ఆదివారం, ఫిబ్రవరి 03, 2013

శ్వేత కాష్టం

అలవాట్లని ఇంగ్లీష్ వాడు 'హేబిట్స్' అంటాడు. ఇవి చాలా చిత్రంగా మొదలవుతాయి. మొదలైతే ఓ పట్టాన వదలవు. చదువుకునే రోజుల్లో, ఈ హేబిట్స్ లో చెడ్డవాటికి దూరంగా ఉండాల్సిన అవసరం గురించి మా మేష్టారు క్లాసులో చెప్పారు. నిజానికి అది పాఠం లో లేదు... సిలబస్ లో లేకపోయినా, పనికొచ్చే విషయాలు తన హేబిట్ అని కూడా ఆయన చెప్పారు, హేబిట్స్ లో మంచివి కూడా ఉంటాయి అని చెబుతూ. చెడ్డ వాటికి దూరంగా ఎందుకు ఉండాలీ అన్నదానికి ఆయన చెప్పిన వివరం భలే గుర్తుండి పోయింది.

నల్లబల్ల మీద సుద్దముక్కతో స్పెల్లింగ్ రాసి అప్పుడు మొదలు పెట్టారు. "హేబిట్ అన్నది ఓ పట్టాన వదలదు. ఇదిగో ఇక్కడ రాశాను చూడండి. హెచ్ ఏ బి ఐ టి ...ఇది కదా స్పెల్లింగు. మనం కష్టపడి హేబిట్ ని కొంచం తగ్గించాం అనుకోండి...హెచ్ తీసేద్దాం.. ఇంకా ఏ బిట్ ఉంది. మరి కొంచం కష్టపడి ఏ తీసేసినా బిట్ ఉంది ఇంకా... మరి కొంచం కస్టపడి బీ తీసేసినా ఇట్ ఉండిపోయింది... చూశారా ఎంత కష్టమో, హేబిట్ ని వదుల్చుకోవడం..." హేబిట్ స్పెల్లింగ్ తో పాటు, ఆ వివరమూ మర్చిపోలేని విధంగా గుర్తుండి పోయింది.

మేష్టార్లు ఏం చెప్పినా పిల్లలు కిక్కురుమనకుండా వింటారు కానీ, సాటి పిల్లలు చెబితే అస్సలు వినరన్న జ్ఞానం కలగడానికి కొంచం ఆగాల్సి వచ్చింది. కాలేజీ రోజుల్లో, కాస్త దూరంగా ఉన్న కొబ్బరి తోటలో రహస్యంగా సిగరెట్లు గుప్పుతున్న మిత్రుల దగ్గరకి వెళ్లి మా మేష్టారు చెప్పిన హేబిట్ పాఠం మొదలు పెట్టానో లేదో, అందరూ ముక్త కంఠంతో గయ్యిమన్నారు. కొన్ని కొన్ని హేబిట్లు కొత్తగా మొదలు పెట్టే వాళ్ళ దగ్గర ఇలాంటి పాఠాలు చెప్పకూడదు అని బాగా తెలిసినప్పటికిన్నూ, వాళ్ళతో నాకు శత్రుత్వం ప్రాప్తించింది.


చాలా బోల్డన్ని కారణాల వల్ల నాకు శ్వేత కాష్ట దహనం పట్టుబడలేదు. అప్పటికే కాఫీ టీలతో పీకల్లోతు ప్రేమలో పడిపోయి ఉండడంతో, 'ఇటీజ్ నాట్ మై కపాఫ్ టీ' అనేసుకున్నాను. కృత్యదవస్థ మీద పాసివ్ స్మోకింగ్ అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. తప్పించుకు తిరిగి ధన్యత నొందడం అన్నివేళలా సాధ్య పడదు కదా మరి. కళ్ళు అరమోడ్పులు చేసి కలల్లో తేలిపోతూ తెల్లని పొగ రింగురింగులుగా వదిలే వాళ్ళని చూస్తున్నపుడు నాకు ఏమనిపిస్తుందో ఒక్క ముక్కలో చెప్పడం కష్టం. అది ఆయా సమయ సందర్భాల్ని బట్టి మారిపోతూ ఉంటుంది.

కాస్త పుస్తకాల వాసన ఉన్నవాళ్ళు చనువుగా సిగరెట్ ఆఫర్ చేస్తే "దున్నపోతై పుడతానండీ..." అనడం అలవాటు చేసుకున్నాను నేను. నా పుణ్యమా అని అవతలి వాళ్ళు కూడా సిగరెట్ పీలుస్తూ మధురవాణిని తలచుకుంటూ ఉంటారు. నేను తాగుడు పూర్తిగా మానేసిన వాళ్ళని చూశాను. కానీ సిగరెట్ల విషయానికి వస్తే కేవలం తగ్గించిన వాళ్ళని మాత్రమే చూశాను. ఆ తగ్గించడం కూడా అప్పుడప్పుడూ మాత్రమే జరుగుతూ ఉంటుంది, అది కూడా పరిస్థితుల ప్రభావం వల్ల. డాక్టర్లు కూడా వీళ్ళతో విసిగిపోవాల్సిందే.

మూడేళ్ళుగా చూస్తున్న మిత్రుడు ఒకాయన ఉన్నారు. వయసు డెబ్భై పైనే. బలశాలి అస్సలు కాదు. ఓ పూట భోజనం లేకపోయినా ఉండగలరు కానీ, రోజూ కనీసం ఓ పెట్టి సిగరెట్లు కాల్చనిదే ఆయనకి తోచదు. ఆయనకి వేళకి సిగరెట్టు పడకపోతే, ఇంటిళ్ళపాదీ మనశ్శాంతి మీద ఆశ వదులుకోవాల్సిందే. ఈ సిగరెట్ల పుణ్యమా అని ఆర్నెల్లకోసారి ఆయనకి రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటుంది. ఓ రెండు పేకట్లు ఎక్కిస్తూ ఉండాలి. సిగరెట్లు మానేయడం మాట అటు ఉంచి, తగ్గించడానికి కూడా ఆయన ఒప్పుకోరు. ఆయన్ని చూసినప్పుడల్లా నాకు మా మేష్టారు గుర్తొస్తూనే ఉంటారు.

8 కామెంట్‌లు:

  1. మీ మేష్టారులాంటివారు మనచుట్టూ బోలెడంతమంది ఉన్నారు....వారిలో మానేయాలి అన్న ధృఢసంకల్పం రానిదే మనమేం చేయగలం చెప్పండి.

    రిప్లయితొలగించండి
  2. శ్వేతకాష్టం అంటే ఏదైనా పుస్తకం గురించి చెపుతున్నారేమో అనుకున్నాను , సిగరెట్టా :) హాబిట్ గురించి మీ మాస్టారు చెప్పింది బాగుందండి .

    రిప్లయితొలగించండి
  3. మనం కొన్ని అలవాట్లని మానుకోవాలన్నా మానుకోలేము. కొన్ని హేబిట్స్ అలాంటివి. మొత్తానికి మీ హేబిట్ టపా చాలా బాగుంది. మీ అనుభవం మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. 'సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టు ....' అని ఆరుద్ర రాసాడు కదా...

    వాటి అనర్దాలు కూడా రాసాడు . చెడును వదిలేసి మంచిని తీసుకోవాలి మనం. అంటే సిగరెట్ జోలికి వెళ్లొద్దు.మీ మేష్టారు చెప్పిన కథనం బావుంది. మీ నరేషన్ స్టైల్ నాకు బాగా నచ్చింది.

    రిప్లయితొలగించండి
  5. మీరు ఈ టపా లో సిగరెట్టు బొమ్మ దగ్గర "smoking is injurious to health" వ్రాయడం మర్చిపోయారు.
    just kidding :-)

    ఎప్పటిలాగే బావుంది పోస్టు.

    రిప్లయితొలగించండి
  6. నైస్ పోస్ట్..!
    అలవాట్ల గురించి మాట్లాడుకుంటే (మంచో చెడో) ఒక్కటైనా లేనివాళ్ళెవరూ ఉండరేమో.

    హేబిట్స్ అనగానే మా ట్యూషన్ మాష్టారు చెప్పిన "హేబిట్స్ ఆర్ ఫస్ట్ కోబ్‌వెబ్స్ దెన్ కేబుల్స్" అనే ప్రోవెర్బే గుర్తొస్తుందండీ.

    మాష్టార్లు పిల్లలకి చిన్నవయసులోనే మంచి విషయాలు, మంచి అలవాట్లు నేర్పిస్తే ఎప్పటికీ వాటిని మర్చిపోరు. దానివల్ల సమాజం బావుంటుందేమో..

    గీతిక B

    రిప్లయితొలగించండి
  7. @పద్మార్పిత: నిజమేనండీ.. ధన్యవాదాలు

    @మాలాకుమార్: అవునండీ... పుస్తకం కాదు :) ..ధన్యవాదాలు

    @నవజీవన్: అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  8. @భాస్కర్: ధన్యవాదాలండీ...

    @శ్రీ.దు: ఆ వార్నింగ్ ఎందుకో నాకు అర్ధం కాదండీ.. పట్టించు కున్న వాళ్ళు సిగరెట్టు కాల్చరు.. కాల్చే వాళ్ళు ఎటూ పట్టించుకోరు :-)

    ...ధన్యవాదాలు

    @గీతిక.బి.: అవునండీ.. కనీసం కొందరైనా వాటి బారిన పడరు.. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి