మంగళవారం, ఏప్రిల్ 30, 2013

ఆవకాయణం...

నా చిన్నప్పుడు మా బామ్మ ఏటా వేసంకాలంలో ఇస్సూ అస్సూ అంటూనే ఆవకాయలు పెట్టేస్తూ, "అన్నీ బాగున్నప్పుడే నాలుగు రుచులూ నోట్లోకి వెళ్ళాలి నాయనా... రేప్పొద్దున్న ఏ చిన్న తేడా వచ్చినా ముందర నోరే కట్టేసుకోవాలి..." అని విధిగా తల్చుకునేది. పెద్దై పోయాక, నేను ఏటా మా బామ్మని తలచుకుంటున్నా. అప్పుడప్పుడూ వేపుళ్లకీ, నూనెలకీ కొంచం సెలవివ్వడం తప్పించి అన్నీ తినగలిగే అదృష్టంతో కొనసాగు తున్నందుకు గాను, ఇదిగో ఈ ఏడాది కూడా ఆవకాయ మహాయజ్ఞం జరుగుతోంది ఇంట్లో. దాదాపు ఇంటింటా జరిగే యజ్ఞమే... మహిళలు రుత్విక్కులు, మగవాళ్ళు సమిధలూను..

పురాణాల్లో మునులు చేసే యజ్ఞాల్లాగా, ఈ మహా యజ్ఞానికి నెయ్యితో పనిలేదు, నువ్వుల నూనె సరిపోతుంది.. అయితే ఏం, శ్రేష్ఠమైన నువ్వుల నూనె కన్నా నెయ్యే చౌక అని సెలవిచ్చారు మా ప్రొవిజనల్ స్టోర్స్ శ్రేష్టి గారు. ఆవకాయ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఖర్చు కాస్త అటూ ఇటూ అవ్వడం సహజమే కానీ, ఎప్పుడూ 'అటే' ఎందుకు అవుతుందో బొత్తిగా అర్ధం కాదు నాకు. మిగిలిన విషయాలకి మల్లేనే, ఆవకాయకి సంబంధించిన విషయాల్లోనూ మగవాడు నోరు విప్పకూడదనీ, విప్పినా పెద్దగా ఉపయోగం ఉండదనీ కొన్ని అనుభవాల తర్వాత తెలిసొచ్చేసింది. ఫలితం, ఏటీఎం కార్డు లాగా నిర్వికారంగా అడిగినవి తెచ్చి అక్కడ పెట్టేయడమే..

అలా అన్నీ తెచ్చి పెట్టేసి ఊరుకోవచ్చా అంటే, అబ్బే అదీ లేదు. ఆదివారం పూటా ఏదన్నా పుస్తకం చదువుకోడానికీ, అధమం టీవీలో వస్తున్న 'మిథునం' సినిమా చూడడానికీ కూడా వీలులేకుండా ఊరగాయ పనులు అడ్డం పడుతూ ఉండడం. అక్కడికీ సహకార పద్ధతిలో నాలుగిళ్ళ వాళ్ళు కలిసి ఉమ్మడి ఊరగాయల పథకం మొదలు పెట్టారు. అందరూ తలో పనీ అందుకుని అల్లేసుకుంటే, ఆట్టే సమయం పట్టకుండా ఆవకాయ రెడీ అయిపోతుంది కదా... కానీ, ఎవరికి వాళ్ళే 'మిగిలిన వాళ్ళ కన్నా మేమే ఎక్కువ పని చేశాం' అన్న తృప్తిని అనుభవించడం కోసం కాబోలు, ఎప్పటికీ ముగియని టీవీ సీరియల్ లాగా సాగుతూనే ఉంది పని.


నా వాటాకి ముక్కలు తుడిచే పని వస్తుందేమో, అలా అలా చిన్నప్పటి రోజుల్లో విహరించి వద్దాం అని ప్లానేసుకున్నా.. ఎక్కడా.. మాగాయ కాయకి చెక్కు తీసే పనిలోకి దిగాల్సి వచ్చింది. తను ఎంత కష్టపడి మంచి మామిడికాయలు ఎంచి తెచ్చాడో పక్కింటివాళ్ళ డ్రైవర్ వర్ణించి చెబుతుంటే, అతని మనోభావాలు దెబ్బతినకుండా ఉండడం కోసం శ్రద్ధగా వింటూ చెక్కు తీస్తూ ఉంటే, మామిడి చెక్కుతో పాటు ఎడం చేతి చిటికెన వేలి మీది పొర ఒకటి పీలర్ లోకి వెళ్ళిపోయింది. టైపు రైటింగ్ నేర్చుకున్న కొత్తలో మొదటి ఎక్సర్సైజు 'ఏ ఎస్ డీ ఎఫ్' ప్రాక్టీసులో 'ఏ' టైపడానికి పుట్టిన నొప్పి గుర్తు రావడంతో, బాల్యానికి బదులు యవ్వనంలో విహరించాల్సి వచ్చింది.

'ఆడుతు పాడుతు పనిచేస్తుంటే...' పాట గుర్తొచ్చి కాబోలు, మహిళలు పాటలు వినడం మొదలు పెట్టారు. 'శుభవేళ' సినిమాలోది అని జ్ఞాపకం, 'శ్రీరామ నవమి తిరనాళ్లు.. నాకప్పుడేమొ ఆరేళ్ళు...' పాట రిపీట్ మోడ్ లో వినాల్సి వచ్చింది. రెండు రోజులుగా ఏ పని చేస్తున్నా 'చిన్ననాటి నుంచీ ఎన్నికొన్నాం.. డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం...' లైన్లు గిర్రున తిరుగుతున్నాయి. "రచయిత ఎవరో కానీ ఎంతబాగా రాశాడో..." అనుకుంటూ, కారాల కష్టం కొంచం మర్చిపోయినట్టే ఉన్నారు వాళ్ళు. బడ్జెట్ లెక్కలు బుర్రలో తిరుగుతూ ఉండడంతో సహా అనేకానేక కారణాల వల్ల మగవాళ్ళం ఎవరం పెద్దగా స్పందించలేదు..

ముందుగా చెప్పకుండా వచ్చేసే చుట్టాలు వచ్చి వెళ్ళగానే "ఆవకాయ జాడీ కన్నతల్లిలా ఆదుకుంది" అనేది అమ్మ.. సమయానికి కూరా పచ్చడీ చేసే వీలు లేకపోయినా, భోజనం పెట్టేయగలిగాను కదా అన్న ఆనందంతో. ఇప్పుడైతే, కూరలూ, పచ్చళ్ళూ ఎన్ని ఉన్నా కొత్తావకాయ ముందు అవన్నీ బలాదూర్. 'అబ్బా... ఈ ఎండల్లో ఏం తింటాం.. నాలుగురోజులు ఆగి నాలుగు చినుకులు పడ్డాక అప్పుడు తినొచ్చులే' అని ఎంతమాత్రమూ అనిపించకపోవడం కొత్తావకాయ ప్రత్యేకత. ఈ ఏటికి ఊరగాయల పనులు అయిపోయినట్టే.. వంటిల్లు ఘుమఘుమలాడి పోతోంది అప్పుడే...

12 వ్యాఖ్యలు:

చాణక్య చెప్పారు...

కొత్తావకాయ వెన్నతో కలుపుకుని, బంగినపల్లి మామిడిపళ్లు ముక్కలు కోసి పక్కనపెట్టుకోండి చెప్తాను! ఎడం చేతి చిటికెన వేలు మీద పొర గుర్తొస్తే ఒట్టు!! :)

అజ్ఞాత చెప్పారు...

మాకు కూడ మీ ఆవకాయ కొంచెం రుచి చూపించండి.

అజ్ఞాత చెప్పారు...

Super! బావుంది కానీ ఇంతకీ ఆవకాయ రుచి ఎలా కుదిరింది?

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

"ఆవకాయ జాడీ కన్నతల్లిలా ఆదుకుంది" అనేది అమ్మ."

మరే చద్దన్నంలాంటి మాట చెప్పారు మురళి గారూ

అబ్బా నోరూరిపోతోందండీ ఇలా పోస్టేసి మరీ ఊరిస్తున్నారు కదండీ గట్టిగా ఏమీ అనలేం కూడా అసలే మా గోదారి పిల్లోడాయే

chinni v చెప్పారు...

మీ వంటింటి ఘుమఘుమలు మా ఊరు వచ్చేసాయి వచ్చే మంగళవారం మీ ఊరు వస్తున్నాను మధ్యాహ్నం భోజనం కొత్త ఆవకాయ తోనే అని డిసైడ్ అయ్యిపోయా :)

కొత్తావకాయ చెప్పారు...

ఏవిటో.. ఇలాంటి కబుర్లు చెప్తే మాత్రం వ్యాఖ్య రాయకుండా ఉండలేం సుమండీ! అందునా మాబోంట్ల ప్రవాసపు బ్రతుకులకి ఆవకాయ రుచి అక్షరాల్లోనే చూపించేస్తున్నారు కూడానూ.. మేమూ ఎప్పటికప్పుడూ కాస్తో కూస్తో ఆవకాయ పెట్టేసుకుంటూనే ఉన్నా కూడా, కాయ రుచే కదండీ ఆవకాయకి ప్రధానం.

పోస్ట్ మొత్తానికి మహ బాగా నచ్చేసినదీ, గుచ్చేసుకున్నదీ ఒకే ఒక్ఖ వాక్యం.. మొదటి పేరాలో చివరిది. :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఈ ఏడాది ఊరగాయలకి రక్తము ధారపోసారన్న మాట....దహా.
రుచి చూసారా? లేక ఇంకో టపాలో మమ్మల్ని మళ్ళి ఊరేస్తారా?....దహా.

Rajitha Pedduri చెప్పారు...

mee post chala baavundandi.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హహహ బాగుందండీ మీ ఆవకాయణం :)

మురళి చెప్పారు...

@చాణక్య: చక్కని సలహా... తప్పకుండా ప్రయత్నిస్తానండీ... ధన్యవాదాలు
@బోనగిరి: గూగులమ్మ ఎప్పుడో ఆ అవకాశం కూడా ఇచ్చేస్తుంది లెండి :) ధన్యవాదాలు..
@అనూ: బాగా కుదిరిందండీ... ధన్యవాదాలు..

మురళి చెప్పారు...

@శ్రీనివాస్ పప్పు: అంతేనండీ... అంతే :) ...ధన్యవాదాలు
@చిన్ని: :-) :-) ధన్యవాదాలండీ
@కొత్తావకాయ: ఉన్నమాట కదండీ మరి... అందుకే అయి ఉంటుంది బహుశా :) ... ధన్యవాదాలు

మురళి చెప్పారు...

@బులుసు సుబ్రహ్మణ్యం: లేదండీ... ఈ ఒక్ఖ పోస్టే :) ధన్యవాదాలు
@రంజిత్ పెద్దూరి: ధన్యవాదాలండీ...
@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి