తెలుగు సినిమా పరిశ్రమకి రెండు కళ్ళు
అనిపించుకున్న ఎన్టీఆర్-ఏఎన్నార్ ల సమవయస్కుడు. కానీ, కెరీర్ ఆరంభం నుంచే
వాళ్ళకి తండ్రి, తాతగా నటించాడు. తనకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళయిన
నటీమణులకి భర్త వేషం వేసి మెప్పించాడు. తెలుగుదనం అనగానే గుర్తొచ్చే
నిలువెత్తు శాంత స్వరూపం గుమ్మడి వెంకటేశ్వరరావు. 'గుమ్మడి నాన్న' తెలియని
తెలుగు సినిమా ప్రేక్షకులు ఉంటారా? ఆ ప్రేక్షకులకి తన గురించి, తను చేసిన
సినిమాల గురించీ మరోవిధంగా తెలియడానికి అవకాశం లేని ఎన్నో విషయాలకి అక్షర
రూపం ఇస్తూ గుమ్మడి రాసిన పుస్తకం 'తీపిగురుతులు - చేదుజ్ఞాపకాలు.'
గుంటూరు
జిల్లాలోని తెనాలి పట్టణం పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది సాహిత్యం. ఆ
వెనుకే నాటకరంగం. 'ఆంధ్రా పారిస్' అన్న ముద్దు పేరు ఉండనే ఉంది కదూ. ఆ
తెనాలికి దగ్గరలో ఉన్న రావికంపాడు అనే పల్లెటూరు గుమ్మడి స్వస్థలం.
వ్యవసాయం చేసుకునే ఉమ్మడి కుటుంబం. చదువంటే, మరీ ముఖ్యంగా తెలుగంటే
చిన్నప్పటినుంచీ చాలా ఇష్టం గుమ్మడికి. తెలుగు మీద ఇష్టం పద్యాలు
నేర్చుకోడానికి దోహదం చేస్తే, పద్యం కర్ణపేయంగా చదవగలిగే నేర్పు నాటకాల్లో
అవకాశాలు ఇప్పించింది. చదువు, నాటకాలు.. స్కూలు చదువు అవుతూనే పెళ్లి..
వ్యవసాయం మీద ఆసక్తి లేకపోవడంతో తెనాలిలో చిన్న వ్యాపారం ఆరంభించడం..
ఇక్కడే ఊహించని మలుపు తిరిగింది జీవితం.
సినిమాల మీద
గుమ్మడికి ఎటువంటి అభిప్రాయమూ లేదు. కానీ, ఆయన సినిమాలకి పనికొస్తాడని
దగ్గరి బంధువుల, ప్రాణ స్నేహితుల నమ్మకం. ఆ నమ్మకమే, గుమ్మడి తరపున ఆయన
కోసం వాళ్ళని సినిమా వేషాలు వెతికేలా ప్రయత్నించింది. విజయా సంస్థలో
భాగస్వామ్యం కోసం తెనాలి లో ఉన్న తన ఆస్తి అమ్మకం కోసం వచ్చిన చక్రపాణికి
గుమ్మడిని పరిచయం చేశారు స్నేహితులు. గుమ్మడిని పరిచయం చేస్తూ "ఈ
కుర్రవాడేనండీ నే చెప్పిందీ. నాటకాలే కాకుండా సినిమాలలో కూడా నటించాలనే
కోర్కె ఉంది. చదువుకున్నవాడు, మనవాడు," అనడంతోనే చక్రపాణి "సినిమాలలో 'తన'
'మన' అనేవి లాభం లేదు. చదువు, సంస్కారాలు ఏవీ అక్కరకి రావు," అనేశారు.
అక్కినేనితో
'దేవదాసు' నిర్మించిన వినోదా సంస్థ నిర్మాతల్లో ఒకరైన డి.ఎల్. నారాయణ
ద్వారా తొలి సినిమా అవకాశం వచ్చింది గుమ్మడికి. చిన్న చిన్న వేషాలు, అంతంత
మాత్రం సంపాదన. వచ్చేది ఖర్చులకి ఏమాత్రం చాలకపోవడంతో నెలనెలా ఇంటికి రాసి
డబ్బు తెప్పించుకోడం అలవాటుగా మారింది. అప్పటికే హీరోగా కుదురుకున్న
ఎన్టీఆర్ బడ్జెట్ పాఠాలు చెప్పేశారు గుమ్మడికి. "నాకు నెలకి ఐదువందలు జీతం
వస్తుంది. ఇది కాకుండా సినిమా మొత్తానికి ఐదువేలు. అంటే నెలకు సుమారుగా
వెయ్యి రూపాయలు. నాకు అయ్యే ఖర్చు వంద రూపాయలు మాత్రమే. రూము రెంటు యాభై,
కేరేజీ పాతిక రూపాయలు. తక్కిన అమాబాపతు ఖర్చులు పాతిక. మరి మీరు అలా ఖర్చు
పెడితే ఎలా?" అన్న ఎన్టీఆర్ ప్రశ్నకి జవాబు లేదు గుమ్మడి దగ్గర.
గుమ్మడి
పర్సనాలిటీ చూసి హీరో వేషాలు రాకపోలేదు. కానీ, కేరక్టర్ ఆర్టిస్టుగా
స్థిరపడితేనే ఎక్కువ రోజులు సినిమాల్లో ఉండగలవు అని చక్రపాణి చెప్పిన
సలహాని పాటించారు. తనకి హాస్య పాత్రలంటే ప్రత్యేకమైన ఇష్టం ఉన్నా, ఆ తరహా
పాత్రలు చాలా తక్కువగానే వచ్చాయి అంటారు గుమ్మడి. పరిశ్రమలో అందరితోనూ
కలుపుగోలుగా, అజాతశత్రువుగా ఉండాలన్న గుమ్మడి ప్రయత్నం ఫలించని సమయం ఒకటి
ఉంది. అక్కినేని హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియో నిర్మిస్తున్న సమయంలో
ఎన్టీఆర్-ఏఎన్నార్లమధ్య అపార్ధాలు పొడసూపినప్పుడు ఆ ఇద్దరూ కూడా మొదట
గుమ్మడిని అపార్ధం చేసుకుని ఆపై అర్ధం చేసుకున్నారు. ఇలాంటి చేదు
జ్ఞాపకాలని రేఖామాత్రంగా ప్రస్తావించి, తీపి గురుతుల గురించి మాత్రం
విశదంగా రాశారీ పుస్తకంలో.
గీతరచయిత సి. నారాయణ రెడ్డి, నవలా
రచయిత్రి దద్దనాల రంగనాయకమ్మ, నాటక రచయిత మోదుకూరి జాన్సన్.. వీళ్ళంతా
సినిమా రంగానికి పరిచయం అవ్వడం వెనుక పూనిక గుమ్మడిదే. నాటకాలన్నా,
సినిమాలన్నా ప్రాణం పెట్టే డాక్టర్ గాలి బాల సుందరరావు గారి ఏకైక పుత్రిక
జలంధరకి పెళ్లి సంబంధం చూడడంలోనూ (వరుడు సినీ నటుడు చంద్రమోహన్) గుమ్మడిది
కీలక పాత్రే. సినీ నటిగా సావిత్రి ప్రస్థానాన్ని తొలినుంచి చివరివరకూ
దగ్గరినుంచి గమనించిన కొందరిలో గుమ్మడి ఒకరు. ఆమె వ్యక్తిత్వం గురించి
రాసిన విశేషాలు ఆశ్చర్య పరుస్తాయి. చిత్తూరు నాగయ్యన్నా, అటెన్ బరో తీసిన
'గాంధీ' సినిమా అన్నా ఒళ్ళు మర్చిపోయేంత ఇష్టం గుమ్మడికి. ఒక్కమాటలో
చెప్పాలంటే నాగయ్యలాంటి నటుడూ, వ్యక్తీ లేడు.. గాంధీ లాంటి మరో సినిమా లేదు
అంటారు.
తన డెబ్భై ఐదో ఏట
'ఆంధ్రజ్యోతి' లో సీరియల్ గా గుమ్మడి రాసిన కబుర్లకి విక్రమ్ పబ్లిషర్స్
సంస్థ 2001 లో పుస్తక రూపం ఇచ్చింది. గుమ్మడి పోషించిన పాత్రల అరుదైన
స్టిల్స్, అనేకమంది ప్రముఖులు గుమ్మడిని గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలతో
పాటు గుమ్మడి నటించిన సినిమాల జాబితాను అనుబంధంగా ఇచ్చారు. సినిమా
అనుభవాలతో పాటు విదేశీ పర్యటనల విశేషాలనూ ప్రస్తావించారిందులో. గుమ్మడి మాటల్లాగే మృదువుగా సాగిపోయే కథనం ఆపకుండా చదివిస్తుందీ పుస్తకాన్ని.
నాటి సినిమాలతో పాటు సామాజిక, రాజకీయ పరిస్థితులని గురించీ తెలుసుకునే
అవకాశం ఇచ్చే రచన ఇది. (పేజీలు 190, వెల రూ. 100, 'విశాలాంధ్ర' అన్ని
శాఖల్లోనూ లభ్యం).
అవునండీ మంచి నటుడు. ఆయన నటనతో పాటు నాకు నచ్చే మరో విషయం ఆయన చక్కటి తెలుగు ఉచ్చారణ. ఎంత స్పష్టంగా దోషరహితంగా ఉండేది!
రిప్లయితొలగించండిమరొకటి మనందరికీ తెలిసినదే - చాలా సినిమాల్లో గుమ్మడి పాత్ర చనిపోతుండేది కదా. ప్రతి సినిమాలోను ఈ చావు చావలేక చస్తున్నాను అని బయట గుమ్మడి సరదాగా అంటుండేవారట.
@విన్నకోట నరసింహారావు: "అయ్యా, ఈ గుండెజబ్బుతో చచ్చిన చావు చావకుండా చచ్చేటన్ని చావులు చచ్చాను. ఇక ఈ చావు నేను చావలేను. నన్ను చంపకండి" అన్నారటండీ గుమ్మడి, గుండెపోటు పాత్రలకి విరామం ఇవ్వాలి అనుకున్నప్పుడు. ...ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి