హోటల్ డైనింగ్ హాల్ అంతా హడావిడిగా ఉంది. శనివారం
సాయంత్రం టిఫిన్స్ అన్-లిమిటెడ్ బఫే ఆఫర్. పెద్దలూ, పిల్లలూ అన్న భేదం
లేకుండా.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆబాలగోపాలమూ అక్కడే ఉన్నారు. మెనూ చాలా
ఆకర్షణీయంగా ఉంది. ఇడ్లీ, కోకోనట్ ఇడ్లీ, పకోడీ, పుణుకులు, పెసరట్, ఉప్మా,
పుల్కా విత్ రాజ్మా కర్రీ, నూడుల్స్, చాట్ మరియూ అక్కడిక్కడ తయారు చేసి
వడ్డిస్తున్న స్వీట్ మలై పూరీ. ప్లేట్లో రెండిడ్లీలు పెట్టుకుని, చట్నీలు,
సాంబారు కప్పుతో చోటు వెతుక్కుంటూ హాలంతా కలియతిరుగుతున్న నా బాధ భరించలేక
ఓ టేబుల్ కార్నర్ సీట్ చూపించాడు మేనేజర్.
నా ఎదురుగా
ఇద్దరు పెద్దవాళ్ళు. ఎప్పుడో రిటైరైన ఉద్యోగులై ఉంటారు బహుశా. కొంచం గట్టిగానే
కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. వద్దన్నా వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి.
బ్యాంకుల వడ్డీ రేట్లు, బంగారం ధరల్లో మార్పులు, షేర్ మార్కెట్ పతనం లాంటి
టాపిక్స్ జమిలిగా నడుస్తున్నాయి. పక్క టేబిల్ లో కుర్ర గుంపు.. పవన్
కళ్యాణ్, మహేష్ బాబు అంటూ టాపు లేపేస్తున్నారు. శ్రద్ధగా రెండిడ్లీలూ
పూర్తి చేసి పెసరట్ ఉప్మా కోసం వెళ్ళబోతూ ఎదుటివాళ్ళిద్దరివైపూ చూశాను.
ఒకాయన మా పక్క టేబిల్ వైపు విసుగూ కోపం కలగలిపి చూస్తున్నాడు. ఎందుకై
ఉంటుంది?
నేను
సీట్లో కూర్చుంటూ ఎదుటివాళ్ళ వైపు చూసేసరికి ఒక్క క్షణం అయోమయం కలిగింది.
మన్ను తిన్న కృష్ణుళ్ళా ఇద్దరూ నోళ్ళు తెరుచుకుని ఉన్నారు. ఇద్దరి కళ్ళూ
పక్క టేబిల్ వైపే ఉన్నాయి. ఆ అమ్మాయి ముగ్గురబ్బాయిలకీ రాఖీలు కడుతోంది.
దృశ్యం చూడముచ్చటగా అనిపించడంతో నేనూ చూస్తూ ఉండిపోయాను. కుర్రాళ్ళు
ముగ్గురూ జేబుల్లోనుంచి గిఫ్ట్లు తీసిచ్చారు ఆ అమ్మాయికి. ఇంతలో
బిల్ వచ్చింది. ఆ అమ్మాయి అందుకుంది. ఇప్పుడు ముగ్గురబ్బాయిలకీ వాళ్ళ
హీరోలు గుర్తొచ్చినట్టు లేదు. ఒకే పార్టీగా మారిపోయి ఆమె చేతినుంచి బిల్ ఫోల్డర్
అక్షరాలా లాగేసుకున్నారు. మరో ఐదు నిమిషాల్లో ఆ టేబిల్ ఖాళీ అయ్యింది.
ఎదుటి ఇద్దరివైపూ నేనస్సలు చూడలేదు.
మిత్రులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు!!
బాగుందండీ వండర్ఫుల్ :-)
రిప్లయితొలగించండినాకెందుకో కార్టూన్లా ఊహకొచ్చి తెగ నవ్వొచ్చిందండీ :) :)
రిప్లయితొలగించండిchala baga rasthunnaru meeru sir.
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: :) ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@పరిమళం: లైవ్ చూసిన నా పరిస్థితి ఊహించండి.. నవ్వడానికి కూడా లేదు పైగా :) ..ధన్యవాదాలండీ
@మహేష్ తిరుపతి: ధన్యవాదాలండీ..