రచయిత సత్తా ఉన్నవాడైతే ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వచ్చినా ఎక్కడా పునరుక్తి అన్న భావన కలగకుండా రక్తి కట్టిస్తాడు అనడానికి ఉదాహరణ జంధ్యాల. నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చిన జంధ్యాల ఒకే విషయాన్ని మూడు సినిమాలలోని సన్నివేశాల్లో చెప్పారు.. మూడింటిలోనూ అవి పతాక సన్నివేశాలే.. సినిమాకి ప్రాణం అయిన సన్నివేశాలే. అయితేనేం.. చూసే ప్రేక్షకుడిని ఒప్పించడం మాత్రమే కాదు, 'ఈ విషయాన్ని ఇంతకన్నా బాగా మరోవిధంగా చెప్పడం సాధ్యమేనా?' అన్న ప్రశ్న వచ్చేలా రాయడం జంధ్యాల ప్రతిభకి నిదర్శనం. తను అర్దాయుష్కుడై మన మధ్య నుంచి వెళ్ళిపోయినా, జంధ్యాల రాసిన సినిమాల్లో కొన్ని చిరంజీవులుగా మిగిలిపోయేవి ఉండడం ఒక్కటే సంతోషించాల్సిన విషయం.
కె. విశ్వనాథ్ 'సిరిసిరిమువ్వ' తో జంధ్యాల సంభాషణల రచయితగా పేరు తెచ్చుకుని స్థిరపడ్డ నాలుగేళ్ళకి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక విచిత్రం జరిగింది. ఇద్దరు ప్రముఖ దర్శకులు ఒకేలాంటి కథతో సినిమాలు తీశారు. అంతేకాదు, ఇద్దరూ కూడా సంభాషణలు రాయడానికి జంధ్యాలనే ఎంచుకున్నారు. రెండు సినిమాలకీ కూడా ముగింపే ప్రాణం. వీటిలో మొదటిది, జంధ్యాల సినీ రంగ గురువు విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'సప్తపది' సినిమా. ఓ బ్రాహ్మణ యువతికీ, హరిజన యువకుడికీ మధ్య ప్రేమ మొలకెత్తి మొగ్గతొడగడం ఇతివృత్తం. ఈ ప్రేమ సంగతి తెలియక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న మేనబావ, తను ఆమెతో కాపురం చేయలేక, ఆ హరిజన యువకుడికి ఆమెని అప్పగించడం ముగింపు.
"చాతుర్వర్ణం మయాసృష్టం..." వరకూ మాత్రమే గీతాకారుణ్ణి గుర్తు చేసుకునే వాళ్లకి, "గుణ కర్మ విభాగచ..." అని చెప్పింది కూడా ఆ శ్రీకృష్ణుడే అని గుర్తు చేయడం మాత్రమేకాదు, వర్ణాశ్రమ ధర్మాల మర్మాన్ని వివరిస్తూ జంధ్యాల రాసిన సంభాషణలే 'సప్తపది' సినిమాని నిలబెట్టాయి అనడం అతిశయోక్తి కాదు. ఈ సంభాషణలని జెవి సోమయాజులు చేత పలికించడం వల్ల, జంధ్యాల రాసిన మాటలకి మరింత నిండుతనం వచ్చి, ప్రేక్షకులకి చేరువయ్యాయి. 'సప్తపది' సినిమా మొత్తం ఒక ఎత్తు, ముగింపు సన్నివేశం ఒక్కటీ ఒక ఎత్తు. జంధ్యాల అక్షరాలా కత్తిమీద సాముచేసి రాశారు అనిపించక మానదు.
అదే సంవత్సరం విడుదలైన మరో ప్రేమకథా చిత్రం 'సీతాకోక చిలుక.' తమిళ దర్శకుడు భారతీ రాజా తమిళ, తెలుగు భాషల్లో తీశారీ సినిమాని. ఓ పేద బ్రాహ్మణ యువకుడికీ, ధనవంతురాలైన క్రైస్తవ అమ్మాయికీ మధ్య ప్రేమ పుట్టి పెరగడం అన్నది ఇతివృత్తం. నాయికనాయకులిద్దరూ వయసురీత్యా చిన్న వాళ్ళు, అస్వతంత్రులు. నాయకుడి పేదరికం, ఇద్దరి మతాలతో పాటు, వాళ్ళ వయసు కూడా అడ్డంకే వాళ్ళ ప్రేమకి. నాయిక సోదరుడు డేవిడ్ వ్యక్తిగా ఎలాంటి వాడైనా, మతం విషయంలో పట్టింపు బాగా ఎక్కువ. అతడితో పాటు, ఊరి వాళ్ళందరినీ ఒప్పించే బాధ్యతని ఓ చర్చి ఫాదర్ తీసుకుంటారు. ఓ తెల్లవారు ఝామున ప్రేమ జంటని తరుముకుంటూ సముద్రం ఒడ్డుకు వచ్చిన ఊరి వాళ్ళందరికీ, మతం కన్నా ప్రేమే గొప్పదని చెప్పి ఒప్పిస్తారు ఆ ఫాదర్.
"అన్ని మతాలూ ప్రేమని బోధిస్తాయి..." అంటూ సాగే సంభాషణలు పలికింది కళా వాచస్పతి కొంగర జగ్గయ్య. చర్చి ఫాదర్ గా అతిధి పాత్రలో కనిపిస్తారు ఈ సినిమాలో. నాయికా నాయకుల ప్రేమ గురించి డేవిడ్ ని, ఊరి వాళ్ళనీ మాత్రమే కాదు, సినిమా చూసే ప్రేక్షకుల్నీ ఒప్పిస్తారు. "ఇలాంటి సన్నివేశాన్నే సప్తపది లో చూశాం.. అక్కడా ఇవే డైలాగులు" అన్న భావన ప్రేక్షకుల్లో కలిగేందుకు ఏమాత్రం ఆస్కారం లేని విధంగా ఉంటాయి జంధ్యాల రాసిన సంభాషణలు. 'సప్తపది' లో ఊరిని ఒప్పించే వృద్ధుడు ఆలయ పూజారి మాత్రమే కాదు, నాయికకి స్వయంగా తాతగారు. కానీ ఇక్కడ చర్చి ఫాదర్ ఎవరికీ బంధువు కాదు.. కానీ ఊరందరి మంచీ కోరే వ్యక్తి. ప్రేమించడం తప్పుకాదని నమ్మే మనిషి.
ఈ రెండు సినిమాలూ విడుదలైన సంవత్సరమే, 'ముద్దమందారం' తో దర్శకుడిగా మారారు జంధ్యాల. మరో ఆరు సంవత్సరాల తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'పడమటి సంధ్యారాగం.' ఇది ఖండాంతర ప్రేమకథ. తెలుగమ్మాయి సంధ్యకీ, అమెరికన్ కుర్రాడు క్రిస్ కీ మధ్య పుట్టిన ప్రేమ. సంధ్య తండ్రి ఆదినారాయణ ఛాందసుడు. దేశం విడిచి పెట్టడానికే ఇష్ట పడని వాడు. అలాంటిది, కూతురు ఒక తెల్లవాడితో ప్రేమలో పడిందన్న విషయం తెలిసి తట్టుకోలేక పోతాడు. ఇండియా తిరిగి వెళ్ళిపోతాడు. సంధ్య-క్రిస్ దంపతులు తమకి పుట్టిన కూతురిని ఆదినారాయణ దగ్గర ఉంచి, ఆయన్ని పెంచమంటారు. తాతయ్య పెంపకంలో పెరిగిన ఆ పిల్ల అనిత, తండ్రి మీద ద్వేషం పెంచుకుంటుంది.. తల్లినీ ఈసడించుకుంటుంది.
అనిత టీనేజ్ కి వచ్చేసరికి, ఆదినారాయణ పరమపదించడంతో, అంత్యక్రియల నిమిత్తం ఇండియా వస్తారు సంధ్య, క్రిస్. తమపట్ల అనిత విముఖత చూసి బాధ పడ్డ సంధ్య, తన కూతురికి తన ప్రేమ కథ మొత్తం చెప్పడంతో పాటు, క్రిస్ మతం విషయం లో అనితకి ఉన్న అభ్యంతరాలకీ జవాబులు చెప్పి, మతం కన్నా మానవత్వం గొప్పదని చెబుతుంది. 'సప్తపది' 'సీతాకోక చిలుక' లలో కులం, మతం గురించి ఊరందరినీ ఒప్పించే విధంగా ఉండే సంభాషణలు రాసిన జంధ్యాల, ఈ సినిమాలో తండ్రి మతాన్ని గురించీ, దేశాన్ని గురించీ తల్లి కూతురుకి చెప్పడం అన్న సందర్భాన్ని గమనంలో ఉంచుకుని రాశారీ డైలాగులు. మిగిలిన రెండు సినిమాల్లోని సన్నివేశాలతో పోల్చినప్పుడు, ఈ సన్నివేశం లో వచ్చే డైలాగులు 'లౌడ్' గా లేకపోవడం గమనించవచ్చు. (జూన్ 19 కి జంధ్యాల మనల్ని విడిచిపెట్టి పుష్కర కాలం పూర్తవుతోంది).