చుట్టూ విస్తరించి ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో కలిసిపోకుండా తనదైన ఆస్థిత్వాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న చిన్న పట్టణం యానాం. అనేక చారిత్రిక కారణాలు ఇందుకు దోహదం చేశాయి. తూర్పు గోదావరితో సహా చుట్టూ ఉన్న మిగిలిన ప్రాంతాలన్నీ బ్రిటిష్ ఏలుబడిలో ఉన్న కాలంలో యానాం ఫ్రెంచ్ పాలనలో ఉంది. దేశానికి బ్రిటిష్ వారినుంచి స్వాతంత్రం వచ్చిన ఏడేళ్ళ తర్వాత మాత్రమే యానాం కి ఫ్రెంచి వారినుంచి విముక్తి కలిగింది. అయితే, తమిళం అధికార భాషగా ఉన్న పాండిచ్చేరిలో భాగమై, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించబడింది.
ఎన్నో వైవిధ్యాలకి నెలవైన యానాం నేపధ్యంగా కవీ, కథకుడూ దాట్ల దేవదానం రాజు రాసిన పద్దెనిమిది కథల సంకలనమే 'యానాం కథలు.' ఈ కథల్లో మనకి ఫ్రెంచ్ దొరలూ, దొరసానులూ కనిపిస్తారు. వాళ్ళ అహాలు, బలహీనతలూ కనిపిస్తాయి. వాళ్ళ ఎడల భయ భక్తులతో మసలుతూనే, ఆత్మగౌరవం విషయంలో రాజీ పడడానికి ఇష్టపడని యానాం ప్రజలు కనిపిస్తారు. యానాం అనగానే గుర్తొచ్చే గోదారీ, పచ్చదనంతో పాటు, ఫ్రెంచి మద్యమూ, తన 'పౌరులకి' ఆ ప్రభుత్వం ఇప్పటికీ ఇస్తున్న భారీ పెన్షన్లు, పక్క ఊరి వాళ్ళతో వచ్చే 'అంతర్రాష్ట్ర' తగాదాలూ వీటన్నింటినీ పరామర్శించాయి ఈ కథలు.
పరాయి పాలకుడు అయినప్పుడు వాడు బ్రిటిష్ వాడు అయితేనేం, ఫ్రెంచి వాడు అయితేనేం... దొర ఎవడైనా దొరే. కానీ, ఫ్రెంచి వాళ్ళ ప్రత్యేకత ఏమిటీ అంటే తమ పాలితులకి న్యాయం జరగాలని తాపత్రయ పడ్డారు. దొరల మీద నేరుగా ఫిర్యాదు చేయడానికి భయపడే లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళు ఏర్పరిచిన వెసులు బాటు ఏమిటంటే, దొరలవల్ల ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఓ కరపత్రాన్ని పంచితే చాలు. న్యాయస్థానం దానిని 'సుమోటో' గా తీసుకుని బాధితులకి న్యాయం చేయాల్సిందే. ఈ న్యాయ సూక్ష్మాన్ని ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథ 'తీర్పు వెనుక.'
సద్బ్రాహ్మణుడు వెంకటయ్య ని ఈడ్చి తన్నాడు పిథోయిస్ దొర. అతని యజ్ఞోపవీతాన్ని తెంపేసే ప్రయత్నం చేశాడు. వెంకటయ్య చిన్న వాడు ఏమీకాదు, కలిగిన వాడు. నలుగురికీ మంచీ చెడు చెప్పేవాడు. అటువంటి వాడికి ఇంత అవమానం జరగడానికి కారణం చిన్నదే. దొర ఇంటికి వెళ్ళిన వెంకటయ్య, అనుమతి తీసుకోకుండా కుర్చీలో కూర్చున్నాడు. అవమానికి భగ్గుమన్న యానాం ప్రజలు దొర ఇంటిమీద దాడి చేశారు. ఫిర్యాదు లేకుండా పెద్దమనుషులు సద్దుబాటు చేసినప్పటికీ, మర్నాడు తెల్లారేసరికి ఊరంతా కరపత్రాలు. కేసు కోర్టుకి వెళ్ళింది. అక్కడ వెంకటయ్య కి న్యాయం జరిగిందా? అన్నది ఆసక్తికరమైన ముగింపు.
ఈ కథల్లో బాగా ఆకర్షించేవి తెలుగమ్మాయిలతో ఫ్రెంచి దొరల ప్రేమలు. ఎదుర్లంక అమ్మాయి పార్వతిని ప్రేమించిన లారెంట్ ప్రేమకథ ఏమయ్యిందో 'ఔను నిజం' కథ చెబితే, సాంబశివుడితో ప్రేమలో పడ్డ లెలీషియా దొరసాని కథ 'కథోర్ జియ్.' అమీర్ ఖాన్ 'లగాన్' సినిమాలో రేఖామాత్రంగా పోలిక కనిపించే ఈ కథకి ప్రాణం రచయిత ఇచ్చిన ముగింపు. లా 'మూర్' కథ చదివాక, కామాక్షితో ప్రేమలో పడ్డ నీలికళ్ళ రొబేర్ ని ఓ పట్టాన మర్చిపోలేం. పాలన ఫ్రెంచి వాళ్ళది అయితేనేం? ఆ దొరలకి కులమతాల పట్టింపులు పెద్దగా లేకపోతేనేం? యానాం ప్రజలకి ఆ పట్టింపులు బానే ఉన్నాయి. వాటిని చిత్రించిన కథలు 'కొత్త నది,' 'రథం కదలాలి.'
ముందుమాట రాసిన కవి శివారెడ్డి కి బాగా నచ్చిన కథ 'తోడు దీపం,' శ్రీరమణ 'మిథునం' కథని జ్ఞప్తికి తెస్తుంది. అలమండ పతంజలి రాజుగారి 'వీరబొబ్బిలి'ని పోలిన 'చక్రవర్తి' ని ఆ అలమండ నుంచే యానాం తీసుకొచ్చారు 'అవిశ్వాసం' కథ కోసం. ఫ్రెంచి పౌరసత్వం సంపాదించుకున్న వాళ్లకి ఆ ప్రభుత్వం భారీ నజరానాలు పెన్షన్ల రూపంలో ఇప్పటికీ ఇస్తూనే ఉంది. దీనిని ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథలు 'బంగరు చూపు' 'ఒప్సియం.' యానాం ని ఆనుకునే ఉండే నీలపల్లి తూర్పు గోదావరి జిల్లాలోకి వస్తుంది. సరిహద్దు ఓ పెద్ద సమస్య, పాండిచ్చేరి, ఆంధ్ర పోలీసు, రెవిన్యూ వారికి. ఈ అంశాన్ని స్పృశిస్తూ రాసిన కథ 'భౌతికం' ఈ సంకలనంలో చివరి కథ.
యానాం వాతావరణం, గోదావరి, పచ్చదనం, గత వైభవం, వైవిధ్యం ఇవన్నీ ఆకర్షిస్తాయి. కవిత్వం నుంచి కథా రచనకి వచ్చిన దేవదానం రాజు కొన్ని కథలని చెప్పిన తీరు కించిత్ నిరాశ పరిచింది. కథావస్తువు చక్కనైనదే అయినా, కథనంలోనూ, సంభాషణలలోనూ దొర్లిన నాటకీయత శ్రుతిమించడం ఇందుకు కారణం. "ఇదే కథని రచయిత తిరగరాస్తే బాగుండేది," అన్న భావన అక్కడక్కడా కలిగింది. ఓ కొత్త వాతావరణంలోకి పాఠకులని అలవోకగా తీసుకు పోయిన రచయిత, కథని ఆసాంతమూ చదివిస్తారు.. చాలాచోట్ల ముగింపు దగ్గర కాసేపు ఆగి ఆలోచించేలా చేస్తారు. పుస్తకం చివరకి వచ్చేసరికి యానాం చిరపరిచితంగా అనిపిస్తుంది.
'యానాం కథలు' రెండోభాగం రాబోతోందన్న కబురుని అందించారు 'సాహితీ చలివేంద్రం లో కథాయానాం' పేరుతొ చివరి మాట రాసిన కవి శిఖామణి. (పాలపిట్ట బుక్స్ ప్రచురణ, పేజీలు 168, వెల రూ.100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
మీ సమీక్ష చూస్తె పేజీల వెంట తిరిగినట్లు ఉంది.చాలా బాగా వ్రాసారు
రిప్లయితొలగించండి@శశికళ: ధన్యవాదాలండీ...
రిప్లయితొలగించండి