ఆదివారం, ఫిబ్రవరి 02, 2014

యాత్రాస్మృతి

జీవితం అంటే ఒక యాత్ర. ఆద్యంతాలు తెలియని ప్రయాణం. అందరూ చేసేదే.. కానీ కొందరుంటారు. వాళ్ళు యాత్రలో ప్రతి మజిలీనీ అనుభవించి, ఆస్వాదించి, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోడమే కాదు, భవిష్యత్ తరాలకి వాళ్ళ జ్ఞాపకాలని అందంగా అందిస్తారు కూడా. అలాంటి ఓ యాత్రికుడి అనుభవాల, అనుభూతుల సమాహారమే 'యాత్రాస్మృతి.' దాశరథి కృష్ణమాచార్య పేరు వినగానే లలితలలితమైన సినీ గీతాలు, విప్లవాన్ని కాంక్షించే 'అగ్నిధార' లూ, 'రుద్ర వీణా'లాపనలూ ఏకకాలంలో గుర్తొస్తాయి.

గాలిబ్ గీతాలని తెలుగు లోగిళ్ళలోకి తీసుకొచ్చిన ఈ సుకుమారుడే, 'నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌనో; అందాక ఈ భూగోళమ్మున అగ్గి పెట్టెదను; నిప్పుల్ వోసి హేమంత భామా గాంధర్వ వివాహమాడెదను' అంటూ 'అంతర్నాదా'న్నీ వినిపించారు. 'గోరొంక గూటికే చేరావు చిలకా' 'పాడెద నీ నామమే గోపాలా' లాంటి సుతిమెత్తని గీతాలు రాసిన కవే, స్వతంత్ర పోరాటంలో సత్యాగ్రహిగా జైలు జీవితం గడిపి, నిజాముకి వ్యతిరేకంగా గొంతెత్తి పాడారన్నది ఒక్కటే కాదు, కృష్ణమాచార్య జీవితం అడుగడుగూ ఆశ్చర్యాలమయమే.

సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబంలో పుట్టి పరమశివుణ్ణి భక్తిగా కొలవడం మొదలు దుర్భర జైలు జీవితం అనుభవించే సమయంలో మోదుగు పూలను చూస్తూ చిలిపి ఊహల్లోకి వెళ్ళడం వరకూ.. ఎన్నని చెప్పాలి? తన యాభై ఐదో ఏట 'యాత్రాస్మృతి' రాయడం ఆరంభించిన కృష్ణమాచార్య 'యాభై ఐదులో రెండు అయిదులున్నాయి కదా! ఐదు తో ఐదు ప్లస్ చేస్తే బాల్యం (పదేండ్లు). ఐదు తో ఐదు ఇంటూ చేస్తే యౌవనం (పాతిక) ఐదు పక్కన ఐదు వ్రాస్తే యాభై ఐదు. వార్ధక్య ద్వారం!' అంటూ వేసిన చమత్కార బాణం, పాఠకుల్ని అలవోకగా పుస్తకంలోకి తీసుకుపోతుంది. 'ఒకే వస్తువు చలికాలంలో వేడిగా, ఎండాకాలంలో చల్లగా ఉండడం ప్రకృతిలో విశేషం. వటచ్చాయ, కూపోదకం, తాంబూలం.. నాలుగవది తమకు తెలిసిందే..' లాంటి చమక్కులకి లోటు లేదు.


ఆకాశవాణి కోసం రాసిన 'తుంగభద్ర' నాటకంలో భద్ర పాత్ర పోషించిన శారదాశ్రీనివాసన్ ని మనసారా మెచ్చుకోవడం లోనూ, సురవరం ప్రతాపరెడ్డి రాసిన 'మొగలాయి కథలు' ని పరిచయడంలోనూ దాశరథి వారి సున్నితత్వం కనిపిస్తే, ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా జైల్లో నిరసన దీక్షలో పాల్గోవడం ఆయన పట్టుదలని పట్టి చూపుతుంది. జైలు జీవితాన్ని గురించీ, రజాకార్ల ఆగడాలు, హైదరాబాద్ సంస్థానం భారత దేశం లో విలీనమైన వైనాన్నీ విశదంగా చెప్పారు ఈ రచనలో. కేవలం తెలుగు కవిత్వాన్ని మాత్రమే కాదు, అంతర్జాతీయ కవితలు ఎన్నింటినో స్పృశించారు ఈ రచనలో.

తన సోదరుడు రంగాచార్య 'చిల్లర దేవుళ్ళు', సమకాలికుడు వట్టికోట ఆళ్వారు స్వామి 'ప్రజల మనిషి' నవలల్లో ఉండే సామ్యాలని గురించి మాత్రమే కాదు, ఆరుద్ర 'త్వమేవాఽహమ్' లోతుల్నీ పరిచయం చేశారు దాశరథి. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఆరుద్ర రచనని అర్ధం చేసుకోవాలి అంటారు కృష్ణమాచార్య. మొత్తం పుస్తకాన్ని అరవై చిన్న చిన్న అధ్యాయాలుగా విభజించి, ప్రతి అధ్యాయానికీ సరిపోయే విధంగా ఉండే దాశరథి కవితని జతచేశారు ప్రకాశకులు 'తెలుగు సమితి' వారు. చివర్లో జోడించిన చిత్రమాలిక ప్రత్యేక ఆకర్షణ.

'ఈ యాత్రాస్మృతి వ్యాసాలలో డాక్టర్ దాశరథి ఆనాటి తెలంగాణ పరిస్థితులను, నిరంకుశ పరిపాలన కింద నలిగిపోయిన ప్రజల ఇక్కట్టులను, రాక్షసమైన యేలుబడిలో అణచి వేయబడిన ప్రజల భాషల దయనీయ స్థితిని, సంస్కృతిని, ఆనాటి చెరసాల లోని పరిస్థితులను, ఏవిధమైన ప్రాథమిక స్వత్వాలు లేని సమాజాన్ని చక్కగా చిత్రించినాడు,' అన్నారు దేవులపల్లి రామానుజరావు, 1988 లో వెలువడిన తొలి ప్రచురణకి రాసిన ముందుమాటలో. 'మహారచయిత టాల్ స్టాయ్ యుద్ధము శాంతిగా పర్యవసించడాన్ని ఒక నవలగా రాశాడు. కాని దాశరథి విషయంలో 'యుద్ధము-శాంతి' ఆయన జీవితంగానే పెనవైచుకు పోయాయి. ఈ యాత్రాస్మృతి ఆ శాంతాశాంతాలకొక అభిజ్ఞ' అంటారు వాడ్రేవు చినవీరభద్రుడు తాజా ముద్రణకి రాసిన ముందుమాట 'మహాంధ్రకవి' లో. అవుననకుండా ఉండలేం, 'యాత్రాస్మృతి' పూర్తి చేసి పక్కన పెట్టాక. (పేజీలు , 247, వెల రూ. 100, ఎమెస్కో ద్వారా లభ్యం).

2 కామెంట్‌లు:

  1. మంచి పుస్తకమ్.... రైలు లో అయన చేతికి సంకెళ్ళు చూసి బాధ పడిన ఒక యువతి గురించి రాసిన రెండు వాక్యాలు అద్భుతమ్... అలాగే నిజామాబాద్ జైలు పై రజాకర్ల దాడిని ఎదుర్కొన్న ఖైదీల గురించి రాసిన తీరు స్పూర్తిదాయకం ...ఈ పుస్తకం ంగ్లీషు లో వచ్చి ఉంటె ఈ పాటికి సినిమా గ వచ్చి ఉండేది

    రిప్లయితొలగించు
  2. @కృష్ణ: అవునండీ.. ఆ అమ్మాయి, ఆమె ఆయన్ని పారిపొమ్మని చెప్పడం, ఆయన ఒప్పుకోక పోవడం.. గుర్తుండిపోయే విషయం.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించు