నేనిప్పుడు భూమికీ, ఆకాశానికీ మధ్యన ఉన్నాను. త్రిశంకు స్వర్గం అంటే ఇదేనా?
విమానం వేగంగా ముందుకు ప్రయాణిస్తుంటే, నా ఆలోచనలు అంతకన్నా వేగంగా
వెనక్కి ప్రయాణం చేస్తున్నాయి. పక్క సీట్లో ఒళ్ళు మరిచి నిద్రపోతున్న
చిన్నా చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు నా కంటికి. వాడిప్పుడు పాతికేళ్ళ
వాడైనా, నా కంటికి పసిబిడ్డే.
రెండువారాల క్రితం ఆఫీసు నుంచి ఇంటికి
వస్తూనే "మనం ఇండియా వెళ్తున్నాం అమ్మా" అన్నాడు వాడు. ఏం చెప్పాలో నాకు
అర్ధం కాలేదు. ఆ ముందు రోజే వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్లి వచ్చాడు. "ఇండియా వెళ్దామా అమ్మా?" అని అడిగి ఉంటే నేను ఏదన్నా
జవాబు చెప్పి ఉండేదాన్నేమో. వాడు నిర్ణయం తీసేసుకున్నాకా, ఇక నేనేం
చెప్పగలను?
ఇన్నేళ్ళ జీవితంలో ఏనాడూ, ఎవరికీ ఎదురు చెప్పడం తెలియని దాన్ని.
ఎటొచ్చీ ఇన్నాళ్ళూ నాకన్నా పెద్దవాళ్ళ మాట మన్నించాను. ఇప్పడు, నా కొడుకు
మాటకి తలవంచాను. నా కొడుకు నన్ను శాసించే అంతటి పెద్దవాడు అయినందుకు సంతోషం
కన్నా, వాడి నిర్ణయం తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయోనన్న భయమే ఎక్కువగా
కలుగుతోంది నాలో.
నిద్రపోతున్న చిన్నాని చూడడం నాకిష్టమైన
వ్యాపకాల్లో ఒకటి. ఏ అర్ధరాత్రి
వేళో లేచి, బ్లాంకెట్ లో నుంచి కనిపించే వాడి ముఖాన్ని చూస్తూ గంటలు
గడిపేస్తూ ఉంటాను నేను. నల్ల మబ్బుల్లో చందమామలా కనిపిస్తాడు నాకొడుకు
నాకంటికి. ఇప్పుడైతే ఆకాశంలో చందమామ.
చిన్న కళ్ళు, సూదంటు ముక్కూ,
ఆడపిల్లలకి ఉండే లాంటి సన్నని పెదవులూ, నుదుటిమీద పడే ఉంగరాల జుట్టూ..
దాచినా దాగని సౌకుమార్యం.. ముమ్మూర్తులా శ్రీకాంత్ గారి పోలికే వాడు. ఆ
పోలిక కూడా నాకు ఏకకాలంలో సంతోషాన్నీ, భయాన్నీ కలిగిస్తూ ఉంటుంది.
వాడి
పెంపకంలో తండ్రికి కూడా భాగం ఉండి ఉంటే బాగుండేదని నేను అనుకోని క్షణం
లేదు. ఎంత తల్లినైనా నేను తండ్రిని కాలేను కదా. చిన్నాకి తండ్రి
దూరమైనందుకు బాధ పడాలా? వాణ్ణి దక్కించుకోగలిగినందుకు సంతోషపడాలా?? ఏవిటో
అన్నీ
ప్రశ్నలే నాకు.
జమీందారీ కుటుంబంలో ఇద్దరు మగపిల్లల తర్వాత పుట్టిన
ఆడపిల్లని నేను. సహజంగానే కాలు కింద పెట్టనక్కర్లేకుండా గడిచిపోయింది నా
బాల్యం. అన్నయ్యలిద్దరికీ బాగా చదువులు చెప్పించారు కానీ, నన్ను మాత్రం
కాలేజీ గడప తొక్కనివ్వలేదు. పై చదువులకి వెళ్ళడానికి నా వయసే అడ్డంకిగా మారింది.
ఎలా వచ్చిందో తెలియదు కానీ, మా
అమ్మకి పుస్తకాలు చదివే అలవాటు వచ్చింది. మా దివాణంలో ఓ గది నిండా పెద్ద
పెద్ద అద్దాల బీరువాలు, వాటి నిండా తెలుగువీ, ఇంగ్లీషువీ పుస్తకాలు.
కొత్తగా అచ్చయిన పుస్తకాలన్నీ మా దివాణానికి పార్సిల్ వస్తూ ఉండేవి. చదువు మధ్యలోనే ఆగిపోయిన నాకు, అమ్మ పరిచయం చేసిన పుస్తకాల్లో
ప్రపంచాన్ని వెతుక్కోవడం అలవాటయింది నెమ్మదిగా.
నాలుగ్గోడలు దాటి బయటికి
వెడితే ఒకటే ప్రపంచం. కానీ, మా లైబ్రరీ గదిలో ఒక్కో పుస్తకమూ ఒక్కో
ప్రపంచం. నేనా ప్రపంచ యాత్రల్లో క్షణం తీరిక లేకుండా ఉండగానే, ఒకరోజు నా
పెళ్లి నిశ్చయం చేశారని చెప్పింది అమ్మ. నేనున్న దివాణానికీ వెళ్లబోయే
దివాణానికీ మధ్య గోదారే అడ్డు.
"అంత పెద్ద జమీందారీకీ ఇద్దరే
వారసులు. ఇతను చిన్నవాడు. చదువుకున్న వాడు. ఈడూ జోడూ బావుంటుంది అన్నారు
నాన్నగారు. అబ్బాయి ఫోటో తెప్పిస్తానన్నారు," ఇదీ అమ్మ చెప్పిన కబురు.
నిజానికి
అప్పటి చాలా ఏళ్ళ క్రితమే జమీందారీలు
రద్దయ్యాయి. భూసంస్కరణల గొడవకూడా చెలరేగి చల్లారింది. వాటిమీద బోల్డన్ని
కథలూ, కవిత్వాలూ కూడా వచ్చాయి. చట్టాలూ, శాసనాలూ బయటి ప్రపంచాన్ని ఏమన్నా
మార్చాయేమో తెలీదు కానీ, మా దివాణాల పద్ధతుల్లో లేశమాత్రం మార్పూ లేదు.
'పెళ్లి విషయం మాట్లాడకుండా, ఇవన్నీ ఏవిటీ?'
అంటే నేను చెప్పగలిగేది ఒక్కటే. ఆడపిల్లకి పెళ్లి జరగాలి కాబట్టి
జరుగుతోంది అంతే. ఆ పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందన్నది పూర్తిగా
నాచేతుల్లో ఉన్న విషయం కాదు కదా. నేనలా అనుకున్నాను కానీ, అమ్మ అలా
ఊరుకోలేకపోయింది. పెళ్లి నిశ్చయం అయింది మొదలు, ఏదో ఒక సమయంలో రోజూ ఓ గంట
సేపన్నా నేను అత్తవారింట్లో ఎలా మసలుకోవాలో చెప్పేది, కొన్నిసార్లు
నేరుగానూ.. చాలాసార్లు అన్యాపదేశంగానూను.
ఆవిడ మాటల సారాంశం సర్దుకుపోవాలి
అని. సంసారం గుట్టుగా జరుపుకోవాలి. మామూలు వాళ్ళ ఇళ్ళలో ఏం జరిగినా ఎవరూ
పట్టించుకోరు కానీ, గొప్ప వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతిదీ ఊరందరి నోళ్ళలోనూ
నానుతుంది. రెండు కుటుంబాల గౌరవం కాపాడాల్సిన బాధ్యత ఆడపిల్లమీదే ఉంది అని
పదేపదే చెప్పిందావిడ. "అయినా, కుర్రాడు చాలా మంచివాడేనుట," అని
ముక్తాయించేది ప్రతిసారీ.
పెళ్లి ఇంకా వారంరోజులు ఉందనగా బంధువులు
ఒక్కొక్కరూ రావడం మొదలయ్యింది. వాతావరణం హడావిడిగా మారిపోయింది. "మైథిలి
మొగుడు బొమ్మలేస్తాట్టే.. పెళ్ళయ్యాక కుంచెల బదులు దీని జడతోనే రంగులు
అద్దుతాడేమో," నా పొడవాటి జడను చూసి మేనత్త కూతుళ్ళు హాస్యాలాడేరు.
"శ్రీకాంత్ బాబుట.. పేరే దర్జాగా ఉంది.. ఇంక మనిషెలా ఉంటాడో?" పిన్ని
కూతురి కుతూహలం. నాకు పెళ్లి జరుగుతోందన్న ఉత్సాహమూ లేదు. జీవితం ఎలా
ఉండబోతోందో అన్న భయమూ లేదు. మా రెండో మేనత్త మాటల్లో చెప్పాలంటే నిమ్మకి
నీరెత్తినట్టు ఉన్నాను.
మగ పెళ్ళివారు విడిదింట్లో దిగిన వెంటనే మా
బంధువుల్లో పెద్దవాళ్లందరూ పరుగున వెళ్ళారు, మర్యాదలు చూడడం కోసం. నిజానికి
వాళ్ళలో సగం మంది వెళ్ళింది పెళ్ళికొడుకుని చూడ్డానికే.
"అదృష్టవంతురాలివే
అమ్మాయీ.. కుర్రాడు బంగారమే అనుకో. కాసేపు చూస్తే నా దిష్టి తగులుతుందేమో
అని చూపు తిప్పుకుని వచ్చేశాను" పెద్దత్త చెప్పింది, నన్ను దగ్గరగా
తీసుకుని.
శ్రీకాంత్ గారిని నేను మొదటిసారి చూసింది పెళ్లి
పీటలమీదే. పెద్దత్త మాటల్లో అతిశయోక్తి ఏమాత్రం లేదు. నాలుగైదు సార్లు
చూశాక నాకు అర్ధమైంది ఏమిటంటే, మనిషి ఇక్కడ ఉన్నారు కానీ, ఆలోచనలు
ఎక్కడో ఉన్నాయి. ఆ కళ్ళు నన్ను చూడడం లేదు. చేతలన్నీ యాంత్రికంగానే
ఉన్నాయి, నవ్వుతో సహా. నేను తలవంచుకున్నాను.
శ్రీకాంత్ గారి దివాణంలో
కాపురం మొదలయింది. అవే నాలుగు గోడలు. గుమాస్తాలు, వంట మనుషులు, పని మనుషులు.
ఒక్కటే తేడా ఏమిటంటే, ఈ ఇంట్లో లైబ్రరీ గది ఉన్నట్టులేదు. మా పడక గదికి ఆనుకునే శ్రీకాంత్ గారు బొమ్మలు వేసుకునే గది. ఆ గదిలో
స్టాండ్లకి అమర్చిన కేన్వాసులు, రంగులు, కుంచెలతో పాటు, రెండు అద్దాల
బీరువాలు. ఆ బీరువాలని చూడగానే నాకు పాత స్నేహితురాళ్ళని చూసినట్టు
అనిపించింది. నా అంతట నేనుగా ఆ గదిలోకి వెళ్ళే ప్రయత్నం ఏనాడూ చేయలేదు.
ఓ
రోజు ఉదయం, పనివాళ్ళు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో శ్రీకాంత్ గారి గదిలోకి
కాఫీ తీసుకెళ్ళాల్సి వచ్చింది. కాఫీ చేతికిచ్చి, అద్దాల బీరువాల్లో ఉన్న
పుస్తకాలని ఆసక్తిగా
చూస్తూ ఉంటే, "పుస్తకాలు చూస్తావా?" అని అడిగారు. ఆ కళ్ళనిండా
వెలుగు.
నిజానికి ఆ గదిలో ఉన్నప్పుడు శ్రీకాంత్ గారు పూర్తిగా
వేరే మనిషి. ఆనంద
పారవశ్యం అంటారే, అలాంటి స్థితిలో ఉండేవారు. నేనేమీ జవాబు చెప్పలేదు. కాఫీ
తాగడం మధ్యలో ఆపేసి, ఆ బీరువాలు తెరిచి పుస్తకాలు చూపించారు,
ఓపిగ్గా. అవేవీ నేను అంతకుముందు చదివినవీ, చూసినవీ కాదు. పెయింటింగ్స్ కి
సంబంధించిన పుస్తకాలు. మెరిసే దళసరి పేజీలు, చేతికి అంటుకుంటాయేమో అనిపించే
రంగులు.
"ఇవి పికాసో వర్క్స్... ఇవి మైకెలేంజిలోవి... ఇవేమో మన రాజా
రవివర్మవి.." శ్రీకాంత్ గారు పుస్తకాల పేజీలు తిప్పుతూ చాలా ఆసక్తిగా
చెప్పుకుపోతున్నారు. "ఈ బీరువాలో అంతా ఇంగ్లీష్ లిటరేచర్. నువ్వు
చదువుకోవచ్చు. ఎక్కడతీసిన పుస్తకం అక్కడ పెట్టెయ్యాలి సుమా" చిన్న పిల్లలకి
చెప్పినట్టు చెప్పారు. తను గెలుచుకున్న బహుమతులన్నింటి గురించీ చాలా
వివరంగా చెప్పారు నాకు. మా పెళ్ళయ్యాక శ్రీకాంత్ గారు నాతో 'మాట్లాడిన'
మొదటి రోజది.
మా పుట్టింటి నుంచి అమ్మ పంపిన దాదికి ఉన్నట్టుండి జబ్బు చేయడంతో
వెనక్కి వెళ్ళిపోయింది. వెంటనే మరో దాదిని పంపడం అమ్మకి వీలుకాలేదు.
రాణివాసంలో దాది లేకపోవడం కన్నా కష్టం మరొకటి ఉండదు. ఏపనీ స్వయంగా
చేసుకోకూడదు మరి. ఒకరోజు శ్రీకాంత్ గారు ఓ ఆడమనిషిని
తీసుకొచ్చారు. నాకన్నా ఓ పదేళ్ళు పెద్దదేమో. నల్లని చెయ్యెత్తు మనిషి. పేరు
అప్పలనరసమ్మట.
"ఈమెకి పని దొరకడం అవసరం. నీకెటూ దాది కావాలి కదా" అన్నారు.
సాధారణంగా ఇలాంటి విషయాల్లో మగవాళ్ళు కలిగించుకోరు. శ్రీకాంత్ గారు నా
ఇబ్బందిని గమనించారో, అప్పలనరసమ్మ అవసరాన్ని గుర్తించారో ఇప్పటికీ తెలియదు
నాకు. ఆ క్షణం నుంచీ అప్పలనరసమ్మ నన్ను కంటికి రెప్పలా చూసుకోడం
మొదలుపెట్టింది.
ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన ఆమెకి మొదలే మా దివాణం
సంగతులు కొన్ని తెలుసు. జమీందారీ గుట్లన్నీ బహిరంగ రహస్యాలే కదా. ఎప్పుడో
తప్ప నాతో మాట కలిపేందుకు ప్రయత్నించేది కాదు. నేను నోరు విప్పనవసరం
లేకుండానే నా అవసరాలన్నీ చూసేది.
ఓ రోజు సాయంత్రం వేళ దర్బారు
హాల్లో పెద్ద గలాభా. శ్రీకాంత్ గారికీ, వాళ్ళ అన్నయ్యకీ - పేరు శరత్ బాబు -
గొడవ జరుగుతోంది. పని వాళ్ళెవరూ కిక్కురు మనడంలేదు. అత్తగారు అంతకు చాలా
ఏళ్ళ క్రితమే కాలం చేశారు. మావగారు మంచాన ఉన్నారు. తోడికోడలు లోకం వేరు.
జరుగుతున్నది ఏవిటో నాకు అర్ధం కాలేదు. కాసేపటికి గొడవ సద్దు మణిగింది.
శ్రీకాంత్ గారు ఇంటికి రాలేదు.
జరిగిందేవిటో అప్పలనరసమ్మ ద్వారా తర్వాత
తెలిసింది. రోడ్డు మీద బొమ్మలేసుకుని, డబ్బులడుక్కునే మనిషిని ఇంటికి
తీసుకు వచ్చారట శ్రీకాంత్ గారు. అతన్ని తన గదికి తీసుకు వెళ్లి రంగుల
మిశ్రమం గురించీ అదీ చాలాసేపు మాట్లాడి, తన దగ్గర ఉన్న కొన్ని రంగులు,
కుంచెలు, కేన్వాసులూ ఇచ్చి పంపారుట. అలగా వాళ్ళని దివాణం లోపలికి రానివ్వడం
అన్నగారికి నచ్చక, తమ్ముడిని కోప్పడ్డారు.
శరత్ కూడా అప్పుడప్పుడూ
బొమ్మలేస్తారట. అప్పలనరసమ్మ చెబితే నాకు తెలిసిందా విషయం. అత్తగారు
ప్రత్యేకం మేష్టర్లని పిలిపించి కొడుకులిద్దరికీ పెయింటింగ్ నేర్పించారట.
పెళ్ళయ్యి
ఏడాది గడిచినా నేను వట్టి మనిషిగానే ఉండిపోవడం అమ్మని చాలా కంగారు
పెట్టింది. చిన్నన్నయ్య పెళ్ళికని నేను పుట్టింటికి వెళ్ళినప్పుడు "అతను
నిన్ను బాగా చూసుకుంటున్నాడా?" అని ఒకటికి పదిసార్లు అడిగింది.
"మగవాడికి
రకరకాల సరదాలుంటాయి. మనం సర్దుకోవాలి. మన ఇళ్ళల్లో ఇలాంటివన్నీ మామూలే..
నేను సర్దుకోవడం లేదూ?" అమ్మ మాటలు నాకు అర్ధమయ్యీ కాకుండా ఉన్నాయి. అమ్మదీ
అదే పరిస్థితి. ఏదో అడిగే ప్రయత్నం చాలా సార్లు చేసి, నోటి చివరి వరకూ
వచ్చిన ప్రశ్నని వెనక్కి లాగేసుకుంది. వస్తూ వస్తూ అమ్మ లైబ్రరీ నుంచి
కొన్ని పుస్తకాలు తెచ్చుకున్నాను నాతో.
మరో ఆరునెలల తర్వాత నేను నెల
తప్పడంతో అమ్మ ఊపిరి పీల్చుకుంది. వచ్చి నాతో నాలుగు రోజులు గడిపి, వెళుతూ
వెళుతూ అప్పలనరసమ్మకి వంద జాగ్రత్తలు చెప్పింది. ఏడో నెల వస్తూనే పురిటికి
తీసుకెళ్ళిపోతానని మరీ మరీ చెప్పి వెళ్ళింది.
అమ్మకన్నా ఎక్కువగా సంబర
పడిపోయింది అప్పలనరసమ్మ. అప్పటివరకూ ముక్తసరిగా ఉన్నది కాస్తా, నాతో తరచూ
మాట్లాడడం మొదలుపెట్టింది. నేను ఆలోచనల్లో ఉండకూడదు అని ఆమె తాపత్రయం. తన
కబుర్లన్నీ చెప్పేది. మొగుడి పధ్ధతి నచ్చక 'ఇడిబావులు' పెట్టేసుకుందిట.
వాళ్ళ బంధువుల ముసలమ్మ ఒకామె ఉంటే, ఆమెకి తోడుగా ఈ ఊరు వచ్చేసిందిట. ఆమె
కబుర్లకి 'ఊ' కొట్టకపోతే ఊరుకునేది కాదు.
ఆ రోజుల్లోనే శ్రీకాంత్ గారు
ఐదార్రోజులు ఇంటికి రాలేదు. అప్పుడప్పుడూ ఇంటికి రాకపోవడం మామూలే కానీ,
చెప్పకుండా ఇన్నాళ్ళు దూరంగా ఉండడం మాత్రం మొదటిసారి. నాలుగు రోజులు
గడిచేటప్పటికి నాకు కంగారు మొదలయ్యింది. ఎవరిని అడగాలి? ఏమని అడగాలి?? అప్పలనరసమ్మ నాతో మాట్లాడడానికి తటపటాయిస్తోంది. ఆ
మధ్యాహ్నం ఆమే నా
దగ్గరికి వచ్చింది.
"గాబరైపోమాకమ్మా.. ఆ మణిసికి పేణం బానేదంట.. బావుగోరు
ఆయమ్మ కాణ్ణే ఉన్నారు. తెరిపినొడగానే ఒచ్చేత్తారు?" చెప్పి వెళ్లబోతుంటే,
ఎప్పుడూ
మాట్లాడని నేను నోరు విప్పాను.
"ఎవరికి నరసమ్మా? ఎవరికి బాగోలేదు? సగం సగం
కాదు, పూర్తిగా చెప్పు" నేనంతగా నిలదీయగలనని నాకే తెలీదు. నా మాటలు విని
నోరు తెరుచుకుని ఉండిపోయింది.
"అయ్యో తల్లీ.. నీకు తెలుసనీసుకున్నాను.. నా
నోటితో సెప్పిత్తన్నాడు పాడు దేవుడు. నిబ్బరించుకో అమ్మా.. ఆ మణిసి గంగమ్మ.
ఊళ్లోనే ఉంటాది. సాని పుట్టకయినా గొప్ప మణిసంతారు. ఈ బాబే
కన్నెరికం సేసేరు. అసలు, మనువాడతానని పేసీ యెట్టేరంట.. శానా గొడవలే
అయ్యేయప్పట్నో.. ఆ మణిసి మరొకడికేసి కన్నెత్తి సూడదు.. ఈబాబు ఆ మణిసిని
సూడకుండా ఉండనేరు," చెప్పేసి గదిలోనుంచి వెళ్ళిపోయింది అప్పలనరసమ్మ.
సీట్లో
కూర్చున్న నేను ఉన్నట్టుండి అటూ ఇటూ ఊగుతున్నాను.. టర్బ్యులెన్స్.. విమానం
క్షేమంగా ల్యాండ్ అవుతుందా? నాకు తెలియకుండానే చిన్నాని గట్టిగా
పట్టుకున్నాను. కుదుపుకి వాడు కళ్ళు తెరిచాడు. నన్ను
చూసి నిబ్బరంగా నవ్వాడు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అదే నిబ్బరం వాడిలో.
(ప్రయాణం కొనసాగుతుంది...)