మంగళవారం, జూన్ 04, 2013

కాశీయాత్ర

"కాశీకి వెళ్ళిన వాడూ, కాటికి వెళ్ళిన వాడూ ఒక్కటే..." ..రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలు అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో బాగా ప్రచారంలో ఉన్న వాడుక ఇది. బస్సులు పెద్దగా లేకపోవడం, ఎక్కువ దూరం కాలి నడకన, బళ్ళ మీద ప్రయాణం చేయాల్సి రావడం, కాశీ పట్టణంలో తరచూ అంటువ్యాధులు ప్రబలుతూ ఉండడం... ఈ కారణాల వల్ల, కాశీకి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారన్న నమ్మకం పెద్దగా ఉండేది కాదు. ఇలాంటి వాతావరణంలో కాశీకి ప్రయాణం అయ్యారు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి. తర్వాతి కాలంలో శతావధానిగా పేరు తెచ్చుకున్న పండితుడూ, తిరుపతి వేంకట కవుల్లో అర్ధభాగమూ అయిన వేంకట శాస్త్రి, తన యవ్వనారంభంలో చేసిన కాశీయాత్రని ఓ సుదీర్ఘ వ్యాసంగా అక్షరబద్ధం చేశారు.

ఈ కాశీయాత్ర విశేషాలతో పాటు, వేంకటశాస్త్రి విరచితమైన వ్యాసాలు మరికొన్నింటిని కలిపి ఓ సంకలనంగా తీసుకు వచ్చారు గుంటూరు కి చెందిన అన్నమయ్య గ్రంధాలయం వారు. సంపాదకుడు మోదుగుల రవికృష్ణ సుదీర్ఘంగా రాసిన 'మనవి మాటలు' తో ప్రారంభమయ్యే ఈ పుస్తకం ఆసాంతమూ చదివిస్తుంది. తిరుపతి వేంకట కవుల ప్రసిద్ధ నాటకం 'పాండవోద్యోగ విజయాలు' లో పండిత పామరులని సమంగా ఆకర్షించిన ఒకానొక పద్యం ప్రారంభ వాక్యం శీర్షికగా 'చెల్లియో చెల్లకో..!' అంటూ శ్రీరమణ చెప్పిన కబుర్లు దాటుకుని ముందుకు వెడితే, 'మా గురువుగారు' అంటూ పలకరిస్తారు 'కవి సామ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ. వేంకట శాస్త్రి ప్రత్యక్ష శిష్యుడైన విశ్వనాథ, తన ఆత్మకథలో గురువు గారి గురించి రాసుకున్న భాగాన్ని ఈ పుస్తకంలో చేర్చడంతో, చెళ్ళపిళ్ళ వారి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే వీలు కలిగింది.

తన పందొమ్మిదో ఏట (1889) కాశీ వెళ్ళడానికి ప్రయాణ ముహూర్తం నిర్ణయించుకున్న వేంకట శాస్త్రి గారికి, అనుకోకుండా అదే ముహూర్తంలో వివాహం జరిగింది. పెళ్ళికి ముందు జరిపే 'స్నాతకం' లో 'కాశీ యాత్ర' జరిపే సంప్రదాయం ఉంటుంది కాబట్టి, తను పెట్టుకున్న ముహూర్తానికి కాశీ ప్రయాణం జరిగినట్టే అని చమత్కారంగా చెబుతూనే, చదువరులని తనతో పాటు కాశీ క్షేత్రానికి ప్రయాణం చేసేస్తారు చెళ్ళపిళ్ళ వారు. కాశీ వెళ్ళాలనే సంకల్పం కలగడానికి మొదటి కారణం తాంబూల చర్వణం మీద ఆయనకి ఉన్న ఇష్టం. పుట్టిన ఊరు యానాం లో కానీ, గురువుగారు చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి స్వస్థలం కడియెద్ద లో కానీ తాంబూలం దొరికే పరిస్థితి లేదు. కాశీలో తాంబూల సేవనం హెచ్చు అనీ, దొరకడం సులభమనీ తెలిశాక కాశీ మీద మోజు కలిగింది అంటారాయన. స్థానికంగా ఎందరు పండితులు ఉన్నా, కాశీ పండితుల దగ్గర విద్య నేర్చుకోవాలి అన్న కుతూహలం మరొక కారణం.


వివాహం జరిగిన తర్వాత, కందుకూరి కృష్ణశాస్త్రి అనే సహాధ్యాయితో కలిసి అష్టావధానాలు చేసి సంపాదించిన సొమ్ముతో కాశీయాత్ర ప్రారంభించిన చెళ్ళపిళ్ళ వారికి ఎదురైన అనుభవాలు ఎన్నో... ఎన్నెన్నో... మొత్తం యాభై తొమ్మిది పేజీల వ్యాసంలో కాశీ యాత్రతో పాటు, ఎన్నో విశేషాలు పంచుకున్నారు. ఎందరో కవిపండితులు, వారిని ఆదరించిన జమీందారులు, ఆయా జమీందారుల చుట్టూ ఉండే బలమైన కోటరీలు.. ఇలా ఎన్ని కబుర్లో... పండితుల మధ్య ఉండే స్పర్ధలు, ఫలితంగా ఎదురయ్యే సమస్యలు... ఇవన్నీ సందర్భానుసారంగా చెబుతూనే, అసలు విషయాన్ని పక్కదోవ పట్టనివ్వకుండా యాత్రాస్మృతిని ఆసాంతం ఆకర్షణీయంగా మలిచారు. కాశీ ప్రయాణం క్లుప్తంగానే చెప్పినా, తిరుగు ప్రయాణాన్ని గురించి విశదంగా రాసి, యాత్రలో ఉండే ఇబ్బందుల గురించి చదువరులకి ఓ అవగాహన కలిగేందుకు దోహదం చేశారు. కష్టార్జితం దొంగల పాలవ్వడం మొదలు, అనారోగ్యంతో చేసిన పడవప్రయాణం వరకూ అన్నీ ఆసక్తిగా చదివించేవే.

ఆకట్టుకునే మరో విషయం 'గంగా సంతర్పణ' వృత్తాంతం. కాశీ వెళ్లి, తిరిగి వచ్చిన వారు సంతర్పణ చేయడం రివాజు. అందరిలాగా కాకుండా, 'కనీసం ఒక మిఠాయితో' ఘనంగా సంతర్పణ చేసుకోవాలి అన్నది చెళ్ళపిళ్ళ వారి కోరిక. ఇంటి ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రం. ఆర్జనకి ఉన్న ఏకైక మార్గం అవధానమే. అప్పటికింకా తిరుపతి శాస్త్రి జతచేరలేదు కూడా.. యానాం నుంచి ముమ్మిడివరం వెళ్లి అవధానం చేసిన చెళ్ళపిళ్ళ వారికి అక్కడ కలిగిన ఖేదం, అటుపై అయినాపురం లో దొరికిన ఆదరణ, ఘనంగా జరిగిన సంతర్పణలతో పాటు, తన జాతకంలో సంభవించిన 'కుసుమ యోగా'న్ని వివరిస్తూ వ్యాసం ముగించారు. ప్రయాణ సౌకర్యాలు పెద్దగా లేని ఆ రోజుల్లో, ఆచారం సాగించుకునే విషయంలో ఏమాత్రమూ రాజీపడలేని ఓ బ్రాహ్మణుడు చేసిన యాత్ర ఎన్నో ఆసక్తికరమైన విషయాలని చెబుతుంది, తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి. 'కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర' చాలాసార్లే గుర్తొచ్చింది.

కాశీయాత్రతో పాటు, 'శృంగార వర్ణనము,' 'శతావధానము,' 'సిగ్గూ-బిడియము,' 'మా విద్యార్ధి దశ-నాటి కవిత్వం'అనే శీర్షికలతో వేంకట శాస్త్రి రాసిన వ్యాసాలని జతచేశారు ప్రకాశకులు. వీటిలో, 'శృంగార వర్ణనము' 'సిగ్గూ-బిడియము' వ్యాసాలు మళ్ళీ మళ్ళీ చదివించేవిగా ఉన్నాయి. శతావధాన ప్రక్రియపై వచ్చిన విమర్శలని ఖండిస్తూ రాసిన పదునైన వ్యాసం 'శతావధానము.' విద్యార్ధి దశలో తెలుగు కవిత్వం అంటే ఏమాత్రం ఆసక్తి లేకపోయినా, చివరికి తెలుగు కవులుగానే స్థిరపడిన వైనాన్ని వర్ణించారు 'మా విద్యార్ధి దశ-నాటి కవిత్వం' వ్యాసంలో. తిరుపతి వేంకట కవుల నుంచి వచ్చిన రచనల జాబితాతో పాటు, వారి అవధానాన్ని గురించి నాటి పత్రికల్లో వచ్చిన కథనాన్ని జతచేశారు. వీటితోపాటు విజయనగరం రాజులకి కాశీతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ సంపాదకుడు రాసిన 'కాశీ-విజయనగరం వారు' వ్యాసం ఏకబిగిన చదివిస్తుంది. (పేజీలు 176, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

7 కామెంట్‌లు:

  1. సంపాదకుడి పేరు మోదుగుల రామకృష్ణ కాదండీ 'రవికృష్ణ'. సవరించగలరు. వృత్తిరీత్యా తెలుగు లెక్చరర్ కానీ చరిత్ర అంటే మక్కువ ఎక్కువ. మన కౌటిల్యచౌదరిగారికి సన్నిహిత మిత్రులు. అందువలన గుంటూరు వెళ్లినప్పుడు ఆయనను కలవగలిగాను. దీనికి ముందు మల్లంపల్లి సోమశేఖరశర్మగారి 'చారిత్రక వ్యాసమంజరి', 'భౌద్దయుగం', ఆదిభట్ల నారాయణదాసు గారి స్వీయచరిత్ర 'నా యెఱుక' పుస్తకాలను ప్రచురణలోకి తీసుకువచ్చారు. ముద్రణలో రాకుండా ఉండిపోయిన మంచి పుస్తకాలను వెలికితీసి ప్రచురించడం ఆయనకు అసక్తి. ఆయన కృషిని తప్పకుండా అభినందించవలసిందే!

    రిప్లయితొలగించండి
  2. ఏభై ఏళ్ళ అకితం చదివిన పుస్తకం మళ్ళీ గుర్తు చేశారు.

    రిప్లయితొలగించండి
  3. బావుంది (పునః ) పరిచయం .

    నేను చదవడం మొదలెట్టా కానీ పూర్తి చెయ్యలేదు . కానీ మా ఊరు అయినాపురం గురించి ఉందని తెలిసాకా ఇప్పుడు వెంటనే చదవాల్సిందే. థాంక్సులు తెలిజేసినందుకు

    విశ్వనాథ వారి మా గురువుగారు వ్యాసం చదివి ఆయన ధోరణి మీద వేంకట శాస్త్రి గారు చురక భలే వేసారు (ఈ వ్యాసం నీ గురించా నా గురించా అని ఏదో అంటారు కదా ).

    అన్నిటికంటే ముఖ్యంగా ఆ పుస్తకం మీద మోదుగుల రవికృష్ణ గారి శ్రద్ధ పేజీ పేజీ లో కనిపించింది. వ్యాసాలూ, చిత్రాలు సందర్భోచితంగా పుస్తకం లో చాలా చక్కగా సమకూర్చారు . అచ్చుతప్పులు కూడా పెద్దగా లేవని అన్నారు జంపాల చౌదరి గారి ఈ మాట వ్యాసం లో .. అక్కడ వ్యాసం చూసే ఈ పుస్తకం కినిగే లో కొన్నాను నేను .


    రిప్లయితొలగించండి
  4. @భాస్కర్: ధన్యవాదాలండీ..
    @చాణక్య: సరి చేశానండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  5. @కష్టేఫలె: ధన్యవాదాలండీ..
    @వాసు: ఐనాపురం ప్రస్తావన రాగానే మిమ్మల్నే తలచుకున్నానండీ... తప్పక చదవండి.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  6. //విశ్వనాథ వారి మా గురువుగారు వ్యాసం చదివి ఆయన ధోరణి మీద వేంకట శాస్త్రి గారు చురక భలే వేసారు (ఈ వ్యాసం నీ గురించా నా గురించా అని ఏదో అంటారు కదా )//
    వ్యాసం నీ గురించా నా గురించా అని కాదండీ.. వేంకటశాస్త్రిగారి సన్మానానికి వెళ్లి "అల నన్నయకు లేదు తిక్కనకు లేదా భోగము.. అంటూ మొదలుపెటి నా వంటి స్వాదు కవితా మనోజ్ఞమూర్తి శిష్యుడయ్యే భోగమనే అర్థమొచ్చే దీర్ఘ సమాసం చెప్పుకుని, మా చెళ్లపిళ్ల స్వామికున్నట్లుగన్" అని ముగిస్తారు విశ్వనాథ. దాంతో నన్ను పొగుడుతూ పద్యం చెప్పావా నిన్ను పొగుడుకుంటూ చెప్పావా అంటారు వేంకట శాస్త్రి గారు. అదండీ కథ.

    రిప్లయితొలగించండి