాతలు ముందుకి వచ్చారు. కానీ, అభిమానులు అభ్యంతరం చెబుతున్నారు.

"నీహారికని మేము సోదరిగానో, కూతురిగానో చూస్తాం.. ఆమెని కథానాయికగా పరిచయం చేయడం మాకు అభ్యంతరం," అంటున్నారట చిరంజీవి అభిమానులు. నీహారిక చేయబోయే సినిమా దర్శక నిర్మాతలకి కొందరు అభిమానులనుంచి బెదిరింపులు వచ్చాయనీ, అయినప్పటికీ వెనక్కి తగ్గనవరసం లేదని వాళ్లకి నాగబాబు హామీ ఇస్తున్నారనీ ఆంగ్ల దినపత్రిక 'ది హిందూ' రాసింది. తండ్రి, సోదరుడు వరుణ్ తేజ్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులనుంచి నీహారికకి ప్రోత్సాహం లేదన్నది ఆ పత్రిక కథనం. అభిమానుల ఒత్తిళ్ళని నాగబాబు కుటుంబం ఏమాత్రం పట్టించుకోడవం లేదనీ, నీహారిక కథానాయికగా పరిచయం కావడం ఖాయమనీ తెలుస్తోంది.

రెండు ఉదంతాలనీ 'ఆడపిల్ల మీద వివక్ష' కోణం నుంచి కన్నా, 'తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయిక స్థానం' అన్న కోణం నుంచి చూడడమే సముచితం. పాతికేళ్ళ క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు కథానాయిక స్థాయి పెరగక పోగా మరింత దిగజారిందన్నది వాస్తవం. హీరోలిప్పుడు తెరమీద నాయికని 'ఏమే.. ఒసే..' అని పిలుస్తున్నారు. ఇలాంటి సంభాషణలు రాస్తున్న రచయితలేమో కాపురాలు బాగుచేసే టీవీ పంచాయితీల్లో పెద్దమనుషుల పాత్ర పోషిస్తున్నారు. మెజారిటీ సినిమాల్లో కథలో నాయిక పాత్ర ప్రాధాన్యం మొదలు, చిత్రీకరణలో ఔచిత్యం వరకూ తిరోగమన దిశలోనే ఉన్నాయిప్పుడు.


తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు, నాయికల ప్రాధాన్యత పాటలకే పరిమితం అవ్వడానికి కారకుల్లో కథానాయకులూ ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. హీరో పాత్రని ఎలివేట్ చేసే క్రమంలో మిగిలిన పాత్రల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చి, చివరికి హీరో పాత్రలు కూడా నేలవిడిచి సాము చేసే స్థితి వచ్చేసింది. ఈ క్రమంలో, ఇప్పటి హీరోయిన్లు ఒకనాటి వ్యాంపుల స్థానాన్ని భర్తీ చేస్తున్నారు తప్ప, అంతకు మించి వాళ్లకి చేసేందుకు ఏమీ ఉండడంలేదు. అందుకే కావొచ్చు, అభిమానులు తమ హీరోల కుమారులు తెరమీద చేసే అద్భుతాలకి జేజేలు పలుకుతున్నారు. కూతుళ్ళు నాయికలుగా వస్తామంటే, వాళ్ళని వ్యాంపులుగా చూడలేమని తిరస్కరిస్తున్నారు.

నూటికి తొంభైకి పైగా సినిమాల్లో నాయికని వ్యాంపుగా చిత్రించి, ఏడాదికో రెండేళ్ళకో ఓ సారి బాక్సాఫీసుని కొల్లగొట్టే ఒకటీ అరా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలని ఉదాహరణగా చూపించి తెలుగు తెరపై నాయికలు పూజలందుకుంటున్నారు అనడం ఆత్మవంచన తప్ప మరొకటి కాదు. నాయిక విలువని హీరోయిన్లకి చెల్లించే పారితోషికాలతో కాక, సినిమా కథలో వాళ్ళకున్న ప్రాధాన్యతతో కొలవడం అత్యవసరం. కథానాయికలంటే కేవలం షో పీస్ లు కాదన్న భావన ప్రేక్షకుల్లో వచ్చిన రోజున, మంజుల, నీహరికలకి ఎదురైన వ్యతిరేకతలాంటివి మున్ముందు కాలంలో మరో నాయికకి ఎదురుకాకుండా ఆగే అవకాశం ఉంది. కానీ, ఆలోచించగలిగే ఓపికా, తీరికా ఎందరికి ఉన్నాయి?

21 కామెంట్‌లు:

  1. "__________ ని మేము సోదరిగానో కూతురిగానో చూస్తాం. ఆమెను కథా నాయికగా పరిచయం చేయడం మాకు అభ్యంతరం".. మరి మిగిలిన వారందరూ మరొకళ్ళ సోదరిలు, కూతుళ్ళు కారా?" ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎప్పటికి పోతాయో...

    రిప్లయితొలగించండి
  2. Welcome to Indian hypocrisy! మన అమ్మలు, మన అక్కలు (ఇప్పుడు కొత్తగా మన హీరోల అమ్మలూ, అక్కలూ) మాత్రమే మనకు గౌరవనీయులు. మిగతావాళ్లందరూ మన గౌరవానికి అనర్హులు. మనదేశమూ, మన సంస్కృతి మాత్రమే ఉన్నతమైనవి. మిగిలివన్నీ చచ్చు సరుకు.

    మనం స్త్రీలందర్నీ గౌరవించేస్తాం కాబట్టే వాళ్ళెలా పడుండాలో మనం శాశించేస్తాం (ironically, this is the same logic often used by Talibans).

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సినిమా నటనకి వరసలు కూడానా? పాత తెలుగు సినిమాల్లో హీరోయిన్ చీర విప్పే సన్నివేశాల్ని హాల్‌లో తండ్రికొడుకులు కూడా కలిసే చూసి ఉంటారు. హీరోయిన్ ప్రేక్షకుల్లో తండ్రులకే కాదు, కొడుకులకి కూడా మరదలు వరస అవుతుందనా దాని అర్థం? బూతు సంస్కృతి నమ్ముకోవడానికి వరసలు ఒకటి!

      తొలగించండి
  3. మురళి గారూ, విశ్లేషణల్లో చెయ్యితిరిగిన మీకు నేను చెప్పేదేమున్నది గానీ, ఇదంతా "అభిమానుల" ఓవర్ ఏక్షన్ అని, తారల కుటుంబాల పబ్లిసిటీ స్టంట్ అయ్యుండచ్చనీ అనిపించడంలేదా? ఓ నటుడి కూతురు హీరోయిన్ అవుదామనుకుంటే మధ్యలో "అభిమానుల"కేం తీపు దిగదీసింది? అసలు పబ్లిసిటీ కోసం నటులే ఇటువంటి నిరసనల్ని లేవదీయిస్తారని నా వ్యక్తిగత అంచనా. ఎందుకంటే "అభిమానులు" అంటూ, "అభిమానుల" సంఘాలు అంటూ, వాళ్ళే మా దేవుళ్ళు అంటూ ఎగదోయడం పెంచిపోషించడం చేస్తున్నది ఈ సో కాల్డ్ .......స్టార్లే అని అనుమానం. సరే అదంతా తమ సినిమా హిట్ అవడానికి పడే తిప్పలు అనుకుందాం. కానీ ఇదంతా సీరియస్ గా తీసుకుంటూ నటుల్ని దేవుళ్ళుగా భావిస్తూ / ఆరాధిస్తూ ఉండే "అభిమానులే" ఓనాడు తమ వారసుల కెరీర్లకే ఎసరు పెడతారని అనుకునుండరు పాపం. బూమరాంగ్ అంటే ఇదేనేమో :) (కృష్ణ గారి కూతురు మంజుల హీరోయిన్ ఆలోచన విరమించుకోవడానికి "అభిమానుల" అభ్యంతరాల కన్నా మించిన కుటుంబకారణాలు ఉండుంటాయని నా అంచనా).

    ".. మరి మిగిలిన వారందరూ మరొకళ్ళ సోదరిలు, కూతుళ్ళు కారా?" అని జ్యోతిర్మయి గారు కరక్టుగా అడిగారు. అలనాటి ప్రముఖ హీరోయిన్ అయిన మంజుల గారి కూతుళ్ళు గాని, రాధ గారి కూతురు గాని హీరోయిన్లుగా వచ్చినప్పుడు ఎవరూ ఇటువంటి అభ్యంతరాలు లేవనెత్తినట్లు లేదే? బహుశా మంజుల గారికి, రాధ గారికి వీరాభిమానసంఘాలు లేకపోబట్టేమో!

    వెర్రితలలు వేసే "అభిమానం" అంటే ఇదే. ఓ ఉదాహరణ చూడండి - ఎక్కడయినా ఈ "స్టార్లు" స్టేజ్ మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక మాట కూడా పూర్తవకుండానే, అసలు నోరిప్పిన ప్రతి సారీ ఖయ్యిమంటూ ఈలలు హోరెత్తించే చప్పట్లు. ఆ నటుడు మాట్లాడుతున్నంతసేపూ ఇదే వరస. చిన్నపిల్లవాడు మొదటిసారి మాటలు చెప్తున్నప్పుడు తల్లిదండ్రులు పోతున్నట్లుంటుంది. వెర్రి కి పరాకాష్ఠ. ముఖ్యంగా మితిమీరిన మీడియా కవరేజ్ వల్ల హీరోల "అభిమానులు", రాజకీయ నాయకులు వారి కార్యకర్తలు చేసే ఓవర్ ఏక్షన్ మరీ పెచ్చుమీరిపోతోంది.

    మీడియాని తమ చుట్టూ తిప్పుకుంటూ పబ్లిసిటీ కోసం అంగలార్చే సినిమా వాళ్ళ మాటల్ని పెద్దగా పట్టించుకోవడం not worth our time అని నా నిశ్చితాభిప్రాయం. సినిమా చూస్తే చూసి, అక్కడితో వదిలెయ్యడమే.

    రిప్లయితొలగించండి
  4. హిందూ సంప్రదాయం ప్రకారం ఏర్పాటు చేసిన వరసల్ని బూతుకి కూడా వర్తింపచెయ్యడమే అన్నిటి కంటే పెద్ద జోక్. హీరో కూతురు తమకి కూడా కూతురుతో సమానం అని వీళ్ళు చెప్పుకోవడం చూస్తోంటే బూతుకి వరసలు అవసరమా అనే అనుమానం తెలివి ఉన్నవాడు ఎవడికైనా వస్తుంది.

    రిప్లయితొలగించండి
  5. (పైన నా వ్యాఖ్యలో మూడో పేరాలో) ....... తల్లిదండ్రులు పోతున్నట్లుంటుంది.
    (sorry, సవరణ) ....... తల్లిదండ్రులు మురిసిపోతున్నట్లుంటుంది.

    రిప్లయితొలగించండి
  6. @జ్యోతిర్మయి:అభిమాన హీరో అంటే ఆత్మబంధువు కదండీ. బాబాయి/అన్నయ్య కూతుర్నీ, పక్కింటి అమ్మాయినీ ఒకే దృష్టిలో చూడగలిగే వాళ్ళు చాలా అరుదనుకుంటాను :) మనం డబల్ స్టాండర్డ్స్ అనుకున్నా, ఇంకేమనుకున్నా జరుగుతున్నది ఇదేనండీ.. ధన్యవాదాలు.
    @కేతన్: నిష్టూరంగా వినిపిస్తున్నా, నిజం చెప్పారు. గౌరవం అనేది కమాండ్ చేయాల్సిందే తప్ప, డిమాండ్ చేసేది కాదనుకుంటాను నేను. కమాండ్ చేయగలిగే వాళ్ళు ఎందరు? ..ధన్యవాదాలు..
    @మార్క్సిస్ట్-హెగెలియన్: తండ్రి-టీనేజ్ కొడుకు కలిసి సినిమా చూసే వాతావరణం మనదగ్గర లేదండీ.. కాలేజ్ ఈడు నుంచీ ఫ్రెండ్స్ తో కలిసే కదా సినిమాలు.. తండ్రితోనూ, కొడుకుతోనూ నాయికగా చేసిన వాళ్ళున్నారు మరి.. ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  7. ఈ పిచ్చి పోకడలు హిందీలో లేకపోవడం మంచిదే అయింది. తమ కరీరులో పెద్దగా విజయం సాదించని రణధీర్ కపూర్ బబీతా గార్ల కూతుళ్ళు ఇద్దరూ మంచి పేరు తెచ్చుకున్నారు. మహేష్ భట్, అనిల్ కపూర్ (తాజాగా జాకీ ష్రాఫ్?) కుమార్తెలు కూడా రాణించారు.

    రిప్లయితొలగించండి
  8. @విన్నకోట నరసింహారావు: 'పెయిడ్ ఫ్యాన్స్' విషయంలో మీతో ఏకీభవిస్తానండీ. అయితే, మన దగ్గర వీళ్ళతో పాటు 'కేస్ట్ ఫ్యాన్స్' కూడా ఉన్నారు. అంటే, సదరు హీరోలదీ, వీళ్ళదీ ఒకే కులం అవ్వడం వల్ల పుట్టే అభిమానం. వీళ్ళు చాలా చాలా ఎమోషనల్. ఈ ఎమోషన్ కారణంగానే మనదగ్గర సినిమా హీరోలు రాజకీయ పార్టీలు పెట్టగలుగుతున్నారు. (తమిళనాడు లో సినిమా నటుల మీద చూపించే అభిమానం కులాలకీ, ప్రాంతాలకీ అతీతం. జయలలిత, రజనీకాంత్ ఇద్దరూ కన్నడిగులే). అయితే, ఈ కేస్ట్ ఫ్యాన్సే ఒక్కోసారి హీరోలకి ఇబ్బందిగా మారుతూ ఉంటారు కూడా. (సోషల్ మీడియాలో ఈ కేస్ట్ ఫ్యాన్స్ ని చూడొచ్చు.. వేరే కులం హీరోల సినిమాలని టార్గెట్ చేస్తూ పంచులు విసరడాలు మొదలు, మల్టీ-స్టారర్ సినిమా కేవలం తమ కులం వాళ్ళ వల్లే సక్సెస్ అయ్యిందని చాటింపు వేయడం వరకూ..) వీళ్ళ ఒత్తిళ్ళకి హీరోలు కొంతవరకూ తల ఒగ్గుతున్నారనిపిస్తుంది నాకు. (ఎంతైనా హీరోలు పెంచి పోషించిన సంస్కృతే కదండీ ఇది). ఇక, హీరోయిన్ల ఫ్యాన్స్.. హీరోల ఫ్యాన్లు దశాబ్దాల తరబడి అభిమానిస్తారండీ.. హీరోల కుటుంబాలు-ఫ్యాన్ల కుటుంబాలు తరాల తరబడి ఇదో చంక్రమణం. కానీ, నాయికల కెరీర్ స్పాన్ తక్కువ.. పైగా వాళ్లకి కులాధారిత అభిమానులు ఉండరు.. తేడా అక్కడ ఉంది.. ...వివరంగా మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  9. @జై గొట్టిముక్కల: అక్కడ అభిమానం సినిమాలకే పరిమితం అండీ.. వ్యక్తిగతంకాదు. అందుకే కావొచ్చు, ఉత్తరాది నటులేవరూ రాజకీయాల్లో పెద్ద స్థాయికి (ప్రధాని) వెళ్ళలేకపోయారు.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  10. సునీల్ దత్ మంత్రైనా అయ్యాడు కదా. దారి పక్కన పడుకున్న కూలీల మీదకి కార్ నడిపిన సల్మాన్ ఖాన్‌ని వెనకేసుకొచ్చినవాళ్ళ సంగతి ఏమిటి?

    రిప్లయితొలగించండి
  11. "కేస్ట్ ఫాన్స్". అదన్నమాట అసలు మర్మం, ప్రధాన factor. నాకు తట్టనేలేదు సుమీ.... ....ధన్యవాదాలు మురళి గారూ.

    రిప్లయితొలగించండి
  12. నా అనుమానం- హీరోల కూటుంబాల్లోంచి అమ్మాయిలు సినిమాల్లోకి రాకుండా అడ్డుపడేది అభిమాన సంఘాలు కావు,ఆ హీరోలే! తమ సినిమాల్లో హీరోయిన్లకు తాము ఇచ్చే గౌరవమూ, స్థానమూ ఏ పాటిదో వాళ్ళకి బాగా తెలుసు. అందుకే గుమ్మడికాయల దొంగలు భుజాలు తడుముకున్నట్టు తమ కుటుంబాల్లోని అమ్మాయిలని సినిమాల్లోకి రాకుండా తామే అడ్డు పడుతూ అభిమాన సంఘాల మీదికి నెపం తోస్తున్నారని నా కొక నమ్మకం/అనుమానమూ.

    ఇహ సినిమాల్లో హీరోయిన్ల (దు)స్థితికి కొంతవరకూ (చాలా వరకూ) హీరోయిన్లదే బాధ్యత అని కూడా నా నమ్మకం. వాళ్ళు కొంచెం ఆలోచన ఉపయోగించి సంఘటితంగా నిలబడితే సినిమాల్లో స్త్రీలు శరీర ప్రదర్శనకి మాత్రమే కాకుండా వుండేలా చేయగలరు. అయితే మనుషులకీ ఆలోచనలకీ ంఅధ్య డబ్బు ఎప్పుడూ అడ్డుగానే వుంటుంది మరి.

    శారద

    రిప్లయితొలగించండి
  13. అది అభిమానులు చేస్తున్న పనే. సినిమా నటులకి డబ్బులు కావాలి కనుక వాళ్ళు తమ కుటుంబ సభ్యుల్ని కూడా సినిమాల్లో నటింపచేస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు (పురుషులు కాకుండా స్త్రీలు) సినిమాల్లో నటించకుండా అడ్డుకోవడం వల్ల వాళ్ళ అభిమానులకి వచ్చే నష్టమేమీ ఉండదు. అవకాశం పోగొట్టుకునేది ఆ నటుల కుటుంబ సభ్యులే కదా.

    రిప్లయితొలగించండి
  14. @విన్నకోట నరసింహారావు: ధన్యవాదాలండీ..
    @శారద: మీ నమ్మకం/అనుమానం కొట్టి పారేయాల్సింది కాదండీ.. డిమాండ్-సప్లై ప్రకారం చూసినప్పుడు హీరోయిన్ల డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ. పైగా, తెలుగమ్మాయిలే అయి ఉండాలని నిబంధన కూడా ఏదీ లేదు కూడా కదా.. కాబట్టి వాళ్ళు చేయగలిగింది పెద్దగా ఏమీ లేదనే అనుకుంటాను.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  15. సినిమావాళ్ళకి డబ్బు అవసరమే. బోడి గుండుని మోకాలితో ముడిపెట్టినట్టు బూతుకి వరసలు కలుపుతున్నది అభిమానులే.

    రిప్లయితొలగించండి
  16. నిజమే..నటనను నటనగా చూసే స్థాయికి మన జనం ఇంకా ఎదగలేదు.
    చిన్న సవరణ..మంజులను హీరోయిన్ చేయాలనుకున్న సినిమా
    జగపతి బాబు పెళ్లికానుక. అది వచ్చి పాతికేళ్లు కాలేదు.. పదిహేనేళ్లు అంతే..
    ..చాలా మందికి తెలీని సంగతి.... మంజుల తమిళ్ లో సినిమాలు చేసింది. రాజస్థాన్ సినిమాలో..ఐతే విలన్ గా కూడా చేసింది.

    రిప్లయితొలగించండి
  17. మంజుల సినిమాలలోకి రావడంపై నిరసనలు 2004లో కూడా జరిగినాయి. అప్పట్లో నేను తూర్పు గోదావరి జిల్లా తాటిపాకలో ఆ వార్తలు విన్నాను. వీళ్ళ రోగం ఎలా ఉందంటే, "హీరోకి వరస కాని స్త్రీలందరూ తమకి కూడా వరస అవ్వరు, ఆ స్త్రీలు సినిమాల్లో నటిస్తే చూడలేము" అనుకుంటున్నారు. కృష్ణ మేనకోడలు జయసుధ నటించిన సినిమాలు వీళ్ళందరూ చూసారు. జయసుధ చీర విప్పి నటించిన సన్నివేశాలు కూడా వీళ్ళు చూసారు. దక్షిణ భారత దేశంలో (తెలంగాణలో తప్ప) మేనమాన-మేనకోడలు మధ్య ఉన్నది నిషిద్ధ వరస కాదు. వీళ్ళు సినిమాలు చూడడంలో కూడా ఆ వరసలకి కట్టుబడి ఉండడం చూస్తోంటే, ఏమిటీ వెర్రి అనే సందేహం వస్తోంది.

    రిప్లయితొలగించండి
  18. @చందు తులసి: మంజుల కథానాయికగా పరిచయం అవుతుందన్న మొదటి ప్రకటన 1990 లో వచ్చిందండీ.. ప్రాజెక్ట్ వివరాలేవీ బయటికి రాలేదు. అప్పుడు కృష్ణవి ఏడాదికి ఐదారు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. విలన్ గా చేసింది మలయాళీ సినిమా అనుకుంటా.. ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  19. ఇప్పుడు అందరి నోటా...!?నాగబాబు పైనాన్స్యిల్ గా చితికిపోయాడు...తన సోదరులు ఎంతవరకు తీర్చగలుగుతారు!?అందుకని తన పిళ్ళల కాయకస్టంతో దరిచేర్దామని అంట...!?అయితే ఇవి ఆ...నోటా..ఈ...నోటా...వినపడుతున్న వాస్తవాలతో...మాలాంటి...అభిమానులం....పీక తెగ నరుక్కోవాలనిపిస్తుంది...!!!???

    రిప్లయితొలగించండి
  20. @సక్సెస్: నాగబాబు అనారోగ్యంగా ఉన్నప్పుడు నీహారిక కాఫీ డే లో పనిచేయడానికి సిద్ధపడింది అని రాశారు కదండీ హిందూలో.. నిజానిజాలు ఆ కుటుంబానికే తెలుసు. బయటికి మాత్రం రకరకాల వార్తలు వస్తున్నాయి.. ఇప్పుడు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు కదా.. నెగిటివ్ వార్తలు పట్టించుకోకండి.. ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి