సోమవారం, ఏప్రిల్ 27, 2015

'ఉపాధ్యాయుల' నరసింహమూర్తి

'ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు...' ...డెబ్భై ఏళ్ళ ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి ఇకలేరు అన్న వార్త వినగానే నాక్కలిగిన భావన ఇది. భాషా, సాహితీ పరిశోధనలకి జీవితాన్ని అంకితం చేసిన నరసింహ మూర్తి ఆరునెలల క్రితం వరకూ కేవలం తన రచనల ద్వారా మాత్రమే నాకు పరిచయం. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే తన ఖాళీ సమయాలని తెలుగు భాష, సాహిత్య పరిశోధనకి వెచ్చించిన నరసింహ మూర్తి, పుష్కర కాలం క్రితం పదవీ విరమణ చేసిన తరువాత తన పూర్తి సమయాన్ని ఈ నిమిత్తమే కేటాయించారు. కేవలం రచయితే కాదు, ఆయన మంచి వక్త కూడా.

'కన్యాశుల్కం' సృష్టికర్త గురజాడ వేంకట అప్పారావు అన్నా, ఆయన ఇతర రచనలన్నా ఉపాధ్యాయుల వారికి ప్రాణ సమానం. 'కన్యాశుల్కం' నాటకంపై ఆయనకి ఉన్న అథారిటీ అసామాన్యం. ఆ నాటకంలో ఏ అంకాన్ని గురించైనా, ఏ పాత్రని గురించైనా అనర్గళంగా మాట్లాడగలరు. ఆయన పరిశోధనల్లో సింహభాగం గురజాడ రచనలు, జీవితాన్ని గురించే. 'కన్యాశుల్కం' పై వచ్చిన విమర్శలు అన్నింటిని గురించీ ఆయన విస్పష్టమైన సమాధానాలు ఇవ్వడమే కాదు, కువిమర్శకుల 'అసలు ఉద్దేశాలని' నిర్మొహమాటంగా ఎత్తిచూపించి, ఖండించారు కూడా.

ఆరేడు నెలల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో 'కన్యాశుల్కం' గురించి నరసింహమూర్తి చేసిన ప్రసంగాన్ని వినగలిగే అవకాశం, ఆయనతో కొంతసేపు ముచ్చటించే అదృష్టం అనుకోకుండా కలిగాయి. అనారోగ్యాన్ని  ఏమాత్రం లెక్కచేయకుండా గంటసేపు అనర్గళంగా ఆయన చేసిన ప్రసంగం 'కన్యాశుల్కం' నాటకం ఎందుచేత గొప్పదో, ప్రపంచ స్థాయి సాహిత్యంగా గణించదానికి గల అర్హతలేవిటో సాదోహరణంగా వివరించారు. ఆ నాటకంలో ఒక్కో స్త్రీ పాత్రనీ ఒక్కో 'స్టేట్మెంట్' అంటారాయన. "బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం కన్యాశుల్కం" అన్న శ్రీశ్రీ అభిప్రాయం, ఆ నాటకాన్ని తక్కువ చేయడమే అని నిర్మొహమాటంగా చెప్పారు.


ఉపన్యాసం పూర్తయ్యాక ఆయనతో మాట కలుపుతూ, "మరికాసేపు మాట్లాడితే బావుండేదండీ.. అప్పుడే అయిపోయిందా అనిపించింది" అన్నాను. "ఎంత గొప్ప సబ్జక్ట్ అయినా గంట కన్నా వినలేరండీ.." అన్నారు క్లుప్తంగా. ప్రసంగంలో చెప్పీచెప్పకుండా వదిలేసిన విషయాలని గురించి సంభాషణ సాగింది. "గురజాడకి మహాకవి అనే గౌరవం దక్కడం కొందరికి మింగుడు పడదు. ఇది ఇవాళ కొత్తగా వచ్చిన సమస్య కాదు. తొలినుంచీ ఉన్నదే. ఇలాంటి వాళ్ళకి గురజాడ సాహిత్యమే సమాధానం చెబుతుంది," అన్నారు. కమ్యూనిస్టు పార్టీ ద్వారా జరిగిన గురజాడ డైరీల పరిష్కారం, ఆ క్రమంలో జరిగిన లోపాలని గురించి కొంత మాట్లాడారు.

కొందరు మిత్రులు ఆయనతో ఫోటోలు దిగడానికి రావడంతో సంభాషణ మధ్యలో ఆగింది. ఆయన జరిపిన, జరుపుతున్న పరిశోధనలు, తెలుగుకి ప్రాచీన హోదా లాంటి విషయాల మీద కబుర్లు దొర్లాయి. ఆయనతో కూడా ఉన్న శ్రీమతి నరసింహమూర్తి ఆయనకి వేసుకోవాల్సిన మందుల గురించి గుర్తుచేశారు. "ఈవిడ నాకు రాతపనిలో సాయం చేస్తూ ఉంటుంది. నేను చెబుతూ ఉంటే తను చకచకా రాసేస్తుంది. ఆవిడ చేతిరాత బావుటుంది కూడా," అన్నారు నవ్వుతూ. వాళ్ళు వెళ్ళగానే, "మనం ఏదో మాట్లాడుకుంటున్నాం.." అన్నారు నాతో. "కన్యాశుల్కంలో స్త్రీపాత్రలు అన్నీ స్టేట్మెంట్స్ అన్నారు?" అడిగాను.

"అవును.. ఒక్క మధురవాణే కాదు, బుచ్చమ్మ, పూటకూళ్ళమ్మ, మీనాక్షి.. వీళ్ళందరూ స్టేట్మెంట్లే.. ఎవరి ఆలోచనా శక్తి మేరకి వాళ్ళు ఆలోచించవచ్చు ఈ పాత్రలని గురించి. మధురవాణి మాటల్లో హాస్యం అందరికీ నచ్చుతుంది. కానీ, ఆమె వ్యంగ్యం వెనుక ఏమున్నదో కొందరికే అర్ధమవుతుంది. పూటకూళ్ళమ్మలూ, మీనాక్షులూ తయారు కావడానికి కారణం ఎవరు? ఆనాటి సమాజమే కదా..." తలూపాను నేను. "అసిరి పాత్రని గురించి కూడా చాలానే చర్చ జరిగింది.." నేను అంటూ ఉండగానే, "ఒక్క అసిరి మాత్రమే కాదండీ, ప్రతి పాత్రా చర్చనీయమే. తెలుగు వాళ్ళ అదృష్టం కన్యాశుల్కం నాటకం.." అంటూ వాచీ చూసుకున్నారు.

"మీతో చాలా మాట్లాడాలి.. ఇప్పుడు కాదు.." అన్నాను. "విజయనగరం రండి.. సావధానంగా మాట్లాడుకుందాం" అన్నారు కారెక్కుతూ. వెళ్ళలేదు విజయనగరం. ఆయనకోసం ఇకపై వెళ్ళక్కర్లేదు కూడా. ప్రతిభ, నిరంతర కృషి, నిరాడంబరత సమపాళ్ళలో ఉన్న మరో పరిశోధకుడు ఎక్కడ? పరిశోధనా ఫలాలని సామాన్యులకి నేరుగా చేరవేసే భాషా పరిశోధకులు ఎక్కడున్నారిప్పుడు?? యు. ఎ. నరసింహమూర్తి ఆరంభించిన పరిశోధనా యజ్ఞాన్ని కొనసాగించే ఔత్సాహికులు కావాలిప్పుడు. ఆ యజ్ఞం కొనసాగడమే నరసింహమూర్తికి ఇచ్చే నిజమైన నివాళి..

4 కామెంట్‌లు:

  1. ఆ ఊరితో ఉందని మునుపెరుగని బంధమేదో పుటుక్కున తెగిన భావన... ఈ వార్త వినగానే. మనసు చెమర్చే నివాళి.

    రిప్లయితొలగించండి
  2. నిన్ననే యీ వార్త విని చాలా బాధపడ్డాను. తెలుగుపరిశోధనా జ్యోతిని వెలిగిస్తున్న ఒక పెద్ద వత్తి ఆరిపోయింది. ఆయన చిరకాలంగా అనుకొంటున్న ఇతిహాసాలగూర్చిన పరిశోధనకు ఠాగూర్ ఫెల్లోషిప్ వచ్చిందని (ఈ ఫెల్లోషిప్ పొందిన మొదటి తెలుగువారు నరసింహమూర్తిగారే!) సంతోషించిన కొద్ది రోజులకే యీ వార్త వినాల్సి వచ్చింది.
    సంక్రాంతి పండక్కి ఊరు వెళ్ళినప్పుడు ఆయన్ను కలిసినప్పుడు, ఎంతో ఆప్యాయంగా వారి తెలుగు వచనశైలి పుస్తకాన్ని యిచ్చి చదివి అభిప్రాయం చెప్పమన్నారు. ఇంకా ఆ పుస్తకాన్ని పూర్తిచెయ్యనే లేదు!
    జరాభారాన్నీ, అనారోగ్యాన్నీ కూడా ధిక్కరించి వారు చేస్తూ వచ్చిన నిరంతర కృషి, నాకెప్పుడూ ఆదర్శంగా మిగులుతుంది.

    రిప్లయితొలగించండి
  3. మురళి గారు...మంచి వ్యక్తి గురించి పరిచయం చేశారండి. గొల్లపూడి మారుతీ రావుగారి బ్లాగులో కూడా ఈయనగురించి రాశారండి... గొప్ప వ్యక్తి అని అర్ధం అవుతోంది...
    మెను పుస్తకాల కోసం కొత్త బ్లాగు మొదలుపెట్టానంది నికు వీలు కుదిరితె ఒక్కసారి చూడండి...

    Www.freebookbank.com
    .....,....నాగ శ్రీనివాస

    రిప్లయితొలగించండి
  4. @కొత్తావకాయ: అర్ధమవుతుందండీ.. ధన్యవాదాలు
    @కామేశ్వరరావు భైరవభట్ల: "తెలుగు పరిశోధనా జ్యోతిని వెలిగిస్తున్న ఒక పెద్ద వత్తి ఆరిపోయింది" నిజమండీ.. ధన్యవాదాలు.
    @నాగ శ్రీనివాస: బ్లాగు చూశానండీ... మీదని ఈ వ్యాఖ్య చూశాక తెలిసింది.. బాగుందండీ, మంచి సమాచారం ఇస్తున్నారు.. ...ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి