సోమవారం, అక్టోబర్ 14, 2013

...ఐనా, నేను ఓడిపోలేదు!

డిస్ప్లే లో ఉన్న పుస్తకాలు వరుసగా చూసుకుంటూ వెళ్తూ, ఒక కవర్ పేజి చూసి "బాగా తెలిసిన అమ్మాయిలా ఉందే?" అనిపించి పుస్తకం చేతిలోకి తీసుకున్నా. '...ఐనా, నేను ఓడిపోలేదు!' అనే టైటిల్ బాగా ఆకర్షించడంతో, పుస్తకం తీసేసుకున్నాను. ఆ తర్వాత, వెళ్ళిన చోట పని కొంచం ఆలస్యం కావడంతో చేతిలో ఉన్న పుస్తకం చదవడం మొదలుపెట్టాను... పది పేజీలు పూర్తిచేసేసరికి అర్ధమయ్యింది, ఈ పుస్తకం పూర్తిచేసి కానీ నేను నిద్రపోలేనని. 'ఏముందీ నూట పాతిక పేజీల పుస్తకంలో?' అని ఎవరన్నాఅడిగితే, నేను చెప్పగలిగే జవాబు ఒక్కటే... "జీవితం!!" 

ఘనమైన చారిత్రక, సాంస్కృతిక చరిత్ర ఉన్న వరంగల్ జిల్లా ప్రస్తుతం ఆత్మహత్యల్లో ముందుంది. ఆంధ్రప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నజిల్లాలలో వరంగల్ ఒకటి. ఆ జిల్లాలో మైలారం అనే ఓ మారుమూల పల్లెటూరికి చెందిన గృహిణి జ్యోతి తన ఇద్దరు చిన్నపిల్లలు బీనా, బిందు లతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. కూలీలందరూ ఇళ్ళకి వెళ్ళిపోయాక, పిల్లలిద్దరినీ బావిలోకి తోసేసి, ఆపై తనూ అదే బావిలో దూకి ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధ పడిపోయింది. కారణం? ఏడాది తేడాతో పుట్టిన ఆ పిల్లలు ఇద్దరికీ కనీసం పాలిచ్చే స్తోమతు లేకపోవడం..

అప్పటివరకూ తన పేదరికం, శారీరక దుర్బలత్వం.. వీటి చుట్టూనే ఆమె ఆలోచనలు తిరిగాయి.. కూలీలందరూ ఇళ్ళకు వెళ్ళిపోయారు. జీవితానికీ, మరణానికీ మధ్య ఉన్నవి కేవలం కొన్నే క్షణాలు. అప్పుడే ఆమెకి గుర్తొచ్చింది.. తను పదోతరగతి పాసయ్యానని. ఆ చదువు తన ఇద్దరు బిడ్డలకీ గుక్కెడు పాలని అందించలేక పోదన్న ధైర్యమూ వచ్చింది.. ఆ పదో తరగతి కూడా, స్వయంగా ఆమె తండ్రే ఆమెని 'బాల సదన్' అనే అనాధాశ్రమానికి తీసుకెళ్ళి అక్కడ చేర్చడం వల్ల చదవగలిగింది. అటుపై ఊహించనంత తొందరగా పెళ్లి, పిల్లలు...


బతకగలను అన్న ధైర్యం కలిగిన క్షణం జ్యోతి జీవితంలో చాలా గొప్పది. ఆ ధైర్యమే ఆమెచేత ఎన్నో ఉద్యోగాలు చేయించింది.. అమెరికా తీసుకెళ్ళింది.. అక్కడ సొంత వ్యాపారం ప్రారంభించ గలిగేలా చేసింది. తను నడిచే దారిలో అడుగడుగునా ఎదురయ్యే ముళ్ళని ఏరి పారేసి ఆపకుండా తన ప్రయాణాన్ని కొనసాగించేలా చేసింది. పదోతరగతి చదువు, గుండెల నిండా ధైర్యం పెట్టుబడిగా, తన ఇద్దరు పిల్లలకీ మంచి జీవితం ఇవ్వడం అనే లక్ష్యంతో మైలారం వదిలిపెట్టిన జ్యోతి చేసిన ప్రయాణం తక్కువదేమీ కాదు. ఎదుర్కొన్న ఒడిదుడుకులూ మామూలువి కాదు.

2012 మే ఒకటిన ఓ తెలుగు టెలివిజన్ చానల్ కి జ్యోతి రెడ్డి ఇంటర్యూ ఇవ్వడం తో మొదలయ్యే కథనం, అదే సంవత్సరం మే రెండున ఎమెస్కో బుక్స్ ఆఫీసులో తన ఆత్మకథ ప్రచురించడానికి అంగీకరించడంతో ముగుస్తుంది. అక్కడక్కడా కొన్ని తడబాట్లు ఉన్నప్పటికీ ఆపకుండా చదివించే కథనం. "నేను నాకు యాది ఉన్నంతవరకూ, నేను అనుభవించిన సంఘటనలన్నీ, అప్పటి మనోభావాల్నీ యథాతథంగా కాగితం మీద పెట్టే ప్రయత్నం చేశాను. కొంతమందికి బాధ కలిగించే విషయాలు ఏవయినా నేను రాసి ఉండకపోవచ్చు, కానీ రాసినవన్నీ వాస్తవాలు. గుండె లోతుల్లోంచి తన్నుకొస్తున్న వేలాది భావాలకి అక్షరరూపాలు," అన్న చివరి మాట సాయంతో ఆమె రాయకుండా వదిలేసిన విషయాలని ఊహించవచ్చు.

"నాకనిపించింది ఏమిటంటే, ఈ జ్యోతి అనే పల్లెటూరు అమ్మాయి ప్రపంచ ఆర్ధిక విపణికి కేంద్రమైన అమెరికాలో స్థానం పొందడానికి కారణం ఆమె భయాన్ని జయించడమేనని. నేను జ్యోతిని భయం లేని ఓ స్త్రీగా భావించడంలేదు. భయాన్ని జయించిన ఓ స్త్రీగా భావిస్తున్నాను" అన్నారు ఎమెస్కో విజయకుమార్ తన ముందుమాటలో. 'నిప్పులాంటి నిజం' పుస్తకాన్ని తెనిగించిన జర్నలిస్ట్ జి.వల్లీశ్వర్ రచనా సహకారం అందించిన ఈ పుస్తకం కథనంలో ఆయన మార్కు కనిపించింది. అచ్చుతప్పులు తక్కువే కానీ, ఫోటోల ముద్రణ విషయంలో మరికొంచం శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది.

... నాకు తెలిసిన అమ్మాయిలా అనిపించి పుస్తకం చేతిలోకి తీసుకున్నా, కవర్ ఫోటోని దగ్గరనుంచి చూడగానే అర్ధమయ్యింది, ఆమె నాకు తెలియదని. కానీ, పుస్తకం చదవడం పూర్తిచేయగానే ఆమె నాకు ఆత్మీయురాలన్న భావన కలిగింది. జీవితం వడ్డించిన విస్తరి కాని ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే రచన ఇది. (ఎమెస్కో ప్రచురణ, వెల రూ. 60, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

9 కామెంట్‌లు:

  1. కొంతమంది ఉంటారు చూడండీ... సిల్వర్‌లైన్లు గట్రా అంటూ దేనికోసమో ఎదురుచూస్తూ ఉండరు!!
    ఒక స్పూర్తిదాయకమైన జీవితాన్ని పరిచయం చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు, మురళీ!

    రిప్లయితొలగించండి
  2. ఏటికి ఎదురీది ధైర్యంగా తలెత్తి నిలబడగలిగితే ఓటమి తలవంచుకు వెళ్ళిపోతుంది!ఇలాంటి ఆత్మకథలు ఆశోపహతులకు నిత్య స్ఫూర్తిదాయకాలు!ఎందరెందరో దగాపడిన చెల్లెళ్ళకు దారిదీపాలు!

    రిప్లయితొలగించండి
  3. మనిషిలోని ధైర్యం అవసరమైనప్పుడు ఏ స్థాయికి తీసుకు వెళుతుందో ఆమె జీవితం తెలుపుతోంది.
    అటువంటి ధైర్యం నాలోనూ ఎప్పటికీ సడలకూడదని
    కోరుకుంటున్నాను.Thanks for da inspiring post.

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగున్నది.మీ బ్లాగ్ చదివిస్తోంది

    రిప్లయితొలగించండి
  5. @నిషిగంధ: నిజమేనండీ.. ఎదురు చూపులు లేవు ఎక్కడా.. ప్రయత్నిస్తూ పోవడమే.. పడిపోయినా, ఓడిపోయినా కూడా... ...ధన్యవాదాలు.
    @సూర్య ప్రకాష్: నిజం చెప్పారు!! ధన్యవాదాలండీ..
    @అనూ: అవునండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  6. @నాగార్జున: ధన్యవాదాలండీ
    @మణికంఠ: ధన్యవాదాలండీ

    రిప్లయితొలగించండి
  7. ii rojullonuu inta aasaktigaa telugu pustakaalu chadivi vyaakhyaaninche vaallu vunnaarani ii blaaglo chuusi aanandistunnaanu.

    రిప్లయితొలగించండి