సోమవారం, అక్టోబర్ 06, 2014

మాటకి మాట

రాజకీయ నాయకులు ఎప్పుడూ వార్తల్లో ఉండాలని కోరుకుంటారు. మంచిగానా, చెడ్డగానా అన్నది అనవసరం. వార్తల్లో ఉండడమే ముఖ్యం వాళ్లకి. హాలీవుడ్, బాలీవుడ్ లతో సహా చాలా సినిమా పరిశ్రమల్లో కూడా ఈ ధోరణి ఉంది. తారలు వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు, కొండొకచో వివాదాస్పదమైన సంగతులూ తరచూ ప్రసార మాధ్యమాల్లో కనిపించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారన్నది బహిరంగ రహస్యం.

ఎందుకోగానీ, తెలుగు సినిమా పరిశ్రమలో మొదటినుంచీ కూడా ఈ ధోరణి కనిపించదు. ఇక్కడ సినిమా వాళ్ళ గురించి గాసిప్పువార్తల ప్రచారం కొంచం తక్కువే. అలాగే, వివాదాలు ఏమన్నా ఉన్నా అవి వార్తల్లో రావడానికి పెద్దగా ఇష్టపడరు  ఇక్కడి సినిమా జనం. తెలుగు సినిమా వాళ్ళు కొందరు రాజకీయాల్లోకి వెళ్ళినా, రాజకీయ నాయకులు అనుసరించే ప్రచార ధోరణులు సినిమా రంగంలోకి రాలేదనే చెప్పాలి. అయితే, ఇప్పుడిప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ కూడా వివాదాల ప్రచారంలో మిగిలిన భాషల్ని అనుసరిస్తోందేమో అన్న సందేహం కలుగుతోంది.

ఓ నటుడికీ, ఓ దర్శకుడికీ ఓ సినిమా షూటింగ్ లో మాటా మాటా పెరిగింది. ఆ నటుడు సినిమా నుంచి తప్పుకున్నాడు (లేదా దర్శకుడే తప్పించాడు). ఇలా నటులకీ దర్శకులకీ అభిప్రాయ భేదాలొచ్చి మాటామాటా పెరిగి, సినిమా తారాగణం మారిపోవడం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. భానుమతి మిస్సైన మిస్సమ్మ సినిమానే ఇందుకు సాక్ష్యం. (ఫలితంగానే తెలుగు పరిశ్రమకి సావిత్రి దొరికింది అనేవాళ్ళూ ఉన్నారు, అది వేరే విషయం). అయితే, ఇప్పటి తాజా సినిమా అలాంటిలాంటి సినిమా కాదు. అగ్రతారలున్న భారీ చిత్రరాజం.

తీరా సినిమా విడుదల అయ్యాక, అనుకున్నది ఒకటీ అయ్యింది మరొకటీ. బ్రహ్మాండం బద్దలు కొట్టేస్తుంది అనుకున్నది కాస్తా ఫలితం చూడబోతే పెట్టుబడి తిరిగి వస్తుందా అన్న సందేహాన్ని కలిగించింది. ఏదోలా జనం ఆ సినిమా చూసేలా చెయ్యాలి. ఎలాగా అని ఆలోచిస్తుండగా అల్లప్పుడెప్పుడో షూటింగులో జరిగిన వివాదం గుర్తొచ్చింది. సరిగ్గా అదే సమయంలో సినిమా నుంచి తీసివేయబడిన నటుడి మరో సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమా కూడా అంచనాలని అందుకోడం కూసింత అనుమానాస్పదంగానే కనిపించింది.

అలనాటి వివాదాన్ని తవ్వితీస్తే ఉభయతారకంగా ఉంటుందని ఎవరికి అనిపించిందో కానీ, మొత్తానికి ఓ సరికొత్త వివాదం తెరమీదకి వచ్చింది. నటుడూ, దర్శకుడూ స్క్రిప్టు ప్రకారం డైలాగులు రువ్వుకున్నారు. ఇక్కడివరకూ బానే ఉంది. కానైతే, వీళ్ళిద్దరి పోరు వల్లా వాళ్ళ సినిమాల కలెక్షన్ల కన్నా ముందే టీవీ చానళ్ళ రేటింగులు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ప్రతి టీవీ చానలూ పూటా ఈ వివాదాన్ని గురించి వార్తా కథనాన్ని వండి వడ్డిస్తోంది. అసలు విషయంతో పాటు, ఆ దర్శకుడి, నటుడి పాత సినిమాల్లో క్లిప్పింగులూ అవీ చూపిస్తోంది కూడా.

ఈ మాటల యుద్ధం రెండు సినిమాలకీ ఏమాత్రం సాయ పడుతుందో తెలీదు కానీ, టీవీ చానళ్ళకీ, గాసిప్ వెబ్సైట్లకీ మాత్రం కావలసినంత ముడిసరుకుని అందిస్తోంది. ఇక్కడో చిన్న పిడకల వేట.. ఒకానొక చానల్లో వివాదం తాలూకు ప్రత్యేక కార్యక్రమం మధ్యలో వచ్చిన బ్రేక్ లో ఓ ప్రకటన వచ్చింది. "మన పెద్ద కొడుకు ఇచ్చాడు" అంటూ ఓ ముసలాయన ఫెళఫెళ్ళాడే కొత్త వెయ్యిరూపాయల నోటుని భార్యకి చూపించడం, ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫోటోని గోడకున్న దేవుళ్ళ ఫోటోల పక్కన తగిలించడం ఆ ప్రకటన సారాంశం. "అన్నయ్య నా అప్పు మొత్తం తీర్చేశాడు," అంటూ ఆ దంపతుల కొడుకు - వ్యవసాయం చేసుకుంటూ - ఆనందంగా చెప్పే ప్రకటన ఎప్పుడు వస్తుందో  కదా..

2 కామెంట్‌లు:

  1. గొడవా గోలా మాట ఎలా ఉన్నా పోస్టులో ఫినిషింగ్ టచ్ మాత్రం కేకంతేనండోయ్

    రిప్లయితొలగించండి
  2. @శ్రీనివాస్ పప్పు: అసలు కన్నా కొసరు నచ్చిందంటారు అయితే :) ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి