మంగళవారం, ఏప్రిల్ 30, 2013

ఆవకాయణం...

నా చిన్నప్పుడు మా బామ్మ ఏటా వేసంకాలంలో ఇస్సూ అస్సూ అంటూనే ఆవకాయలు పెట్టేస్తూ, "అన్నీ బాగున్నప్పుడే నాలుగు రుచులూ నోట్లోకి వెళ్ళాలి నాయనా... రేప్పొద్దున్న ఏ చిన్న తేడా వచ్చినా ముందర నోరే కట్టేసుకోవాలి..." అని విధిగా తల్చుకునేది. పెద్దై పోయాక, నేను ఏటా మా బామ్మని తలచుకుంటున్నా. అప్పుడప్పుడూ వేపుళ్లకీ, నూనెలకీ కొంచం సెలవివ్వడం తప్పించి అన్నీ తినగలిగే అదృష్టంతో కొనసాగు తున్నందుకు గాను, ఇదిగో ఈ ఏడాది కూడా ఆవకాయ మహాయజ్ఞం జరుగుతోంది ఇంట్లో. దాదాపు ఇంటింటా జరిగే యజ్ఞమే... మహిళలు రుత్విక్కులు, మగవాళ్ళు సమిధలూను..

పురాణాల్లో మునులు చేసే యజ్ఞాల్లాగా, ఈ మహా యజ్ఞానికి నెయ్యితో పనిలేదు, నువ్వుల నూనె సరిపోతుంది.. అయితే ఏం, శ్రేష్ఠమైన నువ్వుల నూనె కన్నా నెయ్యే చౌక అని సెలవిచ్చారు మా ప్రొవిజనల్ స్టోర్స్ శ్రేష్టి గారు. ఆవకాయ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఖర్చు కాస్త అటూ ఇటూ అవ్వడం సహజమే కానీ, ఎప్పుడూ 'అటే' ఎందుకు అవుతుందో బొత్తిగా అర్ధం కాదు నాకు. మిగిలిన విషయాలకి మల్లేనే, ఆవకాయకి సంబంధించిన విషయాల్లోనూ మగవాడు నోరు విప్పకూడదనీ, విప్పినా పెద్దగా ఉపయోగం ఉండదనీ కొన్ని అనుభవాల తర్వాత తెలిసొచ్చేసింది. ఫలితం, ఏటీఎం కార్డు లాగా నిర్వికారంగా అడిగినవి తెచ్చి అక్కడ పెట్టేయడమే..

అలా అన్నీ తెచ్చి పెట్టేసి ఊరుకోవచ్చా అంటే, అబ్బే అదీ లేదు. ఆదివారం పూటా ఏదన్నా పుస్తకం చదువుకోడానికీ, అధమం టీవీలో వస్తున్న 'మిథునం' సినిమా చూడడానికీ కూడా వీలులేకుండా ఊరగాయ పనులు అడ్డం పడుతూ ఉండడం. అక్కడికీ సహకార పద్ధతిలో నాలుగిళ్ళ వాళ్ళు కలిసి ఉమ్మడి ఊరగాయల పథకం మొదలు పెట్టారు. అందరూ తలో పనీ అందుకుని అల్లేసుకుంటే, ఆట్టే సమయం పట్టకుండా ఆవకాయ రెడీ అయిపోతుంది కదా... కానీ, ఎవరికి వాళ్ళే 'మిగిలిన వాళ్ళ కన్నా మేమే ఎక్కువ పని చేశాం' అన్న తృప్తిని అనుభవించడం కోసం కాబోలు, ఎప్పటికీ ముగియని టీవీ సీరియల్ లాగా సాగుతూనే ఉంది పని.


నా వాటాకి ముక్కలు తుడిచే పని వస్తుందేమో, అలా అలా చిన్నప్పటి రోజుల్లో విహరించి వద్దాం అని ప్లానేసుకున్నా.. ఎక్కడా.. మాగాయ కాయకి చెక్కు తీసే పనిలోకి దిగాల్సి వచ్చింది. తను ఎంత కష్టపడి మంచి మామిడికాయలు ఎంచి తెచ్చాడో పక్కింటివాళ్ళ డ్రైవర్ వర్ణించి చెబుతుంటే, అతని మనోభావాలు దెబ్బతినకుండా ఉండడం కోసం శ్రద్ధగా వింటూ చెక్కు తీస్తూ ఉంటే, మామిడి చెక్కుతో పాటు ఎడం చేతి చిటికెన వేలి మీది పొర ఒకటి పీలర్ లోకి వెళ్ళిపోయింది. టైపు రైటింగ్ నేర్చుకున్న కొత్తలో మొదటి ఎక్సర్సైజు 'ఏ ఎస్ డీ ఎఫ్' ప్రాక్టీసులో 'ఏ' టైపడానికి పుట్టిన నొప్పి గుర్తు రావడంతో, బాల్యానికి బదులు యవ్వనంలో విహరించాల్సి వచ్చింది.

'ఆడుతు పాడుతు పనిచేస్తుంటే...' పాట గుర్తొచ్చి కాబోలు, మహిళలు పాటలు వినడం మొదలు పెట్టారు. 'శుభవేళ' సినిమాలోది అని జ్ఞాపకం, 'శ్రీరామ నవమి తిరనాళ్లు.. నాకప్పుడేమొ ఆరేళ్ళు...' పాట రిపీట్ మోడ్ లో వినాల్సి వచ్చింది. రెండు రోజులుగా ఏ పని చేస్తున్నా 'చిన్ననాటి నుంచీ ఎన్నికొన్నాం.. డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం...' లైన్లు గిర్రున తిరుగుతున్నాయి. "రచయిత ఎవరో కానీ ఎంతబాగా రాశాడో..." అనుకుంటూ, కారాల కష్టం కొంచం మర్చిపోయినట్టే ఉన్నారు వాళ్ళు. బడ్జెట్ లెక్కలు బుర్రలో తిరుగుతూ ఉండడంతో సహా అనేకానేక కారణాల వల్ల మగవాళ్ళం ఎవరం పెద్దగా స్పందించలేదు..

ముందుగా చెప్పకుండా వచ్చేసే చుట్టాలు వచ్చి వెళ్ళగానే "ఆవకాయ జాడీ కన్నతల్లిలా ఆదుకుంది" అనేది అమ్మ.. సమయానికి కూరా పచ్చడీ చేసే వీలు లేకపోయినా, భోజనం పెట్టేయగలిగాను కదా అన్న ఆనందంతో. ఇప్పుడైతే, కూరలూ, పచ్చళ్ళూ ఎన్ని ఉన్నా కొత్తావకాయ ముందు అవన్నీ బలాదూర్. 'అబ్బా... ఈ ఎండల్లో ఏం తింటాం.. నాలుగురోజులు ఆగి నాలుగు చినుకులు పడ్డాక అప్పుడు తినొచ్చులే' అని ఎంతమాత్రమూ అనిపించకపోవడం కొత్తావకాయ ప్రత్యేకత. ఈ ఏటికి ఊరగాయల పనులు అయిపోయినట్టే.. వంటిల్లు ఘుమఘుమలాడి పోతోంది అప్పుడే...

సోమవారం, ఏప్రిల్ 29, 2013

హృదయనేత్రి

భారత స్వతంత్ర సంగ్రామానికి పూర్వమూ, స్వాతంత్రానంతరమూ దేశంలో ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులని ఇతివృత్తంగా తీసుకుని మాలతీ చందూర్ రాసిన నవల 'హృదయనేత్రి.' విస్తారమైన కేన్వాస్ ఉన్న ఈ నవల చదువుతూ ఉంటే టైం మిషీన్ లో ఒక్కసారిగా ఓ వందేళ్ళు వెనక్కి వెళ్లి పోయి, అక్కడి నుంచి తాపీగా ఓ అరవై-డెబ్భై ఏళ్ళు ప్రయాణం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. 1992 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న నవల ఇది. మహాత్ముడిని మెప్పించిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 'చీరాల-పేరాల' ఉద్యమానికి పూర్వరంగంతో మొదలు పెట్టి, స్వతంత్ర పోరాటం, కాంగ్రెస్, జనతా ప్రభుత్వాల పనితీరు మీదుగా ఇందిగా గాంధీ పాలన, ఎమర్జెన్సీ, అనంతర పరిస్థితులని పరామర్శిస్తూ, ఇందిరా హత్యతో ముగుస్తుంది నవల. ఇది కేవలం దేశ భక్తుల కథ మాత్రమే కాదు, స్వార్ధ పరులు, వేర్పాటు వాదులు కూడా భాగమే ఇందులో.

నవలలో ప్రధాన పాత్ర గోపాలంగా పిలవబడే గోపాలరావు పదేళ్ళ బాలుడిగా ఉండగా కథ మొదలవుతుంది. స్థితిమంతుల కుటుంబం. ఏ పనీ చేయకుండా చీట్ల పేకతో కాలక్షేపం చేసే తండ్రి, పూజలు పునస్కారాలు చేసుకునే తల్లి, ఓ తమ్ముడు బుచ్చి.. గోపాలానికి నిరాసక్తంగా అనిపించే ఇంటి వాతావరణం. ఆసమయంలో అతని కంటికి ఓ చైతన్యంలా కనిపిస్తుంది రావుడత్తయ్య. గోపాలం తండ్రికి సొంత అక్క రామలక్ష్మమ్మ. సంప్రదాయాన్ని కాదని ఖద్దరు కట్టి, వీధుల్లోకి వచ్చిన రామలక్ష్మమ్మ తన భర్త వాసుదేవరావు ప్రోత్సాహంతో స్వతంత్ర పోరాటంలో పాల్గొంటోంది. ఇంటి వాతావరణంతో విసుగు చెందిన గోపాలం, అత్తయ్యతో ఆమె ఊరు చీరాల చేరుకుంటాడు. సంతానం లేని ఆ దంపతులు గోపాలాన్ని సొంత బిడ్డలా చూసుకుంటూ ఉంటారు.

గోపాలం చీరాల చేరిన కొన్ని రోజులకే చీరాల-పేరాల ఉద్యమం మొదలవుతుంది. ఆ రెండు పంచాయితీలనీ ప్రజల ఇష్టానికి విరుద్ధంగా మునిసిపాలిటీలుగా ప్రకటించిన ప్రభుత్వం ఇంటి పన్ను మూడింతలు చేయడంతో ప్రజల్లో తిరుగు బాటు వస్తుంది. అందరూ ఇళ్ళు ఖాళీ చేసి ఊరి చివర గుడిసెలు వేసుకుని నివాసం ఉంటారు. బ్రిటిష్ పాలకులు ప్రజల నుంచి ఎదుర్కొన్న తొలి పెద్ద తిరుగుబాటు ఇది. ఊరంతా కులమతాలకి అతీతంగా ఓ చోట గుడిసెలు వేసుకుని ఉండడం, కలిసి వండుకోవడం, పనులు చేసుకోవడం ఆశ్చర్య పరుస్తుంది గోపాలాన్ని. అక్కడే గాంధీజీని దగ్గర నుంచి చూస్తాడు అతను. చీరాల-పేరాల ఉద్యమం ముగిసాక, ఖద్దరు ఉద్యమం మొదలవుంది. రామలక్ష్మమ్మ కీలకపాత్ర పోషిస్తుంది అందులో కూడా.



ఇంతలో గోపాలం తల్లిదండ్రులు బందరుకి మకాం మార్చడంతో, తనకి ఇష్టం లేకపోయినా వాళ్ళ దగ్గరకి వెళ్లి జాతీయ కళాశాలలో చేరుతాడు గోపాలం. తమ్ముడు బుచ్చి ఇంగ్లీష్ చదువులో ప్రవేశిస్తాడు. అతని జాతీయ భావాలు తల్లిదండ్రులకి నచ్చవు. రామలక్ష్మమ్మ తన కొడుక్కి మందో మాకో పెట్టేసిందని మనసా వాచా నమ్ముతుంది గోపాలం తల్లి.కొడుకు తన చెయ్యి దాటిపోకుండా ఉండడం కోసం, గోపాలానికి జమీందారు గారమ్మాయి పార్వతితో వివాహం జరిపించేస్తుంది ఆమె.ఎదురు చెప్పలేని తన అశక్తతకి సిగ్గు పడతాడు గోపాలం. వాసుదేవరావు గారి మరణం రామలక్ష్మమ్మని ఒంటరిని చేస్తుంది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరిన గోపాలం, పార్వతి గర్భవతిగా ఉండగా శాసనోల్లంఘనలో పాల్గొని జైలు పాలు అవుతాడు.

మొదటి నుంచీ భర్త పద్ధతులు అర్ధం కావు పార్వతికి. అతను 'ప్రయోజకుడు' కాకుండా జైలు పాలు కావడం పెద్ద దెబ్బే ఆమెకి. ఓ కొడుక్కి జన్మనిచ్చి, శ్రీనివాసు అని పేరు పెట్టుకుని, పుట్టింట్లోనే అతన్ని పెంచుతూ ఉంటుంది. జైలు నుంచి విడుదలయిన గోపాలానికి ఇంట్లో మార్పులు ఆశ్చర్య పరుస్తాయి. బుచ్చి రెవిన్యూ బోర్డులో ఉద్యోగం సంపాదించుకుంటాడు. తన వాళ్ళ దగ్గరా, అత్తవారిలోనూ ఇమడలేని గోపాలం, సీతానగరం ఆశ్రమం లో జీవితం గడుపుతున్న రామలక్ష్మమ్మ సలహా మేరకి చీరాల చేరుకొని ఒంటరి జీవితం మొదలు పెడతాడు.

దేశానికి స్వతంత్రం వచ్చిందన్న సంతోషం కన్నా, దేశం రెండు ముక్కలు అయ్యిందన్న బాధే ఎక్కువ కలుగుతుంది గోపాలానికి. చీరాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా, రాజకీయాలు తనకి సరిపడవని గ్రహించి వాటికి దూరంగా జరుగుతాడు. వినోభా ఆశ్రమంలో కొంతకాలం గడిపిన గోపాలానికి, తన కొడుకు శ్రీనివాస్ కమ్యూనిస్టు పోరాటంలో ఆయుధం పట్టిన విషయం తెలుస్తుంది. కొడుకుని కంటితో చూడలేకపోయినా, భార్యతో కలిసి కొడుకు కూతురు 'స్వరాజ్య లక్ష్మి' ని పెంచి పెద్ద చేస్తాడు. బతుకుతెరువు కోసం ఓ పత్రికలో ఉద్యోగం మొదలు పెట్టిన గోపాలం, పొట్టి శ్రీరాములు ఆత్మార్పణనీ, తర్వాతి కాలంలో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జన్సీ నీ ఏమాత్రం అంగీకరించ లేకపోతాడు.

ఇది కేవలం గోపాలం, అతన్ని ప్రభావితం చేసిన రామలక్ష్మమ్మ, స్వరాజ్య లక్ష్మిల కథ మాత్రమే కాదు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన అనేక సంఘటనలని మరో మారు గుర్తు చేసే నవల. నమ్మిన విషయాల పట్ల గోపాలం నిబద్ధత ఆశ్చర్య పరుస్తుంది పాఠకులని. చదువుతున్నంత సేపూ పాలగుమ్మి పద్మరాజు 'రామరాజ్యానికి రహదారి,' అడివి బాపిరాజు 'నారాయణరావు,' కొడవటిగంటి కుటుంబరావు 'చదువు' నవలలు గుర్తొస్తూనే ఉన్నాయి. స్వతంత్ర పోరాటం, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళని ఆపకుండా చదివించే నవల. సంభాషణల్లో అక్కడక్కడా కనిపించే నాటకీయత ని మినహాయించుకుంటే, ఏకబిగిన చదివి పక్కన పెట్టగల పుస్తకం. ('క్వాలిటీ' ప్రచురణ, పేజీలు 240, వెల రూ. 70, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

ఆదివారం, ఏప్రిల్ 28, 2013

సినిమా...సినిమా...

భారతీయ సినిమాకి నూరేళ్ళు అని పేపర్లు బాగా హడావిడి చేస్తున్నాయి... మరీ ముఖ్యంగా తెలుగు పేపర్లలో ఈ హడావిడి కొంచం ఎక్కువే కనిపిస్తోంది. భారతదేశంలో సినిమా నిర్మాణం మొదలై వంద సంవత్సరాలు అయిందన్న మాట. తొలి అడుగులని గుర్తు చేసుకోవడం మొదలు, ఈ వందేళ్ళ లోనూ సాధించిన ప్రగతి, వచ్చి చేరిన అనేకానేక మార్పులు... వీటన్నింటి మీదా వ్యాసాల పరంపర కనిపిస్తోంది. తమిళ పరిశ్రమ సంబరాలకి సిద్ధం అవుతోంది... తెలుగు పరిశ్రమలో కూడా బహుశా ఏర్పాట్లు జరుగుతూ ఉండి ఉండొచ్చు. పేపర్లతో పాటు చానళ్ళ లోనూ తగుమాత్రం హడావిడి కనిపిస్తోంది.

తెలుగు ప్రేక్షకుల దగ్గరికి వస్తే, మిగిలిన భారతీయ భాషా ప్రేక్షకుల్లాగే తెలుగు వారికి సైతం సినిమా మాత్రమే తొలి వినోద సాధనం కాదు. సినిమా పుట్టడానికి పూర్వం కూడా తెలుగు నాట వినోద సాధనాలు ఉన్నాయి. యక్షగానాలు, తోలుబొమ్మలాటలు, హరికథలు, బుర్రకథలు, పౌరాణికాలు అటుపై సాంఘిక నాటకాలు, వీటి తర్వాత రికార్డింగ్ డ్యాన్సులు... అటుపై వచ్చింది సినిమా. నగరాలు, పట్టణాల్లో సినిమా ప్రభంజనం మొదలైన చాలా రోజులవరకూ, పల్లె జనులకి వినోదం పంచినవి మిగిలిన కళా రూపాలే. అయితే, సినిమా ఉద్ధృతికి తట్టుకోలేక మిగిలినవన్నీ నెమ్మదిగా తెరవెనక్కి వెళ్ళిపోయాయి.

వినోద సాధనాల అంతిమ లక్ష్యం ప్రజలకి వినోదం అందిచడమే అయినప్పుడు, నేటి సినిమా ఏ మేరకి వినోదాన్ని అందిస్తోంది అన్న ప్రశ్న వచ్చి తీరుతుంది. సినిమాతో పోల్చినప్పుడు మిగిలిన కళా రూపాలకి ఉన్న సౌలభ్యం ఏమిటంటే, ప్రదర్శనని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అప్పటికప్పుడే తెలుసుకుని, అవసరమైన మార్పులు చేసుకోవడం. నాటకంలో తరచూ 'వన్స్ మోర్' పడే పద్యాలు, సంభాషణలని మరింత శ్రద్ధగా పలకడం లాంటివి అన్నమాట. సినిమా కి ఈ సౌకర్యం లేదు. ఒక్కసారి రీలు తయారై థియేటర్ కి వచ్చేసిందీ అంటే మార్పులకి మరి తావు లేదు. కాబట్టి, నిర్మాణ సమయంలోనే మరింత జాగ్రత్తగా ఉండాలి.


ప్రసార సాధనాల పరిణామం సైతం రేడియో నుంచి టెలివిజన్ కి విస్తరించి, అక్కడినుంచి ఇంటర్నెట్ మీడియం వైపు పరుగులు పెడుతోంది. ఒకప్పుడు సినిమాకి పోటీ అవుతోంది అనుకున్న టీవీ, ఇప్పుడు సినిమాలకి, సినిమా వాళ్లకి పునరావాస కేంద్రంగా మారిపోయింది. బాక్సాఫీసు దగ్గర పల్టీ కొట్టిన సినిమాని ఆదరించి, మూడో వారంలో మూడొందల ప్రకటనల సౌజన్యంతో ప్రసారం చేయడం మొదలు, వెండితెర మీద వేషాలు వెలిసిపోయిన నటీనటుల్ని ఆదరించి అక్కున చేర్చుకోవడం వరకూ అన్నింటికీ నేనున్నాను అంటూ ముందుకి వచ్చేస్తోంది బుల్లిపెట్టె. ఒకప్పుడు నాటకం నుంచి సినిమాకి జరిగిన వలసలు, ఇప్పుడు సినిమా నుంచి టీవీ కి పెరుగుతున్నాయి.

రాన్రానూ కొత్త సినిమా టీవీలో వచ్చేస్తోందన్న 'గ్లామర్' కూడా కనుమరుగు అయిపోతోంది. కనీసం నిన్న కాక మొన్నే విడుదలైన సినిమా, భారీ బడ్జెట్ ది, పెద్ద హీరోది... లాంటి కుతూహలం ఏమాత్రం లేకుండా... సినిమా ఏమాత్రం విసిగించినా పక్క చానల్లో వచ్చే క్రికెట్ మ్యాచ్ రిపీట్ షో లేదా శాసన సభ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం లాంటి వినోదాల వైపు మళ్ళిపోతున్నారు ప్రేక్షకులు. కొన్నాళ్ళు ఇదే పరిస్థితి కొనసాగితే, టీవీ చానళ్ళు సైతం సినిమా హక్కులు కొనుక్కోడానికి వెనకముందాడే పరిస్థితులు వచ్చేస్తాయేమో అనిపించేస్తోంది. టీవీ వాళ్ళు కూడా వద్దు పొమ్మంటే సినిమాలు ఏమైపోవాలి పాపం?!!

వందేళ్ళ కాలంలో బాలారిష్టాలని దాటుకుని, సమస్యలని అధిగమిస్తూ, నష్టాలని చవిచూస్తూ, అప్పుడప్పుడూ భారీ విజయాల్ని సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది భారతీయ సినిమా పరిశ్రమ. సినిమా నిర్మాణంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న తెలుగు పరిశ్రమా ఇంచుమించు అదే దారిలో ప్రయాణం చేస్తోంది. ఊహించనంత వేగంగా వచ్చిపడిన సాంస్కృతిక మార్పుల కారణంగా, ఇప్పటి ప్రజలకి టీవీ, సినిమా మినహా మరో వినోద సాధనం లేనే లేదు. నాసిరకం సినిమాలతో ప్రేక్షకులని ఊదరగొట్టి, సినిమా అంటే విరక్తి కలిగే విధంగా వాళ్ళని తయారు చేయకుండా ఉంటే అదే పదివేలు అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఇలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో సంబంధీకులు అందరికీ తెలుసు... ఎందుకు చేయడం లేదు? అన్న ప్రశ్నతో ప్రేక్షకులకి సంబంధం లేదు..

శుక్రవారం, ఏప్రిల్ 19, 2013

సుశీల

భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే వారిద్దరి మధ్యా ఉండాల్సింది ఏమిటి? 'ప్రేమ' అంటారు చలం. ఆ ప్రేమ బలంగా ఉండడం వల్లే, చదువుకున్నదీ స్వతంత్రురాలూ అయిన సుశీల తన వైవాహిక జీవితంలోకి వచ్చిన మరో వ్యక్తిని కాదనుకుని, భర్త నారాయణప్ప దగ్గరికి తిరిగి వచ్చేసిన వైనాన్ని చిత్రించారు చలం'సుశీల' కథలో. సన్నగా, పొడుగ్గా చాలా నాజూగ్గా ఉండే సుశీల జుట్టు దువ్వుకోవడం, బొట్టు పెట్టుకోవడం, చీర కట్టుకోవడం, నడవడం, మాట్లాడడం... అన్నీ నాజూకుగా అందంగా ఉంటాయి. నారాయణప్ప స్థితిమంతుడు, ఆధునికుడు. ఓ డజను పదవుల్లో ఊపిరి సలపకుండా ఉండే నారాయణప్ప ఇంటికి పెద్ద పెద్దవాళ్ళు అందరూ వస్తూ ఉంటారు, ప్రభుత్వ అధికారులతో సహా.

మహాత్ముడి స్వతంత్ర పోరాటంలో భాగంగా సత్యాగ్రహం జరుగుతున్న రోజులవి. దేశం అంతా అతలాకుతలంగా ఉంది. న్యూసు పేపర్లు ప్రతిరోజూ వార్తా కథనాలు ప్రచురించేవారు. వాటిని గురించి ప్రతి సాయంత్రమూ నారాయణప్ప ఇంట్లో చర్చలు జరుగుతూ ఉండేవి. ఇవన్నీ సుశీలకి చాలా సరదా. జరుగుతున్న వాటి గురించి అందరూ ఏమనుకుంటున్నారో తెలుసుకోడం మాత్రమే కాదు, వాళ్ళందరితో కలిసి ఇంట్లో తిరుగుతుంది, వాళ్లకి టీ ఇస్తుంది, షేక్ హ్యాండ్ ఇస్తుంది.. ఇల్లు దాటి బయటికి వెళ్ళని సుశీలకి చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే మార్గం ఈ కబుర్లే.

పదేళ్లుగా నారాయణప్ప తో అన్యోన్యంగా కాపురం చేస్తున్న సుశీలకి ఉన్నట్టుండి మరో పురుషుడి మీద ప్రేమ కలిగింది. అతను ఆ ఊరికి కొత్తగా వచ్చిన పోలీసు సూపర్నెంట్ సులేమాన్. కొత్తగా ఉద్యోగంలో చేరిన సులేమాన్ అందగాడు, అవివాహితుడు. నారాయణప్ప ఇంటి వాతావరణం అతనికి చాలా ఆసక్తి కలిగించింది. అంతకు మించి సుశీల అతన్ని ఆకర్షించింది. సులేమాన్ మీద సుశీలకి ప్రేమకలిగింది. మొదట్లో ఆ ప్రేమ ఆమెని చాలా ఇబ్బంది పెట్టింది. ఆమెకి భర్తమీద భక్తిగాని, పాపభీతి ఏవీ లేవు. తన భర్తకి ఇవ్వాల్సిన ప్రేమ సులేమాన్ కి ఇవ్వడం ఆమెకి బాధ కలిగింది. అయితే, కొత్త ప్రేమ జయించింది. తన ప్రేమని గురించి నారాయణప్ప కి చెప్పినా ఆయన ఏమీ అనరని తెలుసు సుశీలకి. కానీ, చెప్పలేదు ఆమె.

సులేమాన్ కి దగ్గరైన సుశీల, ఎంతో వేదన అనుభవించింది. పోలీస్ డ్రిల్లు చూడడానికి పోలీస్ లైన్స్ కి వెళ్లాలని నిర్ణయించుకుంది సుశీల. సులేమాన్ ని యూనిఫాం లో చూడాలని ఆమె ఆశ. "ఎందుకు లెద్దూ" అన్నారు నారాయణప్ప. వెళ్లి తీరాలని నిర్ణయించుకున్న సుశీల ఇల్లు కదిలింది. అప్పటివరకూ ఒకే మాటగా ఉన్న దంపతుల మధ్య భేదం మొదలయ్యింది. అంతేకాదు, సుశీల-సులేమాన్ ల బంధం నారాయణప్ప దృష్టికి వచ్చింది. ఒకరిద్దరు స్నేహితులు కూడా కొంచం సూచించారు. సాధారణమైన భర్తల్లా దాక్కుని, సాధించే రకం కాదు నారాయణప్ప. మనసులో బాధని బయట పెట్టలేదు. ఇంతలోనే దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం మొదలవ్వడంతో అందులో తలమునకలు అయిపోయారు నారాయణప్ప, కొందరు స్నేహితులు.

సుశీలని తనతో వచ్చేయమని సులేమాన్ చేసిన ప్రతిపాదనపై ఎటూ తేల్చుకోదు ఆమె. సులేమాన్ ఆమె ఇంటికి రావడం వీలు కాకపోవడంతో తనే అతని బంగ్లాకి వెళ్లి వస్తూ ఉంటుంది. ఇక అతనితోనే ఉండిపోవాలి అని ఆమె నిర్ణయించుకున్న తరుణం లోనే, సహాయ నిరాకరణలో పాల్గొన్న నారాయణప్పకి జైలుశిక్ష పడుతుంది. తన నిర్ణయం మార్చుకున్న సుశీల, ఖద్దరు ధరించడం మొదలు పెట్టి సహాయ నిరకరణలో ప్రత్యక్షంగా పాల్గొంటుంది. ఇది నారాయణప్ప కి సంతోషం కలిగించిన పరిణామం. ఇక సులేమాన్ తో సంబంధం కూడా మానుకుంటుంది అన్న నమ్మకం కలుగుతుంది ఆయనకి. సుశీల ఉద్యమంలో తలమునకలు అయిపోయి, సులేమాన్ కి క్రమంగా దూరం అవుతుంది.

కానీ, సుశీలని వదులుకోడానికి సిద్ధంగా లేడు సులేమాన్. ఆమె కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఇంతలో జబ్బు పడ్డ నారాయణప్ప జైలు నుంచి విడుదల అవుతారు. భర్తని వదిలి తనతో రమ్మని మరోసారి అడిగిన సులేమాన్, "నామీద ప్రేమలేదూ?" అని అడుగుతాడు. "ఉంది.. చాలా ఉంది.. కానీ ఆయనమీద అపరిమితమైన ప్రేమ వచ్చింది. ఏదో జాలి కాదు, నిజంగా ప్రేమ. అట్లా చూస్తావేం? ఆశ్చర్యంగా ఉందా? ఆ బొమికల కుప్ప మీద ప్రేమ ఏమిటనిపిస్తోందా నీకు? అవును. అట్లాంటి ప్రేమ కాదు, నీమీది ప్రేమ రకం కాదు. ఆ పాదాల దుమ్ము నెత్తిన వేసుకోడానికి తగననే భక్తితో కూడిన ప్రేమ. నా దేశం కోసం, నా ప్రజల కోసం అట్లా అయినారు. తన ఆరోగ్యాన్ని అర్పించారు...." ...సుశీల నిర్ణయం తెలిసిన నారాయణప్ప ఎలా స్పందించారు అన్నదే ఈ కథకి చలం ఇచ్చిన ముగింపు.

గురువారం, ఏప్రిల్ 18, 2013

విద్య యొసగును...

నాలుగైదేళ్ళ క్రితం సంగతి... ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు 'పుస్తకావిష్కరణ' కి భాగ్యనగరం ఆహ్వానించారు. రవీంద్రభారతి దగ్గరలో ఉన్న ఒక హోటల్లో ఆ కార్యక్రమం. పెద్దగా హంగూ ఆర్భాటం లేకుండా జరిగిన ఆ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ వీఎస్ రమాదేవి. ఓ కవీ, మరో రచయితా వేదికమీద ఉన్నా సభకి నిండుతనం తెచ్చింది మాత్రం కర్నాటక మాజీ గవర్నర్ గారే. అందరిమీదా ఛలోక్తులు విసురుతూ, నిర్వాహకులు చేస్తున్న చిన్న చిన్న పొరబాట్లనీ, వాళ్ళ తడబాట్లనీ సున్నితంగా ఎత్తిచూపి సరి చేయించడం మాత్రమే కాదు, పుస్తకాన్ని గురించి తను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పి క్లుప్తంగా ప్రసంగాన్ని ముగించారు రమాదేవి. అప్పటివరకూ ఆమె గురించి వినడమే కానీ, అదే ఆమెని మొదటిసారి దగ్గరగా చూడడం.

డెబ్భై తొమ్మిదేళ్ళ రమాదేవి హఠాత్తుగా మరణించారన్న వార్త తెలియగానే నాకు మొదట గుర్తొచ్చిన జ్ఞాపకం అదే. ఆ తర్వాత పత్రికల్లో చూసిన ఆమె ప్రశ్నోత్తరాల కాలమ్స్, సభలు-సమావేశాల వార్తలు..ఇవన్నీ... రెండు రాష్ట్రాలకి (హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక) గవర్నర్ గా పనిచేయడం మాత్రమే కాదు, భారత ఎన్నికల కమిషన్ కి స్వల్పకాలం ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేశారు. ఇప్పటివరకూ ఈ పదవి చేపట్టిన మహిళ రమాదేవి ఒక్కరే కావడం విశేషం. వివాద రహిత అధికారిణిగా, న్యాయ కోవిదురాలిగా మాత్రమే కాదు, రచయిత్రిగానూ మంచి పేరు తెచ్చుకున్నారు ఆమె.

చదువు మాత్రమే ఉన్నతికి మార్గమని మనసా వాచా నమ్మిన వ్యక్తి రమాదేవి. ఆమె విషయంలో అది నిజమయ్యింది కూడా. డిగ్రీ పూర్తికాగానే ఉద్యోగంలో చేరి, అటుపై ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదివి, కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించి ఎన్నెన్నోపదవులు చేపట్టారు. లా కమిషన్ మెంబర్ సెక్రటరీ, జాతీయ మహిళా కమిషన్ సలహాదారు, రాజ్య సభ సెక్రటరీ-జనరల్ ఇవి ఆమె నిర్వహించిన బాధ్యతల్లో కొన్ని. న్యాయశాస్త్రాన్ని ప్రజలకి దగ్గరగా తీసుకు వెళ్ళడానికి ఎంతో కృషి చేసిన రమాదేవి, తన తీరిక సమయాలని సాహిత్యంతో పాటు, వికలాంగులతో గడపడానికి ఇష్టపడ్డారు. చాలా మంది మహిళలకి పెద్దగా ఆసక్తి లేని జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల అధ్యయనం ఆమెకి చాలా ఇష్టమైన విషయం.


"రమాదేవి పేరెత్తగానే నాకు ఎన్నో పాత సంగతులు గుర్తొస్తున్నాయి. ఆవిడ ఎమ్.ఏ., బీ.యెల్., యెమ్.యెల్.. ఇవన్నీ ఆలిండియా రేడియో లో పనిచేస్తున్నప్పుడే చదివారు. ఆవిడ కాన్సంట్రేషన్ కి ఆశ్చర్యం వేస్తుంది. అనౌన్సర్స్ బూత్ లో కూర్చుని సంగీత కార్యక్రమం మొదటి కీర్తన అనౌన్స్ చేసి, పుస్తకం చూసి చదువుకుంటూ కూర్చునేది. ఆ కీర్తన అవుతూనే తొణక్కుండా ఫేడర్ ఆన్ చేసి రెండో కీర్తన చెప్పి మళ్ళీ చదువుకునే వారు. అలాగే నోట్స్ రాసుకునేవారు. ఒకరకంగా అనౌన్సర్స్ జాబ్ టెన్షనబుల్ జాబ్. అలాంటి జాబ్ కూల్ గా చేసుకుంటూ అందులోనే తన చదువు సంగతి కూడా చూసుకునే వారు. మళ్ళీ పరీక్షలు మంచి డిస్టింక్షన్ తో పాసయ్యేవారు," అని తలచుకున్నారు శారదా శ్రీనివాసన్ తన 'రేడియో అనుభవాలు-జ్ఞాపకాలు' లో..(పేజీ 75).

పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు లో 1934వ సంవత్సరంలో కనుమ పండుగ రోజున జన్మించిన రమాదేవి, స్వయంకృషితో ఎదిగిన మహిళ. సూటిగా మాట్లాడుతూనే వివాదరహితంగా ఉండడం ఆమె ప్రత్యేకత. రెండు రాష్ట్రాలకి గవర్నర్ బాధ్యతలు నిర్వహించాక, మూడోసారి అదే బాధ్యత నిర్వహించాల్సిందిగా రాష్ట్రపతి నుంచి పిలుపు వచ్చినప్పుడు ఆమె సున్నితంగా తిరస్కరించడం అప్పట్లో పెద్ద వార్త అయ్యింది. పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్నాక, ఎక్కువ సమయాన్ని లీగల్ లిటరసీ, సాహిత్యం, వికలాంగుల సేవకి కేటాయించిన రమాదేవి, తన రచనలని ఇతర భాషల్లోకి తర్జుమా చేయించే పని పూర్తికాక మునుపే కన్నుమూశారు.

'విద్య వంటి వస్తువు లేదు' అని కన్యాశుల్కం నాటకంలో రామప్పంతులు చేత చెప్పిస్తారు గురజాడ వారు. నిజమే, చదువు జీవితాన్ని మరింత బాగా గడపడానికే సహకరిస్తుంది. కేవలం డిగ్రీలు సంపాదించం మాత్రమే కాకుండా, చదువులలోని సారాన్ని కొంచమైనా వంటపట్టించుకుంటే అది జీవితం మీద ఎంతైనా ప్రభావం చూపించగలదు. 'జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది ఓ నిరంతర ప్రక్రియ..అది ఎప్పుడూ మంచే చేస్తుంది' అన్న సందేశం కనిపిస్తుంది, రమాదేవి జీవితాన్ని గమనించినప్పుడు. ఆ ప్రజ్ఞాశాలికి నివాళులు..

బుధవారం, ఏప్రిల్ 17, 2013

కన్నీటి కెరటాల వెన్నెల

చాలా రోజులుగా చదవాలనుకుంటున్న నవల ఓల్గా రాసిన 'కన్నీటి కెరటాల వెన్నెల.' మొన్నామధ్య వేరే పుస్తకాల కోసం వెతుకుతుండగా పుస్తకాల షాపులో కనిపించింది. లోతైన, భావుకత్వంతో నిండిన శీర్షిక ఉన్న ఈ నవలని చదవడం పూర్తిచేశాక, కథకీ శీర్షికకీ ఉన్న సంబంధం ఏమిటో అర్ధం కాలేదు. అయితే, సినిమా అంటే నాకున్న ఆసక్తి వల్ల కావొచ్చు, పేజీలు చకచకా తిరిగిపోయాయి. ప్రపంచ సినిమా పరిణామ క్రమాన్నీ, భారతీయ సినిమా నడకనీ చర్చిస్తూనే, నవలలో ప్రధాన పాత్రలకీ, కొన్ని పేరొందిన సినిమాల్లో జీవితాలకీ సామ్యాన్ని చూపించడం ద్వారా ఎక్కడా బిగి సడలని విధంగా కథని నడిపించారు ఓల్గా. 'చతుర' పత్రిక మార్చ్, 1988 సంచికలో తొలిసారి ప్రచురితమైన 'కన్నీటి కెరటాల వెన్నెల' 1999 లో తొలి ముద్రణనీ, 2010 లో మలిముద్రణనీ పొందింది.

పాతికేళ్ళ వయసుకే భర్త రవిని కోల్పోయి, ఏడాదికాలంగా నిర్వేదంలో కూరుకుపోయిన రేణు కథ ఇది. రవి తన జీవితంలోకి రాడానికి ముందు, తనకంటూ ఇరవయ్యేళ్ళ జీవితం ఉందన్న విషయాన్ని మర్చిపోయి అతని జ్ఞాపకాల నుంచి బయటకి రాడానికి ఏమాత్రమూ ఇష్ట పడని రేణూని ఆమె స్నేహితురాలు శిరీష పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఆరువారాల ఫిలిం అప్రిసియేషన్ కోర్సులో చేర్చడంతో మొదలయ్యే కథ, రేణూ ఫిలిం ఇన్స్టిట్యూట్ అనుభవాలతో వేగం అందుకుంటుంది. రూం మేట్లు ఉమ, గమనల పరిచయం, క్లాసులో అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన భిన్న మనస్తత్వాలు ఉన్న విద్యార్ధులు, అధ్యాపకులు... వీళ్ళందరి మధ్యనా రోజులో పద్దెనిమిది గంటలు సినిమాలు చూస్తూ, సినిమాల గురించి వింటూ రవి తాలూకు ఆలోచనల నుంచి కొంచం బయటికి రాగలుగుతుంది రేణూ.

మరో పక్క క్లాసులో చెప్పే పాఠాలు, చర్చలు వీటన్నింటినీ వివరంగా రాయడం ద్వారా ప్రపంచ సినిమా చరిత్రని పాఠకుల ముందు ఉంచారు రచయిత్రి. మూకీ సినిమా మొదలు, టాకీలు, వాటి పరిణామ క్రమం, సినిమా తీసే పద్ధతులు, సినిమాలని చూడాల్సిన పద్ధతులు, టెక్నిక్, ఫిలిం మేకర్స్ ఆలోచనలు, వాటిని ప్రేక్షకులు అర్ధం చేసుకునే తీరు... ఇలా ఎన్నో విషయాలని కథలో భాగం చేశారు. అంతేకాదు, కొద్ది రోజుల్లోనే రేణూ కి స్నేహితురాలైపోయిన గమన జీవితాన్ని గురించీ వివరంగానే చెప్పారు. సిక్కు కుటుంబానికి చెందిన ఆ అమ్మాయి, ఇందిరా గాంధీ మరణానంతరం దేశ రాజధానిలో జరిగిన మారణ కాండకి ప్రత్యక్ష సాక్షి. అలాగే ఉమ పాత్రని చిత్రించిన తీరు, ఆ పాత్రకి ఇచ్చిన ముగింపు గుర్తుండిపోతాయి.


కేవలం సినిమా మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటుంది రేణూ. క్లాసులో మేష్టార్లు, స్టూడెంట్స్ తో కలిసి సిగరెట్లు కాల్చడం, గమన లాంటి కొందరు అమ్మాయిలు కూడా సిగరెట్లు, మందు పార్టీలు అనడం మొదట ఆమెకి కొరుకుడు పడదు. అయితే, సిగరెట్ కాల్చడం తప్పు అయితే అది మగాడు చేసినా, ఆడపిల్ల చేసినా కూడా తప్పే. మగవాడు సిగరెట్ కాల్చడాన్ని ఆమోదించేసి, అమ్మాయిల విషయానికి వచ్చేసరికి తప్పు పట్టడం ఎంతవరకూ సబబు? అన్న దగ్గర ఆగుతుంది ఆమె ఆలోచన. రేణూ మీద గమన ప్రభావమూ తక్కువదేమీ కాదు. ఆధునిక భావాలున్న ఆ అమ్మాయి "ఇది మగవాళ్ళ సమాజం" అంటుంది.

"ఒక ఆడపిల్ల పదేళ్ళ వయసు నుంచి పెళ్ళయ్యే దాకా తాను ఆడదాన్ననే విషయం ఎన్ని రకాలుగా ఎన్ని అనుభవాల ద్వారా నేర్చుకుంటుందో కదా. ఇదంతా మగాళ్ళ సమాజం. ఈ సమాజం మనది కాదు అనిపిస్తుంది చాలాసార్లు. ఎవరిదో పరాయింట్లో స్వతంత్ర్యం లేకుండా మసిలినట్టుగా ఉండాలి. ప్రతి అడుగూ ఆలోచించి వెయ్యాలి. ప్రతి మాటా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంతవరకు పెదవులు సాగదియ్యాలో అంతవరకూ మాత్రమే సాగదీసి నవ్వాలి. ఎక్కువయిందో ఏదో ముంచుకొస్తుంది. జీవితాంతం మనది కాని ఈ సమాజంలో బతకడం పెద్ద బోరు. మగ సమాజాన్ని మనుషుల సమాజంగా చేయాలి.. ఎప్పటికి మనుషుల సమాజం వస్తుందోగాని..." అంటుంది గమన. మాధవి, రజని... ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.

పూణే లో తెలుగుకి మొహం వాచిన రేణూకి, అదే కోర్సు కోసం విజయవాడ నుంచి వచ్చిన లెక్చరర్ సూర్యం పరిచయం అవుతాడు. తొందరలోనే స్నేహితులు అవుతారు ఇద్దరూ. 'కొకు' అభిమాని అయిన సూర్యం పాత్ర ద్వారా కొడవటిగంటి కుటుంబరావు కథలు, నవలల గురించి కొంత చర్చ చేశారు రచయిత్రి. ఆరువారాల ఫిలిం అప్రిసియేషన్ కోర్సు రేణూ జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చిందీ అన్నది ముగింపు. సినిమా - మరీ ముఖ్యంగా అంతర్జాతీయ సినిమా- అంటే ఆసక్తి ఉన్న వారిని ఆకట్టుకునే నవల. (స్వేచ్చ ప్రచురణలు, పేజీలు 160, వెల రూ. 50, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, ఏప్రిల్ 15, 2013

మా ఇంటి రామాయణం

పొత్తూరి విజయలక్ష్మి పేరు వినగానే, తెలుగు సాహిత్యం తో పరిచయం ఉన్న వారికి ఎవరికైనా మొదటగా పెదవుల మీద ఓ నవ్వు మొలుస్తుంది. అవును మరి, 'శ్రీవారికి ప్రేమలేఖ' లాంటి హాస్య భరితమైన సినిమాకి కథ అందించడం మాత్రమే కాదు, తన చిన్ననాటి జ్ఞాపకాలని 'హాస్య కథలు' గా మలచి తెలుగు పాఠకులని నవ్వుల్లో ముంచెత్తారు. తన మార్కు హాస్య కథలతో విజయలక్ష్మి తీసుకొచ్చిన మరో సంకలనం 'మా ఇంటి రామాయణం.' మొదటి ముద్రణ జరిగాక మూడేళ్ళలో మూడుసార్లు పునర్ముద్రణలు పొందిందంటే, ఈ పుస్తకానికి దొరికిన ఆదరణని అంచనా వేయొచ్చు.

మొత్తం పద్నాలుగు కథలున్న ఈ సంకలనం లో మెజారిటీ కథలు నవ్వులు పూయించేవే. దైనందిన జీవితం మొదలు, చుట్టూ వస్తున్న మార్పుల వరకూ ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలించి, హాస్యాన్ని రంగరించి కథలుగా మలిచారు విజయలక్ష్మి. ఏ టీవీ చానల్ తిప్పినా కనిపించే సీరియళ్ళలో అత్తాకోడళ్ళు ఒకరిమీద ఒకరు కుట్రలు పన్నుకుంటూనో, కాఫీలో విషం కలుపుతూనో కనిపిస్తారు కదా. కానీ, ఈ పుస్తకంలో మొదటి కథ, సంకలానికి శీర్షికగా ఉంచిన కథ 'మా ఇంటి రామాయణం' ఇతివృత్తం ఇందుకు భిన్నం. కోడలు, అత్తగారితో జతకట్టేసి మావగారి బద్దకాన్ని వదిలించడం ఇతివృత్తం. కొంత అతిశయోక్తి కనిపించినప్పటికీ, వంటింటికే పరిమితమైన మహిళలు, మిగిలిన కుటుంబ సభ్యుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తారు అన్నది చిత్రించారు ఈ కథలో.

మొత్తం ప్రపంచాన్ని మార్కెట్ శాసిస్తున్న కాలం ఇది. ప్రోడక్ట్ ఎలాంటిదైనా దానికి తగిన ప్యాకింగ్, మార్కెటింగ్ లేనిదే ఆ వస్తువు ముఖం చూసేవాళ్ళు ఉండరు. ఈ టెక్నిక్ ని అందిపుచ్చుకుని, వృద్ధాప్యంలో వ్యాపారం మొదలు పెట్టి విజయాన్ని రుచి చూసిన ఇద్దరు మహిళల కథ 'ది కటాస్.' మధ్యలో కొంతభాగం వ్యాసాన్ని గుర్తు చేసినా, చదివించే గుణం పుష్కలంగా ఉండడం వల్ల విసుగు కలగదు. బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ కి నివాళిగా రాసిన కథ 'అత్తగారూ-స్వర్గంలో సీరియస్సూ..' భానుమతి, తన అత్తగారితో కలిసి స్వర్గంలో టీవీ సీరియల్ తీస్తే ఎలా ఉంటుంది అన్నది ఇతివృత్తం.


ఈ సంపుటంలో నాకు బాగా నచ్చిన కథల్లో ఒకటి 'అవును వాళ్ళిద్దరూ కథ రాశారు.' ముందుమాటలో సి. మృణాళిని చెప్పినట్టుగా ఒక విషయాన్ని గురించి స్త్రీలు ఎలా ఆలోచిస్తారు, పురుషులు ఎలా ఆలోచిస్తారు అన్నది బాగా చిత్రించారు ఇందులో. భార్యా భర్తా కలిసి కథల పోటీ కోసం ఓ కథ రాసి, బహుమతి గెలుచుకోవాలి అనుకోవడం ఇతివృత్తం. ఒకరు రాసింది మరొకరికి నచ్చదు. అయినా రాయడం ఆపరు. ఇద్దరూ చెరో ఐదు వాక్యాల చొప్పున రాసి కథ పూర్తి చేయాలన్న ఒప్పందం కుదురుతుంది. వాళ్ళు రాసిన కథ ఏ కంచికి చేరిందన్నది ముగింపు.

ఆకట్టుకునే మరో కథ 'ప్రసాదరావూ-వంట సరస్వతీ..' మహిళల వంటింటి కష్టాన్ని ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథే ఇది కూడా. ఇక, 'అప్పిచ్చువాడు-వైద్యుడు' కథ అయితే వెంటబడి అప్పులిచ్చే బ్యాంకుల మీదా, డిస్కౌంట్లు ఆఫర్ చేసే కార్పోరేట్ ఆస్పత్రుల మీదా రచయిత్రి సంధించిన వ్యంగ్యాస్త్రం. వీళ్ళనే కాదు, మాడరన్ మాతాజీలనీ వదలలేదు విజయలక్ష్మి. అక్షరాలా ఉతికి ఆరేశారు 'వైరాగ్య స్థితి' కథలో. మెడ తిరగనన్ని నగలు వేసుకున్న మాతాజీ మీద రచయిత్రి వేసే సెటైర్లు చదవాల్సిందే. 'ఇదో వింత' 'తిక్క కుదిరింది' లాంటి కథలు ఈ సంకలనంలో లేకపోయినా పర్లేదు అనిపించింది.

బీనాదేవి తన 'కథలూ-కబుర్లూ' లో రాసిన ఓ గల్ఫిక గుర్తొచ్చింది, 'అమ్మో! ఆదివారం!!' చదివాక. హాస్యం పాళ్ళు కొంచం తగ్గినట్టు అనిపించిన కథలు 'ఇల్లు కట్టి చూడు' 'భాస్కరం-రూపాయీ.' మొత్తం మీద, సరదాగా చదువుకునే సంకలనం ఇది. "పొత్తూరి విజయలక్ష్మి కథలు చదివితే మనమూ రాసెయ్యొచ్చు పెద్ద కష్టమేం కాదనిపిస్తుంది. అలా అనిపించడంలోనే రచనా శిల్పం ఉంది. 'మా ఇంటి రామాయణం' లో ఏ కథ చదివినా కొత్త పెళ్లి కూతురు పూలు కడుతున్నట్లు, పోకిరి పిల్ల గవ్వలు చిలకరించినట్టు, తొలకరి జల్లులో తడిసిన పాలపిట్ట రెక్కలు విదిల్చినట్టు అనిపిస్తుంది," అంటూ శ్రీరమణ చెప్పిన మాటల్లో నిజం ఉందనిపిస్తుంది. (శ్రీ రిషిక పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 117, వెల రూ. 80, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శనివారం, ఏప్రిల్ 06, 2013

చాసో కథలు

తెలుగు సాహిత్యంలో 'కథకులకి కథకుడు' అని పేరు పొందిన వాడు చాసో గా పిలవబడే చాగంటి సోమయాజులు. తెలుగు కథకి దిశానిర్దేశం చేసిన కొద్ది మంది ప్రముఖులలో ఈయన ఒకరు. 'ఎంపు' 'వాయులీనం' 'కుంకుడాకు' 'కుక్కుటేశ్వరము' ఇవి చాసో పేరు చెప్పగానే మొదటగా గుర్తొచ్చే కథలు. కేవలం ఈ నాలుగు కథలు మాత్రమే కాదు, 1943-79 మధ్య కాలంలో చాసో రాసిన కథల నుంచి ఎంపిక చేసిన నలభై కథలతో విశాలాంధ్ర వెలువరించిన తాజా సంకలనం 'చాసో కథలు.' మళ్ళీ మళ్ళీ చదువుకునే కథలు ఇవి. అంతే కాదు, కొత్తగా కథలు రాయాలనుకునే వారికి ఒక రిఫరెన్స్ కూడా.

'ఎంపు' కథ మీద చాలా చర్చే జరిగింది. కొందరు ప్రముఖులు కథని బాగా మెచ్చుకుంటే, మరికొందరు తీవ్రంగా విమర్శించారు. ఓ బిచ్చగాడి కూతురు మరో బిచ్చగాడితో ప్రేమలో పడింది. ఆమె తండ్రి ఆమెకో పెళ్లి సంబంధం  తెచ్చాడు.. ఆ పెళ్లి కొడుకూ యాచకుడే. ఆ ఇద్దరిలోనూ ఆమె ఎవరిని ఎంచుకుంది? ఈ ప్రశ్నకి జవాబే 'ఎంపు' కథ. పాఠకులని ముగింపు దగ్గర పట్టి ఆపేసే కథ ఇది. అరవయ్యేళ్ళ క్రితపు మధ్యతరగతి జీవన సరళిని పట్టి చూపించే కథ 'వాయులీనం,' ఈ సంపుటిలో మొదటి కథ. భార్యాభర్తల అనుబంధం, అభిరుచులకీ-అవసరాలకీ మధ్య జరిగే పోటీలో గెలుపు వేటిది అన్నదే కథాంశం.

వ్యవస్థ మీద కోపం కలిగించి, ఆ వెంటే ఆలోచనల్లోకి నెట్టే కథ 'కుంకుడాకు.' వంట చెరుకు కోసం ఎండిన కుంకుడాకులు ఏరుకునే ఓ పేదింటి పిల్లకి ఎదురైన అనుభవమే ఈ కథ. "పేదరాసి పెద్దమ్మా... పెద్దమ్మ కొడకా... కొడుకు చేతి గొడ్డలా!" పాడుకుని, ఒక్క క్షణం ఆగి "ముక్త పదగ్రస్తం కదూ అలంకారం?" అనుకునే మనిషిని పిచ్చివాడు అనుకోగలమా? కానీ, ఆ ఊళ్ళో పిచ్చివాడిగా చెలామణి అవుతున్న ఆ విద్యావంతుడి కథే 'పర బ్రహ్మము.' కేవలం ఉత్తరాలతోనే నడిపిన కథ 'బదిలీ.' చాసో 1945 లో రాశారు ఈ కథని.. కానీ ఇవాల్టికీ సమకాలీనమే.. ఈ ఒక్క కథే కాదు, సంపుటంలో ఏ ఒక్క కథనీ 'అవుట్ డేటెడ్' అనలేం మనం.


ఏ ఒక్క కథకీ మరో కథతో రేఖామాత్రపు పోలిక కూడా ఉండకపోవడం చాసో కథల ప్రత్యేకత. ఈ లక్షణమే చాసో ని కథకులకి కథకుడిగా నిలిపిందేమో. కేవలం ఉత్తరాంధ్ర రచయితల మీదే కాదు, చాసో తర్వాతి తరాల తెలుగు కథకులు అందరిమీదా ఎంతో కొంత ఆయన ప్రభావం ఉందనడం సత్యదూరం కాదు. 'చాసోని మెప్పించే కథ రాయడం' అన్నది, పతంజలి లాంటి ఎంతోమంది రచయితలకి తొలినాళ్ళలో ఎదురైన సవాలు. ఎలా ఉంటాయి చాసో కథలు? ఏ ఒక్క కథా కూడా నిడివిలో నాలుగైదు పేజీలు మించదు. ప్రారంభ వాక్యాలు, కథకీ, పాఠకుడికీ మధ్య రచయిత సూత్రధారి పాత్ర పోషించడం లాంటివి ఏవీ ఉండవు. నేరుగా కథలోకి వెళ్ళిపోవడమే..

"బక్క చిక్కిన ముసలమ్మ అస్థి పంజరం కట్టె పురుగులాగ ఊగిసలాడ్డం మొదలు పెట్టింది. పత్తిభోగల్లాటి కళ్ళెత్తి చూసింది. ఆ కళ్ళకి చత్వారం లేదు. మధ్య కాలం లో వచ్చిన చత్వారం మధ్య కాలంలోనే పోయింది. ముసలమ్మ చూసీ చూడడమే పోల్చింది. ఒక నిట్టూర్పు విడిచి ఈశ్వరుణ్ణి తలచుకుని మనస్సు కట్టుదిట్టం చేసుకుంది. 'ఎవరివి నాయనా నువ్వు?' అని, తనే కాస్త బంధుత్వం కలుపుతూ ప్రశ్నించింది. 'మనం మనం పాత వాళ్ళమే. మళ్ళా వచ్చా ముసలమ్మా!' అన్నాడు ఎదురుగుండా ఉన్న ఉద్యోగస్తుడు. ఏమిటి సాధనం? శ్రీమన్నారాయణ మూర్తీ! అని దేవుణ్ణి సంబోధించుకుంది. కుక్కుటేశ్వరుడి ఆజ్ఞ లేనిదే కుక్కయినా మొరగదు అని ధైర్యం చెప్పుకుంది." ..'కుక్కుటేశ్వరము' కథలో ప్రారంభ వాక్యాలు ఇవి.

'వెలం వెంకడు' 'ఎందుకు పారేస్తాను నాన్నా' కథలు చదువు ప్రాముఖ్యత చెబితే, 'లేడీ కరుణాకరం' 'పోనీ తిను' కథలు వేశ్యావృత్తి నేపధ్యంగా సాగేవి. పుస్తకం పక్కన పెట్టాక మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే కథలే అన్నీ. చెప్పదలచుకున్న విషయం పట్ల రచయిత స్పష్ట దృష్టి, చేసిన పరిశీలన, ముందుచూపు.. ఇవన్నీ ఆశ్చర్య పరుస్తాయి పాఠకులని. ఇవి మాండలీకం కథలు కాదు, కానీ కథ చెప్పడంలో ఉత్తరాంధ్ర నుడికారం తళుక్కున మెరుస్తుంది. ఒకటి రెండు వాక్యాల్లో ప్రకృతిని వర్ణించడంలో చాసో అందెవేసిన చేయి. ముందే చెప్పినట్టు, మళ్ళీ మళ్ళీ చదవాల్సిన కథలే ఇవన్నీ.. ('చాసో కథలు,' పేజీలు 220, వెల రూ. 125, విశాలాంధ్ర ప్రచురణ, అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది).

మంగళవారం, ఏప్రిల్ 02, 2013

ప్రత్యామ్నాయం

అప్పు అవసరం రాకుండానే ఉండాలి. వచ్చిందంటే మాత్రం, అప్పిచ్చు వాడు పెట్టే అన్ని నిబంధనలకీ తల ఊపి తీరాలి, ఇష్టం ఉన్నా లేక పోయినా. ఊరంతటికీ ఒక్కడే వడ్డీ వ్యాపారి ఉన్నట్టయితే మన అవసరం ఎంత గొప్పది అయినా, కచ్చితంగా బాకీ తీర్చేసిన ఘన చరిత్ర మనకి ఎంత ఉన్నా, చివరికి అప్పు పుట్టడం అనేది అతగాడి ఇష్టాయిష్టాల మీద ఆధార పడి ఉంటుంది. అదే, ఒకటికి రెండు చోట్ల అప్పు పుట్టే వీలుంటే? ఇక్కడ కాకపొతే మరో చోట అన్న ధీమా ఉంటుంది మనకి. ఎందుకంటే డబ్బుతో ఎప్పుడు ఎలాంటి అవసరం పడుతుందో తెలియదు కాబట్టి. మన ఇల్లు లాగే మన దేశం కూడా. అవసరం పడినప్పుడల్లా డబ్బు సర్దుబాటయ్యే మార్గాలు వెతికి పెట్టుకుంటూ ఉండాలి నిత్యమూ. ఎందుకంటే, అవసరాలు పెరిగేవే తప్ప తగ్గేవి కాదు కదా.

'బ్రిక్స్ బ్యాంకు' ..గడిచిన వారం ప్రముఖంగా వచ్చిన వార్త ఇది. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న ఐదు దేశాలు కలిసి ఏర్పాటు చేయబోయే ఈ బ్యాంకు, ఇప్పటికే ప్రపంచ దేశాల్లో వేళ్ళూనుకుని ఉన్న ప్రపంచ బ్యాకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐయెమ్మెఫ్) ల మీద ఎంతవరకూ ప్రభావం చూపిస్తుందీ అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ప్రపంచ బ్యాంకు ఇప్పటికే ఎంతో హుందాగా బ్రిక్స్ బ్యాంక్ ప్రతిపాదనని స్వాగతించింది. ఐయెమ్మెఫ్ మాత్రం కొత్త సంస్థ ఏర్పాటును ఆసక్తితో పరిశీలిస్తున్నట్టు చెప్పి ఊరుకుంది. ఈ రెండు సంస్థలు మాత్రమే కాదు, యావత్తు ప్రపంచమూ బ్రిక్స్ బ్యాంక్ విషయంతో చాలా ఆసక్తి చూపుతోంది అన్నది నిజం. ఇంతకీ ఏమిటీ బ్రిక్స్?

బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా... ఈ ఐదూ అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలు. రానున్న రోజుల్లో అభివృద్ధి చెందిన దేశాలుగా మారే అవకాశాలు, వనరులు పుష్కలంగా ఉన్న దేశాలు కూడా. అవకాశాలు, వనరులతో పాటు వీటి ముందు ఉన్న సవాళ్లు కూడా తక్కువవేమీ కాదు. వీటన్నింటి గురించి చర్చించుకోడానికి, పరస్పర సంబంధాలు మెరుగు పెరుచుకోడం కోసం నాలుగేళ్ల క్రితం ఈ ఐదు దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. తమ దేశాల పేర్లలో మొదటి అక్షరాలతో 'బ్రిక్స్' అని నామకరణం చేశాయి ఆ కూటమికి. అనేక కారణాల వల్ల, ఈ బ్రిక్స్ కూటమి దాదాపు నిశ్శబ్దంగానే ఉంది. దక్షిణాఫ్రికా లోని డర్బన్ లో గతవారం సదస్సు జరిపే వరకూ ఈ 'బ్రిక్స్' ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.


అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వేటి సమస్యలు వాటివే అయినా, ప్రతి ఒక్కదేశానికీ తప్పక ఉండే సమస్య మాత్రం ఆర్ధిక వనరులు. పెట్టుబడులు పెట్టి, లాభాలు సంపాదిస్తే కదా అభివృద్ధి సాధించడం. మరి ఆ పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలి? ఇంతకాలం ప్రపంచ దేశాలకి పెద్ద దిక్కుగా ఉన్నవి ప్రపంచ బ్యాంకు, ఐయెమ్మెఫ్. ఈ రెండు సంస్థల సభ్య దేశాలూ, చిన్నా పెద్దా అని లేకుండా ఏ అవసరం వచ్చినా ముందు తట్టేది వీటి తలుపులే. అయితే, రాను రానూ ఈ రెండు సంస్థల మీదా ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి, రుణాల మంజూరు మొదలు, వడ్డీ రేటు వరకూ ఎన్నో విషయాల్లో ఎన్నెన్నో ఫిర్యాదులు. అంతేకాదు, ఈ రెండు సంస్థలూ అమెరికా, యూరోప్ ల కనుసన్నల్లో పనిచేస్తున్నాయన్నది బహిరంగ రహస్యం.

గతవారపు బ్రిక్స్ సదస్సులో ప్రధానంగా చర్చకి వచ్చిన విషయం ఇదే. ఐదు దేశాలూ కూడా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవలసిన అవసరాన్ని గుర్తించాయి. యాభై బిలియన్ డాలర్ల సీడ్ మనీ తో బ్యాంకుని ప్రారంభించి, దానిని వంద బిలియన్ డాలర్ల కి విస్తరించాలి అన్నది ప్రాధమికంగా తీసుకున్న నిర్ణయం. బ్యాంకు కేంద్ర స్థానం మొదలు, నియమ నిబంధనల వరకూ కేలకమైన అనేక విషయాలపై ఇంకా తుది నిర్ణయం రావాల్సి ఉంది. కొత్త బ్యాంకు ఏర్పాటుతో ఈ ఐదు సభ్య దేశాలు ప్రపంచ బ్యాంకు, ఐయెమ్మెఫ్ ల మీద ఆధారపడం తగ్గుతుంది అన్నది నిర్వివాదం. ఫలితంగా డాలర్ మారకపు రేటుకి కనీసం కొంతమేరకు స్థిరత్వం వచ్చే అవకాశం కనిపిస్తోంది. బ్రిక్స్ బ్యాంక్ ప్రభావం యూరో మీదా ఉంటుందన్నది ఆర్ధిక విశ్లేషకుల అభిప్రాయం.

బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటులో కష్టనష్టాలు చాలానే ఉన్నాయి. సభ్య దేశాల మధ్య సంబంధాలు ఓ ముఖ్యమైన అంశం. భారత్-చైనా సంబంధాలు 'క్షణక్షణముల్..' చందంగా ఉన్నాయి. దక్షిణాఫ్రికా తన వంతు పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు ప్రస్తుతం. అయితే, కేవలం ఈ కారణాలకి బ్యాంక్ ఏర్పాటు ఆగిపోతుంది అనుకోలేం. ఎందుకంటే ఐదు దేశాలకీ కూడా బలమైన సంకల్పమూ, ప్రత్యామ్నాయం కావాల్సిన అవసరమూ ఉన్నాయి కాబట్టి. బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటు వల్ల, రానున్న రోజుల్లో డాలర్, యూరోలకి దీటైన మరో ప్రత్యామ్నాయం వచ్చే అవకాశమూ ఉంది. అవసరానికి అప్పు పుట్టే మరో కొత్త మార్గం దొరకడం అన్నది సంతోషించాల్సిన విషయమే, ముఖ్యంగా అప్పు తప్పనిసరి అయినప్పుడు.